గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 July 2019

ఆదిపర్వం.: వ్యాస భగవానుడు మహాభారత కథను అనర్గళంగా ఆశువుగా చెప్పసాగాడు గణపతికి.

ఆదిపర్వం.
----------------
వ్యాస భగవానుడు మహాభారత కథను అనర్గళంగా  ఆశువుగా చెప్పసాగాడు గణపతికి.  గణేశుడు కూడా అంతే నేర్పుతో చకచకా వ్రాయసాగాడు.  అయితే, యెక్కడైనా విరామం వస్తే వ్రాయడం ఆపేస్తానన్నాడుకదా మన గణేశుడు !  వ్యాసుడేమో నీవు అర్ధం చేసుకుని వ్రాయాలని చెప్పాడుకదా !  అందుకే వ్యాసుడు వుపాయంగా తాను ఆలోచించుకొని వీలు చిక్కడానికి మధ్య మధ్యలో ' గ్రంథ గ్రంధి ' ని  వాడుకుంటూ,  అది గణేశుడు అర్ధం చేసుకొనే లోపు  తాను కావాలసిన శ్లోకాలను మనస్సులో సమకూర్చుకునేవాడు.  ఆహా ! ఒకప్రక్క వ్యాసుని చమత్కారం తో కూడిన పాండిత్యము.  వేరొక ప్రక్క గణేశుని శ్లోకాలు అర్ధంచేసుకోవాలనే జిజ్ఞాస.  ఇరువురికిరువురూ సమఉజ్జీలుగా గ్రంథ రచన సాగింది. ఇట్టి కఠినమైన శ్లోకాలు 8,800  వివిధ దశలలో వాడినట్లు  వ్యాసులవారే చెప్పారు.

ఇక భారత కథావిశేషాలు శౌనకాది మహామునులకు సూతుడు చెప్పిన ప్రకారం :

శ్రీకృష్ణ అవతార సమాప్తి అనంతరం కలియుగం ప్రారంభం కాగానే, పరీక్షిత్తు రాజ్యాధికారం స్వీకరించాడు. వ్యాసుడు ఆ సమయానికే బదరికాశ్రమంలో భారత రచన ప్రారంభించి మూడు సంవత్సరాలలో విఘ్నేశుని సహకారంతో పూర్తిచేశాడు. ఆ తరువాత ఈ కథను వ్యాసుడు తన కుమారుడైన శుకునికి, వైశంపాయనుని సమక్షంలో వినిపించాడు.  

పరీక్షిన్మహారాజు, ధర్మనిష్ఠతో ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపిస్తుండడంతో,  కలి పురుషుడు తన ప్రతాపం చూపించడానికి సమయం కోసం వేచి వున్నాడు. ధర్మదేవత కలి
యొక్క దుష్ట చింతనను పరీక్షిత్తుకు తెలియజేసి, తనను కలిపురుషుని నుండి కాపాడమని మొరబెట్టుకున్నది.  కలిని,  పరీక్షిత్తు తన రాజ్యంలో కలిమాయను ప్రవేశపెట్టడానికి వీలులేదని హెచ్చరించాడు.  అయినా యుగధర్మం నెరవేర్చాలని తన ప్రయత్నంలో తాను వున్నాడు కలి అవకాశం కోసం ఓపికగా యెదురుచూస్తూ.  

ఆ రోజుల్లోనే, పరీక్షిత్తు అరణ్యానికి వేటకై వెళ్లి,దప్పికతో బాధపడుతూ దగ్గరలో వున్న ' శమీక ముని '  ఆశ్రమానికి వెళ్ళాడు.   ఆయన ధ్యాన నిష్ట లో వుండి పరీక్షిత్తు పిలిచినా సమాధానం చెప్పలేదు.  దానికి రాజు ఆగ్రహించి తనను లక్ష్యపెట్టలేదనే క్షణికమైన అహంకారంతో, ఊగిపోయాడు.  అవకాశం కోసం యెదురుచూస్తున్న కలి వెంటనే పరీక్షిత్తు ని ఆవహించాడు.  అంతే, ఆ కోపాగ్ని శగలలో తప్పొప్పులు మర్చిపోయి, పరీక్షిత్తు ప్రక్కనే చచ్చిపడివున్న ఒక సర్పకళేబరాన్ని, తన ధనుస్సుతో తీసి, శమీకముని మెడలో దండగా వేసి అక్కడనుంచి నిష్క్రమించాడు.  

ఒక్కసారి ఆ సన్నివేశం నుంచి ప్రక్కకు తొలగగానే, కలి పరీక్షిత్తు నుండి వైతొలగడం,  జరిగిన సంగతి గుర్తుకు తెచ్చుకుని, పరీక్షిత్తు కుమిలిపోవడం జరిగింది.  చూద్దాం !  ఈ క్షణికావేశం యే విధమైన పరిణామాలకు దారి తీస్తుందో! 

పరీక్షిత్తు శమీకునినుండి వెళ్లిన క్రొద్దిసేపటికి, శమీకుని కుమారుడు ' శృంగి ' తపస్సంపన్నుడు రావడం,  తండ్రి గారి మెడలో ఆ మృతసర్పం వ్రేలాడుతుండడం చూడడం,  దివ్యదృష్టితో జరిగినది తెలుసుకోవడం వెంటవెంటనే   జరిగిపోయింది.   యువకుడైన శృంగి కూడా ఆవేశం చంపుకొనలేక, తన తండ్రిని యీ విధంగా అవమానించిన పరీక్షిత్తు వారం రోజులలో పాముకాటుతోనే మరణించునట్లు శాపం పెట్టాడు.   శమీకుడు ధ్యానం నుండి మేలుకుని తనకుమారుని ఆవేశానికి మందలించి రాజుకు శాపమివ్వడం తగదని హితవు పలికాడు.  అయినా అప్పటికే జరగవలసింది జరిగిపోయింది.

ఇంతకీ ఈ పరీక్షిత్తు అంటే యెవరో కాదు.పాండవుల మనుమడు. సుభద్రకు అర్జునునకు పుట్టిన అభిమన్యుని కుమారుడు.  ఎంతటివాడైనా తన శాప విముక్తికోసం ఒంటి స్తంభపు మేడలో వారం రోజులు భాగవత కథా సప్తాహం శుకమహర్షి ద్వారా జరిపించుకొని చివరకు,  ఆ వొంటి స్తంభపు మేడలో తాను వున్న గదిలోకి అరటిపండు ద్వారా ప్రవేశించిన ' తక్షకుడు ' అనే సర్పం విషపు కాటుకు బలికాక తప్పలేదు.  ఆహా విధి వైపరీత్యం.  అది తప్పించుకొనే విషయము కాదని తెలుసుకునే, భాగవత కథామృతం లో తేలియాడి పరమపదం పొందాడు పరీక్షిత్తు.  

మహాభారత మొదటి దశలోనే యీ గాథ యందలి సూక్ష్మ విషయము,  ' విధి కి యెంత వారైనా బద్ధులే ' అని జనావళికి చెప్పారు వ్యాస మహర్షి.  శ్రీ వ్యాసాయ నమోనమ: 

 పరీక్షిత్తునకు నలుగురు కుమారులు.  వారు జనమేజయుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు, శ్రుతశ్రేణుడు.  నలుగురూ అశ్వమేధయాగములు చేసిన ఘనులే.  అందులో పెద్దవాడైన జనమేజయుడు పరీక్షిత్తు తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు.  కలి ప్రభావం వలన తన తండ్రిని చంపిన తక్షకునిపై ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాడు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML