
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 13 March 2016
ఆంధ్రభోజుని వేంకటేశ భక్తి!
ఆంధ్రభోజుని వేంకటేశ భక్తి!
కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యమునకు చక్రవర్తి. వేంకటేశ్వరస్వామి చక్రవర్తులకు సార్వభౌముడు. స్వామి సర్వభూపాల మౌళిమణి రంజిత పాదపీఠము గలవాడు. కృష్ణరాయులు వేంకటేశ్వరస్వామికి అనన్య భక్తుడు. స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన సంవత్సరము 1440 కు సరియగు శ్రీ బహుధాన్యనామ సంవత్సరంలో కృష్ణరాయులు కళింగదేశ విజిగీశామనీషతో విజయనగరం నుండి బయలుదేరి విజయవాడలో కొన్ని దినములు మజిలీ చేశాడు. ఆ సందర్భంలో శ్రీకాకుళ క్షేత్రంలో వేలిసియున్న ఆంద్రవిష్ణుదేవుని దర్శించుటకు శ్రీకాకుళం వెళ్లాడు. శాలివాహనశకం 1440 సంవత్సరమునకు సరియగు బహుదాన్యనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి శుక్రవారం (12-2-1519) నాడు రాయులు ఆంద్రవిష్ణుదేవుని సేవించి, ఉపవాసం చేశాడు. ఆ రాత్రి నాల్గువజామున తెలుగు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను అముక్తమాల్యదగా కీర్తికేక్కిన గోదాదేవిని (ఆండాళ్ ను) శ్రీరంగంలో పెండ్లియాడిన కథను తెలుగుభాషలో కావ్యముగా రచించి, నీకు ఇష్టదైవమగు వేంకటాచలపటికి అంకితము చేయుమని ఆదేశించాడు. వేంకటపతికి నాకు నామభేదమేకాని, నేనేఅతడు. అతడేనేను. ఇరువురం ఒక్కరమే అని తెలియజేశాడు. పూర్వం కృష్ణావతారములో సుదాముడు ఇచ్చిన పూలమాలను అయిష్టంగా తీసుకున్నాను. ఎయిడ్ నామోషీగా ఉంది. ఆ కొరత తీరునట్లు నాప్రియురాలి పూలమాలను తాను అలంకరించుకొని, తొలగించి, నాకు ఆలంకారానికి ఇచ్చింది. తనను నేను పెండ్లియాడినాను. ఆ కల్యాణ కథను కావ్యంగా రచించుమని కోరినాడు.
కృష్ణరాయులు ఆంద్ర విష్ణుదేవుని ఆదేశానుసారం తెలుగులో ‘ఆముక్తమాల్యద’ అను గోదాదేవి కళ్యాణ కథను ప్రబంధంగా రచించి, శ్రీవేంకటేశ్వరాస్వామికి అంకితమిచ్చాడు. అంతేగాక తమిళదేశంలోని శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో వెలసియున్న గోదాదేవికి అలంకరించి, పిమ్మట తొలగించిన పూలమాలలను తిరుమలలో జరిగే వార్షికబ్రహ్మోత్సవములో గరుడసేవ నాటికి శ్రీవిల్లిపుత్తూరు నుండి తిరుమలకు తెప్పించి, వేంకటేశ్వరస్వామికి అలంకరించే ఏర్పాటు చేసినాడు. ఆంధ్రవిష్ణుదేవుని కోరికను తీర్చినాడు. ఇందుకు రాయలు రచించిన ఆముక్తమాల్యద సాక్షిగా ఉంది. ఈ సంప్రదాయం రాయలకాలం నుండి నేటి వరకు అవిచ్చినంగా జరుగుచున్నది.
ఆముక్తమాల్యదలో వేంకటేశ్వస్వామిని రాయులు బహువిధములుగా వర్ణించినాడు. ఆ వర్ణనల ద్వారా స్వామి విలక్షణాన్ని, వైశిష్ట్యాన్ని కీర్తించాడు. వేంకటవిభుడు.
‘గుహపుష్కరిణీ తట ఘన గుహాఖేట వంచక పుళిందుడు’ (1-48) – స్వామి పుష్కరిణీ తీరముననున్న దట్టమైన గుహవంటి అరణ్యమందు వేటాడు మాయా వుళిందుడు (చెంచువాడు).
వేంకటాచల పతికిన్ (1-49) – వేంకటమను పర్వతమునకు అధిపతి, రాయలు ఆముక్తమాల్యద కావ్యంలో నేడు ప్రసిద్ధమైన ‘వేంకటేశ్వర’ పదమును ఎక్కడా ప్రయోగించలేదు. అహో! రాయల వైష్ణవ నిష్ఠ!
బాలార్కాంశు విజృంభితామల శరత్పద్మాక్ష (1-86) – బాలసూర్యుని కిరణములచేత వికసింపజేయబడిన నిర్మలములైన శరత్కాలమునందలి పద్మముల వంటి నేత్రములుగలవాడు అని రాయలు వేంకటవిభుని నేత్ర సౌందర్యమును వర్ణించాడు. స్వామివారి నేత్రాలు సమదృష్టిని ప్రసరిస్తూ ఉంటాయి. భక్తులంకు దివ్యానుభూతిని కలిగిస్తుంటాయి.
పాదాబ్జఫాలంకార కచావతౌ మకరదీవ్యత్కుండ లాంచన్ముఖా! (1-86) – చవితినాటి చంద్రుని వంటి లలాటమునకు అలంకారముగ ఉన్న ముంగురుల చేత, మకర కుండలముల చేత ప్రకాశించుచున్న ముఖము గలవాడు అని వేంకటపతి ముఖసౌందర్యాన్ని రాయలు అభివర్ణించాడు. (ఇక్కడ పాద = నాల్గవభాగం, అబ్జ = చంద్రుడు అని అర్థము).
అలమేల్మంగాభిధేందిరాలయ వక్షా (1-87) – అలమేలుమంగ అను పేరుగల లక్ష్మీదేవికి నివాసమగు వక్షఃస్థలములవాడు.
శ్రీనయన కువల యుగళానూన జ్యోత్స్నాయుతస్మితోజ్జ్వల ముఖ (2-1) – లక్ష్మీదేవి యొక్క కలువలవంటి రెండు కన్నులకు అధికమైన వెన్నెలవంటి చిరునవ్వు చేత ప్రకాశించుచున్న ముఖముగలవాడు అని రాయులు స్వామి చిరునవ్వుతో కూడిన ముఖ సౌందర్యాన్ని వర్ణించాడు. ఆ నగుమోము భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది. తిరుమలేశుని విగ్రహం ఒక సౌందర్యలహరి. కేవలం శిలలో అంత దివ్యసౌందర్యం, ఆకర్షణ కాణాచియగుట సంభావమా? ఆ కొలది అప్రాకృత సౌందర్యం వర్ణించతరమా? దర్శించి అనుభవించాలి. ఎదకు మాటలురావు. నోటికి స్పందన కరవు. ఏంచేయాలి? నిండుభక్తితో ఓ నమస్కారం!’ శ్రీవేంకటేశ్వర చరణే శరణం ప్రప్రద్యే’ అని స్వామి పాదాలను ఆశ్రయించాలి. స్వామివిగ్రహం స్వయంవ్యక్తమైన విష్ణుదేవుని ఆర్చారూపం.
వేంకటాచల రమణా (2-1) – వేంకటమను పర్వతమునకు అధిపతి.
తామరసాయన నేత్ర (2-99) – పద్యపత్రముల వలె విశాలమైన కన్నులు గలవాడు.
లీలా వార్థుషికా (2-100) – విలాసార్థము భక్తులచేత వడ్డీ తీసుకోనువాడు. వడ్డీతో జీవించువాడు వార్థుషికుడని అమరము. వేంకటేశ్వరస్వామిని వడ్డీకాసులవాడని భక్తులు కీర్తిస్తున్నారు.
కృపా వీక్షా దృత బాహులేయ (3-1) – దయగల కంటి చూపులచేత కుమారస్వామిని ఆదరించినవాడు.
వేంకటరాయా (3-1) – వేంకటమను పేరుగల పర్వతమునకు అధిపతి.
కృకవాకు ధ్వజ దీర్ఘకాప్లవ తపః క్రీడో త్సువాద్యుత్ముకా (3-90) – ఎండాకాలమున కోడిధ్వజముగా గల కుమారస్వామి పేరుతో పిలువబడుచున్న స్వామి పుష్కరిణియందు వేసవి ఆటలగు తెప్పోత్సవము మొదలగువాణి యందు ఆసక్తిగాలవాడని రాయలు వేంకటేశ్వరస్వామి క్రీడాభిలాషను వర్ణించాడు. (రాయలకాలములో తిరుమలలో వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవములు వేసవికాలములో జ్యేష్ఠ పూర్ణిమకు జరిగేవి. నేడు తిరుమలలో వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవములు ఫాల్గుణ మాసములో – పూర్ణిమకు – జరుగుచున్నాయి). ఎంతమార్పు !
శ్రీమందిర భుజ మధ్యమ (4-1) – లక్ష్మీదేవికి నివాసస్థానమగు వక్షః స్థలము గలవాడు.
వృష గిరిస్థ (4-1) – సప్తగిరుల్లో ఒకటి అయిన వృషాచలము (ధర్మగిరి) నందు నివసించువాడు.
కారుణ్యాంబు సింధూభవ ద్దృగ్దామా (4-286) – దయ అను నీటికి సముద్రమగుచున్న చూపులకు నిలయమైనవాడు అని రాయలు వేంకటనాధుని దయాగుణమును కీర్తించాడు. భగవంతుని కల్యాణ గుణములలొ దయాగుణము ప్రముఖమైనది. పరహితచింతనయే దయ. చెరకురసము ఘనీభవించి చక్కెరగా మారినట్లు శ్రీనివాసుని దయాగుణ ప్రవాహము ఘనీభవించి, వేంకటాద్రిగా రూపొందిందని వేంకటనాధుడు (వేదాంతదేశీకులు) దయాశాతకములో వేంకటేశ్వరుని దయాగుణమును కీర్తించాడు. మన పూర్వులు వేంకటాద్రినే భగవంతుని స్వరూపంగా భావించి పూజించినారు. కొండమీద వెలసియున్న వేంకటవిభుని దర్శించుటకు అనుమతించమని నీపై కాళ్ళతో నడుచుట అను పాపమును క్షమించమణి కొండను ప్రార్థించి, కొండను ఎక్కేవారు.
కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమాన్ నృపాలక (4-287) – హస్తములందు ధరించిన శంఖ చక్రములను ఇచ్చుటచే తొండమాన్ రాజును రక్షించిన వాడు. తిరువేంగడనాథుదు తన శంఖచక్రములను తొండమాన్ రాజుకు ఇచ్చి, రక్షించిన కథ వేంకటాచల మహాత్మ్య ములోని బ్రహ్మపురాణం, బ్రహ్మాండపురాణం భవిష్యోత్తర పురాణ భాములలో వర్ణింపబడింది.
శేషనగ హర్యక్షా (5-1) – శేషాచలమందు సింహము వంటివాడు.
హరార్భక దుర్భర పక్వతపః కుహనార్భాక (5-160) – కుమారస్వామి యొక్క త్రివమైన, పరిపక్వమైన తపస్సుకు ఫలంగా కపటబాలకుడుగా అవతరించినవాడు. కుమారస్వామి తపస్సు, స్వామి సాక్షాత్కారం వేంకటాచల మాహాత్మ్యంలోని మార్కండేయపురాణంలో ఉంది.
వార్భృత కోనిరిహారి హిరణ్మయ హర్మ్య చరిష్ణుపదా (5-160) – నీటిచే నిండిన స్వామి పుష్కరిణీ యందున్న బంగారు మంటపమందు సంచరించెడు పాదములు గలవాడు.
కాకోదర నగోదయస్థ పతంగా (6-1) – శేషశైల మనెడు ఉదయ పర్వతమందున్న సూర్యుడు.
స్కందసరస్తటీ రమణకందర చందన కుండవాటికా మంద సమీరలోల వనమాలీ (6-136) – స్వామిపుష్కరిణీ తీరమందలి మనోహరమైన గుహలయందున్న చందన వృక్షముల, మొల్లల కోతల నుండి వీచుచున్న పిల్లగాలులు చేత కదలుచున్న వనమాలికలవాడు.
నిర్మల దివ్యవిగ్రహాస్పంది విభాధారీ కృత నభస్ఫుట కాళిక (6-136) – స్వచ్ఛమైన శరీరము యొక్క చలింపని కాంతిచేత తిరస్కరించబడిన ఆకాశపు చల్లదనంగలవాడు వేంకటవిభుడు ఆకాశవర్ణము గల శరీరము (విగ్రహము) గలవాడని రాయలు తిరువేంగడనాధుని విగ్రహ సౌందర్యమును వర్ణించాడు. ఇట్లు కృష్ణరాయులు తిరుమల వేంకటనాధుని దివ్యసౌందర్యమును ఆముక్తమాల్యద కావ్యంలో వర్ణించి ధన్యుడైయ్యాడు. అంతేగాక వేంకటేశుని సన్నిధిలో నిత్యసేవ చేయుటకు అంజలిబద్ధుడై ఇరుప్రక్కల తిరుమలదేవి, చిన్నాదేవి సహితుడైయున్న తమ రాగి విగ్రహాలను తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామి ఎదురుగా నిలిపాడు. ఇదీ కృష్ణరాయల వేంకటేశ భక్తి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment