శ్రీ పంచమి/వసంత పంచమి
మాఘ మాసం శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వ దినమైన "సరస్వతీ పూజ" దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు "అక్షరాభ్యాసం" జరుపుతారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం), ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ సంస్కారాలే.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ! విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా!!
ఇంతకీ ''శ్రీ పంచమి'' లేదా ''వసంత పంచమి'' అంటే చదువులతల్లి సరస్వతీదేవి జన్మదినం. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, నవరాత్రులను పురస్కరించుకుని దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమినాడు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఇళ్ళలో, దేవాలయాల్లో కూడా సరస్వతీదేవిని భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు మక్కువైన పండుగ ఇది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ ! పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః !!
అనగా మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభంనాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్ల వస్త్రాలతో అర్చించాలి
ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. అనగా అమ్మల్లో శ్రేష్ఠురాలు, నదుల్లో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతి. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్ధం కూడా ఉంది. శబ్దమనే జ్యోతి లేకుంటే జగమంతా అంధకార బంధురమే. లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత్రి సరస్వతి. భ్రమ, మాంద్యం, మతిమరపు, వాక్కు లోపాలు మొదలైన జాడ్యాలను సమూలంగా నశింపచేస్తుంది కనుక ‘నిశే్శష జాడ్యాపహా” అని ఈ విద్యాదేవిని పేర్కొన్నారు.
వేదం సరస్వతీ దేవిని ‘ప్ర(ణో)దేవి సరస్వతీ! వాజే భిర్వాజినీ వతీ ధీనా మవిత్య్రవతు’ అని ప్రశంసించింది. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామరపువ్వునీ, మిగతా రెండు చేతుల్తో వీణను వాయిస్తుంటుంది. సరస్వతీ బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుందని వర్ణించారు. అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి.
వల్లూరి పవన్ కుమార్

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


No comments:
Post a comment