గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 12 March 2016

పార్వతీదేవి తపోగ్రత-శ్రీ శివ మహాపురాణముపార్వతీదేవి తపోగ్రత-శ్రీ శివ మహాపురాణము

హంసతూలికా తల్పాలపై శయనించే పార్వతి కటికనేలపై పరుండి, ప్రాతః సంధ్యలోనే మేల్కాంచి నిత్య శివదీక్షాపరురాలైంది.

ఉష్ణోదకస్నానం, షడ్రసోపేత భోజనం మానివేసి, చన్నీటి స్నానం కందమూల ఫలములను ఆహారంగా తన నిత్యకృత్యాల్లో చేర్చింది. కోమల శరీరాన, పసిడి వర్ణానికే మెరుగుపెట్టే ఆభరణాలు ధరించవలసినది.. అట్టిది విభూది రేఖలే అలంకారాలుగా చేసుకున్నది.

అయినా - ఆమెకు సదాశివ దర్శనం కరువే అయ్యింది. శివనిరీక్ష కంటె శివతపం ఉత్తమమనిభావించి, ఆ ప్రయత్నం చేపట్టింది. మండు వేసవిలో పంచాగ్ని మధ్యాన నిలిచి, సూర్యమండలంవైపు చూపు నిలిపి తపస్సు నాచరించడం చలివేళల వర్షధారల నాచరించడం; ఆమెను చూసి - శతవృద్ధులు సైతం ఆశ్చర్యపోయేరీతిగా, కాల తీవ్రతలతో చెలిమిచేస్తూ తపోనిష్ఠా గరిష్ఠురాలు కావడం... ఆమె తపోగ్రతకు నిదర్శనాలైనాయి.

ఇంద్రాది దేవతలు సదాశివుని ప్రార్ధించి, పార్వతిని పరిణయ మాడి ప్రపంచాన్ని కాపాడమని వేడుకున్నారు. పార్వతియందు కుమారుడిని కని తారకుని పీడ తొలగించమని అభ్యర్ధించారు. వారిని కరుణించి, అట్లే జరుగుతుందని అభయం ఇచ్చి పంపేశాడు శివుడు.

సప్తర్షుల ద్వారా పార్వతి తపోగ్రత తెలిసినా, తానొకపరి, ఆమె మనోనిశ్చయాన్ని పరీక్షించ దలిచాడు శూలి.

నటన బ్రహ్మచారీ - నగరాజపుత్రీ ముఖాముఖి:

ఒకనాటి మధ్యాహ్న సమయాన, పార్వతి యధోచితమున నియమనిష్ఠలతో తపమాచరించు చుండగా అచ్చటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. సూర్యతేజంతో వెలుగుతున్న అతడు కృష్ణాజినము, జపమాల ధరించాడు. త్రిపుండ్రాంకితమైన అతని లలాటాన్ని చూసి సాక్షాత్తు శివయోగిగా భావించిన పార్వతి నమస్కరించగా, అతడు 'అభీష్ట సిద్ధిరస్తు' అని ధీవించాడు.

కుశల ప్రశ్నలడిగాడు. పార్వతి వంక పరిశీలనగా చూసి, "అమ్మాయీ! ఏదో ఫలాపేక్షతో భీషణ తపమాచరిస్తున్నట్లున్నావు. కాని , దేహం విషయంలో అశ్రద్ధ చేస్తున్నావు. అయినా, మేము యోగులము! స్త్రీలతో సంభాషించడమేమిటని ఆశ్చర్యపోతున్నావు కదూ! సంబంధం సాప్తపదీనం అంటారు...నేను ఆ ప్రకారం నీకు ఆప్తుడ్ని కనుక అడుగుతున్నాను. నీవు చూస్తే మహోన్నత హిమవత్పర్వత రాజు కుమార్తెవు. సౌందర్యం, ఐశ్వర్యం, సౌఖ్యం అన్నీ నీకు అరచేత అమరినవే! ఆశ్చర్యమే మరి!" అంటూ, తన వాక్ సుధా రసం ప్రేమమీర వర్షించాడా వటువు.

పార్వతీదేవి ఏమీ మాట్లాడలేదు. మళ్లీ తన వాగ్ధోరణి కొనసాగించాడా బ్రహ్మచారి.

"సుందరీ! పుట్టింట నిన్నెవరూ అవమానించలేదు కద! అయినా, పాము పడగపైన చేతిని ఉంచేవాళ్లుంటారా ఎక్కడైనా? అదీగాక, నీవుపడుతున్న కష్టం చూస్తూంటే - తీరని కోరిక ఏదో నిన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నట్లే ఉంది. అట్టి కోరిక ఏమిటై ఉంటుందబ్బా? స్వర్గ సౌఖ్యమయి ఉండదు. స్త్రీకి పుట్టింటిని మించిన స్వర్గ సౌఖ్యమేడగలదు? మగని కోసం కాబోలును? అయినా, నీవు నారీ శిరోరత్నానివి. రత్నాన్ని వెతుక్కుంటూ ఎవరైనా రావాలిగాని, రత్న లంతాను ఎవర్నని వెతుక్కొని వెళ్తుంది? నీ నిట్టూర్పుల వేడి చూస్తూంటే నువ్వు చాలా శ్రమ చెందినట్లుగా కనిపిస్తున్నావు. నిన్ను ఇంతగా కష్టపెట్టిన ఆ కఠినుడు ఎవడు?"

ఇంత సుదీర్ఘమైన సంభాషణకూ, ఒక్కటంటే ఒక్కపలుకు కూడ పార్వతి బదులీయక పోవడంతో, కొంచెం చొరవ చేసి ముందు కొచ్చి "ఇదిగో! అమ్మాయీ! నువ్వు చూస్తే కన్యవు. నేనా బ్రహ్మచారిని! మన కిద్దరికీ సరిజోడు కుదురుతుందనే నా నమ్మకం! ఏమంటావు! పోనీ! నీవు ప్రేమించిన వానికై నా తపస్సులో సగభాగం నీకు ఇప్పుడే ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను"...అని ఆశ చూపించాడు.

ఆ వాగ్వైఖరి నచ్చక, పార్వతి చెలికత్తె వైపు కనుసైగ చేసి చూసింది. ఆమె వివరంగా పార్వతీదేవి ఎవరికోసం తపస్సు చేస్తున్నదో చెప్పింది.

అంతా విని గట్టిగా నవ్వాడా బ్రహ్మచారి. "భేషు! చాలా గొప్ప వరుడి కోసమే తపస్సు చేస్తున్నదే మీ రాజపుత్రి" అని మళ్లీ పక పక నవ్వాడు.

"ఏమి! శివుడికంటె ఉత్తమ వరుడున్నాడా?" అడిగిందా చెలికత్తె.

"అదలా వుంచు! ప్రస్తుతం మీ చెలి ఎవర్నయితే వరించ బూనుకొన్నదో అలాంటి వాడు ఈ పధ్నాలుగు లోకాల్లోనూ ఎక్కడా గాలించి వెతికినా కనబడడు.

ఒంటి నిండా బూడిద! మెడలో ఇంతింత కపాలాల మాల, వాటిని పెనవేసుకున్న పాములగోల, కట్టినదేమో జంతుచర్మం. అట్టలు కట్టిన జడలు...ఓహోహో! ఎవరైనా వింటే నవ్విపోతారు.

అంద చందాల్లో గానీ - ఐశ్వర్య భాగాలలో గాని పార్వతీదేవి ఎక్కడ? శ్శశానవాసి సాంబుడెక్కడ? ఐనా ఆవిడ కోరుకోదలిస్తే, దేవలోకంలో దేవతలు ఎంతమంది లేరు? భూలోకంలో రాజపుత్రు లెంతమంది లేరు? పోనీ!..అవన్నీ వదిలేయ్ ! మీ సఖికి నేను తగనా? కాస్త చెప్పిచూడు!

దీంతో చెలికెత్తె క్కూడా కోపం వచ్చింది. అయినా, బ్రాహ్మణులపై కోపం తగదని తెలిసిన ఇంగితజ్ఞురాలు కనుక - "అయ్యా! తాప సోత్తములకు తగని పలుకులను, మీ నోటి వెంట వినాల్సి వస్తున్నందుకు విచారంగా ఉంది. తాము ఎవర్ని కోరుతున్నారో, కాస్త ఆలోచించడం మంచిది" అన్నది కాస్త కటువుగానే.

"ఓహో! అదా సంగతి! అమ్మా! పార్వతీదేవి చెలీ! మీ సఖి పర్వతరాజు కూతురని నేను మర్చిపోయాననుకున్నావా? ఇలా ఎవరైనా మాట్లాడారంటే - ఉరితీయించేస్తారు! అంతేకదా!

తలపట్టుకుంది చెలికత్తె.

"అయ్యో! అది కాదయ్యా విప్రకుమారా! ఈమె ఏనాడో పరమ శివుని సొత్తు అయిపోయింది. ఇతరులీమెను ఆశించడం మహాపాపం!" అంది - ఇంకేం అనాలో తోచక.

"బాగుందమ్మా - ఈ వైనం! మనస్సును పరమశివునికి అంకితం చేసింది, సరే! ఆయనగా రీవిడ మానసాన్ని అంగీకరించాలా? వద్దా?"

"అతడు అంగికరిస్తాడో - లేదో నీకెందుకయ్యా ఆ సంగతి?"

"ఓహోహో! అంగీకరించేవాడే అయితే - ఇంత జాగు చేయనేల? నేటికీమె తపమాచరించుట మొదలిడి ఎన్నాళ్లుగడిచింది? నిజంగా ఈమెపై ప్రేమే ఉంటే, ఈ సుందరి ఈ రీతిన తపశ్చర్యలో నలిగిపోతూంటే, చూసి ఓర్చుకోగలడా? ఆ శివుడో పాషాణ హృదయుడు లయకారకుడు. ప్రేమ ఉంటుందని ఎలా భావించగలం? రంగురంగుల వస్త్రాలున్నాయా? కస్తూరి సుగంధికారి లేపనాలున్నాయా? రత్నా భరణాలున్నాయా? ముసలెద్దు తప్ప సరైన వాహనమైనా లేదే! అవన్నీ అలా ఉంచు! మీ సఖి శివుడ్ని పెళ్లాడిందనుకో! దగ్గరగా నిలబడ్డప్పుడు ముఖం మీద పాము బుస్సన్న కోసమా ఈ తపస్సంతా?" అని పెద్ద పెట్టిన నవ్వేస్తూ, నోటి కొచ్చినట్టల్లా వాగాడతడు.

అంతవరకు శాంతచిత్తురాలై ఉన్న పార్వతి ఇంక సహించ లేకపోయింది.

"చెలీ! ఈ శివ దూషణను ఇక భరించడం నావల్ల గాదు. ఈతడిట్లు శివనింద చేయువాడని తెలియక గౌరవించాను. ఇట్టి శివద్వేషిని తక్షణం ఇటనుండి వెడలిపొమ్మని చెప్పు!" అని ముఖం అటు తిప్పుకోబోయింది.

ఆ తత్తరపాటులో పార్వతీ దేవి సన్నని వల్కలాంచలం అందంగా ఆమె చన్నుల పైనుంచి జారి వింతసొగసు లీనసాగింది. అది కూడా ఆమె గమనించక చరచరా నాలుగడుగులు నడిచి, రోషం నిండిన కళ్లతో ఒక్కసారి వెనక్కు తిరుగుతూ పైట సర్దుకుంది.

ఆ తిరగడంలో ఆమె కళ్లకు చంద్రశేఖర రూపం సాక్షాత్కరించింది. అంతవరకు నటన వేషధారిగా, బ్రహ్మచర్యదీక్షా పరుడిగా కనిపించిన ఆ వటువే ఈ శివుడని తెలిసి ఆమె సిగ్గులమొగ్గ అయింది. ఆమె చెలి కూడా ఆశ్చర్యపోయి; ఆవలకు తప్పుకున్నది.

"దేవాధిదేవా! ఈ దీనురాలిపై ఇంతకాలానిక్కాని తమకు దయ కలగలేదన్నమాట!" అని గబగబా దగ్గరకొచ్చి నిష్ఠురమాడింది - ప్రేమా స్పదమైన పార్వతి అలుకకు చిర్నవ్వే శివుని సమాధానం!

"ఏదయితేనేం! నేటికి నేను ధన్యురాలినైనాను. తల్లిదండ్రుల చాటు పిల్లని కదా! ఎంతగా మిమ్ములను ప్రేమించినా, లోకాచారరీత్యా తాము, మా పితృవరేణ్యులను అర్ధించి నన్ను అనుగ్రహించేందుకు తోడ్పడవలసింది" అని కోరింది పార్వతి.

"సరే! నే నేరీతిన అర్ధించాలో అదీ నువ్వే చెప్పు!" అన్నాడు సాంబశివుడు. "తమకు తెలియని రీతులా? సమస్త విషయగ్రహణ పారీణులు తాము" అంటూనే శలవు పుచ్చుకొని పార్వతి గృహోన్ముఖంగా కదిలింది. శివుడచటినుంచి అంతర్హితుడయ్యాడు.

సప్తర్షులతో మంతనాలు

ఒకానొక సుర పొన్ననీడన కూర్చుండి, 'శివుడనైన నేను యాచనకు జంకేవాడిని కాను. భిక్షాటన నా వృత్తి కావచ్చుగాక! ఇది కల్యాణఘట్టము. కనుక దీనికి తగిన వారిని నియుక్తులను చేయక తప్పదు' అని యోచించినవాడై సప్తర్షులను తన మనస్సులో తల్చుకున్నాడు.

వారంతా వెంటనే శివసంకల్పమైనదని సంతసించి, విహాయస వీధుల వడివడిగా బయల్దేరి, అనతి కాలములో ఫాలలోచనుని ముంగిట ప్రణతులిడుతూ నిలబడ్డారు.

ఆ విధంగా తన ఎదుట నిలిచిన భరద్వాజ, అత్రి, గౌతమ, విశ్వామిత్ర, జమదగ్ని, అరుంధతీ సహిత వశిష్ఠులను గాంచి శంకరుడు హసన్ముఖుడైనాడు. వారికి ఉచిత మర్యాదలు సలిపి "సప్తర్షులారా!తమవల్ల కాగల కార్యమొకటి ఉండుటచే మిమ్ములను రావించితి" నన్నాడు చంద్రశేఖరుడు.

"మహాదేవా! తమ ఆజ్ఞ శిరసావహించుటకంటే వేరే మాకు కార్యమేమియులేదు. సవిస్తరంగా ఆనతీయ వలసింది" అని కోరారు అందరూ.

"పర్వతరాజు పుత్రి పార్వతి, గత జన్మమునందు దాక్షాయణి అని మీకు తెలిసినదే! నేను పార్వతిని వివాహమాడ దలచితి! పెండ్లి పెద్దలుగా మీరు నా తరుపున వ్యవహరించాలి!" అన్నాడు శూలి.

"జగదానందకరమైన ఇంతటి దివ్యకార్యము, మా భుజ స్కంధములపై నుంచిన మహాదేవా! నీకు వేన వేల కృతజ్ఞతలు. నీ కృపవల్ల మా పుణ్యము ద్విగుణీకృతమైనది. ఈ కార్యనిర్వహణ ద్వారా మేము అందరికంటె మిన్నగా సత్కరించబడ్డ వాళ్లమైనాము"...అని పరిపరి విధముల సంస్తుతించి హిమవంతుని కడకేగి పెండ్లిముహుర్తము నిశ్చయించుకొను ప్రయత్నమున పడ్డారు.

తనను సందర్శింప వచ్చిన సప్తర్షులను, అసమాన గౌరవంతో - అగణిత మర్యాదతో చూసిన హిమవంతుడు తానే ముందు ప్రస్తావించాడు. అప్పుడు అందరూ ముక్తకంఠంతో "పర్వతరాజా! నీకు శుభమగుగాక! నీవు అసామాన్యుడివి! పౌరాణిక శ్రేష్ఠులు నిన్ను విష్ణువని స్తుతిస్తారు. సప్తపాతాళ భువన గోళాలకు నీవు మూలాధార భూతుడవు! అట్టి నీ పుత్రిక సాక్షాత్తు అంబ. పరమేశ్వరి. అఖిలాండేశ్వరి. యోగీశ హృదయ మందారుడైన చంద్రశేఖరుడు నీ పుత్రికను పెండ్లాడగోరి, మమ్ము పెళ్లి పెద్దలుగా పంపించాడు. నీవు కన్యాదాతవు. మేము వివాహ సంధాతలం! ఇదీ జగత్కల్యాణ కారకం!" అని వివరించారు. సప్తర్షుల సందేశాన్ని శ్రద్ధగా విన్నాక, మేనకాహిమవంతుల ఆనందానికి అవధిలేకపోయింది.

అందరూ పార్వతీదేవిని ఆశీర్వదించారు. నాటికి నాలుగవ రోజున ఒక గొప్ప ముహూర్తాన్ని నిర్ణయించి, హిమవంతుని వీడ్కోలు తీసుకొని సప్తర్షులు వెళ్లిపోయారు.

ఆ క్షణం నుంచే పెండ్లి ఏర్పాట్లలో పడినాడు హిమవంతుడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML