గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 February 2016

ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా? పురాణగాధ :

ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా?
పురాణగాధ :
పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలిగింది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికి విందుభోజనాలను ఏర్పాటు చేసి... తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరిని ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరిసంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు. అప్పుడు కుబేరుడు తన మనసులో.. ‘‘శివునికి ఒక ఇల్లు అంటూ లేదు... ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ వుంటాడు. అతను నా ఇంటిని చూసి ఆశ్చపోతాడు. అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది’’ అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు.
అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి.. ఎవరు, ఎప్పుడు, ఏమిటి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు. అలాగే కుబేరుని అహంకారాన్ని కూడా శివుడు పసిగడతాడు. పార్వతీదేవి కూడా కుబేరుని పథకాన్ని పసిగట్టి, అతని అహంకారాన్ని అణిచివేయడానికి శివునికి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది. కుబేరుడు శివపార్వతుల దగ్గరికి చేరుకుని.. ‘‘మహాదేవా! మీరు, పార్వతీదేవి ఇద్దరూ కలిసి మా ఇంట్లో నిర్వహించిన విందు కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను’’ అని వేడుకుంటాడు.
దానికి సమాధానంగా శివుడు.. ఆ విందు కార్యక్రమానికి హాజరు కావడానికి కుదరదంటాడు. అలాగే పార్వతీదేవి కూడా ‘‘భర్త రానిదే నేను రాను’’ అని చెబుతుంది. కుబేరుడు మళ్లీ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో వినాయకుడు కైలాసానికి చేరకుంటాడు. రాగానే తన తల్లి అయిన పార్వతీదేవితో.. ‘‘అమ్మా! నాకు చాలా ఆకలేస్తోంది. ఏదైనా వుంటే వడ్డించు’’ అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి పథకం పన్ని గణపతివైపు కనుసైగ చేసి.. ‘‘కుబేరా! మేము ఎలాగూ నీ విందు కార్యక్రమానికి రాలేకపోతున్నాం కాబట్టి.. మా గణపతిని మీ విందుకు తీసుకెళ్లు’’ అని చెబుతుంది. శివుడు కూడా పార్వతీదేవి పథకాన్ని అర్థం చేసుకుని.. ‘‘అవును కుబేరా! గణపతిని తీసుకెళ్లు. అతనికెలాగో విందు భోజనం అంటే చాలా ఇష్టం. మాకు బదులుగా గణపతిని నీ విందు కార్యక్రమానికి తీసుకెళ్లు’’ అని చెబుతాడు.
కుబేరుడు ఆ బాలవినాయకుడిని చూసి తన మనసులో.. ‘‘ఈ పసిపిల్లాడా.. సరే! ఇతను విందుకు వచ్చినా ఎంత తింటాడులే’’ అని అనుకుంటూ.. గణపతిని అలకాపురిలో వున్న తన భవనానికి తీసుకుని వెళతాడు. తన భవనంలో వున్న సౌకర్యాలు, అందాలు, ఇతర సంపదలను ఆ వినాయకునికి చూపించాడు. అయితే వినాయకుడు.. ‘‘ఇవన్నీ నాకు వ్యర్థం. వీటితో నాకు ఎటువంటి అవసరమూ లేదు. నాకు చాలా ఆకలిగా వుంది. త్వరగా ఆహారం పెట్టండి’’ అని కసురుకుంటాడు. అప్పుడు కుబేరుడు వెంటనే భోజనాన్ని సిద్ధం చేయాల్సిందిగా తన దగ్గర పనిచేస్తున్నవారికి ఆజ్ఞాపిస్తాడు.
కుబేరుని పనివాళ్లందరు వెంటనే గణపతి ముందు ఒక కంచెం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు, ఇతర భోజనాలన్నీ వడ్డిస్తారు. కుబేరుడు పక్కనే వుండి చూస్తుండగా.. గణపతి కంచంలో వున్న ఆహారంతోపాటు అక్కడే వున్న పాత్రల్లో వున్న ఆహారాన్ని మొత్తం తినేసి.. ఇంకా భోజనాన్ని తీసుకురండని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సేవకులు వంటశాలలో వున్న మొత్తం ఆహారాన్ని గణపతికి వడ్డించారు. అయినా గణపతికి ఆకలి తీరలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి గర్జిస్తూ ఆజ్ఞాపిస్తాడు. కొద్దిసేపటిలోనే కుబేరుడు దేవతల కోసం తయారుచేసి పెట్టిన భోజనం మొత్తం ఖాళీ అయిపోతుంది.
ఇక కుబేరుడు తనతో జరుగుతున్న మొత్తం విషయం గురించి తెలుసుకుంటాడు. తన సంపద మొత్తం తరిగిపోయినా గణపతి కడుపు నిండలేదు. దాంతో కుబేరుడు చింతిస్తూ ఏమి చేయాలో అర్థంకాక అలాగే వుండిపోతాడు. ఇంతలోనే గణపతి ఆగ్రహంతో.. ‘‘నన్ను నీ ఇంటికి విందు భోజనాలకు రమ్మని, ఆహారం పెట్టకుండా అవమానిస్తావా’’ అని పలుకుతాడు. కుబేరుడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని, తన అహంకారాన్ని అణచడానికే శివుడు ఇలా చేశాడని గ్రహించి.. వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు. అప్పుడు కుబేరుడు, శివునితో.. ‘‘శంకరా! నువ్వు నాకు సిరిసంపదలు ప్రసాదించి, అధిపతిని చేసిన విషయాన్ని మరచి.. నీతో అహంకారంగా ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతితో నా మొత్తం సంపదను ఖాళీ చేయించావు. బాల వినాయకుడైన నీ కుమారుని ఆకలి కూడా తీర్చలేకపోయాను. దీనికి ఏదైనా పరిష్కారమార్గం చూపించండి’’ అంటూ వేడుకున్నాడు.
అప్పుడు శివుడు.. ‘‘కుబేరా! నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలను వడ్డించావు. అందుకే అతను సంతృప్తి చెందలేదు. నీ దగ్గర ఎంత సంపద వుందన్నది గణపతికి ముఖ్యం కాదు.. ఎంత భక్తితో సమర్పించావోనన్నది మాత్రమే చూస్తాడు. కాబట్టి నీ అహంకారాన్ని మరిచి.. ఈ గుప్పెడు బియ్యం తీసుకునివెళ్లు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకుని భక్తితో బియ్యాన్ని ఉడికించి, భోజనం పెట్టు’’ అని అన్నాడు. కుబేరుడు, శివుడు ఇచ్చిన బియ్యాన్ని తీసుకుని.. వాటిని ఉడికించి, భక్తితో గణపతికి వడ్డించాడు. దాంతో గణపతి కడుపు నిండి, సంతృప్తి చెందుతాడు. ఇలా ఈ విధంగా పరమశివుడు.. కుబేరునికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML