గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 February 2016

విశిష్టమైన గిరిజన జాతర "మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.విశిష్టమైన గిరిజన జాతర "మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.

తెలంగాణ లో జరిగే అతిపెద్దదైన, విశిష్టమైన గిరిజన జాతర "మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర." ఈ జాతర రెండేళ్లకొకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర ను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నం గా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకువస్తారు.

వరంగల్ జిల్లా కేంద్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, తెలంగాణ లోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు సమ్మక్క-సారలమ్మలు!

"దేశం లోనే అతి పెద్ద గిరిజన జాతర" గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .
మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడ లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

ఎవరీ సమ్మక్క-సారలమ్మలు?

12వ శతాబ్ధంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని 'పొలవాస' (పొలాస) ను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజు కిచ్చి వివాహము చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తినాడు.

ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుండగా మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోయాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తినా డు.

సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేసినారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.

ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు! కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

🔹జాతర విశేషాలు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు.
రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.

మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు.

నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు.

వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనలే కాక అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML