గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 23 January 2016

వేదమనే పదానికి అర్థం:వేదమనే పదానికి అర్థం:

"విదంతి అనేన ధర్మం" - దీనిచే జనులు ధర్మమును తెలుసుకొందురు గనుక వేదమని వేద శబ్దమునకు వ్యుత్పత్యర్థము. ఇది విదజ్ఞానే యను ధాతువునుండి ఏర్పడిన రూపము. "విద విచారణే (విచారణ యందు), విద సత్తాయాం (ఉనికి యందు), విద జ్ఞానే (జ్ఞానమందు), విద్ లాభే (లాభమందు), ఏతేషాం ధాతూనాం విషయే వర్తతే యస్మాత్ తతో వేద ఇత్యుక్తః" - విద అను క్రియ విచారణ, ఉనికి, జ్ఞానము, లాభము అను అర్థములందు ఉన్నది కావున వేదమని చెప్పబడినదని శంకర భాష్యము. "ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయో రలౌకికముపాయంయో వేదయతి సవేదః" - ఇష్టమును పొందుటకును, ఇష్టముకానిది పోగొట్టుటకును, అలౌకికమైన ఉపాయమును తెలుపునది వేదము.

ప్రత్యక్షేణానుమిత్యా వాయస్తూపాయో న బుధ్యతే
ఏవం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా

ప్రత్యక్షముగా గాని, అనుమాన ప్రమాణముచేతగాని, దేనికి ఉపాయము తెలియబడదో అది వేదముచేత తెలియబడును. కావున దీనికి వేదమని పేరు వచ్చినది. స్వర్గాది లోకములు, పుత్రకామేష్టిని బట్టి పుత్ర జననము, దర్శ పూర్ణమాసాది కర్మల ఫలములు, పాప పుణ్యములు, యజ్ఞముల వలన వచ్చు వర్షాది యోగములు, యాగములవలన వచ్చు పుణ్యఫలములు వేదమువలన తెలియును.ఇవి ప్రత్యక్షముగా గాని, అనుమాన ప్రమాణము చేత గాని తెలియవు.

వేదములెన్ని?

అనంతావై వేదాః - ఈ సూక్తిని బట్టి వేదములు అనంతములు. "నీకు నాలుగింతలు ఆయుర్దాయమిచ్చినను వేదములను తెలుసుకొనలేవు" - భరద్వాజునితో ఇంద్రుడు అన్న మాట తైత్తరీయ బ్రాహ్మణములో చెప్పబడినది. జ్ఞానప్రదములైన వేదములు అనంతములైనను బాహ్యముగా చూచినచో ఋగ్, యజుర్, సామ, అథర్వ వేదమని నాలుగు విధములు. కానీ విషయవిభాగమును బట్టి చూస్తే అవి మూడే. "త్రయీ వై విద్యా ఋచో యాజుంషి సామాని" అని శతపథ బ్రాహ్మణములో చెప్పబడెను. వేద విద్య ఋక్కులు, యజుస్సులు, సామములు అని మూడు విధములు. వాని త్రయి అందురు. "ఇతి వేదాస్త్రయా స్త్రయీ" - ఇట్లు వేదములు మూడు అని నిఘంటువులు చెప్పుచున్నవి. విషయవిభాగమును బట్టి మూడు అన్నను, బాహ్య రూపమును బట్టి నాలుగు అన్నను విరోధము లేదు.

వేదములు అపౌరుషేయములు

వేదములు ఏ పురుషుని చేత రచించబడినవి కావు కనుక అవి శాశ్వతములు, నిత్యములు. "అనాది నిధనా నిత్యా వాగుత్సృష్టా స్వయంభువా| ఆదౌ వేదమయీ దివ్యా తతః సర్వా ప్రవృత్తయః" (మహాభారతము) - ఆది అంతములు లేని నిత్యమైన వాకు స్వయంభువుచే పైకి వెల్లడి చేయబడినది. అది ఆదిలో దివ్యమైన వేదమయ వాక్కు. దాని నుండి సర్వ ప్రవృత్తులు బయలుదేరినవి, అని మహాభారతములో వ్యాసులవారు చెబుతున్నారు.

"తస్మాత్యజ్ఞాత్సర్వ హుతః | ఋచః సామాని జజ్ఞిరే | ఛందాంసి జజ్ఞిరే తస్మా | ద్యజుస్తస్మాదజాయత |" (యజుర్వేదము) - ఆ యజ్ఞమునుండి సర్వ దేవతలను పిలుచు ఋక్కులు, సామములు బయలుదేరినవి. దానినుండి ఛందస్సులు, యజుస్సులు బయలుదేరినవి. ఈ వేదములు ఆ పరమాత్మ యొక్క నిశ్వాసములు. ధ్యానించబడిన ఆ వానినుండి వేదములు బయలుదేరినవి. అగ్ని నుండి ఋగ్వేదము, వాయువు నుండి యజుర్వేదము, సూర్యుని నుండీ సామవేదములు బయలుదేరినవి అని శతపథము చెప్పుచున్నది. కావున వేదములు అపౌరుషేయములే.

నామ విభాగ వివరణము
ఋచస్తుతౌ అనే ధాతువునుండి ఋక్ అను పదము ఏర్పడినది. అగ్ని ఇంద్రుడు మొదలైన దేవతలను స్తుతించునవి గావున ఋక్కులనబడెను. అటువంటి ఋక్కులు గలది ఋగ్వేదము.
యజపూజాయం అను ధాతువునుండి యజుస్సు అను పదము ఏర్పడినది. దేవతలను దర్శ పూర్ణ మాసాది యజ్ఞాదుల ద్వారా పూజించునవి యజుస్సులు. అవి గలది యజుర్వేదము. యజ్ఞాదులయందు దేవతలను పూజించుటకు ఈ యజుస్సులను ఉపయోగిస్తారు.
సమముగా ఉదాత్తనుదాత్త స్వరితాది స్వరములచే సరిగా, చక్కగా గానము చేయుబడునవి సామములు. అవి గలది సామవేదము
అథర్వమని చెప్పబడిన వేదములో పైన చెప్పిన ఋక్కులు, యజస్సులు, సామములు కలిసి యున్నవి.అథర్వుడను ఋషి దర్శించిన మంత్రములు చాలా యున్నవి గనుక అథర్వ వేదమనబడినది. అది వేరే వేదముకాదు.
మంత్రములు

ఈ ఋక్కులను, యజుస్సులను, సామములను మంత్రములందురు. "మననాత్ త్రాయతే యస్మాత్" - మననము చేయుటవలన రక్షించునవి గావున మంత్రములని వ్యుత్పత్తి. వీనిని ఛందస్సులు అని కూడా అందురు. "ఛందాంసి ఛాదనాత్" - ఉత్తమమైన భావములను కప్పునవి గావున ఛందస్సులనబడినవి. ఏ కోరికగల ఋషి ఏ దేవతను గూర్చి ప్రయోజనము కోరి స్తుతించునో ఆ మంత్రము ఆ దేవతకు సంబంధించినది అగును. ఋషులు ధర్మములను సాక్షాత్కారము చేసుకొనిరి. వారు ధర్మములను సాక్షాత్కారము చేసుకొనలేని వారికి ఉపదేశముల ద్వారా మంత్రములను ప్రసాదించిరి.

వేదములు స్వతః ప్రమాణములు. అవి పరమేశ్వర నిశ్వసితములు. వానికింకొక దాని వలన ప్రామాణికము సిద్ధించనవసరము లేదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML