గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

ఇంతకీ మనం మన దేశంలోనే ఉన్నామా? -ఎం.వి.ఆర్. శాస్త్రి23/01/2016ఇంతకీ మనం మన దేశంలోనే ఉన్నామా? -ఎం.వి.ఆర్. శాస్త్రి23/01/2016

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై ఎంవీఆర్ శాస్త్రి గారి ఉన్నమాట.. ప్రతి ఒక్కరు తప్పకుండా చదవాలి.

ఆవేశకావేషాల ఉద్ధతిలో అసలు విషయం మరపున పడింది.
పాకిస్తాన్ తన తైనాతీలను ఉసిగొలిపి ముంబయిలో వరసగా పేలుళ్లు జరిపించి 300 మందిని నిష్కారణంగా, క్రూరాతిక్రూరంగా పొట్టన పెట్టుకుంది. ఆ పాపంలో పెద్ద్భాగం ఉన్న యాకుబ్ మెమెన్ అనే వాడిని రెండు దశాబ్దాలు లేటుగా నిరుడు ఉరి తీశారు. ఆలస్యంగానైనా న్యాయం అమలయిందని భారతీయులు సంతోషించారు. కాని మన దేశంలోని పాకిస్తాన్ తొత్తులు, మెదళ్లు పుచ్చిన మేధావులు, కుటిల రాజకీయులు దేశద్రోహిని ఉరి తీసినందుకు పెంకులెగిరేలా రంకెలేశారు.
ఆ సందర్భంలో అందరి దృష్టిని ఆకట్టుకుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యాకుబ్ మెమెన్ వీరాభిమానుల వీరంగం. వందల ప్రాణాలు బలిగొన్న పాపాత్ముడి ఉరిని వ్యతిరేకిస్తూ చదువుల తల్లి నెలవైన ఉన్నత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెడబొబ్బలు, చచ్చినవాడి ఆత్మశాంతికి సామూహిక ప్రార్థనలు, ‘ఒక యాకూబ్‌ను ఉరి తీస్తే ఇంటింటా ఒక యాకుబ్ పుట్టుకొస్తాడంటూ’ ప్లకార్డుల ప్రదర్శనలు తిలకించిన ప్రజలు విస్తుపోయారు.
అదే యూనివర్సిటీలో ఒక విద్యార్థి కూడా అక్కడ జరిగిన దానిని తీవ్రంగా గర్హించాడు. యాకుబ్ మెమెన్ అభిమాన సంఘం కార్యకలాపాలను అతడు అడ్డగించలేదు. ఎవరిమీదా దాడి చేయలేదు. ఎవరినీ పేరుపెట్టి దూషించలేదు. యూనివర్సిటీలో ముష్కరులు చెలరేగటం తప్పంటూ తన ఫేస్‌బుక్ ‘గోడ’మీద తనకొచ్చిన భాషలో రాసుకున్నాడు. అందులో అభ్యంతరకరమైనదేదీ లేదు. దేశద్రోహిని బాహాటంగా సమర్థించి, అమరవీరుడిగా కీర్తించే హక్కు అవతలవారికి ఉన్నప్పుడు, అది తగదంటూ వ్యతిరేకించే భావస్వేచ్ఛ ఆ విద్యార్థికి మాత్రం ఎందుకు ఉండదు?
యాకుబ్ మెమెన్ అభిమానగణం అలా అనుకోలేదు. మమ్మల్నే తప్పు పట్టేంత మొనగాడివా అంటూ అర్ధరాత్రి హాస్టల్ గదిలో అతడి మీదికి పాతిక ముప్ఫైమంది దండెత్తారు. ఆ విద్యార్థిని ఎంతలా కొట్టారు అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిరసన తెలిపిన విద్యార్థి గదికి ఆగ్రహించిన గుంపు అర్ధరాత్రి వెళ్లినట్టు, బయటి గేటు దగ్గరి సెక్యూరిటీ గదికి లాక్కువెళ్లి క్షమాపణ లేఖ రాయించినట్టు అతడిని వ్యతిరేకించే విద్యార్థి నాయకులు సైతం అంగీకరించారు. ఫేస్‌బుక్‌లో అతడు పెట్టిన పోస్టును అతడిచేతే బలవంతంగా తీయంచారు.
అది దౌర్జన్యం కాదా? సెంట్రల్ యూనివర్సిటీ మన హైదరాబాద్‌లో కాక పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఉండివుంటే... పాకిస్తాన్ వాడిని ఇండియా ఉరి తీయటాన్ని అక్కడి ఒక భారతీయ విద్యార్థి సమర్థించగా మిగతా పాకిస్తానీలంతా కలిసి అతడిని చితకబాదారంటే - అక్కడి పరిస్థితి అది, ఆ దేశస్థుల జాతీయ సెంటిమెంటు తీవ్రత అలాంటిది అని అర్థం చేసుకోవచ్చు. కాని భారతదేశంలో భారతీయ విశ్వవిద్యాలయంలో కూడా జాతీయ భావాన్ని ప్రకటించి, జాతి వ్యతిరేక ధోరణిని గర్హించే భారతీయ విద్యార్థికి రక్షణ లేదా? జాతి వ్యతిరేకులకే తప్ప జాతీయ వాదులకు మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులు ఉండవా?
దాడికి లోనైన విద్యార్థి తెలంగాణలో సామాన్య కుటుంబానికి చెందిన బి.సి. కులస్థుడు. మన మహా మేధావులు పొద్దస్తమానం ఉచ్చరించే ‘సామాజిక న్యాయా’నికి అన్ని విధాల అర్హతగల బడుగు వర్గానికి చెందినవాడు. అతడికి న్యాయం కోరుతూ అతడి తల్లి యూనివర్సిటీ గడప ఎక్కింది. దౌర్జన్య శక్తులు ఆమెను అడ్డుకున్నాయి. దిక్కుతోచక ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు యూనివర్సిటీని వివరణ కోరింది. యూనివర్సిటీ ఐదుగురు విద్యార్థులను హాస్టలునుంచి సస్పెండ్ చేసింది. దానిని నిరసిస్తూ ఆందోళన సాగుతూండగా దురదృష్టవశాత్తూ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అది మొదలుకుని కొద్దిరోజులుగా దేశం మొత్తం సెంట్రల్ వర్సిటీ మీద దృష్టి నిలిపింది. అక్కడి పరిణామాలు, ఆత్మహత్య పూర్వాపరాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. తప్పులేదు. ఎవరు చెప్పేదానినీ కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎవరి సెంటిమెంటునూ, ఎవరి భావావేశాన్నీ కించపరచవలసిన పనిలేదు. ఆయా వాద ప్రతివాదాల మంచిచెడ్డలు ఇక్కడ చర్చనీయాంశం కానేకాదు.
మరణించిన విద్యార్థి తల్లీ తండ్రీ వడ్డెర కులస్థులని ఆ తండ్రిని కన్న తల్లే స్వయంగా చెప్పింది. ఆ కులం బి.సి. జాబితాలోకి వస్తుంది. తమది బి.సి. వర్గమని ఆ విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. అదే నిజమైతే ఆ విద్యార్థి దళితుడు కాడు. అతడు దళిత స్కాలర్ అని మీడియాలో జరుగుతున్నది ముమ్మాటికీ అసత్య ప్రచారం.
చనిపోయన రోహిత్ దళితుడు కానంతమాత్రాన ఇప్పుడు యూనివర్సిటీలో దళితులకు అన్యాయం గురించి రగులుతున్న ఆందోళన అంతా అసంబద్ధమని చెప్పటం సరికాదు. తాము సామాజికంగా ఇప్పటికీ తగని వివక్ష ఎదుర్కొనవలసి వస్తున్నదన్న ఆవేదన, అసంతృప్తి దేశం మొత్తంలోని దళితుల్లో ఉన్నట్టే ఈ వర్సిటీలోని దళిత విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల్లోనూ బలంగా ఉన్నమాట యథార్థం. దానిని సానుభూతితో అర్థం చేసుకుని, సంఘీభావం తెలిపి, దళితుల చిత్తక్షోభను తొలగించేందుకు సర్వ విధాలా సహకరించాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సును కోరే ప్రతి ఒక్కరి మీద ఉందన్నది నిర్వివాదం. దళిత వర్గాల్లో అసహనం, అసంతృప్తి ఇంతలా పేరుకు పోవడానికి కారణాలు అనేకం ఉన్నాయ. యూనివర్సిటీ నిర్వాహకులు చేసిన తప్పులు, అవకతవక నిర్ణయాలు చాలానే ఉండి ఉండొచ్చు. దళిత రిసెర్చిస్కాలర్లను సస్పెండ్ చేసిన తీరూ అనుమానాస్పదమే. వాటన్నిటినీ కూలంకషంగా విచారించాల్సిందే. దోషులు ఎవరైనా, ఎంతటివారైనా శిక్షించవలసిందే. చాలా కాలంగా యూనివర్సిటీలో తాండవిస్తున్న అశాంతిని అంతమొందించి, అవాంఛనీయ ధోరణులను అవశ్యం అరికట్టవలసిందే.
ఇందులో మరోమాటకు తావులేదు. ఎటొచ్చీ కొద్ది రోజులుగా హెచ్‌సియు వేదికగా మారుమోగుతున్న రాజకీయ కాహళిని గమనిస్తున్న సామాన్యులకు సందేహమల్లా ఒక్కటే. ఇప్పటి గొడవ మొత్తానికీ మూలం నిరుడు యాకుబ్ మెమెన్ సమర్థకుల అగడాలు కదా? దాని గురించి ఎవరూ మాట్లాడరేం? పవిత్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని అలాంటి పాడు పనికి దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాలా వద్దా? ఆ అకృత్యాన్ని అధిక్షేపించిన విద్యార్థిపై జరిగిన దౌర్జన్యాన్ని- దాని తీవ్రత ఎంతయినా- ఖండించాలా వద్దా? ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిజం విజృంభించి, ‘ఐసిస్’ ఏజంట్లు హైదరాబాద్ సహా పలుచోట్ల పట్టుబడుతూ, పఠాన్‌కోటపై పాక్ ప్రచ్ఛన్న దాడి దేశమంతటినీ నిర్ఘాంత పరిచిన స్థితిగతుల్లో ఉన్నత విశ్వవిద్యాలయాలు టెర్రరిస్టుల సమర్థకులకు ఆటపట్టు కావటాన్ని జాతిభద్రతకు తీవ్ర సమస్యగా పరిగణించాలా వదా ద?
యూనివర్సిటీ అధికారుల దుర్విధానాలవల్ల విద్యార్థులకు కష్టం కలిగితే వారూ వారూ తేల్చుకోవచ్చు. తమకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్య తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఎంతైనా పోరాడవచ్చు. తమ హద్దులను గుర్తెరిగి ఎంత దూరమైనా వెళ్లవచ్చు. కాని ఈ పోరులోకి కేంద్రమంత్రులను లాగడమెందుకు? మధ్యలో వారేమి చేశారు? మెమెన్ వత్తాసుదారుల విజృంభణను, విద్యార్థిపై మూకుమ్మడి దాడిని ఒక విద్యార్థి సంఘం తన దృష్టికి తెస్తే ఆ సంగతేదో కనుక్కొనమని, వర్సిటీలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాయటం తప్పా? స్థానిక ప్రజాప్రతినిధిగా అది ఆయన బాధ్యత కాదా? యూనివర్సిటీలో దళిత విద్యార్థులు, దళిత అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయాలకూ, వాటిపై దళిత వర్గాలు సాగిస్తున్న న్యాయమైన పోరాటాలకూ - దీనికీ సంబంధమేమిటి? వందలమంది ప్రాణాలు హరించిన పాకిస్తానీ విద్రోహిని అమరవీరుడిగా, మహాపురుషుడిగా చిత్రిస్తూ సంస్మరణ సభలు, ప్రదర్శనలు జరపటం జాతి వ్యతిరేక చర్య కాదా? సాటి కేంద్రమంత్రి పంపిన మహజరును విచారించి, తగిన చర్యలు తీసుకోవాలంటూ యూనివర్సిటీ అధికారులను ఆదేశించటం మానవ వనరుల మంత్రిణి విధ్యుక్త ధర్మం కాదా? విషయ ప్రాధాన్యం దృష్ట్యా దాని సంగతి ఏమైందని ఆర్నెల్ల తరవాత ఒకటికి రెండుమార్లు మంత్రిత్వ శాఖ వర్సిటీ వారిని కనుక్కోవటం తప్పా? అది వారి మీద ఒత్తడి పెట్టి, అనుచిత నిర్ణయానికి ప్రేరేపించటం ఎలా అవుతుంది? ఫలానా వారి మీద ఫలానా ఫలానా చర్యలు తీసుకొని తీరాలని మంత్రి నిర్బంధించిన దాఖలాలున్నాయా? లేనప్పుడు కేంద్రమంత్రిని ఆడిపోసుకోవటం ఎందుకు? మొత్తం వ్యవహారాన్ని దళితులకు జరిగిన అన్యాయంగా వ్యతిరేకులు చిత్రిస్తున్నప్పుడు దాన్ని ఖండించటం కోసం కేంద్రమంత్రిణి అది దళిత - దళితేతర వివాదం కానే కాదంటూ తన వాదం వినిపించటం, ఆ సందర్భాన అనివార్యంగా సామాజిక వర్గాలను ప్రస్తావించవలసి రావటం ఏ రకంగా నేరం?
మరణించిన విద్యార్థే తన చావుకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని రాసిపెట్టినప్పుడు అతడి మరణానికి ఇద్దరు కేంద్రమంత్రులు కారకులని, వారిని ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చి, మంత్రి పదవులు ఊడగొడితేగానీ కుదరదని పంతం పట్టటం ఎటువంటి తర్కం?
ఆత్మహత్య చేసుకున్న రోహిత్ పిరికివాడు కాదు. కాషాయం కనిపిస్తే చింపుతానని, ఎ.బి.వి.పి., ఆరెస్సెస్, హిందూమతం అంటే తనకు అసహ్యమని నిర్భయంగా చాటగలిగిన ధీరుడు. స్వామి వివేకానంద నకిలీ మేధావి అని కనిపెట్టగలిగిన జ్ఞాని. అలాంటివాడు కేవలం దత్తాత్రేయ కేంద్రానికి రాసిన ఉత్తరానికే, ఢిల్లీ నుంచి వర్సిటీకి వచ్చిన రిమైండర్లకే బెదిరి, జీవితమంటే విరక్తి చెంది న్యాయపోరాటాన్ని బహిరంగ ఉద్యమాన్ని అర్ధాంతరంగా చాలించి ఆత్మహత్య చేసుకుంటాడంటే నమ్మడం కష్టం. బండారు దత్తాత్రేయో, స్మృతి ఇరానో అదృశ్యరూపంలో వచ్చి అతడి మెడకు ఉరివేశారని అనుకోలేము కాబట్టి అతడి చావు తెగింపుకు బలమైన కారణమే ఏదో ఉండాలి. అదేమిటి?
ASA, SFI anything and everything exist for their own sake. Seldom the interest of a person and these organisations match ఎస్.ఎఫ్.ఐ. (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఏదైనా, ఏవైనా తమకోసమే ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రయోజనాలు, ఈ సంస్థల ప్రయోజనాలు ఎప్పుడూ కలవవు అని రోహిత్ ప్రాణం తీసుకునే ముంథు నోట్‌లో రాసి, కొట్టేశాడట. విద్యార్థి సంఘాల మీద భ్రమలు తొలిగి, వాటికి దూరమయ్యానన్న భావనవల్లే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడా అని టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక శుక్రవారం అనుమానం వ్యక్తం చేసింది.
సూసైడ్ నోట్‌లో పేర్కొనక పోయినా సరే ఇద్దరు కేంద్రమంత్రులను ఆత్మహత్యకు కారకులుగా ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చాల్సిందేనంటూ విద్యార్థి సంఘాలు పంతం పట్టగలుగుతున్నప్పుడు ఆ విద్యార్థి సంఘాల గురించి మృతుడే స్వయంగా పేర్కొన్న దాని కోణంనుంచి మాత్రం దర్యాఫ్తు జరగవద్దా?
రోహిత్ వాడిన సెల్‌ఫోన్ కనపడటం లేదని, దొరికిన ఫోన్‌లో సిమ్‌కార్డు లేదని ‘హిందూ’ పత్రిక రిపోర్టు చేసింది. ఆ సిమ్‌కార్డును కూడా స్మృతి ఇరానీయే ఆకాశమార్గాన వచ్చి ఎత్తుకుపోయిందా? ఆత్మహత్యపై పొడసూపిన అనుమానాలన్నిటి మీదా సమగ్ర దర్యాప్తు జరగవద్దా? విచారణ కాకుండానే విద్యార్థి సంఘాలు కోరిన ప్రకారం శిక్షలు వేసెయ్యాలా?
ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలలో క్రేజీవాల్‌కూ, స్మృతి ఇరానీకి మధ్య ఎన్నో గొడవలు, రాజకీయ కక్షలు ఉండవచ్చు. ఆమె మీద అక్కసు తీర్చుకోవడానికి, తనకు విరోధి అయిన మోదీ సర్కారును మోదడానికి ‘క్రేజీ’కంటికి హెచ్‌సియు రచ్చ లడ్డూ ముక్కలా కనపడి ఉండొచ్చు. అలాగే పార్ట్‌టైం పొలిటీషియను రాహుల్ బాబుకు నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకెళ్ళేలోగా మోదీని పడగొట్టి అర్జంటుగా మళ్లీ రాజ్యాధికారం కొల్లగొట్టాలన్న ఆబ చాలానే ఉంది. బిహార్ ఎన్నికల ముందు ‘అసహనం’ లొల్లి పెట్టి, ఆ ఎన్నికలు కాగానే ఠక్కున ఆపేసిన కుటిల రాజకీయ శక్తులు అనేక రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బిజెపిని బొందపెట్టాలనే హెచ్‌సియులో విద్యార్థి కాష్ఠం మీద పేలాలు ఏరుకోవడానికి వెంపర్లాడుతున్నాయని ఊహించటంలో తప్పులేదు. నరేంద్రమోదీని, అతని ప్రభుత్వాన్ని నిర్ణీతకాలం కూడా పనిచేయనివ్వకుండా వెంటనే పడగొట్టాలని కాచుకుకూచున్న వారి లెక్కలు ఎలా ఉన్నా, ఆ రాజకీయ గద్దల మాయాజూదానికి వర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పాచికల్లా ఎందుకు ఉపయోగపడాలి? విద్యార్థులపై సస్పెన్షన్లను ఎత్తివేసి, న్యాయ విచారణను ప్రకటించాక కూడా ఫలానా కేంద్రమంత్రులను తక్షణం తొలగించాల్సిందేనంటూ విద్యార్థి సంఘాలు పట్టుబట్టటం సమంజసమేనా? కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరు ఉండాలో, ఎవరిని తొలగించాలో ఒక యూనివర్సిటీలోని ఆందోళనకారులు నిర్ణయిస్తారా?
హెచ్.సి.యు. అలజడి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎలా ముగుస్తుందో తెలియదు. కాని - జాతి వ్యతిరేక కార్యకలాపాలను యూనివర్సిటీలో అరికట్టాలంటూ ఒక కేంద్రమంత్రికి ఇంకో కేంద్రమంత్రి లేఖ రాయటమే ఎస్.సి., ఎస్.టి. ఎట్రాసిటీ చట్టం కింద శిక్షించవలసిన నేరమైతే... పాకిస్తానీ విద్రోహిని కీర్తించటమే రైటు, ఆ పని తప్పు అనటమే దారుణమైన తప్పు అని అనుకోవలసివస్తే... ఈ ఆలోచనా ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది? ఇంతకీ మనం మన దేశంలోనే ఉన్నామా
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML