గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

పరబ్రహ్మ స్వరూపమే గణపతి.

పరబ్రహ్మ స్వరూపమే గణపతి. వేదవేద్యమైన తత్త్వమే గణపతి. ఏదైనా పూజ చేసినా, పునస్కారం చేసినా యే శుభకర్మ చేసినా ప్రథమంగా మనం గణపతిని తలంచుకుంటాం. దానిలో వాడబడే వేదమంత్రం ప్రసిద్ధంగా అందరికీ తెలిసినదే. "గణానాం త్వా గణపతిం హవామహే. కవిం కవీనా ముపవశ్రమస్తమమ్‌! జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత. ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్!!" అని ఆ వేదమంత్రం. ఈ మంత్రాన్ని బాగా ఏకాగ్రంగా పరిశీలిస్తే పరబ్రహ్మయొక్క తత్త్వం అంతా ఇందులో నిబద్ధం చేశారు మహర్షులు. దీని ప్రభావం యేమిటంటే గణములలో గణపతిగా ప్రకాశించే ఓదైవమా! నిన్ను ఉపాసిస్తున్నాము/ఆహ్వానిస్తున్నాము. నువ్వు ఎటువంటి వాడివి అంటే కవీనాం కవిః - కవులకు కూడా కవియైనటువంటి వాడివి. ఉపమశ్రవస్తమమ్‌ - పోలికగా చెప్పదగినటువంటి మిక్కిలి కీర్తిగలవాడు అని ఒక అర్థం. సృష్టిలో యేదైనా ఒక గొప్ప వస్తువును చూస్తే ఆ గొప్ప వస్తువును చెప్పడానికి మరొక గొప్పవస్తువుతో పోలుస్తాం. అందంగా ఒక ముఖం ఉంటే చంద్రుడిలా ఉంది అంటాం. అప్పటికే చంద్రుడు అందంగా ఉన్నాడు గనుక. ఇలా పోల్చడానికి లేదా ఆదర్శంగా చెప్పడానికి ఉత్తమమైనటువంటి కీర్తి గలిగినటువంటివాడు అని అర్థం. ఇంకొక అర్థం యేమిటంటే "సర్వేషాం అన్నానాం ఉపమానం యస్య" అంటూ వేదార్థం తెలిసిన వారు వ్యాఖ్యానించారు. ఉపమశ్రవస్తమమ్ అంటే అన్నసమృద్ధి కలవాడు అని ఒక అర్థం. గణపతికి ఎన్ని లక్షణాలు చెప్తున్నారు గణానాంత్వా గణపతి గ్ం హవామహే - ఓ గణపతీ అన్నారు. గణపతి అంటే గణములకు పతి. గణములకు పతియైన వాడు ఎక్కడున్నాడు? గణములలోనే ఉన్నాడన్నారు. అంటే గణములలో గణపతిగా ఉన్నటువంటివాడు. అది ఆయనయొక్క గొప్పతనం. ఇంకొకవైపు కవులకు కవియై ఉన్నాడు. అన్న సమృద్ధి కలవాడు. జ్యేష్ఠ రాజం - జ్యేష్ఠరాజు అనగానే గణపతి తొలిదైవం అనేమాట ఈ మంత్రంలోనే మనకు కనపడుతోంది. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, మొదటివాడు అని అర్థం. రాజా అంటే ప్రకాశించువాడు అని అర్థం. జ్యేష్ఠరాజ అంటే అందరికన్నా మొదటివాడై ప్రకాశించేటటువంటివాడు కనుక జ్యేష్ఠరాజం అన్నారు. బ్రహ్మణాం బ్రహ్మణస్పత - బ్రహ్మణస్పతే అని సంబోధిస్తున్నారన్నమాట గణపతిని. ఆయన బ్రహ్మణాం బ్రహ్మణస్పతి - బ్రహ్మణములయందు బ్రహ్మణస్పతిగా ప్రకాశిస్తున్నవాడు కూడా ఆయనే. బ్రహ్మణములు అంటే వేదమంత్రములు అని అర్థం. అంతేకాకుండా కర్మకు వినియోగింపబడేటటువంటి వేదమంత్రములు ప్రత్యేకించి లేదా వేదమంత్రాలని కర్మకు వినియోగించేటప్పుడు బ్రహ్మణములు అని అంటాం అని దీని అర్థం. అంటే బ్రహ్మణ శబ్దం కర్మలను తెలియజేస్తోంది. ఈ కర్మలన్నింటికీ కూడా పతి యెవడో అతడు బ్రహ్మణస్పతి అని చెప్తున్నారు. అటువంటి ఓ బ్రహ్మణస్పతీ! ఓ గణపతీ! నువ్వు రావయ్యా అని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికి రావాలి? సాదనమ్ - సదనస్య భావమ్ సాదనమ్. సదనము అంటే ఇల్లు అని అర్థం. సాదనమ్ అంటే ఇల్లు లేదా నివాసం అని అర్థం. అయితే అన్ని ఇళ్ళూ సదనాలు అనిపించుకోవు. సదనం అంటే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఆ చోటుకి సదనం అని పేరు. అంటే ఎవరి ఇంట్లో నిరంతరం దేవతారాధనలు అనే యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో ఆ యిల్లునే సదనం అనాలి. లేకపోతే కొంప అనవచ్చు మనం. గృహం సదనమ్ ఎప్పుడౌతుందంటే యజ్ఞాలు జరిగేటటువంటి ఇల్లే సదనం అవుతుంది. అలాంటి సదనంలోకి రమ్మంటున్నాం గణపతిని. ఎలా రావాలి అంటే ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద - నః అంటే మాయొక్క; శృణ్వన్ - విని; మమ్మల్ని విని- మా మనస్సులో ఉన్న భావాలు, మేము చేసే ఈ ప్రార్థనలు మేము పలికే ఈ ఆహ్వానాలు విని రావయ్యా. ఎక్కడికి రావాలి? - మా సదనానికి రావాలి. ఎలా రావాలి? ఊతిభిః - శక్తులతో; ఓ గణపతీ! నీయొక్క సమస్త శక్తులతో మా సదనమునకు రావయ్యా అన్నారు. గణపతిగానీ తన సమస్త శక్తులతో వచ్చాడా ఇంక ఆ సదనం దివ్యమైపోతుంది. ఆసదనంలో జరిగే ప్రతియజ్ఞం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. అందువల్లనే యజ్ఞం - భగవదారాధన చేసేముందు ఈమంత్రం చెప్పడం ఎందుకంటే గణపతి తన సమస్త శక్తులతో వస్తే ఆ యజ్ఞం చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇక్కడ గణపతి అనే నామం, కవి అనే నామం, బ్రహ్మణస్పతి అనే నామం ప్రధానంగా మనం చూడవలసినవి. గణములలో గణపతిగా ఉండేటటువంటివాడు; ఇక్కడ గణములు అంటే దేవతా గణాలు అని ఒక అర్థం. కవి అంటే మంత్రములు అని అర్థం. కవి అనే శబ్దం వేదం చాలగొప్ప అర్థంతో వాడింది. అంతేకానీ రచనలు చేసేటటువంటి వాడు కవి కాదు. కవి అనేది వేదశబ్దం. పరమాత్మకు వాడారు. మళ్ళీ వేదమంత్రాలకు వాడారు. దర్శనశక్తి కలవాడిని కవి అని అంటారు. అతీంద్రియమైన విషయాన్ని దర్శించేవాడిని కవి అంటారు. "కవయః క్రాంతదర్శయాః" - కవి యెవరయ్యా అంటే క్రాంతదర్శనశక్తి కలిగినటువంటి వాడు కవి. క్రాంతద్రష్టలన్నమాట. మామూలు కన్ను చూడలేనటువంటి మహత్వాన్ని దర్శించేవాడు కవి. అలా మంత్రములకు కవి అని పేరు. ఎందుకంటే వేదమంత్రములు ఆ పరమాత్మను దర్శిస్తూ, దర్శింపజేస్తున్నాయి కనుకనే వేదమంత్రములను కవి అన్నారు. ఆ కవులకు కవి గణపతి. అంటే వేదమంత్రములన్నీ భగవంతుడిని చూస్తూ ఉన్నాయి. ఆ భగవంతుడు ఈ వేదములను, ఈ ప్రపంచాన్ని, నిరంతరం చూస్తూ ఉంటాడు. కనుక కవులకు కవియైనటువంటివాడు గణపతి అన్నమాట. బ్రహ్మణస్పతి అంటే వేదచోదితమైన కర్మలన్నింటికీ అధిపతియైనటువంటివాడు. ఈ మంత్రంలో ప్రధానంగా మూడు విషయములు చెప్పబడుతున్నాయి. గణములు అంటే దేవతలందరూ చెప్పబడ్డారు. కవి అంటే మంత్రములు చెప్పబడ్డాయి. బ్రహ్మణములు అంటే కర్మలు చెప్పబడ్డాయి. మధ్యలో ఉపవశ్రవస్తమమ్‌ - అన్నసమృద్ధి కలవాడు అని అన్నములు చెప్పబడ్డాయి. ఈనాలుగూ యజ్ఞమునకు కావలసినవి. మొదట కావలసినది దేవతా గణములు; రెండు మంత్రములు కావాలి; మూడు కర్మకావాలి. నాలుగు యజ్ఞమునకు వినియోగింపబడే ద్రవ్యములు కావాలి. ఈ నాలుగింటికీ అధిపతి పరమాత్మయే అని చెప్తున్నారు. దేవతలలో దేవతగా ఉన్నవాడు. పైగా దేవతలకు అధిపతిగా ఉండేటటువంటివాడు. అందుకే గణములలో గణపతి అన్నారు. అదేవిధంగా స్వామి అన్నసమృద్ధి కలవాడు. అంటే యజ్ఞద్రవ్యాలన్నీ ఆయనవల్లే వస్తున్నాయన్నమాట. అటువంటి స్వామి కర్మలకు కూడ పతియైనటువంటివాడు అన్నారు. యజ్ఞములలో వాడబడే వాటి అన్నింటికీ పతి యెవరో అతడే ముందు వస్తే తర్వాత యజ్ఞకర్మ అంతా చక్కగా జరగబడుతుంది. గణపతి అంటే విఘ్నాలు తొలగించే మామూలు దైవం కాదు ఆయన. పరిపూర్ణుడైన పరబ్రహ్మయే గణపతి అని వేదం వర్ణించింది

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML