గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలుశ్రీ కృష్ణతత్త్వ విశేషాలు


1
మనకు వేదాలు ప్రమాణం.ఈ యుగ ప్రారంభంలో వ్యాసుడు వేదరాశిని నాలుగుగా విభజించి నలుగురు శిష్యులకు వాటి సంరక్షణకై ఈ నాలుగు భాగాలు ఇచ్చాడు. వేదంలో భాగాలు సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తులను వేదం చివరచేర్చడం వలన అవి వేదాంతము అనిపిలువబడతాయి. ఈ ఉపనిషత్తులసారాన్ని 18 అధ్యాయాలలొ సుమారు 700 శ్లోకాలుగా మనకై ఇచ్చినవాడు శ్రీకృష్ణుడు. అర్జునుని వ్యాజంతో మనందరికీ బోధించిన గురువయ్యాడు. అందుకే భగవద్గీతను గీతోపనిషత్ అంటారు. వేదాలు అర్థంచేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని వేదాంగాలు అంటారు. ఇవి వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం,శిక్ష,ఛందస్సు. వేదంలోని విషయాలను కథలలో చెప్పేవి పురాణాలు.ముఖ్యమైనవి 18. ఇవీ వ్యాసుడేసామాన్యులకై చెప్పాడు. సాంఖ్యం, యోగం. మీమాంస, వేదాంతం - ఈ ఆరూ ఆస్తిక దర్శనాలు. వ్యాసుడు పైలుడికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదం, జైమినికి సామవేదం, సుమంతునికి అథర్వ వేదం ఇచ్చాడు. రోమహర్షణునికి పురాణాలు ఇచ్చాడు. ఈయన సూతుడనే పేరుతో తరువాత కాలంలో నైమిశారణ్యంలోశౌనకాది మహర్షులకు పురాణ ప్రవచనాలు ఇచ్చారు
2
శ్రీకృష్ణుడు మనకి బాగాతెలిసినదైవం. భగవంతుడే మానవునిగా వచ్చాడు. ఈ కలియుగం ఆరంభంలోనే 5000 సం. ముందు వచ్చాడు.మనకు ఆయనను గురించి తెలుసు అనుకుంటాము. కాని ఆయన తత్త్వం మనకు తెలియదు. వ్రేపల్లెలో లీలలు,బృందావనంలో ఆటలు, రాసక్రీడలు,16000 గోపికలు, రాధ - అంతే మనకు తెలిసినది. ఆయన 125సం.దీర్ఘ జీవితంలో ఇవి కేవలం మొదటి 12 సంవత్సరాల విశేషాలు. ఆయనను అపార్థం చేసుకోవడమే మనకు అర్థమైనది. జారుడు, వెన్నదొంగ, మానినీచిత్తచోరుడు -- ఇవి మనం ఆయనకు ఇచ్చిన బిరుదులు. వీని పరమార్థమూ మనకు తెలియదు. సద్గురుబోధనుండి సేకరించినవి - తెలియవచ్చినంత తేట పరతు.
3
అసలు శ్రీకృష్ణుడు ఎవరు? భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం - అని వ్యాసుడు ఎందుకు అన్నాడు? జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు. ఫరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ. ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి?
4
కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి. సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు. రాక్షసత్వం, కౄరత్వం,అధర్మం చాలామందిలో ప్రవేశించింది. కంస, జరాసంధ, శిశుపాలాదులు కృష్ణుని బంధువులే. అజ్ఞానంకూడా అనేకంగా వ్యాపించింది. కృష్ణుని పాత్ర 125 సంవత్సరాల వ్యవహారం. పైగా అదియుగాంతం. సమాజ ప్రక్షాళన అతడి కార్యక్రమమైనది. రాక్షస సంహారము విష్ణుతత్త్వమైతే అనేక ఇతరదేవతల అంశలను కూడా తీసుకుని కృష్ణుడు వచ్చాడు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన.
5
శ్రీకృష్ణుడు అంటేనే యోగం గుర్తుకు వస్తుంది. ఆయన మహాయోగి, యోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఒక యోగమే. యోగ అన్నపదానికి అర్థం రెంటిని కలుపుట. సంయోగం కలయిక, ఐతే వియోగం విడిపోవడం. "యోగక్షేమం వహామ్యహం" అంటాడు పరమాత్మ. యోగమంటే లేనిది లభించడం, క్షేమమంటే ఉన్నది నిలబడడం. గీతలో యోగం అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేయడం. దీనికి అనేక దర్శనాలు అనేక మార్గాలు. వాటన్నిటినీ సమన్వయంచేసి గీతలోచెప్పినవాడు భగవంతుడు. గీత వృద్ధులకు పనికి వచ్చే పుస్తకమా? కానేకాదు. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణకు మార్గం చూపిస్తుంది. దానిని మించిన Management Textbook లేదు.
6
వసుదేవసుతందేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
మనము కృష్ణుడు మహాయోగి అనిచెప్పుకున్నాము. అసలు ఆయన ముఖ్యతత్త్వం జగద్గురు తత్త్వం.ఇది విష్ణుతత్త్వం కాదు. విష్ణువు ఏ అవతారంలోనూ ఎవరికీ బోధ చేయలేదు. ఇది కృష్ణునిలోని శివ తత్త్వం, సుబ్రహ్మణ్య తత్త్వం. కృష్ణునికి శివునికీ ఉన్న సంబంధం మామూలుగా గుర్తించనిది. భీష్ముడు ధర్మరాజు కు విష్ణు సహస్రం బోధించాడు. కృష్ణుడు ధర్మరాజుకు శివసహస్రనామావళి, శివ పూజా ప్రాశస్త్యం బోధించాడు. ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెప్పాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీతలు. భ్రమర గీత కూడా. కృష్ణుని భంగిమ నటరాజ స్వామి కుంచితపాదాన్ని పోలి ఉంటుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు (శివసహస్రంలో ఒకపేరు).
7
ఇప్పుడు సృష్టి గురించి తెలుసుకోవాలి. పురాణాలు ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి .సర్గ, ప్రతిసర్గ, మన్వంతరం, వంశం, వంశానుచరితం. - అనంత కాల చక్రం ఆద్యంతాలులేనిది. మానవజీవితమునకు సుమారు 100 సంవత్సరాలు పరిమితి అయితే, కలియుగ పరిమితి 4,32,000 సం. 4:3:2:1 లొ ఉన్న నాలుగు యుగాలు ఒక మహాయుగం. ఎన్నో మహాయుగాలు గడిస్తే కల్పం, మన్వంతరం వంటివి వస్తాయి. యుగాంతం లో ప్రళయాలు వస్తాయి. విష్ణువు పాలసముద్రంలో ఆది శేషునిపై యోగనిద్రలో ఉంటాడు. ఆతడే సృష్టి కర్త. ఆధునికులం పాలసముద్రాన్ని Milky Way Galaxy గా భావించుకోవచ్చు. ఆయన సృష్టికోసం ఒక పరిమిత విశ్వాన్ని సృష్టించాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు , అతల, వితల, .... పాతాళ అనే 7 క్రిందిలోకాలు సృష్టించాడు. సత్యలోకములో ప్రతిసృష్టిచేసే బ్రహ్మదేవుణ్ణి సృష్టింఛాడు. ఈ బ్రహ్మలోకంపైన పరమేశ్వర లోకాలనే వైకుంఠం, కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులు, శివపార్వతులూ, రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వారి లోకాలలో ఉంటారు.
8
పంచబ్రహ్మ సిద్ధాంతములో వరుసగ సదాశివ బ్రహ్మ (లేదా పరబ్రహ్మ), (కామేశ్వర, కామేశ్వరి లేదా (పురుషుడు,ప్రకృతి),విష్ణువు,బ్రహ్మ,రుద్రుడు,(త్రిమూర్తులు)ఉంటారు. మనకి శివాదిషణ్మతములు ఉన్నాయి. సాంఖ్యులు ప్రకృతి పురుషుడు అన్నదానినే కైలాస, వైకుంఠ,గోలోక, మణిద్వీప వాసులలొ ఎవరినన్నా అనుకోవచ్చు. బ్రహ్మ వైవర్త పురాణం , చైతన్య సాంప్రదాయం గోలోకములోని రాధాకృష్ణులను అత్యున్నతస్థితిగా పరిగణిస్తాయి. ఆ కృష్ణుని పూర్ణ అవతారమే మన ద్వాపర యుగ కృష్ణుడు. ఆ ప్రకృతియే,(లేదా శక్తి, లేదా యోగమాయ) రాధ.రాధ పాత్ర భాగవతంలో కనబడదు.కృష్ణుడు అంటే పురుషతత్త్వం, శ్రీకృష్ణుడు అంటే శక్తితో కూడిన కృష్ణుడు. శ్రీకృష్ణుడు అనడమే మనకు శ్రేయోదాయకం. శ్రీ అంటే మహాలక్ష్మి ఆమెయేరాధ. బ్ర.వై. పురాణంలో బ్రహ్మ ఖండం, ప్రకృతి ఖండం, గణేశ ఖండం, కృష్ణ ఖండం అని నాలుగు భాగాలు. ఇది సృష్టి చరిత్ర (సర్గ, ప్రతి సర్గలు)
9
శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు అంటే ఏమిటి? ముందు చిత్తమంటే ఏమిటో తెలుసుకోవాలి. పంచ జ్ఞానేంద్రియాల తరువాత మనస్సు అనే అంతఃకరణ. మనసు అంటే ఆలోచనలే. కోతిలా గంతులు వేస్తుంది. ఆ పైన బుద్ధి. వివేకానికి కేంద్రము. ఆపైనది చిత్తం. హృదయ తత్త్వం.తరువాతది అహంకారం (మమకారంతోపాటుగా) .నేను,నాదీ అనుకోడం ఇవన్నీ ఆత్మను ఆవరించే జీవ లక్షణాలు. ఇంగ్లీషులో చెబితే mind, intellect, consciousness, ego covering pure soul matter. గోకుల నివాసులందరి హృదయాలు కృష్ణునితో నిండిపోయాయి. గోపికలు మొదట్లో "మధురానగరిలో చల్ల నమ్మబోదూ" అనితిరిగేవారు. ఇప్పుడు పాలూ, పెరుగూ, వెన్నా మరచిపోయారు. అత్తగారు భర్తా, పిల్లలూ ఎవరూ గుర్తులేరు. కొందరు భర్తగా, కొందరు కుమారుడుగా, ఆవులు దూడగా భావించుకున్నారు. ఎవరిఊహ వారిదే. ఎవరికి వారు అతడి సాన్నిహిత్యంలోనే ఉన్నారు. ఇదే యోగం. పతంజలి మాటలలో "చిత్తవృత్తి నిరోధం." గోకులంలో అందరూ మానినులే. అందరి హృదయాలలోనూ కృష్ణుడే. ఈపరిస్థితిలోనే ఒక రాత్రి వారికి రాసక్రీడ అనుభవం జరిగినది. మధ్యలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు. తరువాత వెంటనే గోకులాన్ని వదలి అక్రూరునితో మధుర వెళ్ళిపోయాడు. కాని అందరిహృదయాల్లో చిత్తచోరుడుగా ఉండిపోయాడు. చోరుడు అంటే చిత్తాన్ని పూర్తిగా ఆక్రమించినవాడు.
10
ఆదిశక్తికి పరమేశ్వరునికీ ఉన్న సంబంధం - పరమాత్మయైన శ్రీకృష్ణుని స్త్రీమూర్తిగా తలచుకోవాలంటే లలితాదేవిని తలచుకోవాలి. భాగవతంలో ప్రారంభ పద్యాలు చూడండి - లలిత స్కంధము, కృష్ణమూలము .. భాగవతాఖ్య కల్పతరువు.. భాగవతమనే కల్పవృక్షానికి లలిత - స్కంధము (మాను), కృష్ణుడు - మూలము (వేరు). అలాగే శ్రీరాముడు స్త్రీ గా శ్యామల.---- వైదేహీ సహితం సురద్రుమతలే, హైమే మహామండపే ... రామం భజే శ్యామలాం. అలాగే వేంకటేశ్వరుని పేరు బాలాజీలో బాల.
11
కృష్ణునికీ కాత్యాయనీ వ్రతానికీ గోపికావస్త్రాపహరణానికీ సంబంధం ఏమిటి? వ్రజభూమిలోగోపికలు నందకిశోరుడే భర్తకావాలని కాత్యాయనీవ్రతంచేస్తారు. కాళిందిలో(యమునలో) స్నానంచేసి అమ్మవారిని పూజిస్తారు. తమ వస్త్రాలు ఒడ్డునే ఉంచి నదిలోదిగుతారు. స్నానంచేస్తూండగా కృష్ణుడు వచ్చిఆ వస్త్రములు అపహరించి ఆప్రక్కన ఉన్న వృక్షంపైన ఎక్కి వాళ్ళను పిలుస్తాడు. మీరు వస్త్రాలు లేకుండా వ్రతభంగం చేశారు. పైకి వచ్చి నమస్కారంచేయండి. అనిచెబుతాడు. కథ తెలిసినదే. వస్త్రం ఆవరణ, ఆచ్ఛాదన. గోపికలు జీవాత్మలే. అజ్ఞానం వస్త్ర రూపంలో కప్పి ఉంచింది. అజ్ఞానపు తెరతొలగిస్తే అంతా పరమాత్మస్వరూపమే. చెట్టుపైనా క్రిందనూ ఉన్న వస్తువు ఒకటే.వ్రతఫలం అప్పటికప్పుడు పురుషరూపంలో కాత్యాయనియే ఐన కృష్ణ దర్శనం లభించింది. వారి అజ్ఞానపు తెరలు తొలగినవి.
12
కృష్ణుని పేరు ఏమిటి? వింత ప్రశ్న. ఎవరు పెట్టారా పేరు? చిన్నప్పుడు బారసాల (బాలసారె) వంటి సంస్కారములు జరిగినట్లు ఎక్కడా వినలేదే? పుట్టగానే తండ్రి వసుదేవుడు యమునను దాటించి నందుని ఇంట్లో విడిచి వచ్చాడు. తండ్రి బియ్యంలోపేరు వ్రాసి నామకరణం చేయాలి. తల్లితండ్రుల నివాసం కారాగారం. వ్రేపల్లెలో తరచు పూతనాది రాక్షసుల రాకపోకలు. ఒకనాడు గర్గమహర్షి వచ్చాడు. నందయశోదలు కృష్ణుని బాలారిష్టములను గురించి బెంగ పెట్టుకొని ఆయనకు కృష్ణుని చూపింఛారు. ఆయన నవ్వుతూ ఈబాలుడు ఎవరనుకొన్నారు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. సకలదేవతాస్వరూపుడు. విష్ణువే. గోలోక కృష్ణుడు. మీపిల్లవాడు కాదు. దేవకీవసుదేవులబిడ్డడు. మీకు ఆడపిల్ల జన్మించినది. మీకు తెలియకుండా ఈ మార్పిడి జరిగినది. ఈయనకు మనము పెట్టే పేరులేదు. కృష్ణుడు అనే పిలవండి. పైగానల్లనివాడు. ఆపేరు సార్థకము. క అంటే బ్రహ్మ. రు అంటే అనంతుడు. ష అంటే శివుడు. ణ అంటే ధర్మము. అ అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు)
13
నలుపు సరే నీలము ఎక్కడనుంచి వచ్చినది? ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? (సర్ సి. వి.రామన్ గారి పరిశోధన) అక్కడ నీలవర్ణపు వస్తువులేదు. అది అనంతమైన ఆకాశము యొక్క సహజమైన తేజస్సు యొక్క వర్ణము.) 15 వ శతాబ్దములో చైతన్య మహాప్రభువు శిష్యుడైన రూపాగోస్వామి ఉజ్జ్వల నీలమణి అని కృష్ణుణ్ణి అదేపేరు గల గ్రంథంలో వర్ణించాడు. అన్నమయ్య శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము అని నవరత్నములతో పోల్చే కీర్తనలో చెబుతాడు. రంగు నలుపు. తేజస్సు నీలము.
14
11-12 సం. వయస్సులో కృష్ణుడు బృందావనం విడిచి మథురవెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ తిరిగిరాలేదు. మళ్ళీ మనకు బాగా తెలిసినవి కృష్ణుడి పెళ్ళిళ్ళూ, 16008 భార్యలు, సత్యభామతో సరాగాలు, ఇవన్ని ఆయన 30-40ల లోనివి అనుకుందాము. ఈ మధ్యకాలంలో ఆయన ఏమిచేశాడు? మళ్ళీ బాగా తెలిసినవి ద్రౌపదీ మాన సంరక్షణ, రాయబారం, యుద్ధం, భగవద్గీతా బోధ. మహాభారత యుద్ధ కాలానికి ఆయన వయస్సు 80 సంవత్సరాలు. యుద్ధం తరువాత ఆయన 125 సం. వచ్చేవరకు జీవించి ఉన్నాడు. అప్పుడు ఆయన కార్యక్రమం ఏమిటి? మనకు తెలిసినది 25 ఏళ్ళ జీవితం.. బాగా తెలియనిది 100 సంవత్సరాలు. భగవంతుడు భూమిపై అవతరించి చిన్ననాటి లీలలు, వైవాహిక జీవితం కాక ఆయన చేసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏమిటవి? అసలు ఆయన రాక కారణాలు ఏమిటి? చూద్దాం. 15
బలరామ కృష్ణులు నందాదులతో కలసి కంసుని ఆహ్వానంపై మథుర వెడతారు. రాజ సభకు వెడతారు. కంసుడు ముష్టికుడు, చాణూరుడు వంటి మల్లయుద్ధ ప్రవీణులని దారిలో వీరిని అంతంచేయడానికి నియోగిస్తాడు. చిన్నపిల్లలతో ఏనుగులవంటివారి మల్ల యుధ్ధాన్ని చూచి అందరూ కంసుని పన్నాగానికి దుఃఖ పడతారు. కాని బలరామ కృష్ణులు వారందరిని తేలికగా మల్ల యుద్ధంలోనే చంపుతారు. అదిచూచి కంసుడు భయంతో కంపించి సింహాసనం దిక్కుగా వస్తున్న రామ కృష్ణులను చంపడానికి తన కత్తి, డాలు పట్టుకుని సిద్ధమౌతాడు. ఒక క్షణంలో కృష్ణుడు అతడిపై లంఘించి మెడపట్టుకుని మల్ల యుద్ధంజరిగే ప్రదేశానికి విసిరేసి, అతడిపై దూకుతాడు. ఏఆయుధము వాడ కుండానే కంసుడు బహుశా భయముతో వచ్చిన ఆఘాతము (shock) తోనే మరణిస్తాడు. దేవకీవసుదేవులను కలుసుకొని వారినీ, తాత అయిన ఉగ్రసేనుణ్ణి విడిపిస్తాడు. ఉగ్రసేనుడు కృష్ణునే మధురను పాలించమని అడుగుతాడు. కృష్ణుడు దానికి నిరాకరిస్తాడు. సామాన్యంగా తెలియని విషయం కృష్ణునికి మల్లయుద్ధం అంటే చాలా ఇష్టం. మల్లయుద్ధంలో శ్రీకృష్ణుని ఓడించగల వ్యక్తి ఒక్కరే. జైన తీర్థంకరుడు అరిష్టనేమి. వసుదేవుని అన్న సముద్రవిజయుని కుమారుడు. శ్రీకృష్ణుని కన్న వయసులో పెద్ద. శ్రీకృష్ణునికి ఆయన అంటే అమితగౌరవం.
16
కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. మనతప్పుల తడకల చరిత్ర పుస్తకాలను పక్కన పెడితే - మనకు లభించే ఆధారాలు గ్రంధాలు. సాంప్రదాయ నిర్ణయం ప్రకారం కృష్ణుని సమకాలికుడైన వేదవ్యాసుడు వ్రాసినవే భారత, భాగవతాలు. కృష్ణుని తరువాత వచ్చినది బుద్ధావతారం. ఈ ఊహకు ఆధారం భాగవత శ్లోకం.
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురాద్విషామ్
బుద్దో నామ్నా జినసుతా కీకటేషు భవిష్యతి -- (భాగవతం - 1.3.24)
తరువాత కలియుగంలో సురద్వేషులైన నాస్తికులను సమ్మోహన పరచుటకు కీకట దేశంలో బుద్ధుడనే పేరుతొ జినసుతుడుగా ప్రభవిస్తాడు. ఇదంతా కలియుగంకొరకు ఉద్దేశింపబడిన శ్రీకృష్ణుని గురుతత్త్వ ప్రభావమే! ఈ బుద్ధుడెవరు? 12వ శతాబ్దపు జయదేవుని అష్టపది ప్రకారం గౌతమ బుద్ధుడు గుర్తుకు వస్తాడు --
నిందతి యజ్ఞవిదే రహః శ్రుతిజాతం,
సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవ ధృత బుద్ధ శరీరా, జయ జగదీశ హరే ||
కాని భాగవత శ్లోకం లో జినసుత అనే పేరు, ఆ బుద్ధుడు వేరు అని సూచిస్తుంది. జైనం తో సంబంధాన్ని సూచిస్తుంది. దానికి అర్థం వసుదేవుడు జినుడు. వాసుదేవుడు జిన సుతుడు.
17
దేవకీ వసుదేవులు వారికి ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి కాశీ పంపిస్తారు. ఈలోపునే కంసుడి మామగారయిన జరాసంధుడు మధురను ముట్టడిస్తాడు. కాశీలో వారు జరా సంధుని గూఢ చారుల బారినుండి తప్పించుకోడానికి బ్రాహ్మణ బాలురవేషాలతో వెడతారు.అక్కడ వారికి అవంతీ(నేటి ఉజ్జయిని) వాసుడైన సాందీపని అనే ముని దర్శనం అవుతుంది. అప్పుడు ఆయన గురుకులంలో చేరడానికి వెళ్తారు. సాందీపని వద్ద విద్యాభ్యాసం కృష్ణుని మరియొక కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
18
భారతదేశంలో ఏడు మోక్షనగరాలున్నాయి. అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశీ, కాంచీ, అవంతిక (ఉజ్జయిని), ద్వారవతి (ద్వారక).అయోధ్య రాముని పాద స్పర్శ వల్ల మోక్షపురి అయినది. మథుర, కాశీ, అవంతిక, ద్వారక, మాయాపురి (విష్ణుమాయ), శ్రీకృష్ణ సంబంధం కలవి. కాంచీపురంలో విష్ణుకంచి గజేంద్రమోక్షణ కథతో సంబంధం కలది. రామ కృష్ణుల విద్యాభ్యాసం కాశీ, అవంతీలలో జరిగినది. వాళ్ళు అక్కడ వేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం వంటి క్షత్రియోచిత విద్యలు నేర్చుకున్నారు. సాందీపని వారికి ఛందస్సు - అనుష్టుప్, గాయత్రి వంటి ఛందస్సులగురించి చెప్పాడు. ఈ రెండూ పాదానికి 8 మాత్రలను కలిగి ఉంటాయి. ఉదహరణకు – “కృష్ణం వందే జగద్గురుం”, “భర్గో దేవస్య ధీమహి” లవలే. గాయత్రి మూడు పాదాలు,అనుష్టుప్ నాలుగు పాదాలు కలిగిఉంటాయి. సాందీపని కృష్ణునికి గాయత్రీ మంత్రము ఉపదేశించినపుడు ఆయనకు చిత్రమైన అనుభవం కలిగినది. గాయత్రీదేవికే గాయత్రి ఉపదేశిస్తున్న భావన. అపుడు కృష్ణుడెవరో ఆయనకు పూర్తిగా తెలిసినది. సామాన్యుల కంటే తక్కువ సమయంలోనే వారు విద్యలన్నీ నేర్చుకున్నారు. చదువు పూర్తి చేసుకొని ఆయనను గురుదక్షిణ ఏమికావాలని అడిగారు. వారి శక్తి తెలిసిన గురువు తగిన కోరిక చెప్పారు. కొన్నిసంవత్సరాల క్రితం చనిపోయిన వారి పుత్రుని తిరిగి తెమ్మని అడిగారు. అదొక అద్భుత ఘట్టం.
19
యమునితో ముఖాముఖీ
మనుష్యులు తప్పించుకొనలేనిది మృత్యువు., ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే దుఃఖాన్ని ప్రతివారూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసినదే. అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. సావిత్రి యమునితో వాదించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి తీసుకురాగలిగినది. నచికేతుడు యమునితో వాదించి యముని వద్దనుండి తిరిగి రాగలిగాడు. కృష్ణుడు, బలరాముడు యముని వద్దకి వెళ్ళి సాందీపని పుత్రుని ప్రాణాలు తీసుకొని వచ్చారు. తరువాత కృష్ణుడు ఉత్తరాగర్భంలోని మృత శిశువుని బ్రతికేస్తేనే పరీక్షిత్తు బ్రతికి బట్టకట్టాడు. ఇది ఎలా సాధ్యం? దేవుళ్ళు కాబట్టి అనేసమాధానం, కల్పిత కథ కాబట్టి అనేసమాధానం పొసగవు. కృష్ణుడు తన వేణువును ఇంద్రజాలికుని దండంవలె మూడు సార్లు తిప్పి “సాందీపని కుమారుడా! తిరిగిరా, రా” అని మంత్రం చదవలేదు. ఇవికాక యముని తో ముఖాముఖీలో ప్రాణాలు తిరిగి పొందడం గురించి పురాణాల్లో ఇతర గాధలు లేవు. దీనికి సమాధానం ఉంది. దీనికి కారణం కృష్ణుని దివ్యత్వం కాదు. ఆయన యోగీశ్వరుడవటం వలన ఇది సాధ్యమైనది. ఆధునిక యుగంలోకూడా యోగసిద్ధులు సాధ్యమని చెప్పే నిజజీవిత గాధలున్నాయి. అందరూ చదవవలసిన పుస్తకం పరమహంస యోగానంద (1893-1952) గారి "ఒక యోగి ఆత్మ కథ" The Autobiography of a Yogi. ఇంగ్లీష్ లోను తెలుగులోనూ లభ్యం అవుతుంది. యోగానంద 1952 లోనే సిద్ధిపొందారు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు "ఆంధ్ర యోగులు" అని నాలుగు సంపుటాలు ప్రచురించారు.
కృష్ణుడు యమలోకానికి ఎలా వెళ్ళిఉంటాడు? (నచికేతుడు యమలోకానికి వెళ్ళడము, యమునితో సంభాషించి మృత్యుంజయత్వాన్ని సాధించే విద్యను సంపాదించి భూలోకానికి తిరిగి రావడము సద్గురు శ్రీ శివానంద మూర్తిగారి "కఠ యోగము" పుస్తకములో విపులంగా లభిస్తుంది.)
20
శ్రీ కృష్ణుడు తనగురువు కొరకై ఏ యోగి, ఏ తపస్వి చేయని యోగ ప్రక్రియ చేసినాడు. గురుదక్షిణగా తన మృత పుత్రుని తీసుకు రావలేనని ఆయన కోరెను. కృష్ణుడు వెంటనే ధ్యాన ముద్రలో స్వాధిష్ఠానమునకు వెళ్ళినాడు. వెంటనే అతని దివ్య శరీరము యమలోకములో ప్రత్యక్ష మైనది. యముడు ఏమికావాలని అడుగగా కొన్ని సంవత్సరముల క్రితం చనిపోయిన గురుపుత్రుని జీవాత్మ కావలెనని అడిగి తీసుకొని భూలోకమునకు వచ్చినాడు. అప్పటి వయసు ఎంత ఉండునో, అట్టి శరీరమును యోగశక్తిచే సృష్టించి, జీవుని అందు ప్రవేశింపజేసినాడు. ఇది అనితర సాధ్యము అనిపిస్తుంది.
21
రాధ ఎవరు? పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ.
22
బ్రహ్మ వస్తువు రూపగుణములులేని నిత్య సత్యము. జగత్తు నిత్యమూకాదు, సత్యమూ కాదు. దీని నిర్మాణమునకు ఆ నిర్గుణబ్రహ్మమునుండి పుట్టి అందులోనే లయమయ్యే రెండు తత్త్వములు కారణము. అవి పురుష స్త్రీ తత్త్వములు. మనమున్న 14 లోకముల బ్రహ్మాండ సృష్టికి మహావిష్ణువు అనే పురుషతత్త్వము, బ్రహ్మ, రుద్రుడు అనే మరిరెండు పురుష రూపములు, లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే స్త్రీ తత్త్వములు కారణము. ఈ సృష్టిలోని జీవులు ఈ త్రిముర్తులను ఆరాధించి వరములు పొందుతారు. ఈ లోకములు కాక బ్రహ్మాండమందు గోలోకమనే లోకము ఉన్నది. ఈ లోకములో జీవులు నిత్యులు, ఆనంద స్వరూపులు. ఈ లోక పాలకులు రాధాకృష్ణులు.శుద్ధ ఆనందమైన బ్రహ్మ స్వరూపులు. ద్వాపరాంతమందు వీరి భూమియందు అవతరించినారు. వారి ఉపాసన వలన సర్వ కర్మాతీతమై ఏ కర్మఫలమూ కానటువంటి ఒకానొక ఆనందము మనకు లభిస్తుంది.
23
దేవీభాగవతం రాధాదేవి ఉపాసనను వివరిస్తుంది. గోలోకంలో రాధాకృష్ణులను దేవతలందరూ అర్చించారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, దుర్గ, మొదలైన వారందరూ దుర్గా మహోత్సవం జరిపినట్లు, పురాణ కథనం. బ్రహ్మకోరిక మేరకు శివుడు గానం చేయగా, ఆ గానరసంలో రాధాకృష్ణులు కరగి జలమై ప్రవహించారట. ఆ విధముగా గంగయే రాధ. శివుడు తిరిగి స్తుతించిన తరువాత రాధాకృష్ణుల దర్శనం అందరికీ లభించింది. ఈ గంగ భూలోకంలోని రాసమండలంలో ఉద్భవించినదనికూడా చెబుతారు. రాసమండలమంటే శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించిన వర్తులాకార స్థలము. దీని అంతరార్థము రాధాకృష్ణులు కేవలము రసమయ స్వరూపులు. వారి రస తత్త్వము అనురాగ జన్యమైన ఆనందము. భూమిపై అవతరించిన శ్రీకృష్ణుడు రాధయందు గోపికల యందు మనవాతీతమైన అనురాగమును కలిగించినాడు.
24
శ్రీకృష్ణుడు తన భార్యలందరినీ సమముగా ప్రేమించినాడు. అందులో ఆశ్చర్యమేమున్నది? అతడు సమస్త ప్రాణికోటినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. ఒక సారి కృష్ణుని భార్యలైన మిత్రవింద, కాళింది అనేవారికి ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? అనే సందేహము వచ్చింది. శ్రీకృష్ణుడంటే ఎక్కువ భక్తి కలిగినది రుక్మిణి అని ఎక్కువ ప్రేమ కలిగినది సత్యభామ అనీ వారి అనుమానము. వారినే వాళ్ళు అడిగారు. సత్య సమాధానం "భక్తి, ప్రేమలలో ప్రేమ ప్రధానం. అందరు భార్యలకంటె నేనే ఆయనకు ఇష్టము" అని ఆమె అన్నదట. రుక్మిణి ఇలాచెప్పినది. "ఆయనకు సమస్త జీవరాసులపై సమానమైన ప్రేమ.అట్టివారిలో నేనొకతెను." శ్రీకృష్ణుడు దక్షిణ నాయకుడు, భార్యలందరిపై సమాన ప్రేమ కలవాడు. సత్యభామ, రుక్మిణీ, రాధ వీరి ప్రేమలలో తేడా ఏమిటి? సత్యభామది భూతత్త్వము. ఆమె నిరంతరం ఆయన భౌతిక సాన్నిహిత్యము కోరుతుంది. ఇది తామసిక ప్రేమ. రుక్మిణి అతడు తనవద్దకు వచ్చినప్పుడు పూజిస్తుంది. అతడు దగ్గరలేనప్పుడు హృదయమందు ధ్యానిస్తుంది. ఇది రాజసిక ప్రేమ. రాధ ఎప్పుడూ కృష్ణుని సన్నిధిలోనే ఉన్నట్లు భావించుకుంటుంది. అతడు సన్నిహితముగా లేని భావనయే ఆమెకు ఉండదు. ఆమెది సాత్త్విక ప్రేమ. రాధాకృష్ణుల తత్త్వము అర్ధనారీశ్వర తత్త్వమే. ఒక నాణెమునకు కృష్ణుడు ఒకవైపు, రాధ మరియొకవైపు. వారు సనాతనులు.
25
భగవంతుడు మత్స్యావతారములో వేదరాశిని సముద్రగర్భమునుండి సోమకాసురుని నుండి రక్షించి జగత్తుకు తిరిగి ఇచ్చాడు. సోమకుడు అపహరించాడంటే అర్థం ఏమిటి? ధ్వనిరూపములో విశ్వవ్యాప్తమైన వేదమును ఉపసంహరించి, ఆ శబ్దస్వరూపమును పరాస్థితిలో ఉంచి ఎవరికీ వినపడకుండా ఉండే ప్రయత్నముచేశాడు. సృష్టి, స్థితి, లయ జ్ఞానముల నివ్వగలిగిన వేదమును ఉపసంహరించడం వలన త్రిమూర్తుల కార్యక్రమములోనే అంతరాయం కలిగినది. విష్ణువు మత్స్యావతారంలో ఆ అసురుని సంహరించి ఆజ్ఞానమును తాను గ్రహించి జగత్తుకు తిరిగి ఇచ్చాడు. తిరిగి ఆవేద సారమును భగవద్గీత రూపముగా ప్రవచించి లోకానికి అందజేశాడు. తరువాత తానే బుద్ధుడుగా వేద కర్మలను ఉపసంహరించి జ్ఞానబోధచేశాడు. ఒకరకముగా వైదిక కర్మకాండ ప్రాముఖ్యతను తగ్గించి కలియుగమునకు తగినట్లు జ్ఞాన బోధచేయడం శ్రీకృష్ణుని ఉద్దేశ్యం. కలిపురుషుని అవతారమైన దుర్యోధనుని ఎదురుగా దేవేంద్రుని అంశయైన అర్జునునికి గీతాబోధచేయడంలో అంతరార్థమిదే.
26
భగవద్గీత విచిత్రమైనది. ఒకొకరికి, వారికి ఉచితమైన సందేశం ఇచ్చినట్లు కనబడుతుంది. ప్రారంభములో యుద్ధము చేయనన్న అర్జునుని "క్షుద్రం హృదయ దౌర్బల్యం" అని హెచ్చరించి, చివరలో "సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని అన్నింటినీ వదలమని చెప్పాడు. గీత వివిధ మనస్తత్వాలకు వివిధమైన స్ఫురణలు ఇస్తుంది. ఈ 28వ మహాయుగము వరకు తపస్సులు, స్వాధ్యాయనిరతి, యజ్ఞ కర్మ, భగవత్తత్వ జ్ఞానము మోక్ష ప్రాప్తికి మార్గములు. కలియుగ వాసులకు ఇవి అసాధ్యములని భగవంతుడైన శ్రీకృష్ణుని నిర్ణయము. వీరి అర్హతకు తగిన నూతన మార్గము కృష్ణునిచేత ఆవిష్కరింపబడినది. ఇక్కడ భక్తి ప్రేమలను భగవత్పరము చేయడమే ముక్తి మార్గము. గోపికలు ఆతని వంశీగానము విని ఆత్మానంద భరితులై ఆ కృష్ణ రూపమును మోహించి, కాంక్షించి తరించారు. కుచేలుడు తత్త్వవేత్త. దూరంగా ఉంటోనే తత్త్వగ్రహణముచేత ఆయన యందు లీనమైనాడు. అమాయకులైన గోపాలకులు ఆయన స్నేహములో మోహావిష్టులై తరించారు. చైతన్యుడు బోధించినది ఇదే. కృష్ణుని చేరుటకు మధురభక్తి మార్గము ఈ యుగములోనే పుట్టినది.
27
అధర్వణవేదంలో కృష్ణోపనిషత్తు ఉంది. ఇది కృష్ణావతారానికి ముందే ఉన్నది. శ్రీరామావతారములోనే కృష్ణుని జన్మకు నాంది ఏర్పడినది. శ్రీ రాముని జగన్మోహన రూపమును మునులు చూచి, ఉపాసించి మోహబద్ధులై గోపికలుగా జన్మించారు. సృష్టిలో ఈ మోహము జీవలక్షణముగా ఉన్నది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, భోగభాగ్యములపై మోహము ఈ రెండూ మనుష్యుని దృష్టి ని పారమార్థిక విషయములపై పోనివ్వటంలేదు. ఇట్టి మోహావిష్టుని కొరకు ఆవిర్భవించినదే కృష్ణుని మోహనరూపము. త్రేతాయుగమందు శ్రీరామదర్శనము పొందిన తపశ్శాలురు, కృష్ణావతార సమయములో విజ్ఞానము లేని మందబుద్ధులైన గోపికలుగా జన్మించారు. రాముని రూపముచే మోహితులైన మునులు, గోపికలుగా ఆమోహావేశముచేతనే ముక్తులైనారు. ఇదే దీనిలోని తత్త్వ రహస్యము. కాలగతిలో ముక్తిమార్గములలోని మార్పులు కృష్ణునిచేత సూచించబడినవి.
28
శ్రీకృష్ణావతారము యొక్క ఆవిర్భావము పరమాత్మ సంకల్పము. అప్పుడే రుద్రాదిదేవతల ఆవిర్భావముకూడా జరిగినది. సకల దేవతాంశలూ కృష్ణునిలో ఉన్నాయి. రుద్రుని ఘోరరూపము కృష్ణుని నందకమనే ఖడ్గము. కృష్ణుని వేణువు సకల కళామయమైన రుద్రుని శాంతరూపము. ఇంద్రుడు శృంగముగా, బ్రహ్మ యష్టికగా జన్మించారు. సాందీపనిముని బ్రహ్మయే. బ్రహ్మానందము నందుడు, ముక్తికాంత యశోద.అందుకే ఆనందస్వరూపుడైన కృష్ణుని బాల్యం నందగోకులములోగడచినది. బలరామకృష్ణులే వేదార్థము. "ఉపనిషదర్థం ఉలూఖలేనిబద్ధం" అన్నారు.(అంటే ఉపనిషత్తుల అర్థమైన కృష్ణుడు యశోదచేత ఱోలుకి కట్టబడ్డాడు.) ఉలూఖలము (ఱోలు) కశ్యప ప్రజాపతి. రజ్జువు అదితి. అది ఖండనమండనలకు అతీతమైనది. గోప, గోపికలు వేదమతులైన ఋషులు. పరమేశ్వరుని ఉచ్చ్వాస నిశ్వాసములు వేణువులో ప్రవేశించి నాదరూపమున వెలువడినవి. గోకులము వైకుంఠము. వనమునందలి వృక్షములు నారదాది మునులు. పదహారు వేలగోపికలు ఉపనిషన్మంత్రములు. చాణూర ముష్టికులు ద్వేష, మాత్సర్యములు. కంసుడు కలహము. సుదాముడు శమము. ఉద్ధవుడు దమము. అకౄరుడు సత్త్వగుణము. వైజయంతీమాల వేదముల తేజస్సు. దాని సువాసన ధర్మము. గద కాళిక, సంహార శక్తి. ఇటువంటి వివరణకూడా ప్రచారములో ఉన్నది.
29
మనుష్యులు మిత్రభావనతోగాని, శతృభావనతోగాని, శృంగారభావనతోగాని, ప్రేమ, భక్తి భావనలతో కాని భగవంతుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను తమవంటి మనుష్యునిగానే చూస్తారు. దాతగా చూస్తారు, సంహర్తగా చూస్తారు, అతడు తనని చంపబోతున్నాడనే భయంతో చూస్తారు, చనిపోతారుకూడా, ప్రియునిగా చూస్తారు. అనుగ్రహాన్ని అనుభవించి ఆనందం పొందుతారు. ఏ భావంతో ఈశ్వరునిచేరుతారో ఆ అనుభూతి వారికి లభిస్తున్నది. ఆయన క్రియాశూన్యుడు, నిర్లిప్తుడు. భాగవతం జీవులచరిత్ర.
30
కృష్ణావతారం ధర్మ సంస్థాపనకు వచ్చినది కదా, ఈ గోపికలు, పదివేలమంది భార్యలు వీటినన్నిటినీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మనం ఆయనను ఒక మానవుని వ్యక్తిత్వం కలవానిగా చూడడంవలన వచ్చిన సందేహం. ఈ స్త్రీలందరితో సంచరించిన కృష్ణుడనే వ్యక్తి అక్కడలేడు. అతడు చేసినట్లు భావింపబడుతున్న శృంగార చేష్టలు ఆయనకు వర్తించవు. జీవుల మనస్సులోని భావనలు మాత్రమే అక్కడ ఆజీవులకు అనుభవంలోకి వస్తున్నాయి. పరమాత్మ సర్వకారణకారణుడే కాని వ్యక్తుల సుఖ, దుఃఖాలనే తాత్కాలిక అనుభవాలలో అతని పాత్ర లేదు. పుణ్యంచేసినవాడు పుణ్యఫలంపొందినా, పాపంచేసినవాడు పాపఫలం పొందినా అదిదైవ శాసనమేకాని, ఆయన కర్తగా ఏపనీ చేయడంలేదు. ఆయన నిర్లిప్తుడు. కార్యంలేదు. క్రియలేదు. పరమాత్మ. సర్వాంతర్యామి. సాక్షీభూతుడు. మనవంటి మానవమాత్రునిగా చేసిన భావనలోనే ఆయన దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ కూడా ఉన్నాయి. ఈ ద్వంద్వస్థితిలో మానవమాత్రులమైన మనము ఉండటంవలన ధర్మాధర్మ విచక్షణ మనకు కలిగి, ఆయనకు ఆపాదిస్తున్నాము.
సేకరణ - వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ, బెంగళూరు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML