గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 30 October 2015

యుద్ధకాండ

యుద్ధకాండ
హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి " హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు.
సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి, ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని, బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దెగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దెగ్గర ఉన్నది ఈ దేహమే, అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను " అని, హనుమని దెగ్గరికి తీసుకుని గట్టిగ కౌగలించుకున్నాడు.
తవువాత రాముడన్నాడు " అంతా బాగానే ఉంది కాని, ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు. మనకున్న ఈ వానర సముహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము. అందులో క్రూరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా......." అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు, " రామ! నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడిననాడు నీముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు. నువ్వు సమస్త బ్రహ్మండములను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. ఒకసారి వానర సైన్యము లంకా పట్టణంలో అడుగుపెట్టిందంటే, రావణుడు నిహతుడయ్యిపోయినట్టే. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి " అన్నాడు.
సుగ్రీవుడి మాటలకి ఉత్సాహం పొందిన రాముడు " నిజమే, నేను తలుచుకుంటె నా తపఃశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను. నేను తలుచుకుంటె నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను " అని చెప్పి, హనుమ వంక తిరిగి " హనుమా! ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది. ద్వారములు, దుర్గములు ఎలా ఉంటాయి " అని అడిగాడు.
అప్పుడు హనుమంతుడు " ఆ లంకా పట్టణం 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూటా పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. అది శత్రు దుర్భేధ్యమైనది, దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. ఆ లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అందులో ఒక విశాలమైన అగడ్త నిర్మించారు. దానిమీద నాలుగు వైపులా నాలుగు వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలములయందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చెయ్యబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గాలున్నాయి, అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు. నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు. కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. ఆ లంకా పట్టణము ఈ నాలుగు దుర్గములతోటి శోభిల్లుతోంది. లంకకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం దెగ్గర 10,000 మంది రాక్షసులు ఆయుధములు పట్టుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. దక్షిణ ద్వారాన్ని లక్ష మంది సైనికులు కాపు కాస్తుంటారు. పది లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తుంటారు. కోటి మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడమంటే మహా ప్రీతికరమైన విషయం. రాజద్వారమునకు భయంకరమైన ఇనుప గడియలు, పరిఘలు బిగించి ఉంటాయి. ఆ లంకని చేరుకొని యుద్ధం చెయ్యడం అంత సామాన్యమైన విషయం కాదు.
మీరు కాని ఆజ్ఞాపిస్తే ఒక సుషేణుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్వివిదుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనని పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలని విరగొట్టాను. ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది, రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను " అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు " నాకన్నీ శుభనిమిత్తములు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటితే రావణుడు నిహతుడు అయిపోయినట్టే. మంచి ముహూర్త నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదాము " అన్నాడు.
అప్పుడు రాముడు " మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది, ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగుంది కనుక మన వెంటనే సైన్యాన్ని తీసుకొని బయలుదేరదాము " అన్నాడు.
రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరములన్నీ సంతోషాన్ని పొంది " జై శ్రీరాం, జై జై రామ, బయలుదేరదాము, లంక చేరిపోదాము, రావణుడిని సంహరిద్దాము " అన్నాయి.
తరువాత రాముడు సుగ్రీవుడితో " వృద్ధులైన వారు, శరీరంలో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి, ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైనరీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు, అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి, తాగడానికి మంచి నీరు దొరకాలి, పళ్ళు, తేనె దొరకాలి, అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి.
వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలొ శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి " అని చెప్పాడు.
అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు " ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో " అని ఒకడు, " నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి. చూడరా నా కండ " అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గోడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. తరువాత అక్కడినుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది.
అప్పుడు రాముడు " మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను 3 భాగములు చెయ్యండి " అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరములని ఒక వైపు నిలబెట్టారు, కొండముచ్చులని ఒక వైపు నిలబెట్టారు, భల్లూకాలని ఒక వైపు నిలబెట్టారు.
చంద్రుని కాంతి కెరటాలు మీద, కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ, అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి. ఆకాశం సముద్రంలా, సముద్రం ఆకాశంలా ఉన్నాయి, రెండిటికి తేడా తెలియడం లేదు. ఆకాశము, సముద్రము రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి, ఆకాశంలో తారలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది, కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది, అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు.
ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ " సీత లంకలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా! సీత నిన్ను చూసుంటుంది, అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది " అన్నాడు.
అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో " జెరగకూడని పని జెరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడొ మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). అప్పుడు మనం రామలక్ష్మణులతో, వానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఎకాభిప్రాయంగా చెప్పిన మాట, ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట, మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి, ఎవరిమానన వాళ్ళు తలోమాట చెబితే, అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి " అన్నాడు.
అప్పుడా మంత్రులన్నారు " ప్రభు! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి, ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లోనుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడినుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులని, తక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడినుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు, యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు. మీ దెగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు, ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత " అన్నారు.
ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి " రావణ! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము " అన్నాడు.
అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి " నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను " అన్నాడు.
అప్పుడు వజ్రదంష్ట్రుడు " రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దెగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దెగ్గరికి పంపి ' అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు ' అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది, అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము " అన్నాడు.
అప్పుడు నికుంభుడు(కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు " దీనికింత మోసం ఎందుకు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి, రామలక్ష్మణులని తినేసి వస్తాను " అన్నాడు.
అప్పుడు విభీషణుడు " 3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటె యుద్ధానికి వెళ్ళడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక, దైవము ప్రతికూలంగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని, మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటె అంత చేతకానివాడిలా కనపడుతున్నాడ. రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు(తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు(పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దెగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా. యుద్ధానికి వెళ్ళేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగ అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటె వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటె, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశార?
మీరు ఒక్కసారి ఆలోచించండి, రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది, ధర్మం ఎక్కడుంటె దేవతలు అక్కడ ఉంటారు, కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు. ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటె, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చెయ్యండి " అన్నాడు.
విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు.
విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు, పూజలు, అగ్నికార్యాలు జెరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి " అన్నయ్య! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే, ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతె నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని, నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను.
నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకోచ్చావో, ఆనాటినుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే, ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీమించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటె, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు.
ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు, దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము " అన్నాడు.
అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి " ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి రా. నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు " అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు.
తన మనస్సు నిరంతరము పరకాంత యందు ఉండుట చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోవుచున్నాడు.
తరువాత రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు. అందరూ సభలొ కూర్చున్నాక ఆయనంటాడు " నేను సీతని అపహరించి తీసుకొచ్చిన మాట పరమ వాస్తవం. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. ప్రహస్త! వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా " అన్నాడు.
తరువాత ఆ సభని ఉద్దేశించి రావణుడు అన్నాడు " మూడు లోకాలలో సీతకన్నా అందగత్తె లేదు, కనుక నేను ఆమెని అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతని చూస్తుంటే నాలొ కామ ప్రచోదనం పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కామం ఎక్కువ అవ్వడం వల్ల నేను నీరసించిపోతున్నాను ( ఆ రావణుడు సీతమ్మ గురించి ఇంకా నీచంగా వర్ణిస్తాడు, అది ఇక్కడ రాయడం బాగోదని రాయడం లేదు). నేను సీతని అపహరించి తీసుకొచ్చాక ' రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో, ఒక సంవత్సర కాలం చూద్దాము ' అని సీత నన్ను అడిగింది. ఒక సంవత్సరం వరకూ నా మంచం ఎక్కను అనింది, పోనిలె ఒక సంవత్సరమే కదా అని సంవత్సరం గడువు ఇచ్చాను " అన్నాడు.
అప్పుడు అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు " నువ్వు చేసిన పని పరమ తప్పు. ఇప్పుడు మా అందరినీ పిలిచి, ఏమి చెయ్యను అని అంటావేంటి. ఈ మాట నువ్వు మమ్మల్ని అపహరించే ముందు అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసేముందు న్యాయాన్యాయములను బాగా ఆలోచించాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపలచిత్తంతో రాజు కాని నిర్ణయం చేస్తే, ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. నువ్వు తొందరపడి సీతని తీసుకొచ్చావు, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బతికి ఉన్నావు. ఏదో తప్పు చేశావు సరె, ఇంక బెంగపెట్టుకోమాకు. హాయిగా లోపలికి వెళ్ళి మధ్యం తాగి, నీ కాంతలతో సుఖంగా విహరించు. నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరించి, ఆ వానరులందరినీ తినేసి వస్తాను " అన్నాడు.
అప్పుడు మహాపార్షుడు అనే మంత్రి అన్నాడు " ఒక కోడిపుంజుకి కోరిక కలిగితే కోడిపెట్టని తరిమి, బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతని అనుభవించు " అన్నాడు.
రావణుడు ఆ మహాపార్షుడిని దెగ్గరికి పిలిచి " ఎంత గొప్ప ఆలోచన చెప్పావు. కాని నాకు ఒక శాపం ఉండిపోయింది. ఒకనాడు నేను బ్రహ్మ సభకి వెళుతున్నప్పుడు పుంజకస్థల అనే అప్సరస నన్ను చూసి దాక్కుంది. అప్పుడు నేను ఆమెని వెంట తరిమి, వివస్త్రని చేసి అనుభవించాను. బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పుంటుంది, అందుకని బ్రహ్మగారు నన్ను పిలిచి ' ఇకముందు నీయందు మనస్సులేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే, ఉత్తర క్షణం నీ శిరస్సు నూరు ముక్కలవుతుందని ' బ్రహ్మగారు శపించారు. అందుకని నేను సీత జోలికి వెళ్ళలేదు " అన్నాడు.
అప్పుడు విభీషణుడు పైకి లేచి అన్నాడు " మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటె మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్షుడు కాని, మహొదరుడు కాని, నికుంభుడు కాని, వీరేవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు " అన్నాడు.
అప్పుడు ప్రహస్తుడు " ఏమిటయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు, మన ప్రభువు దేవదానవులని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటివరకూ తెలీదు. అటువంటిది నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు " అన్నాడు.
విభీషణుడు " ఇక్ష్వాకు వంశస్తుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త! నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామ బాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటె నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామ బాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటె, అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చెయ్యండి, రావణుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని ఇచ్చెయ్యండి, అలా చేస్తే మీరు బతికుంటారు లేకపోతె నశించిపోతారు " అన్నాడు.
ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి " వీర్యంలొ కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రి!. పద్దాక ' రాముడు వచ్చేస్తాడు ' అని మాట్లాడుతున్నావు, ఎందుకంత భయం నీకు, ఏంచేస్తాడు రాముడు వస్తే " అన్నాడు.

యుద్ధకాండ
రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి, ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళి ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి, తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి " ఈయనకి తినడం అంటె బాగా ఇష్టం. అందుకని ఈయనకి ఇష్టమైన పదార్ధాలని తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్నవాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా, మనం పెట్టిన పదార్ధాల వాసనకి నిద్ర లేస్తాడు " అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగాలని చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరువాత ఆ పాత్రలని తీసుకొచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతొ మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్ధాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు.
అప్పుడు వాళ్ళు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మోగించారు, భేరీలు, మృదంగాలు మోగించారు. పెద్ద పెద్ద శూలాలు, పరిఘలు, తోమరాలు పట్టుకొచ్చి ఆయనని పొడిచారు. ఆ కుంభకర్ణుడి చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కిందపడేశారు. తరువాత వాళ్ళు ఏనుగుల్ని, కంచర గాడిదలని, ఎద్దులని, ఒంటెలని తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీదకి ఒక వైపు నుండి ఎక్కి మళ్ళి ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. వాళ్ళు అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రం చెలించకుండా అలానే నిద్రపోతున్నాడు.
తరువాత వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటి కడవలని తీసుకొచ్చి, ఆ నీటిని ఆయన చెవులలో పోసేశారు. ఇంక లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరికెయ్యడం మొదలుపెట్టారు. తరువాత పర్వతాలంత ఎత్తు, బరువు ఉన్న 1000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. అ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టనిపించింది. ఈయన మళ్ళి కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలాలతొ ఆయనని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడా కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి, రెండు చేతులని కలిపి ఒళ్ళు విరుచుకొని, పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. ఆ పక్కన ఉన్న కల్లుని కూడా తాగేసాడు.
అప్పుడా రాక్షసులు " కుంభకర్ణా! ఎన్నడూ లేని ప్రమాదం ఇవ్వాళ లంకకి ఏర్పడింది. మీ అన్నగారు సీతని అపహరించి తీసుకొచ్చారు. కేవలం నరుడైన రాముడు వానరములని తన సైన్యంగా మలుచుకొని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి, ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడై తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇంక దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము " అన్నారు.
అప్పుడు కుంభకర్ణుడు " ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దెగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇలానే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణులని సంహరించడం నాకు ఒక లెక్కా. నాకు చాలా ఆకలిగా ఉంది, అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చెయ్యడానికి వెళితే నేను తినడానికి వెళతాను. అక్కడున్న వానరాలని, భల్లూకాలని తింటాను " అన్నాడు.
అప్పుడు ఆ రాక్షసులు " అలా వెళ్ళిపోకయ్యా. మీ అన్నగారు నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో మాట్లాడి, ఆయన ఎలా నిర్దేసిస్తే అలా వెళ్ళు " అన్నారు.
" ఇవన్నీ తిన్నాక, స్నానం చేసి వస్తాను " అని కుంభకర్ణుడు అన్నాడు.
స్నానం చేసి బయటకి వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ 1000 కడవలలో ఉన్న కల్లుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరాలు భయంతో పారిపోయాయి,( కుంభకర్ణుడిది అంత పెద్ద శరీరం, లంకా పట్టణానికి దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరాలికి కూడా వాడు కనిపించాడు) కొంతమంది చెట్లు ఎక్కేసారు, కొంతమంది పర్వత గుహలలోకి దూరిపోయారు, కొంతమంది సేతువెక్కి పారిపోయారు.
ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు ' ఏంటి విషయము ' అని అడుగగా, విభీషణుడు అన్నాడు " మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంక కొంచెంసేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు, ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకి చెప్పకండి, అలా చెబితే వాళ్ళు భయపడతారు, అది కేవలం ఒక యంత్రం అని చెప్పండి " అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ మళ్ళి తిరిగి వచ్చాయి.
అప్పుడు రాముడు " విభీషణ! నీ అన్నయ్య ఇలా ఉన్నాడేంటి. వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడ " అని అడిగాడు.
విభీషణుడు అన్నాడు " కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటె, ఆయన పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ' ఆకలీ ' అని దేశం మీద పడి మనుష్యులని, రాక్షసులని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్ధించారు. అప్పుడాయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఆకాశంలో ఐరావతం మీద వెళ్ళి ' ఏరా నీకు బుద్ధి ఉందా లేదా, ఏమిట్రా ఆ తినెయ్యడం. కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణి కోటిని బతకనివ్వవా ' అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో పైకి ఎరిగి ' నేను తింటుంటే నువ్వు ఎవడివిరా చెప్పడానికి ' అని, ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోసాడు. అప్పుడా ఐరావతం కింద పడిపోయింది. అప్పుడాయన ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు ' సృష్టిలో ఇలాంటివాడు ఒకడు వచ్చాడ! అలా తినెయ్యడమేమిటి, వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి ' అన్నారు.
తరువాత వాళ్ళు కుంభకర్ణుడిని బ్రహ్మగారి దెగ్గరికి తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి ' నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో ' అన్నారు.
కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించి, కాని రావణుడికి బాధ కలిగింది. అప్పుడాయన బ్రహ్మగారితో ' అదేమిటి తాత అలా శపించావు, వాడు నీకు మునిమనవడు. అలా నిద్రపోమంటే ఎలా, కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి ' అన్నాడు.
అప్పుడు బ్రహ్మగారు ' వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్క రోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే 6 నెలల తిండి తినేస్తాడు. తినంగానే మళ్ళి నిద్రపోతాడు ' అన్నారు.
అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు రామ. ఇవ్వాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితొ యుద్ధం అంటె సామాన్య మైన విషయం కాదు రామ " అన్నాడు.
ఇంతలో కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు " అన్నయ్య! మనం ఏదన్నా ఒక పని చేసేముందు ఆలోచించి చెయ్యాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావ. ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు, ఇప్పుడది ఉపద్రవం అయ్యి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు కాని, నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి, సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి, లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభీషణుడు చెబితే, ఆయనని రాజ్యం నుండి బయటకి పంపించేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా?, నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా?. వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా?. ఏమి రాజ్య పాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు " అని అడిగాడు.
ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి " నేను తప్పే చేశాను అనుకో, దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప, నా తప్పుని పది మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చెయ్యగలిగితే రామలక్ష్మణులని సంహరించు, లేకపోతె వెళ్ళి పడుకో, కాని ఇవ్వాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది " అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు " ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు. నేను ఉండి కూడా నీకు ఉపకారం చెయ్యకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి. యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను " అని బయలుదేరుతున్నాడు.
ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి " కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేంటి. ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు, మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక అయిదుగురము బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాము. అయిదుగురము రాముడి చుట్టూ చేరి ఆయనని నిగ్రహించగలిగితే అదృష్టవంతులం, ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతె రామనామాంకితమైన బాణములు మన శరీరంలో గుచ్చుకుని ఉంటాయి.అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలాన అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనన్ని కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనాలు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. అప్పుడు సీత అనుకుంటుంది ' ఇంత సభ జెరుగుతుంది, బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా.... ' అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది " అన్నాడు.
అప్పుడు రావణుడు " ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటె భయంరా, అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు " అని అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు " మీరెవరు రావక్కరలేదు, నేనొక్కడినే వెళతాను " అన్నాడు.
అప్పుడు రావణుడు " నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు " అని చెప్పి, కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు.
అప్పుడా కుంభకర్ణుడు మంచి ఉత్తరీయము వేసుకొని, ఒక మంచి పంచె కట్టుకొని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది.
యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవుడికి, సుషేనుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు కుంభకర్ణుడు అని తెలుసు. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు, అప్పుడవి చూర్ణమయ్యి కిందపడ్డాయి. ఆయన తన అరి చేతులతో కొడుతుంటే వేలకు వేల వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలని నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో 200 మంది వానరాలని పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరాలలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటకి దుకేస్తున్నారు, కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకి దుకేస్తున్నారు. అలా బయటకి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళి ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాలని పట్టుకొని కొరుక్కుని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరాలు చనిపోయాయి.
అక్కడున్న వానరాలకి వచ్చింది యంత్రము కాదు రాక్షసుడే అని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో దూకేశారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు.
అప్పుడు అంగదుడు వాళ్ళందరి దెగ్గరికి వెళ్ళి అన్నాడు " ఏరా మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా, రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు. యుద్ధ భూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతార. మీ పౌరుషం ఏమయ్యింది " అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు.
ఇంతలో నీలుడు, ఋషభుడు, గంధమాధనుడు, సుగ్రీవుడు మొదలైనవారు కుంభకర్ణుడి దెగ్గరికి వెళ్ళారు. అప్పుడా కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకుని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి నెత్తురు వరదలై పారింది. తరువాత వాళ్ళని అవతలికి విసిరేశాడు. కాని వాళ్ళు చాలా దేహ ధారుడ్యం, బలము ఉన్నవాళ్లు కనుక కిందపడి మూర్చపోయారు. తరువాత ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదాలతో తన్నాడు, కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కిందపడిపోయింది. అప్పుడాయన తన శూలంతొ సుగ్రీవుడిని కొట్టాడు, ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్చపోయి కిందపడిపోయాడు, కాని మళ్ళి స్పృహ వచ్చి పైకి లెగబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు " సుగ్రీవ! నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉందా, నువ్వు ఋక్షరజస్సు కొడుకువి(బ్రహ్మగారి కొడుకైన ఋక్షరజస్సు ఒకనాడు తెలియక శాపం ఉన్న ఒక సరస్సులొ స్నానం చేశాడు. అలా స్నానం చేసేసరికి ఆయన ఒక అప్సరస అయ్యాడు. అప్పుడు సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరస యుక్క తలోచెయ్యి పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి వీర్యము స్కలనమయ్యింది. ఇంద్రుడు తన వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వాల భాగమునందు విడిచిపెట్టాడు. సూర్యుడు తన వీర్యాన్ని ఆమె కంఠ భాగమునందు విడిచిపెట్టాడు. ఆ కంఠ భాగమునుండి సుగ్రీవుడు, వాల భాగమునుండి వాలి పుట్టారు. ఆ తరువాత బ్రహ్మగారు ఆ అప్సరసని తీసుకెళ్ళి ఇంకొక తటాకంలో స్నానం చేయించాడు, అప్పుడాయన మళ్ళి తన వానర రూపాన్ని పొందాడు). నేను నిన్ను విడిచిపెడతాన...." అని శూలం పట్టుకొని సుగ్రీవుడిని గట్టిగా కొట్టాడు. ఆ సుగ్రీవుడు నెత్తురు కక్కుతూ కిందపడిపోయాడు.
అప్పుడు హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కుని తన తొడకేసి కొట్టి వంచేశాడు. అప్పుడా కుంభకర్ణుడు హనుమంతుడిని ఒక దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ విచలితుడై పడిపోయాడు. తరువాత ఆ కుంభకర్ణుడు కిందపడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన సంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయంలో హనుమంతుడు చూసి అనుకున్నాడు ' నాకు ప్రభువు అయినవాడిని శత్రువు అపహరిస్తుండగా సేవకుడనైన నేను వెళ్ళి ఆయనని రక్షిస్తే, అది ప్రభువుకి అమర్యాద. సుగ్రీవుడికే తెలివొస్తుంది, వేచి చూద్దాము " అని హనుమంతుడు అనుకున్నాడు.
ఈలోగా ఆ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీదనుంచి, మేడల మీదనుంచి చందన ద్రవాలని కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్ళు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివొచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేశాడు. తరువాత ఆయన డొక్కల్ని తన గోళ్ళతో చీల్చేశాడు. అలా చీల్చేసేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు.
ఇంక ఆ కుంభకర్ణుడు కోపంతో మళ్ళి యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో " ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి, నిన్ను చంపితే లాభం ఏమిటి. నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దెగ్గరి వెళతాను " అన్నాడు.
లక్ష్మణుడు కొట్టిన బాణాలకి, సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుడి శరీరం నుండి నెత్తురు కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు " వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే గొడవ వదిలిపోతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. అప్పుడా బరువుకి వాడు కిందపడిపోతాడు " అన్నాడు.
అప్పుడు కొన్ని కోట్ల వానరాలు ఎగిరి వాడిమీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు, అంతే, అన్ని వానరాలు కిందపడిపోయాయి. అప్పుడు అందరూ రాముడి దెగ్గరికి వెళ్ళారు. " రామ! ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు. మీరొచ్చి ఈ కుంభకర్ణుడిని సంహరించండి " అన్నారు.
రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది, కాని ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి, తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి, కళ్ళు తిరిగినంత పనయ్యింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడా కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు.
రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది.
కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ " అయ్యయ్యో, నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు, నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది " అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు.
వాళ్ళన్నారు " నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము " అన్నారు.
అప్పుడు రావణుడు " ఇప్పటికయినా నా కోరిక తీర్చండి " అన్నాడు.
అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు.
ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు " విభీషణ! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు " అని అడిగాడు.
అప్పుడు విభీషణుడు " ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దెగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం " అన్నాడు.
ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు " లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో " అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు " ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి " అన్నాడు.
అతికాయుడన్నాడు " పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు " అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు " నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను " అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు " అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే " అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి.
ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో " వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది " అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు.
అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి " నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది " అన్నాడు.
అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు.
Read More

హనుమ అనుగ్రహాన్ని అందించే పూలు..!హనుమ అనుగ్రహాన్ని అందించే పూలు..!

భగవంతుడిని ఏదో ఒకటి కోరుకునే భక్తి ఎంతోకొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక భగవంతుడి నుంచి ఏమీ కోరనప్పుడు .. ఆయన సేవచేసుకునే భాగ్యం తప్ప మరేమీ ఆశించనప్పుడు కలిగే సంతోషం వేరు ... సంబరం వేరు. ఇవి మనకి హనుమంతుడిలో స్పష్టంగా కనిపిస్తాయి. సాక్షాత్తు నారాయణుడి స్వరూపమైన రాముడిని ప్రత్యక్షంగా సేవించుకునే అదృష్టం కలిగినందుకే హనుమంతుడు మురిసిపోయాడు.
సీతారాములు ప్రీతిచెందడం కోసమే ఆయన సిందూరం ధరించాడనీ, తమలపాకుల మాలను ధరించాడని అంటారు. అందుకే హనుమంతుడిని ఎవరైతే అనునిత్యం సేవిస్తూ వుంటారో, అలాంటివారికి తమ అనుగ్రహం తప్పక లభిస్తుందని సీతారాములు సెలవిచ్చారు. అలాంటి హనుమంతుడు అనేక క్షేత్రాల్లో అర్చామూర్తిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఇక ఆయన ప్రతిమను పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని అనుదినం పూజించుకునేవారు లేకపోలేదు.
ఇక హనుమంతుడికి పూలంటే మహాఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మల్లెలు .. సన్నజాజులు .. సంపెంగలు .. పొగడలు .. పొన్నాగులు .. మందారాలు .. కనకాంబరాలు .. గులాబీలు మరింత ఇష్టమట. హనుమంతుడికి ప్రీతికరమైన ఈ పూలతో ఆ స్వామిని పూజించడం వలన ఆయన ఎంతో సంతోషపడతాడు.
ధర్మాన్ని రక్షించడం కోసం తన పరాక్రమాన్ని ఉపయోగించే ఆయన, తన అనుగ్రహాన్ని భక్తులపై అపరిమితంగా కురిపిస్తుంటాడు. హనుమంతుడికి ఇష్టమైన పూలతో ఆయనని సేవించడం వలన భూత ప్రేత పిశాచ బాధలు ... గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోవడమే కాకుండా, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... విజయాలు చేకూరతాయని చెప్పబడుతోంది.
Read More

శ్రీ శివ మహాపురాణము- నారదునికి బ్రహ్మ ఉపదేశంశ్రీ శివ మహాపురాణము-

నారదునికి బ్రహ్మ ఉపదేశం

"పరమ పురుషుడైన ఆ ఆది దేవుని లీలలను వర్ణింప నా తరమా నాయనా! నేనైనా, నారాయణుడైనా పరమ శివుని గురించి పరిపూర్ణ జ్ఞానులమని భావిస్తే అది అహంకారమే. అవాజ్మానస గోచరుడా మహా దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే - పరమ శివుడొక అద్భుతం అనాలి.

ఆ అద్భుత మూర్తి ఆద్యంతాలు లేని వాడు. అనాది మధ్య లయ రహితుడు. ప్రళయం అనే అపార జల రాశి మయం నుంచి ఆరంభిస్తే, కొంత వివరణ సుసాధ్యం కావచ్చు నేమో గానీ, అదీ మన భ్రాంతి మాత్రమే! అతడు నిత్యుడు. సత్య సత్వుడు. సమస్త సృష్టీ, సూర్య చంద్ర గ్రహ తారకాదులన్నీ తెలియ రాని అగాధం లోకి తరలి పోయిన ఆ తరుణాన...రాత్రీ కాని- పగలూ కాని ఓ విచిత్ర స్థితి ఆవరించిన వేళ... నిబిడాంధ కారమే దిగంత పర్యంతం వ్యాపించిన సమయాన... 'ఇదీ' అని వచింప శక్యం గాని సత్య జ్ఞాన సుందర మైనది ఏదయితే ఉంటుందో అదే 'శివం' అని ప్రకటిత మవుతోంది.

ముందే చెప్పినట్టు, అట్టి 'పరం' ('స్వ' కానిది)నుండి స్వయంభువంగా 'శివం' పరివర్తింప బడుతోంది. అదే సదాశివమని పరిఢ విల్లు తోంది. కనుక సదా శివం ఆవిర్భావానికి దోహద పడే ప్రకృతిని 'అంబ' అని భావించాలి! ఆమెయే సకలేశ్వరి.

ప్రకృతి పురుషుల క్రీడానంద ఫలితం - విష్ణు దేవుని రూప కల్పనకు నాంది. ఆయన ఎట్టి వాడు ? సకలేశ్వరీ సదా శివుల అంశ గనుక అతడు కూడా అమృత మూర్తి. త్రిలోక సుందరాకారుడు. శాంత గంభీరుడు, సత్వ గుణ పరి పూర్ణుడు. శంఖు చక్ర గదా పద్మ ధారి. పీతాంబరుడు. నీల మణి కాంతితో వెలిగే దేహం గల వాడు. జగజ్జెట్టీ, జగత్పూజ్యుడైన వాడూ అయిన పరమ పురుషునికి నమస్కరించి, తన కొక నామధేయాన్ని ప్రసాదించ మనగా- 'నా వలె నీవు కూడా జగత్తునంతట్నీనీకు నిశ్వాస రూపంగా కల్పిస్తున్నాను. ప్రళయాంతం వరకు తపో నిష్ఠా గరిష్ఠుడవు కమ్ము!' అని ఆనతిచ్చి అంబతో సహా అదృశ్యుడై పోయాడు."

విష్ణువు నారాయణుడన బడుట :

ఆ విధంగా ఆనతి పొందిన విష్ణువు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపో దీక్షలో ఉన్నాడు. అయినప్పటికీ శివానుగ్రహం కలగక పోగా, అశరీర వాణి సూచనల మేరకు తిరిగి తపస్సులో మునిగి పోయాడు.

"అలా ఎంత కాలం ?.." నారదుని ప్రశ్న.

"ఇంత కాలం అని చెప్ప బడనంత చాలాకాలం! ఆయన శరీరం నుంచి విపరీత మైన జల ధారలు స్రవిస్తూన్నప్పటికీ, శివ మాయా వశాన విష్ణువు అలా ఆ నీట్లోనే పడి నిద్ర పోసాగాడు. అలా ఎన్నాళ్లు పడి వున్నాడన్నదీ ఎవరికీ తెలియదు. నీటి ధారలే ఆయనములుగా పడివున్న కారణంగా విష్ణువు నారాయణుడయ్యాడు. (నరః అంటే రుద్రుడు. అట్టి రుద్ర మాయా జనిత మగుట చే 'నారము' నీరు అనబడినది.)

తిరిగి విష్ణువు తెప్పరిల్లి లేచి చూచేలోగా సృష్టి క్రమం ప్రారంభమై పోయింది. అయితే అప్పటికి ఇంకా జీవజాలం ఉద్భవించ లేదు. రజస్స్త్తత్వ తమో గుణాలూ, అహంకారం, పంచతన్మాత్రలూ, పంచ భూతాలూ, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం... కలిసి మొత్తం 24 తత్వాలు పుట్టాయి.

నీటిలో ఉండగానే, నారాయణుని నాభి నుండి ఓ పద్మం జనించి, అలా పైకి ఎదగ సాగింది. కనుకనే - విష్ణువుకు పద్మ నాభుడనే నామాంతరం కలిగింది. ఈలోగా విష్ణుని నాభి కమలం లోకి శివ దక్షిణ భాగ జనిత మైన ఒక అంశ బ్రహ్మగా పరివర్తనం చెంది ప్రవేశ పెట్ట బడింది. ఆ శివాంశకు ముఖాలు నాలుగు. చతుర్ముఖుడైన ఆ మహా వేత్త గర్భంలో బంగారం నిక్షిప్తమైనందున, అతడికి హిరణ్య గర్భుడనే మరో పేరు కలిగింది.

అయితే - శివలీలా విలాసం కనుక, కేవలం అలా అంతూ - దరీ లేకుండా పైకెదుగుతున్న తామరపువ్వే తన లోకం తప్ప ఇతర ప్రపంచం ఏమిటో - ఎలా వుంటుందో కూడా చతుర్ముఖునికి అంతు పట్టలేదు."
Read More

ప్రమధగణాలను వెంటనిడుకొని వెళ్తూన్న సతీదేవి తన హృదయంలో ఇలా అనుకోసాగింది.ప్రమధగణాలను వెంటనిడుకొని వెళ్తూన్న సతీదేవి తన హృదయంలో ఇలా అనుకోసాగింది.

"ఇదంతా నా తండ్రి అజ్ఞానమా? పరాకా? ప్రతీకారమా? ఈ అనాదరణను ఏమని భావించాలి? అజ్ఞానమైతే జ్ఞాన బోధ చేస్తాను. అహంకారమైతే అది తగదని హెచ్చరిస్తాను. పరాకు చిత్తగిస్తే పరోక్షంగా మందలిస్తాను.." ఇలా ఎన్నెన్నో ఊహించుకుంటూ యజ్ఞవాటిక సమీపించి, నందిపైనుండి దిగింది సతీదేవి.

తన వెంట వచ్చిన గణసముహాన్ని, తగిన తావులలో ఉండవలసిందిగా నిర్దేశించింది.

పుట్టినింట అడుగిడిన సతీదేవికి, సోదరీమణుల - దేవతల - ఋషుల స్వాగత సత్కారాలు బాగానే లభించాయి. తల్లి అసిక్నీ అక్కున చేర్చుకుంది.

హవనవేదిక చెంతకొచ్చి నిలబడింది సతి. శివుడికి తప్ప తక్కిన వారందరికీ అక్కడ హవిర్భాగాలు ఏర్పరచి ఉండటం గమనించింది. కూతుర్ని చూసికూడా, ముఖం మరోవైపు తిప్పుకున్నాడు దక్షుడు.

సతీదేవి తక్షణమే తండ్రి కెదురుగా నిలిచింది. వారి సంభాషణ ఈ రీతిగా సాగింది.

సతి: జనకా! స్మరణ మాత్రం చేతనే చరాచర జగత్తులన్నీ పావనం చెయ్య గల శంభుని ఏల పిలవలేదు? అత్యున్నతమైన అపవిత్ర కార్యం అదే అని నీకుతెలియదా? అజ్ఞానమో - అహంకారమో?! ఏదయినాగానీ... ఇటువంటి యజ్ఞం నిష్ఫలం. అధమాధమం.

దక్షుడు: చాలు! ఇక ఆపు! నీ భర్త ఇందు ఉండుటకు అర్హుడేకాడు.

సతి: (ఆశ్చర్యంగా) ఏమేమీ?

దక్షుడు: భూత ప్రేత పిశాచాలకు అధిపతులైనవారు. క్షుద్రదేవతలవుతారు. వారికి వేదోక్త యజ్ఞవాటిక పూజలందు అర్హత లేదు.

సతి: కేవలం భూత గణాధినాధుడు మాత్రమేనా? చతుర్దశ భువన భాండాలకూ రక్షా ధ్యక్ష ధురీణుడాయన. అసలు.. నీకు అజ్ఞానం తిరగబెట్టడం వల్ల, నీపేరే దక్షుడుకాదు... అక్షరాలు తిరగబడి 'క్షుద' రమైంది. నీకే అర్హతలేనిది!

దక్షుడు: (వేళాకోళంగా)ఇప్పుడే గదా - నీ భర్త సర్వవ్యాపకుడూ - సర్వాధ్యక్షుడూ అన్నావు. అదే నిజమైతే ఇక్కడ ఉండాలికదా!

సతి: విధి విధానంగా ఆవాహన చేశావా? పిలుపులో లోపం పెట్టుకుని, వ్యాపి ఇందులేడని అడగడం మర్యాదా?

దక్షుడు: ముందే చెప్పాను.. క్షుద్రసహవాసి అని!

సతి: మరి... అంత క్షుద్రమూర్తికి నన్నెట్లు ఇవ్వగలిగావు?

దక్షుడు: రుద్రమూర్తి అని చెప్పాడు బ్రహ్మ! విధివశాన్ని తప్పించ నా తరమా?

సతి: నమ్మి ఇచ్చినచోట, కడదాకా అదేనమ్మిక ఉండాలి! మధ్యలో ఎన్నో వస్తూ - పోతూ ఉంటాయి. ప్రాజ్ఞుల లక్షణమేది? బాంధవ్యం కాటుక బొట్టులాంటిదికాదు - తడిచేస్తే పోవడానికి! అల్లునికి మర్యాద ఈయవద్దా?

దక్షుడు: (హూంకరిస్తూ) మర్యాదట.. మర్యాద! మర్యాదయే తెలీని వారికి ఇంకేం మర్యాద?

సతి: (కోపం తారాస్థాయికి చేరుకొంటూండగా) అంత అమర్యాద కరమైన పనేమిచేశాడు నా పెనిమిటి?

దక్షుడు: తెలీక అడుగుతున్నావా? నా నోటితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నావా? ఆ బూడిదపూతలూ, దిగంబరంగా ఊరేగుట....

సతి: (మధ్యలోనే ఆపి)చాలు చాలు! ఈ చరాచర జగత్తునే నగ్నంగా పుట్టించినవాడికి, దిగంబరం కాక పట్టు పుట్టము లుండునా? ఆయన మహిమ మీకు ఏం తెలుసు?

దక్షుడు: (మరింత వెటకారంగా) ఓహో హో! మహిమలు! అన్నీ దురాంతక దుర్మార్గచేష్టలే! మన్మధుణ్ణి కంటి మంటతో కాల్చి చంపడం మహిమేనా? బ్రహ్మ తల తెగ్గోసి, ఆ పాతకం చాలదనట్టు ఆయన కపాలంలో ఆడుక్కుతినడం ఓ గొప్పా? సిగ్గూ - ఎగ్గూ లేనివాడు.

వెంటనే, శివదూషణ భరించలేక తన అరిచేతులతో తన రెండు చెవులూ మూసుకుంది సతీదేవి.

ఇక - తండ్రితో ఎంత వాదించినా ఫలితం శూన్యం అని ఆమెకు బోధపడింది. బహుళా ఇంత రాద్ధాంతాన్ని తన పతి ముందే ఊహించి ఊంటాడు. అందుకే వెళ్లవద్దన్నాడేమో! అని క్షణకాలం పాటు ఆమె మదిలో మెదిలింది.

అక్కడున్న విష్ణ్యాది దేవతల వైపు తిరిగి ఇలా అంది సతీదేవి; సమస్త దేవతలారా! ఈశ్వర బహిష్కృతుడైన ఈ యాగానికి మీరంతా ఏ మొహం పెట్టుకొనివచ్చారు? అసలు మీకు మనసెలా ఒప్పింది?

దేవతలే కాదు... ఋత్విక్కులు సైతం, సతీదేవి ప్రశ్నకు జవాబు చెప్పలేక దిక్కుల్ని ఆశ్రయించారు.

పిలవని పేరంటానికి వెళ్లకూడదని శివుడెంత చెప్తూన్నా వినకుండా వచ్చినందుకు తనకీ శాస్తి కావలసిందే! హరహరా! ఎంత శివనింద! ఎంత మహాదూషణ? ఇక్కడ జరిగిన ఈ విషయాలు ఏ ముఖంతో ఆయనకు విన్నవించను?.. రకరకాలుగా వ్యథచెందింది.

చివరికి ఓ నిర్ణయానికి వచ్చేసింది సతీదేవి.

"తండ్రీ! యజ్ఞపురుషుడూ - యజ్ఞభోక్త - యజ్ఞరూపుడూ అయిన నా పతిదేవుని - శ్రీ సదాశివుని ఆహ్వానించకపోవడమే ఒక అపచారం!

అది చాలదన్నట్టు.. దూషణ చేశావు. అదీ నా చెవులబడేలా చేశావు. మరో అపచారం ఇది. ఏ కర్మఫలాన్ని ఆపేక్షించి ఇది తలపెట్టావొ, అది నీకు అందదు. సాంబశివుడే నిన్ను శిక్షించబూనితే రక్షించువా రుండరు. నీలాంటి పాపాత్ముడికి కూతిరిగా, దాక్షాయణిగా ఇక మనజాలను.

శివనిందాపరుడివైన నీకూ - నీచేత ఈ యాగం చేయిస్తూ సమర్ధించబూనిన యావన్మందికీ త్వరలోనే కీడు మూడుగాక!" అని అక్కడే యజ్ఞ హోమగుండంలోకి అంతా ఆశ్చర్యపోయి చూస్తుండగా దూకి, ప్రాణాలు విడిచింది సతీదేవి.

ప్రాణత్యాగం చేస్తూ, 'నేను సతీమతల్లినైతే పునర్జన్మయందు కూడా, ఆ పరమశివునే పతిగా పొందెదను గాక!' అంటూ సతీదేవి పలికిన పలుకులే యజ్ఞవాటిక అంతటా మారుమ్రోగాయి.

హోమగుండంలోనికి, నిరావాహనతో హఠాత్తుగా ఓ నిండు ప్రాణాం దుమికేసరికి - ఋత్విక్కుల నోళ్ళు కట్టుబడిపోయాయి. మంత్రాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.

ఈ అకస్మిక పరిణామానికి, ఆమె వెంటవెళ్లిన దాదాపు రెండు వేలమంది శివగణానుయాయులు, తమ శిరస్సులను తామే ఖండించు కొని శివార్పణ చేసుకున్నారు. ఎటుచూసినా రక్త కుంకుమలు జల్లినట్లు భీతావహంగా మారింది యజ్ఞవాటిక. ఈ ఘోరాకృత్యానికి దేవతలూ - ఋషులూ హాహాకారాలు చేశారు. సతీదేవి తమ కళ్లముందే నిలువునా బూడిదైపోవడం చూసి తట్టుకోలేని సున్నిత మనస్కులైన కొందరు మార్చిల్లారు. మరికొందరు శ్రీ మహావిష్ణువును చూసి, "జగద్రక్షకా! ఈ ఘోరాకృత్యములింక కొనసాగనివ్వక కట్టడి చేయకూడదా?" అని ప్రార్ధించారు.

దేవ ఋషియైన నారద మునీంద్రు లీఘోరాలు చూసి తట్టుకోలేక, తక్షణం గగన మార్గాన పయనమై అగ్నిదగ్దమైన సతీదేవి సమాచారాన్ని మహా శివదేవునికి అందజేశాడు.

నారదుని ద్వారా సతి ఆత్మాహుతి వార్త విన్న తక్షణం, ఆ త్రిలోచనుడి ముడునేత్రాలూ వీక్షణ రూక్షణాలయ్యాయి.

పట పట పండ్లుకొరికిన కపర్ది, తన జటాజూటాన్ని పెరికాడు. ఒక జడపాయతీసి పిడుగుపాటు తలపించేలా బండపై కొట్టాడు. అది రెండు చీలికలై అందునుండి గణేశ్వరుడు - కాళీశక్తీ ఉద్భవించారు. దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచాడు. అందునుండి 13రకాల సన్నిపాత జ్వరాలు, నూరురకాల జ్వరభూతాలు, కోటానుకోట్ల భూతగణాలూ పుట్టాయి. మొదట పుట్టిన గణేశ్వరుడు మహాకాయుడు, సహస్రబాహుడు, ప్రళయాగ్ని సమప్రకాశుడు, జన భీకరుడూ కావడంతో శివుడాతనికి వీరభద్రుడని పేరిడినాడు. వీరభద్రుడు శివునికి ప్రదక్షిణ నమస్కారా లాచరించి "దేవరా! ఏమి సెలవు? అనతీయవే!" అని కోరగా " నీవు వెంటనే ఈ పరివారాన్ని అంతట్నీ వెంటబెట్టుకువెళ్ళి, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి వచ్చి, ఆ వైనం నాకు వివరించు!" అని ఆజ్ఞ ఇచ్చాడు.

ఆశరీర వాణి హెచ్చరిక:

అక్కడ - దేవ, ఋషి, బ్రహ్మాదులు విష్ణువుతో మొరపెట్టుకుంటూ ఉండగా ఆకాశవాణి అక్కడున్నవా రందరినీ హెచ్చరించింది. "దక్షా! ఈ యజ్ఞవాటిక అతిస్వల్ప సమయంలోనే మహా దహనవేదీక కనున్నది. విష్ణూ! నీవు వెన్వెంటనే ఈ యాగశాల వీడి వెళ్లగలవు! లేకుంటే నీకు కీడు మూడగలదు" అని వినిపించిన అశరీరవాణి పలుకులకు మరోసారి అదిరిపడ్డారు అందరూ.
Read More

పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడుపూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు .శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో ,భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు . అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు .ఆ రాజ్యంలోఅందరు ధనికులే అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది.ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి .

ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలోరాజ్యంలోతిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు . దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి'' నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు .కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు . దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు .ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు .


అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది .అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టేలకని అడవిలోకివెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు .అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినపుడు .ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి ని ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది అప్పుడు నువామేని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెనికుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది .

ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది .వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారంరోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతా శీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయిచినందుకు చాలా బాధపడుతూ వుంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రాసాదిస్తుంది . ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు .
Read More

పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు ” సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం ”

పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు ” సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం ” . కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేయడం వలన అబ్బాయిలకి త్వరలో వివాహము అవుతుంది అని ఒక విశ్వాసం .
ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి
🔵 సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ 🔵
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం |
Read More

శ్రీ శివ మహా పురాణము ప్రారంభం - సృష్టి ఖండముశ్రీ శివ మహా పురాణము ప్రారంభం - సృష్టి ఖండము
🍀 శ్రీ లలితాంబికగా, ఆదిదేవి తపస్సు చేసిన ప్రదేశం నైమి శారణ్యం. కృతయుగం నాటి క్షేత్రస్థలి ఇది. ఒకానొకప్పుడు ఋషు లందరూ కలిసి తమకొక దివ్యమైన తపోస్థలిని ప్రసాదించమని బ్రహ్మను కోరారు. బ్రహ్మ చూపించబోయే ఆ దివ్యస్థలం సర్వోపద్రవాలకు అతీతం గానూ, దుర్జన దుర్జయముగానూ ఉండాలని అభ్యర్థించారు. శ్రీమన్నారాయణుని స్తుతించిన విధాత, ఒక చక్రాయుధాన్ని సృష్టించి దాని భ్రమణం ఎక్కడ నిలిచిపోతే అక్కడ తపస్సుకు అనుకూలమైన స్థలం ఉంటుందని, దానిని అనుసరిస్తూ వెళ్లవలసిందని ఆనతినిచ్చాడు. అది లోకాలన్నీ తిరిగి భూలోకంలోని ఒక ప్రదేశంలో ఒక రాక్షసుని నిమేష మాత్రంలో వధించి, ఆ చక్రనేమి అక్కడ నిలిచిపోయింది. నేమి నిలిచిన ఆ ప్రదేశమే నైమిశారణ్య ప్రాంతం.ఆ స్థలంలోనే ఆదిదేవి తపస్సు చేసినదని గ్రహించిన ఋషిగణం యావత్తూ విధాతకు స్తోత్రావళు లర్పించి మహదానందంగా నైమిశారణ్యప్రవేశం చేశారు.

సుమారు ఎనభై ఎనిమిది వేలమంది ఋషులు అక్కడ తపో వాటికలు నిర్మించుకుని లోక హితార్థం యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుండగా ఒకనాడు ...

మహాపౌరాణికులయిన సూతమహర్షి అక్కడకు వేంచేశారు. రోమహర్షణ మహర్షి పుత్రుడూ, శ్రీ శుకయోగీంద్రుల సహపాఠీ, వేదవ్యాస మునీంద్రుల ప్రియశిష్యుడూ ఐన సూతముని రాక, నైమి శారణ్యమునందు వసించుచున్న శౌనకాది ఋషులందరికీ ఆనందం కలిగించింది.

మునిగణమంతా, సూతమహర్షి కెదురేగి స్వాగతించి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి, సత్కరించి అనంతరం - ఆయనను పరివేష్ఠించి కూర్చున్న మీదట శౌనకుడీ విధంగా ప్రస్తావించాడు.

"మహాత్మా! మా యందుగల అపార కరుణా కటాక్షముచేత ఈ నైమిశారణ్యస్థలిని పావనం చేశావు. మాకు మీ దర్శన భాగ్యం లభించే ప్రతీసారీ పౌరాణిక గాధావళి విన వేడుక కలగడం - తాము అభిభాషించి అనుగ్రహించడం అనూచారంగా వస్తున్నది. ఎన్ని గాధలనైనా ధర్మ సూక్ష్మ సహితంగా వివరించగల 'అగాధమౌ జలనిధి ' వంటి తాము మాపై దయ ప్రసరించి, దివ్యపురాణమేదైనా సెలవీయ వలసిందిగా మా కోరిక" అని ఋషులందరి తరుపునా అభ్యర్థించాడు.

'కలి ప్రభావ పీడితులై నానాక్లేశాలు అనుభవిస్తున్న నరులను సైతం ఉద్ధరించగల ఏకైక పురాణం ఏది?' అని అర్థనిమీలిత నేత్రుడై, మనసులోనే త్రినేత్రుని అవలోకించిన సూతపౌరాణికునకు సాక్షాత్తు శ్రీ మహాశివుని పురాణమే ఆ క్షణాన వృదయ ఫలకంపై స్పురించింది.

చిరునవ్వుతోనూ, సదయాదృక్కులతోనూ తనచుట్టూ చేరివున్న మునిజన బృందాన్ని సమ్మోహనకరంగా చూశాడు సూత మహర్షి.

"ఇంతవరకు మీరు విన్న పౌరాణిక గాథలన్నిటికంటే శ్రేష్ఠమైనదీ, జ్ఞానయోగ మోక్ష కారకమైనదీ, జన్మజన్మాంతర పుణ్యఫల విశేషంచేత మాత్రమే శ్రవణార్హమైనదీ అయినట్టి శ్రీ శివమహాపురాణా గాధ సవిస్తరంగా మీకు చెప్ప ఉత్సాహంగా ఉంది! అంతా శివేచ్చ!" అంటు మొట్టమొదట తమ గురువైన వ్యాసభగవానుని ధ్యానించి, ఆయన కృతమైన రుద్ర స్తుతితో, ఈ మహాపురాణం ప్రారంభించాడు సూత పౌరాణికుడు.

వ్యాసోక్త రుద్ర స్తుతి -

నమో దేవాయ మహతే - దేవదేవాయ - శూలినే!
త్ర్యంబకాయ త్రినేత్రాయ - యోగినాంపతయే నమః!!

నమోస్తు దేవదేవాయ - మహాదేవాయ వేధసే!
శంభవే స్థాణవే నిత్యం - శివాయ పరమాత్మనే!!

నమస్సోమాయ రుద్రాయ - మహాగ్రాసాయ హేతవే!
ప్రపద్యేహం విరూపాక్షం - శరణ్యం బ్రహ్మచారిణమ్!!

మహాదేవం మహాయోగ - మీశానం త్వంబికాపతిం!
యోగినం యోగదాతారం - యోగ మాయా సమావృతం!!

యోగినాం గురు మాచార్యం - యోగగమ్యం సనాతనం!
సంసారతారణం రుద్రం - బ్రహ్మణాం బ్రాహ్మణోధిపం!!

శాశ్వతం సర్వగ్o శాంతం - బ్రహ్మాణం బ్రాహ్మణప్రియం!
కపర్దినం కళామూర్తి - మమూర్తి మమరేశ్వరమ్!!

ఏక మూర్తిం మహామూర్తిం - వేదవేద్యం సతాం గతిమ్!
నీలకంఠం విశ్వమూర్తిం - వ్యాపినం విశ్వరేతసం!!

కాలాగ్నిం కాలదహనం - కామినం కామ నాశనం!
నమామి గిరీశం దేవం - చంద్రావయవభూషణం!!

త్రిలోచనం లేలిహాస - మాదిత్యం పరమేష్ఠినం!
ఉగ్రం పశుపతిం భీమం - భాస్కరం తమసః పరమ్!!

సూత మహర్షి ఈ విధంగా స్తోత్రం చేసిన అనంతరం, ఇలా చెప్పసాగాడు. " మునివరేణ్యులారా! నేను పఠించిన ఈ స్తోత్రములోనే శివుని అష్టవిధ రూపములు అంతర్గతమై ఉన్నాయి. వాటి విశిష్టత మీకు వివరిస్తాను. శ్రద్ధాళువులై వినండి! అన్నాడు.
Read More

ఈ రోజు శరత్ పౌర్ణమి ఈ ప్రదోషకాలం లో శివపురాణం చదివితే అనంతమైన ఫలం !

ఈ రోజు శరత్ పౌర్ణమి ఈ ప్రదోషకాలం లో శివపురాణం చదివితే అనంతమైన ఫలం !
🍀 శ్రీ శివ మహాపురాణము - ప్రదోషకాలం 🙏
🍀 సృష్టి క్రమము - 🔵 హిందూ ధర్మచక్రం. ☀ ధార్మిక ప్రచారం. హైదరాబాదు. 🔵
🍀 మహా ప్రళయ కాలంలో జగత్తులన్నీ నశిస్తాయి. అంతా జల మయం. ఒకే సముద్రంలా తోచే అట్టి అపార జలరాశి ఆవరించి ఉండగా - సహస్ర శీర్ష, సహస్ర కర పాద రూప సహితుడై విరాట్పురుషుడు సత్వ గుణ ప్రేరితుడై సమాధి స్థితి యందు విశ్రాంతి తీసు కుంటాడు. ఆ తరుణ మందు - భూనభోంతరాళములందు ఎటు చూసినా చిమ్మ చీకటి వ్యాపించి ఉంటుంది.
సృష్టి, స్థితి, లయాలకు మూల భూతుడైన ఆది దేవుడొక్కడే వటపత్ర శాయిగా దేదీప్య మానంగా ప్రకాశిస్తూ, తెలివి రాగా నిద్ర లేచి ఈ ప్రపంచపు దురవస్థను చూచి విచారిస్తాడు. రజోగుణ ప్రభావం చేత జ్ఞానాన్ని ఉద్దీపింప జేస్తాడు. అదే పునః సృష్టికి సంకల్పం వంటిది. బ్రహ్మగా, నారాయణుడిగా, రుద్రుడిగా అనేక నామాలతో సంకీర్తింప బడే ఆది విరాట్‌ స్వరూపుడే,జ్ఞానం ద్వారా అహంకారాన్ని, దాన్నుండి మనస్సును, దాని వలన పంచ భూతములైన పృథి వ్యాపస్తేజో వాయు రాకాశాల్ని పుట్టిస్తాడు.
వీటిలో ఆకాశం వల్ల శబ్దం, వాయువు వల్ల స్పర్శ, అగ్ని వల్ల రూపం, జలము వల్ల రసం, భూమి వల్ల గంధం జన్మిస్తాయి. ఆ తదుపరి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచ ప్రాణాలు; సత్వ, రజ స్తమం గుణాలనే త్రిగుణాలు ఉద్భవిస్తాయి. ఇందు నుండి సత్వ గుణ ప్రతినిధిగా విష్ణువు, రజో గుణ ప్రతినిధిగా బ్రహ్మ, తమో గుణ ప్రతినిధిగా ఈశ్వరుడు వెలుగొందుతారు.
వీరిలో మహేశ్వరుడు సనాతనుడు, నిరంజనుడు, అరూపుడు, ఆది మధ్యాంత రహితుడు. సృష్ట్యంతాన - తమో గుణ ప్రాబల్యం వల్ల సంహార కార్యానికి ఇతడే కర్త అవుతాడు. అనగా - మరలా ప్రళయ కాల జల రాశికి ఆధార భూతుడౌతాడు. కనుక పరమ శివుడను పేర ఇతడు చిరస్థాయిగా నుండువాడని అర్థం!
"సూక్ష్మంగా తరచి చూడగా పరమ శివుడే పైన చెప్పిన సమస్తం సృష్టించు వాడు. అనగా స్వయంభువు కూడా అతడే అవుతున్నాడు.
తన మహేశ్వరాంశ తో సహా బ్రహ్మ, విష్ణ్యంశ లను కూడా లయ స్థితి కి తెచ్చే ఈ పరమ శివుడు 'ఆది విరాట్పురుషు' డనుటకు సందేహమేమున్నది ? బ్రహ్మ కల్పాంతకాలంలో యోగనిద్ర చెందేది ఇతడే! తిరిగి ఈ సృష్టి లీలా వినోదానికి కారణ భూతుడూ ఇతడే! మహర్లోకంలో ఉన్న దివిజ మహర్షులంతా ఈ లీల లను స్వయంగా పరికింప శక్తి కలిగిన వారు. వారు తప్ప ఇతరులెవ్వరునూ లేరు.
బ్రహ్మగా సృష్టి ఆరంభించి, రాత్రి అయ్యే వరకు ఆ సృష్టి లోనే బ్రహ్మ గడిపే కాలం - 'ఒక కల్ప కాలము'. అటు వంటిదే రాత్రి విశ్రాంతితో గడిపే కాలం - మరొక కల్పకాలం. కనుక ఇటువంటి రెండు కల్పములు (ఒక పగలు - ఒక రాత్రి) బ్రహ్మకు ఒక రోజు.
ఇటువంటి ఒక రోజు జరగాలంటే, 14 మన్వంతరాలు గడవాలి. (మన్వంతరాలు 14. అవి: స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవస్వత, సూర్యసావర్ణి, అగ్నిసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, దక్షసావర్ణి, రౌచ్య, భౌచ్య అనేవి.
వీటిలో ఒక్క మన్వంతరం గడవాలీ అంటే - మానవుల లెక్కల ప్రకారం ఏడు యుగాలు గడవాలి. (అవి: కృత, త్రేతా, ద్వాపర, కలి అనే 4 యుగాలు. ఈ నాల్గు యుగాలూ మరలా అవే ఆవృతమవుతూ ఉంటాయి.) ఒక్కొక్క యుగం లోనూ కొన్ని తరాలకు తరాల జీవులు జనించడం - నశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారం మానవుల జీవిత కాలం అతి స్వల్పం! కనుక ఈ స్వల్ప కాలాన్నే సక్రమ మైన రీతిలో మలచు కొని, దుస్తరంబైన ఈ మాయామయ సంసారమనే సాగరం నుండి విముక్తి పొందాలి. ఈ ప్రపంచం లోనే మళ్లీ జన్మిస్తూ - మరణిస్తూ ఉండక, ధర్మ ప్రవర్తనతో, జ్ఞాన సముపార్జనతో ఉత్తమ జీవితం గడపడమే విముక్తి సాధన. ధర్మం నాలుగు పాదాలతో నడయాడుతూ ఉంటుంది అవే సత్యము, అహింస, శాంతమూ, దయ. కృత యుగాంతానికి సత్యం నశించినది. త్రేతాయుగం అంత్యకాలం నాటికి అహింస అణిగింది. ద్వాపర యుగం ముగిసే సరికి శాంతం అంతరించింది. ప్రస్తుత కలి యుగమున దయ అంతరించే సూచనలున్నవి. ఆయా యుగాలు ధర్మాలు కోల్పోయాక వచ్చేది ప్రళయం. ఇక పునః పునః సృష్టి!.. ఇదీ సృష్టి క్రమం. ఇదొక చక్రం వలె నిరంతరం ఆవృతమయ్యే విధానం. అందుకే ఆది మధ్య అంతం లేని నిరంతర భ్రమణం. - 'కాలం' యొక్క స్వభావం.
ఈ కాలము అనేది మూడు విధాలు. అవి:- మానుష మానము, దేవ మానము, బ్రహ్మ మానము.
పైన చెప్పిన కల్పముల వంటివి బ్రహ్మ మానం. (ప్రస్తుతము మానుష మానం ప్రకారం - 28వ మహాయుగం లోని 5102వ కలి యుగం నడుస్తున్నది. ప్రస్తుతము నడుస్తున్నది వైవస్వత మన్వంతరం.
ఈ కాల ప్రశస్తి గురించిన ప్రస్తావన తో ప్రథమమున చెప్పినట్లు - ఒకానొక కల్ప కాల ప్రారంభ సమయమున, బ్రహ్మదేవుడు తన వంటి మహా తేజస్వి యైన కుమారుని ప్రభవింప జేయ సంకల్పించాడు.
అంతే!...
సంకల్పించినదే తడవుగా, తేజో పుంజ మనదగిన ఓ గొప్ప కాంతితో నీల లోహిత వర్ణుడైన ఒక కుమారుడు బ్రహ్మ తొడపై ప్రత్యక్షమై, తనకో పేరు కావాలని ఏడవ సాగాడు. రుద్రుడని నామ కరణం చేశాడు బ్రహ్మ. తనకొక్క పేరు చాలదన్నాడు ఆ బాలుడు. ఈసారి భవుడని పేరు పెట్టాడు. ఇంకా ఆ బాలకుడు ఊరకొనక పోవడం వల్ల శివుడు, పశుపతి, ఈశ్వరుడు, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనే మొత్తం ఎనిమిది పేర్లు పెట్టి సంతుష్టుని చేశాడు బ్రహ్మ.
"నన్ను అష్టమూర్తిని చేశావు బాగానే ఉంది. మరి వేటికి స్థాన శరీర విశేషాలు, ఉనికి పట్లు, పత్నీ పుత్రులు... ఇన్ని హంగులు ఏ విధంగా కూర్చావో చెప్పు!" అని అడిగాడు - పరమ శివాంశ గల ఆ బాలుడు.
ఇంకా ఉంది..
Read More

శివుని అష్ట మూర్తులు - శ్రీ శివ మహాపురాణము

శివుని అష్ట మూర్తులు - శ్రీ శివ మహాపురాణము 
🔴 బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెప్తున్నాను! విను" అంటూ ఇలా వివరించాడు.
1. రుద్రుడు: "యాభి రాదిత్య స్తపతి రశ్మిభి | 
స్తాభిః పర్జన్యో వర్షతి ||"
అనే వేద ప్రామాణికాన్ననుసరించి నీవు సూర్య స్థానంలో ఉందువు. సూర్యుడే సర్వ చరాచర జగత్తుకు ఆత్మ స్వరూపుడు. (ఆదిత్య హృదయం) జగత్కారణ కర్త. సస్యానుకాల వర్ష కారకుడు. 'సూర్య ఆత్మా జగత సస్థుషశ్చ' అనే స్మృతి వాక్యానుసారం ఈ జీవజాలాన్నంతటినీ ప్రభావితం చేయ గలడు. కనుక - రూపం రౌద్రం. భార్య సువర్చల. కొడుకు శని.
2. భవుడు: 'యోప్సునావం ప్రతిష్టితాం వవేద - ప్రత్యేవతిష్ఠతి' అని శ్రుతి లోకాలన్నీ నీళ్లలో ఓడల్లా తేలు తున్నవని గ్రహించే వాడే భవుడు. కనుక - శరీరం నారము. (అపో నారా ఇతి ప్రోక్తాః!) నీటి యందు నీ ఉనికి పట్టు గలదు. ఈ మూర్తిలో నీకు భార్యా పుత్రులు ఉష - ఉశనులు
3. శివుడు: 
శర్వుడు అనే నామాంతరంతో గూడ పిలువ బడతావు. శరీరంలో ఎముకలు ఎట్లా నిలబెట్ట బడి ఆధారభూతమై నిలుస్తాయో, ఆ విధంగా ఈ భూమి కూడా నివసించడానికి వీలు కల్పించేలా నిలబెట్టబడి ఉంది. కనుక ఈ మూర్తి యందు నీ ఉనికి పట్టు భూమి. శరీరము - శార్వము. భార్య - వికేశి. కొడుకు - అంగారకుడు.
4. పశుపతి : "అహం వైశ్వానరో భూత్వా | 
ప్రాణి్నాం దేహ మాశ్రితః ||"
అని గీతా ప్రవచనం.
అన్ని జీవుల శరీరం లోనూ జఠరాగ్ని అనేది జీర్ణ క్రియ కు దోహద కారి. కనుక ఈ మూర్తి లో నీ స్థానం అగ్ని. శరీరం - వైశ్వానరం. భార్య - స్వాహా దేవి. కొడుకు - స్కందుడు.
5. ఈశ్వరుడు : ప్రాణుల శరీరం లోని ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన,సమాన అనే నామాంతరంతో వాయువుల రూపంలో ఉండి మానవుల్ని జీవింప చేస్తావు. కనుక ఈ మూర్తి యందు నీ స్థా నం- వాయువు. 'ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వరస్సర్వ భూతానాం' అని శ్రుతి. కనుక శరీరం - ఈశానం. భార్య - శివ. కొడుకు - మనోజవుడు.
6. భీముడు : ఈ మూర్తిలో నీ స్థానం ఆకాశం. దేహం లోని రంధ్రాలలో (బయలు ప్రదేశం) వ్యాపించి ఉంటావు. నీ శరీరం భీమము. దశ దిశలు భార్యలు, స్వర్గుడు కొడుకు.
7. ఉగ్రుడు : యజమానుడైన గృహస్థు రూపంలో నీవు ఈ మూర్తి యందు వశించెదవు. యజ్ఞదీక్ష యందుండు యజమానుడు - నీకు ఉనికి పట్టు. దేవతలను సర్వాంతర్యామిని యజ్ఞంతో సంతుష్టి చేయు వాడవు. నీ శరీరం ఈ మూర్తిలో ఉగ్రము. భార్య దీక్ష. కొడుకు సంతానుడు.
8. మహా దేవుడు : "సోమ ఓషధీనా మధిపతిః" అని శ్రుతి వాక్యము.కనుక నీ స్థానము చంద్రుడు. ఈ మూర్తిలో ఓషధులన్నిటికీ అధిపతివై, వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవ ప్రమాణ వృద్ధికి దాతవు కూడా అయ్యెదవు. కనుక నీ శరీరము - చాంద్రమసం. భార్య - రోహిణి. కొడుకు - బుధుడు
- ఈ ప్రకారము శివుని అష్టమూర్తి నిరూపణము జరిగినది. ఇదంతయూ సృష్టి వైచిత్ర్యమే! శివుని అష్ట మూర్తులను, ఆయా మూర్తి తత్వాలను గ్రహించిన వాడు ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవు తారు.
అంతే కాదు! ...
"శివనామాష్టకం (శివుని ఎనిమిది పేర్లు) కూడా ఎంతో పుణ్య ఫల దాయకం! ఆ పేర్లు ఇవి: శివాయ నమః, రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, (ఈ ఐదు పంచ సాధకులకు ప్రియమైనవి). సంసార భిషజే నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మాయ నమః (ఈ మూడు మోక్ష సాధకులకు శుద్ధ నివృత్తి కారకాలు.) ఉభయ తారక మైన ఈ నామాష్టకం విశిష్టత ఇంతింతని చెప్ప బడనిది. కనుకనే నేను ఈ శివ పురాణం మీకు వినిపింప ప్రారంభిస్తూ - రుద్ర స్తుతి పఠించడం జరిగింది." అని చెప్పాడు సూతుడు.
Read More

కామదహన ఘట్టము:-శ్రీ శివ మహాపురాణము. .కామదహన ఘట్టము:-శ్రీ శివ మహాపురాణము. .

"ఒకప్పుడు తారకాసురుడనే రాక్షసుని వల్ల నానాక్ష్లేశములు అనుభవించుచున్న దేవతలంతా బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన వారినందరినీ తోడ్కుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళగా - ఈశ్వరుని తపస్సు భగ్నం చేస్తేగాని, దీనికి మార్గం లేదన్నాడు. వివరించమన్నారు దేవతలు. తారకాసురుని సంహరించాలంటే, అది శివాంశతో కూడినట్టి ఆయన పుత్రుని వల్లనే సాధ్యం! ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షతో ఉగ్రతప మాచరిస్తున్న శూలి మొక్కోపి. ఆయన సమాధి స్థితి నండి బైటికి వస్తేనేగాని, శరీర స్పృహ కలుగదు. అది కలిగితే తప్ప - ఆయన కామపరవశుడు కాలేడు. అది జరిగితే గానీ - శివునికి వివాహప్రయత్నం గానీ, తద్వారా కుమారజననం గాని సాధ్యం కావు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా జరగవలసిన ఈ కార్యక్రమాలన్నిటికీ ఒకే ఒక ఉపాయమున్నది. మొట్టమొదట శివ తపోదీక్షకు భంగం కలగాలి. దానికి సమర్థుడు నా పుత్రుడైన మన్మథుడు మాత్రమే! సమస్త జీవరాసులకు కామావేశము కలిగించగల కందర్పుని దర్శించి, మీ కార్యాన్ని సానుకూల పరుచుకోండని వివరించాడు విష్ణువు.

దేవతలంతా పంచబాణుని బ్రతిమాలి, పరమశివుని దీక్షకు భంగం కలిగించమని వేడుకున్నారు. నిటలాక్షుడు అగ్నినే మూడోకన్నుగా ధరించినవాడు కనుక, పుష్పబాణాలు ప్రయోగించేటప్పుడు చాటుగా ఉండి - శరసంధానం చేయవలసిందని సలహాలూ, జగ్రత్తలూ చెప్పి పంపారు.

పంచశరుడు మలయమారుతుని, జయంత; వసంతుల్ని వెంట బెట్టుకుని, శివుని తపస్సు చాలించేలా చేయడానికి సన్నద్ధుడయ్యాడు.

కేవలం ఒక మహాత్కార్యసిద్ధి కోసం, రూపొందించిన ఈ ప్రయత్నంలో - అవసరార్థం అక్కడ ఆకాలంలో అడుగుపెట్టింది వసంతం. అదంతా మన్మథుని మిత్రుడైన వసంతుడు చలవే! పిల్లగాలులు రువ్వేపని మలయమారుతుడు చేపట్టాడు. వసంతానికి ప్రతిస్పందించే జీవులు, ప్రాణులను అక్కడకు చేర్చేపని జయంతుడు తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు.

మన్మథుడు చాటుగా ఉండి, పుష్పబాణాలను ప్రయోగించాడు. అవి తగిలి శివునికి తపోభంగం జరిగింది. నలుదిక్కులా కలయజూసే సరికి, ఓ చెట్టుప్రక్కగా నక్కి నిలుచున్న పుష్పశరుడు కనిపించాడు. ఫాలనేత్రం పరమవేగాన తెరుచుకున్నది. శివుని కంటి మంటలకు ఆహుతయ్యాడు కాముడు.

కీడు శంకించిన కాముని సతి, రతీదేవి గోడు గోడున ఏడుస్తూ శివుని శరణువేడింది. పెక్కురీతుల ప్రార్థించింది. శివుడామెను కరుణించి "ఇక పై నీ పతి నీకు మాత్రమే సశరీరుడిగా దర్శనమిస్తాడు. మిగిలిన దేవ దానవ యక్ష రాక్షస మానవ మునివరేణ్య గణాలకు ఎవరికైనా సరే అతడు అనంగుడు".. (శరీర రహితుడు) అని కొంతవరకు ఉపమించే రీతిలో రతీదేవికి అభయప్రదానం గావించాడు. ఇతరులకు ఎవరికీ కనబడనప్పటికీ, అతని విధినిర్వహణయైన మరుబాధాక్రమం మాత్రం నిర్వర్తిస్తూనే ఉంటాడు - మన్మథుడు.

ఆ విధంగా మరుని శరీరం భస్మమైనప్పటికీ - 'ఆత్మజుభావం' నశించనందున, ప్రపంచంలో సమస్త జీవరాశీ అతని వల్ల కామ మోహ పరవశమవుతూనే ఉన్నాయి.

ఏ స్థలంలోనైతే - మన్మథుడు శివుని ఫాలనేత్రం బారినపడి బుడిదగా మారాడో, ఆ స్థలంలో మాత్రం మన్మథుడి మహత్తులూ, మాయలూ ఏవీ పనిచేయకుండు గాక!" అని శివుడు ఆనతిచ్చి, ఉన్నందున అక్కడే తపస్సు చేస్తూన్న నారదుల వారి విషయంలో మన్మథ ప్రతాపం ఎంత బలీయంగా ఉన్నప్పటికీ ఫలితమివ్వడం లేదు. మునీంద్రునికి తపోభంగం కలగడం లేదు. శివుడా రీతిన ఇచ్చిన ఆనతిని అంతా విస్మరించారు. అదీ శివమాయాధీనమే!

ఇటు రతిపతి గానీ , అటు శచీపతి గానీ ఈ శివమాయ కతీతులు కారు కదా! అదంతా నారద మునిశ్రేష్ఠుని అసాధారణ తపోనిష్ఠగా భావించి ఆయనకు నమస్కరించి, తన మిత్రబృంద సమేతంగా వెను దిరిగి పోయాడా మదనుడు.

"పురాణపురుషా! మా కొక్క ధర్మసందేహము! ఈ మన్మథునికి మరేం పనిలేదా? ఎంతసేపూ పూలబాణాలు పట్టుకు తిరుగుతూ, అవి ఎవరికి సంధిద్దామా అనే పనిగట్టుకు సంచరిస్తుండడమే పనా?" సనందనుడనే ఒక మునివరేణ్యుడు అడిగాడు.

దానికి సూతుడిలా చెప్పసాగాడు: -

"చక్కని ప్రశ్న! నిజమే మరి! అతడికి నియుక్తమైన పని అదే కనుక - దానినే ఆచరిస్తున్నాడు అతడు."

మహర్షులకు ఆసక్తి అధికమైంది. మన్మథుని ఆవిర్భావం గురించీ, అతడికా పదవి ఇచ్చిన వైనం గురించీ పలురకాలుగా ప్రశ్నించారు. అందరి సందేహాలూ విన్నపిమ్మట సూతమహర్షి "మన్మథుని కథ " వివరించడానికి ఉద్యుక్తుడయ్యాడు.
Read More

శ్రీ శివ మహాపురాణము- మన్మథుని గాథ -శ్రీ శివ మహాపురాణము
మన్మథుని గాథ -
"ఒకానొక సమయమందు విష్ణ్వంశ తో ఒక కుమారుని పుట్టించాలని సంకల్పించిన బ్రహ్మకు హృదయ స్థానం నుంచి నవ యవ్వన విలాసిని యైన ఓ కన్య ఆవిర్భవించింది. ఆమె పేరే సంధ్య.

ఆ సమయంలో బ్రహ్మ మానస పుత్రులైన దక్ష - మరీచ్యాదులు అక్కడే ఉన్నారు. ఆ కన్యను చూసి అంతా ఆశ్చర్య పోతుండగా, అంత లోనే ఆమెకు కవల సోదరుడా అన్నట్టు బ్రహ్మ హృదయ కమలం నుంచి ఒక నవ యువకుడూ ఊడి పడ్డాడు అక్కడ.

స్త్రీల కన్నా సమ్మోహన కారుడై, అత్యంత దర్ప విలసితుడై ఉన్న ఆ యువకుడు చెరకువిల్లు నూ, పంచ సంఖ్య కలిగిన బాణాలనూ ధరించి ఉన్నాడు. జన్మిస్తూనే బ్రహ్మకు నమస్కరించి తనకొక పేరూ పదవీ కావాలన్నాడు. ఏదో ఒక వ్యాపకం కల్పించ మంటూన్న ఆ యువకుడిని చూస్తుంటే ఎవరికీ నోరు మెదపాలని కూడా అనిపించక నిర్నిమేషులై అలా చూడ సాగారు. తెలియని ఏదో చిత్రమైన వికారానికిలోను కా సాగారు అందరూ.

ముందుగా ఆ మోహం లోంచి కాస్త తెప్పరిల్లాడు బ్రహ్మ. దర్శించినంత మాత్రాన మోహం పుట్టిస్తున్నావు. ఇక నీకు వేరే వ్యాపకం అనవసరం! ఆ పనే చేస్తుండు. నీకున్న పూలబాణాలతో సర్వప్రాణుల్నీ సమ్మోహన పరుస్తుండు. స్త్రీ, పురుషులు నీ బారినపడి, కామంలో చిత్త చాంచల్యం కలగజెయ్యి. నీ రహస్య సంచారానికి తిరుగు లేదు. భావజుడవు నీవు. తలచినంత మాత్రాన వచ్చి వ్రాలగలవు. నీధాటికి త్రిమూర్తులైనా చలించాల్సిందే! పుడుతూనే మనోచాంచల్య కారకుడవు కనుక మన్మథుడు అనే పేరు నీకు సరిపోతుంది. కామోద్దీపకుడవు కనుక, నిన్ను కామదేవుడనీ అనగలం. గొప్పదర్పం కలిగిన వాడవు కనుక కందర్పుడనీ వ్యవహరిస్తాం. మదనుడు, మారుడు, సుమశరుడు, పుష్ప చాపుడు, పంచశరుడు, స్మరుడు, మనసిజుడు, పుష్పధన్వుడు, ఆత్మభువు... ఇవన్నీ నీ పేర్లే. అని అక్కడ సభలోనున్నవారంతా వివిధరీతుల మదన కుమారుడ్ని శ్లాఘించారు.

తనకంటూ ఒక వ్యాపకం కల్పించగానే, అది అక్కడికక్కడే నిర్వర్తించబోయాడా అత్యుత్సాహి. చకచకా పూలబాణాలను అక్కడున్న వారిమీద ఎడాపెడా ప్రయోగించేశాడు. అన్నిటికంటే పెద్ద చిక్కొచ్చి పడింది బ్రహ్మదేవుడికి. సరిగ్గా అంతకు కొద్దిసేపటి క్రిందటే, మన్మథునితో పాటే జన్మించిన నవయువతి, కుసుమకోమలి, బ్రహ్మ మానసపుత్రి మీదనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఆ అవస్థ బ్రహ్మకు కూడా తప్పలేదు.

ఘోరమైన తప్పిదం జరగకుండా ధర్మదేవత సకాలంలో స్పందించి అడ్డుపడబట్టి సరిపోయింది. తక్షణమే అక్కడ మృత్యుంజయుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మనూ, ఆయన మానస పుత్రులనూ మందలించాడు. వావివరసలు మరచి కామించబోయిన వారందరికీ కామోపసంహారం చేసి అదృశ్యుడయ్యాడు మహాదేవుడు.

బ్రహ్మకు ముచ్చెమటలు పోశాయి. చిరాకు అధికమైంది. శివునితో చెప్పించుకోవలసి వచ్చినందునకు లజ్జితుడై, ఆ చిరాకును మన్మథుని మీద ప్రసరింపచేశాడు. 'నాలుగు ముఖాలున్నా ఏం లాభం? పరువుపోయక ఏ ముఖం పెట్టుకుని దేవతలందరికీ పెద్దదిక్కుగా వ్యవహరించగలను? ఇదంతా నీ వల్లనే జరిగింది కనుక - పరమశివుడంతటి వాడిని రప్పించేలా, నాకు నీతులు చెప్పించేలా చేశావు కనుక ఆ ముక్కంటి మూడోకంటి అగ్ని చేత నీవు దహింపబడెదవుగాక!' అని శపించేశాడు విధాత.

ఉద్యోగధర్మ నిర్వహణ చేశానంటాడు మన్మథుడు. అయినప్పటికీ వావివరసలు చూడకూండా కామవికారం పుట్టించావు అంటాడు ప్రజాపతి.

తనతప్పు లేదంటాడు కాముడు. అసలు... కామం యొక్క గుణమే అంత! దాని స్వభావం అది, ఎలా అతిక్రమిస్తుంది? కుమారుడి వాదనలో బలం ఉందని గ్రహించిన చతురాననుడు, చతురంగా తన శాపాన్ని సమర్థించుకున్నాడు . సరే! నీవు త్రినేత్రుడి ధాటికి మాడిమసైనా, నీ ప్రమేయమే లేకుంటే సృష్టి జరగదు కనుక, అ పరమేశ్వరానుగ్రహాన తిరిగి నీవు జీవించగల్గుతావు అని శాపోపహతి చెప్పాడు స్రష్ట. అంతలో - బ్రహ్మ మానసపుత్రుడైన దక్షుని స్వేదం నుంచి ఓ మనోహరాంగి ఉద్భవించింది. శృంగార సీమలకు పట్టపురాణి అనదగ్గ ఆ కన్యకామణికి 'రతి' అని నామకరణం చేసి, మదనుడి వంక చూశారందరూ.

సర్వులనూ మోహింపచేసే మన్మథునికే, మదనవికారం కలిగించేలా ఉన్నది అ రమణీయమూర్తి. కామకారకుడికి కొంతవరకు అతని వృత్తి ఉధృతిని తప్పించగల తరుణీమణి ఆమెయే అని తోచింది అందరికీ. స్త్రీ పురుషలు సంభోగించడానికి ఎన్ని పద్ధతులున్నాయో అన్నిటినీ ప్రయోగిస్తూ వారిరువురూ ఆనంద డోలికల్లో ఊగసాగారు. అంతేకాక ఎన్నో కొత్తరీతులను ఆవిష్కరించే ప్రయత్నాల్లోనూ పడ్డారు. అదీ మన్మథగాథ! ఈ గాథ ఆసాంతం విన్నా, చదివినా, శృంగార సీమల్లో విహరించు వారి సర్వాభీష్టములు నెరవేరునట్లు బ్రహ్మ అనుగ్రహించాడు. అయితే మన్మథదహనం అంత స్వల్పకాలిక వ్యవధిలోనే జరుగలేదు. ఈ నడిమి కాలంలో మరికొంత కథ నడిచింది" అన్నాడు సూతుడు.

అది కూడా సవిస్తరంగా వినిపించమని కోరారు శౌనకాది మహర్షులు.
Read More

అట్లతదియ పర్వదినం. హిందూధర్మచక్రం

అట్లతదియ పర్వదినం. హిందూధర్మచక్రం
అట్లతదియ శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సవాలతో అట్లతద్ది జరుపుకుంటారు. ఇది పూర్తిగా ఆడవారు భక్తి శ్రద్దలతో చేసుకొనే పండుగ గా చెప్పవచ్చు. అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు, అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం.
ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి అట్లు, ఫలాలు వాయనంగా ఇవ్వాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. పదిరకాల ఫలాలను తినడం, పదిమార్లు తాంబూలం వేసుకోవడం, పదిమార్లు ఊయల ఊగడం, ఈ పండుగలో విశేషం.
ఈవిధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన, చక్కటి రూపం కలిగిన భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తర తరాల నుంచి వస్తున్న నమ్మకం.
అట్ల తద్దె పేరులోని అట్ల యొక్క ప్రాముఖ్యత విశిష్టం గా చెప్పబడింది. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల లోని కుజుడు అట్ల ప్రియుడు. అట్లను గౌరీ దేవి కి నైవేద్యం గా నివేదించితే కుజగ్రహ శాంతి జరిగి దోష పరిహారం అవ్వడమే గాక వైవాహిక జీవితం లో ఎటువంటి అడ్డంకులు రావు. కుజుడు రజోదయమునాకు కూడా కారకుడు కావున స్త్రీలకు ఋతుచక్రమునకు సంబందించిన సమస్యలు రానివ్వకుండా కాపాడుతుంది. తద్వారా గర్భాదారణము లో ఎటువంటి సమస్యలు ఉండవు. ఇందులో ప్రధానం గా వాడే మినుములు రాహు గ్రహానికి, బియ్యం చంద్ర గ్రహానికి సంబందించిన ధాన్యాలు, వీటి తో చేసిన అట్లను వాయనం ఇవ్వడం వలన గర్భ దోషాలు తొలగిపోతాయి. అంతే కాదు గర్భస్రావం నివారింపబడి సుఖ ప్రసవం అవుతుందని చెప్పబడింది.
ఈ పండుగ లో మరో విశేషం ఆడవారంతా గోరింటాకు పెట్టుకోవడం. చేయడం లోని పరమార్దం, శరీరం చల్లబడి వివిద రకాల క్రిముల వలన కలిగే సమస్యల నుండి గోర్లని, అరచేతుల్ని, అరికాళ్ళని కాపాడుకోవడం కొరకు ఆచరిస్తాం .
Read More

సుమశరుని పరాజయం -

 సుమశరుని పరాజయం - మన్మథుని జనక కాలమందు జరిగిన ఘటన గుర్తొచ్చినప్పుడల్లా బ్రహ్మదేవుడికి హృయమందు, శూలి గుచ్చిన మందలింపు మాటలనే శూలపుపోట్లు బాధించసాగాయి. శివుడికేం? నిత్య విరాగి! తపోనిష్ఠలో కూర్చున్నవాడికి తరుణి తపనలో వేదన ఏం తెలుస్తుంది? ఒక్కసారైనా స్త్రీ సంయోగ - వియోగ బాధ కలిగించి ' కామం ' యెక్క ప్రభావం ఎలాంటిదో చవిచూపించ దల్చుకున్నాడు చతురాననుడు. తన ఆజ్ఞగా మన్మథుని ప్రేరేపించి శివుణ్ణి ఓ ఊపు ఊపమన్నాడు. మన్మథుని మాయలకు రుద్రుడు చలించలేదు.
సుమశరునికీ పౌరుషంగానే ఉంది. తన పూలబాణాలతో, యోగి పుంగవుల్నీ భోగ విషయసూయ మానులను చేసిన ఘనుడతడు. రుద్రుని దీక్షను చిద్రం చేయడానికి తనకు ప్రత్యేకాస్త్రాలు దయచేయించమని, కమలాసనుని కోరాడు కందర్పుడు.
కేవలం పూలబాణాలతోనే హడలెత్తిస్తున్న కాముడింకా కొత్తఅస్త్రాలు పొందితే, సృష్టిలో ఇక సమస్తకార్యాలూ స్తంబించి, కామకార్య మొక్కటే విజృంభిస్తుందని దూరాలోచన చేసినవాడై - విధాత యోచించాడు.
ఒక ఆలోచన స్ఫురించి, ఆయన మదినుండి వసంతుడు ఉద్భవించాడు. పుడుతూనే తన సుగంధ శోభతో - మలయ పవనాలతో అక్కడున్న వాతావరణమంతా ఆహ్లాదకరంగా మలచాడు. మన్మథుడికి అతడిని జతచేసి శివునిపైకి ఉసిగొల్పినా ప్రయోజనం లేకపోయేసరికి - ఉస్సురని నిట్టూర్చిన బ్రహ్మ ఎదుట, అ నిట్టూర్పులో నుండే 'మారయ మారయ - భేదయ భేదయ ' అని అరుస్తూ కొన్ని గణాలు ఓ సమూహంగా ఉద్భవించాయి. వాళ్ళందరినీ' మార గణాలు ' అనే పేరిట మన్మథుని అనుచరులను చేసి, బ్రహ్మ మళ్ళీ మహా శివుని మీదకు దండయాత్ర చేయించాడు. ఫలితం శూన్యం.
"మనం త్రోవతప్పి కాముని ప్రసంగంలో పడ్డాం! మన నారద మహర్షుల వారు శివతత్త్వ జిజ్ఞాసాపరులై, ఉగ్రతప మాచరిస్తున్న వైనాన్ని అక్కడే వదిలేశాం!" అను గుర్తుచేసుకున్నారుం శౌనకాదులు.
"ఋషివరేణ్యులారా! ఇదంతా శివ సంకల్పానుసారం జరుగుతున్నదే! ఒక గాథలోంచి మరొకగాథ, అందుండి ఇంకొక ఉపకథ... ఈ పురాణ సముచ్చయమంతా ఒక గాధామాలిక! ఒక్కో అంశానికి ఎన్నో అనుబంధ గాధలతో సంబంధం ఉండి తీరుతుంది. అవన్నీ ఆమూలాగ్రం తెలుసుకోవడం కూడా పురాణ సమగ్రతకు దోహదకారి అవుతుంది!" అని వివరించి నారద తపస్సు గురించి ప్రస్తావించాడు సూతుడు మళ్ళీ.
నారదుని తపోగర్వం:
'ఆవిధంగా శివ శాసనం వల్ల, కామదహన ప్రదేశంలో ఎటువంటి మాయలుగాని, మారవికారాలు గాని ఫలించలేదు. పైగా శివమాయా ధీనులై ఉన్న వారందరికీ, ఆ శాసనం గుర్తులేకుండా పోయి నందున -అదంతా నారద మునీంద్రుల ఉగ్రతపః ప్రభావమేనని భావించారు. మన్మథుని పరాజితుని చేయడంలో, నారదునిదే పైచేయి కావడంతో - శివుడంతటి వాడితో ఆ మునీంద్రుని పోల్చి కొనియాడసాగారు.
కొంతకాలానికి తత్త్వదర్శనం చేసుకున్నాక నారదముని కన్నులు తెరిచి తపస్సు చాలించాడు. ఆ నోటా - ఈ నోటా తాను కాముని జయించినట్లు ప్రచారంలో ఉన్నసంగతి తెలుసుకుని, అదంతా తన ప్రతిభే అని విర్రవీగసాగాడు నారదుడు.
హరి బ్రహ్మాదులకే శక్యం కాని శివమాయా తరణం, నారదుని వశమా? తత్త్వ దర్శనం జరిగిందనుకున్నాడే గానీ, నిజంగా శివతత్త్వం బోధపడి ఉంటే - అహంకరించేవాడే కాదుకదా!
అందరూ - మదనునిపై విజయమే మాయపై విజయంగా అభివర్ణించేసరికి 'అవునుకాబోలు ' అనుకున్న నారదుని గర్వానికి అంతు లేకుండా పోయింది. ఆ గర్వాంధత ఎట్టిదంటే-
సాక్షాత్తు శివుడి ఎదుటికే వెళ్లి, ఆ మహాదేవుడినే తూలనాడేటంత స్థాయిలో ఉంది. కైలాసవాసుడి కడకేగి, తన కందర్ప విజయం ప్రగల్భాలమయం కాగా పరమాత్ముడిని తానేనని ప్రకటించుకునేటంతవరకూ వెళ్లింది - నారదుని స్థితి.
మహాదేవుడు శాంతచిత్తుడై, నారదుడిపై జాలికొద్దీ - ఆసాంతం విని నవ్వుకున్నాడు.
"బాగానే వుంది గానీ మహర్షీ! ఇలాంటి మార్మిక విషయాలు అందరితోనూ చెప్పరాదు. ఏదో నేను భోళాశంకరుణ్ణి కనుక - నేనెవ్వరితోనూ అనను కనుక, నాదగ్గర అంటే అన్నావు కాని ఇంకెక్కడా చెప్పకు! మరీ మరీ దాచవలసిన ఇలాంటి అంశం, ముఖ్యంగా ఆ శ్రీహరి సన్నిధిన మాత్రం అస్సలు చెప్పకు!" అని నారదుడిలోని ఇంకా అంతర్భూతమై ఉన్న కొంటె తనాన్ని రెచ్చగొట్టి మరీ వదిలాడు శివుడు.
అసలే జడధారి. ఆపైన పెడదారి పట్టిన బుద్ది. శివుడు చెప్తున్నంత సేపూ విన్నట్టే విన్నప్పటికీ, కైలాసం సరిహద్దులు దాటేసరికి అవన్నీ గాలి కొదిలేశాడు. బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రితో తన గొప్పలు చెప్పుకున్నాడు. 'ఆత్మస్తుతి దూష్యంరా తండ్రీ! అలా ఎవర్నీ వారే పొగుడుకోరాదు ' అని బ్రహ్మ కూడా మందలించాడు.
తన కళ్ళముందే తన కొడుకు తనను మించి ఎదిగిపోవడాన్ని, ఆ వృద్ధ పితృదేవుడు భరించలేక ఇలా అంటున్నాడనిపించింది నారదుడికి. శివుడికీ ఇదే బుద్ధి! ఇక తనను సరిగ్గా అర్థంచేసుకునేది ఆ శ్రీమన్నారాయణు డొక్కడే. ఈ నారదుని ప్రతిభ ముల్లోకాలకే కాదు... ఏడేడు పధ్నాలుగు లోకాలకూ వెల్లడి చేయగల మహావిష్ణువు సర్వవ్యాపి! ఆయన తల్చుకోవాలే గాని, "పరమాత్ముడు నారదుడే" అని ప్రచారం కూడా చేసిపెట్టగలడు. బహుళా తనకంత పేరు ప్రఖ్యాతలు రావడం ఇష్టం లేకనే, శివుడు అలా అడ్డుపుల్ల వేసి వుంటాడు... అనుకున్నాడు నారదుడు.
పాలకడలిపై పవళిస్తూ, లోకపాలనలో వింతలన్నీ అవలోకిస్తూన్న విష్ణుదేవుడి దృష్టికి నారద ప్రగల్భాలేవీ దాటిపోలేదు. ఆయనా నవ్వుకున్నాడు. తీరా ఆ 'నారదపరమాత్మ' తన వద్దకే వచ్చేసరికి తత్తరపడి, స్వాగత సత్కారాలు స్వయంగా చేశాడు హరి. విష్ణుదేవుడంతటి వాడు తన కెదురేగి సత్కరించడంతో - తాను వెంట్రుకవాసి తేడాలో మహావిరాట్ పురుషుడే అని నమ్మకం కలిగిపోయింది నారదుడికి. ఈ ప్రళయం, సృష్టీ, అనంతకాల కల్పాలూ, మన్వంతరాలూ, యుగాలూ, ఈ త్రిమూర్తులూ, వారి అనుచరగణాలూ, చరాచర జగత్ సృష్టీ అంతా తన మహాత్యమే అని తారాస్థాయిలో చెప్పుకుంటున్న నారదుడి ధోరణి విని 'ఆహా!' అన్నాడు శ్రీహరి. అని ఊరుకున్నాడా? "తమంత వారికలేరు. తమంతవారు ఇక తమరే!" అని రెట్టించాడు.
అందులో నర్మగర్భితంతా వున్న వేళాకోళాన్ని గ్రహించే స్థితిలో లేడు నారదుడు.
శివమాయలో చిక్కుకుని, అహంకరిస్తూ తన స్వస్వరూప జ్ఞానాన్ని క్రమంగా కోల్పోతూన్న నారదునికి మళ్లీ వివేచన కలిగించగల మహాను భావుడు మరి ఇక ఎవరు? ఆపనీ ఆ పరమాత్ముడే చేయాలి.
'విష్ణువు తన మాటలు వినడమేకాదు! అంగీకరించాడు కూడా!' అనుకుని పొంగిపోతూ ఇతరలోకాల్లో తనప్రజ్ఞ తానే స్వయంగా చూటుకోవడానికి బయల్దేరాడు నారదుడు.
నారదుడలా వెళ్లగానే, శ్రీ హరి నారదునికి గట్టిగా బుద్ధి చెప్పదల్చుకున్నాడు.
Read More

ఆశ్వీయుజ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.

ఆశ్వీయుజ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
 ఓం గం గణపతయే నమః
 సంకష్టహరచవితి వ్రత విధానం :
 సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు అని భక్తుల విశ్వాసం.
🍀 . ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.
ఏదైనా ‪#‎గణపతి‬ ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.
సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.
ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.
ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.
(‪#‎సంకష్టహరచవితి‬ మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.
Read More

విష్ణుమాయ - శ్రీ శివ మహాపురాణము. హిందూ ధర్మచక్రం.

విష్ణుమాయ - శ్రీ శివ మహాపురాణము. హిందూ ధర్మచక్రం.
శివుని ప్రేరణ వల్లనే విష్ణువుకు అటువంటి అభిప్రాయం కలిగిందనడం సమంజసం! శివమాయా ప్రెరితుడై శ్రీహరి, ఒక మాయా మహానగరి సృష్టించాడు. దానికొక రాజు - శీలనిధి. అతడికి అపారమైన అనుచరవర్గం... అతనికో కూతురు - పేరు శ్రీమతి. ఇలా అంతా సహజం అనిపించేటంత భ్రాంతిమయ మంత్రనగరి నారద సంచారానికి అతి చేరువలొ ఉండేలా నిర్మితమైంది.
తనకు తెలిసిన లోకాలే కాక, ఈ నగరి ఎక్కడ్నుంచొచ్చింది? అనే ఊహ అయినా చేయకుండా నారదుడా నగరిలో అడుగుపెట్టాడు. అదే మాయా విలసనం అంటే!
నారదుని రాకకు పరమానంద భరితుడైన ఆ మహా ఇంద్రజాల నగరి రాజు శీలనిధి స్వాగత సత్కార్యాలు యధావిధిగా చేసి, అంతఃపుర మందిరంలోకి ఆయనను తోడ్కుని వచ్చాడు. వేయి అప్సర స్త్రీల రూప లావణ్యాల్ని తిరస్కరించేటంత జగజ్జేగీయమాన సౌధర్యంతో రాజిల్లుతున్న తన కుమార్తె శ్రీమతిని చూపించి, ఆమె చేత మునీంద్రులకు నమస్కరింపజేశాడు. ఈమెకు త్వరలో స్వయంవరం ఏర్పాటు కానున్నది. ఉత్తముడైన భర్తను పొందే భాగ్యం కలిగించండి! దీవించండి! అన్నాడు.
సమవిభక్తాంగయై, సమ్మోహకారంగ పరిస్ఫుట సౌందర్య రాశియై, రతీమన్మథుల జంట ఏకరూపమై వెలిగినంత శృంగారోద్దీపకమై, వయ్యారాలుపోతూ తన ఎదుటనిలిచిన ఆ లీలా లలనామణిని చూసేసరికి, నారదునుకి మతి అదుపుతప్పింది. చిత్తచాంపల్యం అధికమైంది. అస్తు! అస్తు! అన్నాడే గాని , ఆమె అందాన్ని విస్తుపోయి చూస్తూ కన్నార్పకుండా కళ్లతోనే ఆ వనితారత్న సౌందర్యాన్ని గ్రోలుతున్నాడు నారదుడు.
శివ తపోభూమిలో, శివుడానవల్ల కాముణ్ణి దూరం తరిమిన నారద తపోనిష్ట, ఆ తపోభూమి వెలుపల నిష్పలమైంది. కామకేళీ మనో లగ్నత ఓడించింది. పెళ్లాడితే ఇటువంటి కన్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.
కానీ, ఎలా?!... చూడబోతే తాను జడదారి. ఆమెవంటి అపురూప సౌందర్యరాశి తనబోటి మునిమ్రుచ్చు నెట్లువరిస్తుంది? శౌర్య పరాక్రమ విలసితమై, మదన సమ్మోహరూప సముపేతమై అలరారే ఎందరెందరో క్షత్రియ, దేవ , గంధర్వ కుమారులు... ఇందరిని కాదని - ఆమె తనదాకా వచ్చేదెలా? ఈ ఆలోచన కలగగానే, తనకు ఈ విషయంలో సహాయం చేయగలవా రెవ్వరా అని క్షణం యోచించాడు.
నారద గర్వభంగం-శ్రీ శివ మహాపురాణము
తనను సరిగ్గా అర్థం చేసుకోగలవాడు ఆ శ్రీహరి ఒక్కడే అని స్ఫురించడంతో, వైకుంఠం దారిపట్టి - శ్రీ మహా విష్ణువుకు తన మానసాన్ని వివరించాడా బ్రహ్మపట్టి.
'అందమైన రూపంలో నీకు సాటిరాగలవా రెవ్వరూలేరు ' అని జనార్థనుని పొగిడి - 'నీ రూపాన్ని నాకు ప్రసాదించి, పెళ్ళయ్యేవరకు అనుగ్రహించు! అ తర్వాత నా పాట్లేవో నేనుపడతాను ' అని వేడుకున్నాడు. కామమహిమ అంతటిది! కేవలం బాహ్యమైన ఆకర్షణ కలిగించే రూపం కోసం ప్రాధేయపడి యాచించాల్సిన పరిస్థితిని కల్పించింది.
లోలోన గుంభనగా నవ్వుకున్న నారాయణుడు సరేనన్నాడు. ఒక్క ముఖం తప్ప, మిగతా శరీరమంతా పురుషులకే సమ్మోహం కలిగించేటంత అందంగా మార్చి ముఖం మాత్రం వానరరూపంలో కనిపించేలా ఉంచేశాడు. ఎవరి ముఖం సంగతి వారికి తెలియదు కనుక, ఆ వీలును ఇలా ఉపయోగించు కన్నాడు విష్ణువు.
శ్రీహరినే నెరనమ్మిన నారదుడు, మారుని తలపులే మదిలో సందడి చేస్తుంటే మరో ఆలోచన లేకుండా, అత్యుత్సాహంతో స్వయంవరానికి బయల్దేరాడు. నారదుడు స్వయంవర సభామంటపంలో ప్రవేశించగానే, శివమాయా ప్రేరితులై రుద్రగణాధినేత లిరువురు చెరోపక్కా ఆయన్ను అనుసరిస్తూ (బ్రాహ్మణ వేషధారులై వున్నందున) నారదునికి అనుమానం రాకుండా మెలగసాగారు. చివరికి నారదుడు కూర్చున్న చోటికే వచ్చి ఇరువైపులా ఆశీనులయ్యారు.
శ్రీమతి పుష్పమలాధారిణి అయి, స్వయంవర సభావేదికను సమీపించింది. సభలోని అందర్నీ కలయజూసింది. కోతి ముఖంతో వచ్చిన నారదుని చూసే సరికి ఆమెకు అప్రయత్నంగా నవ్వురాగా, కామతప్తుడై వున్న నారదునికి ఆమె నవ్వు సుప్రసన్నంగా - తనపట్ల పరవశంగా వునట్లు తోచింది. తన ముఖారవిందాన్ని మరింత విప్పార్చి, ఆమెనే అలా చూస్తుండిపోయాడు నారదుడు.
ఆమె దగ్గరగా వచ్చి, మరోసారి తన ముఖాన్ని చూసి నవ్వడంతో అదంతా సుముఖంగానే వునట్లు భ్రాంతి చెందిన నారదునికి ఆశాభంగం కలిగిస్తూ తనను దాటి వెళ్లిపోయింది శ్రీమతి.
ఈలోగా మాధవుడు, అపర మన్మథుడిలా అక్కడికి రావడం - శ్రీమతి వరమాల అతడి కంఠసీమ నలంకరించడం వెన్వెంటనే జరిగిపోయాయి. హతాశుడయ్యాడు నారదుడు.
బ్రాహ్మణ వేషధారులై ఉన్న రుద్రగణాధిపు లిద్దరూ నారదుని అవస్థ కనిపెట్టి, "దేనికయ్యా అంత ఆందోళన?! ఆమె ఎవరికి చెందాలో వారికే చెందిందిలే! అయినా.. అందుకోడానికి నీకేం అర్హతవుంది? అందమైన లేదుకదా! అసలు నీముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా?" అంటూ ఎద్దేవా చేశారు.
సందేహిస్తూనే, తన ప్రతిబింబాన్ని అక్కడే వున్న కాచఫలకంలో చూసుకున్నాడు. వానర ముఖాకృతి అచ్చుగుద్దినట్లు కనిపించేసరికి, గ్రద్ద వాహనారూఢుడి మోసం గమనించి నొచ్చుకున్నాడు.
తనకు ఇరువైపులా చేరి వేళాకోళం చేస్తున్న ఇద్దరిని బ్రాహ్మణులుగానే భావించుకున్న నారదుడు, "సాటి బ్రాహ్మణుని సమయా సమయాలు గానక, పరిహసిస్తున్న మీరు బ్రాహ్మణ బీజాన రాక్షసులై జన్మించెదరు గాక!" అని శపించి, క్రోధావేశం చల్లారక వైకుంఠవాసుని కొంటె చేష్టను కడిగి పారేయ్యాలని వైకుంఠం దిక్కుగా పయనమయ్యాడు.
Read More

నారద పుణ్యతీర్థ యాత్ర - శ్రీ శివ మహాపురాణము,.

నారద పుణ్యతీర్థ యాత్ర - శ్రీ శివ మహాపురాణము,.
 నారద - శాపచాలనం
 మొదట కామాతురుడై, ఆ పిదప కార్యభంగ వికల మానసుడై, ప్రస్తుతం క్రోధోన్మత్త మిళిత వేదనా పరివృతుడై వైకుంఠంలోకి అడుగిడిన నారదుడు శ్రీహరిని నిందించసాగాడు. "ఆశ్రితులను సైతం అల్లరిపెట్టే తుంటరితన మేలనయ్యా శ్రీహరీ? నువ్వు మహామేధావివే కాదు! మాయావివి కూడా! అయితే మాత్రం...?! నీవే శరణన్నవారిని కూడా, నవ్వులపాలు చేస్తే ఇక నీ మహిమకెంత మచ్చ? కనీసం అదయినా నువ్వు ఆలోచించుకున్నావా? నువ్వింతటి అఖండుడవని తెలిసే, ఆ మహాదేవుడు సర్వాధికులుగా బ్రాహ్మణులను నియుక్తుల్ని చేశాడు. నిన్ను ఆ తర్వాతివాడిగానే కొలువమన్నాడు. పరమౌన్నత్యం కట్టబెట్టడానికి శివుడంతటివాడే జంకాడూ అంటే - నీ సంగతి అయనకు బాగా తెలిసినట్టే ఉంది.." అంటూ దెబ్బిపొడవసాగాడు.
"శ్రీ మహావిష్ణువు కంటె బ్రాహ్మణులను ఎట్లు అధికుల్ని చేశాడా భూతేశుడు?" మహర్షులు ప్రశ్నించారు.
 సాక్షాత్తు ఆ విరాట్పురుషుని ముఖం నుంచి ఉద్భవించడమేకాక, అపర సరస్వతీ మూర్తులైన వేదాల్ని అభ్యసించే దేవతలుగా వెలుగొందుతారని ఆ పరమశివుని ఆనతి. ఉదాత్త అనుదాత్త సర్వ సహితంగానూ - అప శబ్దోత్పన్నం కాకుండానూ వేదాన్ని చదవగల ప్రజ్ఞ భూసురుల సొంతం చేశాడా భగవంతుడు. సమస్త మునిజనాలకు మూల పురుషులు బ్రాహ్మణులే! అందుకే బ్రాహ్మణ దూషణ బ్రహ్మహత్యాపాతకంతో సమానమని సెలవిచ్చి ఉన్నారు. భారతగాధలో దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి. వారిని సాక్షాత్తు విష్ణుస్వరూపులుగా సంభావించాలి. బ్రాహ్మణ ద్వేషులను శ్రీహరి ద్వేషులుగా నెంచును. సరే! అది అట్లుండనిండు! నారదుడు నోరు నొప్పిపుట్టేలా శ్రీహరిని నిందించి - చివరకు ఒక శాపం కూడా దయచేశాడు. ' స్త్రీ విషయమై నన్ను మోసం చేసిన నీవు, భూలోకములోనే రాజుగా పుట్టి , నీ ఇష్టపత్ని వియోగబాధలో కొన్నాళ్ళు పరితపించెదవుగాక! నన్ను కోతిని చేసి ఆడించబోయిన నీ మర్కటబుద్ధికి, ఆ జన్మమందు - కోతి మూకలే నిన్ను కొలుచుగాకా!'...అంటూ నారదుడు అప్పటికి శాంతించాడు.
 శివమాయా విలసనం - దాని ప్రభావం చిదానంద స్వరూపుడై పరికిస్తున్న శ్రీహరి ఆ మహాదేవుని తలచి, నారదునికి కమ్మిన మాయ తెరలను పటాపంచలు అయ్యేలాచేశాడు.
 ఎప్పుడైతే మాయ నారదుని వీడిందో, జరిగినదంతా స్పష్టంగా దృగ్గోచరం కాసాగింది - ఆ మునివర్యునికి. జరిగిన పోరపాటుకు అసాధారణంగా చింతాక్రాంతుడై, చతుర్భుజుని పాదాల చెంత వ్రాలాడు నారదుడు.
బ్రహ్మ మనసపుత్రా! ఇందులో నీ దోషం లేదు. అంతా పరమేశ్వరుడి లీల! నేనూ - నువ్వు అందరం ఆయన అడించినట్లు ఆడవలసిందే! కేవలం శివేచ్చానుసారమే ఇదంతా జరిగింది. నీవు నాకు శాపం దయచేయడం కూడా అందులో అంతర్భాగమే. కనుక - నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. జరిగిందేదో జరిగింది. త్రికరణ శుద్ధిగా ఇకనైనా ఆ పరమశివుని ధ్యానించుకో! పురాకృత పుణ్య విశేష వశాన మాత్రమే లభించే శివభక్తి తత్పరుడవై తరించు! నీ తండ్రినే గురువుగా చేసుకుని అద్వైత శివతత్త్వాన్ని అనుసరించు! ఆ పరమ శివానుగ్రహం నీకు కలిగి తీరుతుంది" అంటూ అంతర్హితుడయ్యాడు శ్రీహరి.
 నారద పుణ్యతీర్థ యాత్ర:
నారాయణమూర్తి ఆనతిచ్చిన ప్రకారం - శివభక్తి తత్పరుడయ్యాడు నారదుడు. అందులో భాగంగా శైవక్షేత్రాలన్నీ సందర్శిస్తూన్న తరుణంలో ఒకచోట నారదశాపానికి గురైన రుద్రగణాధినేతలు ఇద్దరూ తారసపడ్డారు.
తమ నిజరూపాలు చూపించి, శాపం సడలింపజేయమని అభ్యర్ధించారు. శాపం వెనక్కు తీసుకోగల అవకాశం లేదనీ - వశ్యవాక్కు అయిన తనశాపం అనుభవించక తప్పదనీ - అయితే కొంత ఉపశమనం ఉండేలా సవరించగలననీ చెప్పి, రాక్షసులై జన్మించినప్పటికీ వారు శివునిభక్తి వీడరనీ - శివుడంతటి దేవుడిచేతనే నిర్జితులవుతారనీ వారిని ఊరడించాడు నారదుడు.
అలా తీర్ధాలన్నీ చరిస్తూవున్న నారద మునీంద్రుడు వారణాశీ పురం చేరుకున్నాడు. విశాలాక్షీ - విశ్వేశ్వరుల దర్శనం చేసుకున్నాడు. అక్కడ్నుంచి సరాసరి బ్రహ్మలోకం చేరుకున్నాడు.
తండ్రి అయిన పరమేష్ఠికి ప్రణామమాచరించి "తండ్రీ! ఎన్నెన్ని తీర్ధాలు సేవించినా శివతత్త్వసారం వంటపట్టలేదు. నాయందు దయతో నీవే గురువుగా ఆ పరిజ్ఞానం కలిగింప వేడుతున్నాను" అన్నాడు.🍀
 హిందూ ధర్మచక్రం. ధార్మిక ప్రచారం. హైదరాబాద్.
మితృలు పై సమాచారాన్ని యధాతధంగా షేర్ చేసి మా హిందూ ధర్మ విషయాలు అందరికీ పరిచయం కావడానికి సహాయపడగలరు.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML