ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 1 August 2015

స్వయంభూవుగా వెలసిన నారసింహ స్వామి శిల్పం ....



స్వయంభూవుగా వెలసిన నారసింహ స్వామి శిల్పం ....

శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించి ఆయన కుమారుడు ప్రహ్లాదుడిని కాపాడే కథ చాలా ప్రముఖమైనదే. ఆనాడు స్తంభము నుండి ఉద్భవించిన స్వామియే ఈ కొండపై ఉన్న గుహలో వెలిసాడని అందుచేతనే కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెపుతారు.అంతేకాక ఈ కొండమొత్తంగా కూడా ఒక స్తంభంఆకారంలో వుంటుంది. కాబట్టి కూడా పట్టణానికి స్తంభాద్రి అనే పేరు వచ్చేందనేది మరొక కథనం.అంతేకాక ఆరోజులనుంచే కంభంమెట్టు అనే పేరు వుందని ఖమ్మంజిల్లా ఆదికవి హరిభట్టు తన వరాహ పురాణము లో పేర్కొన్నాడు.

1953వ సంవత్సరంలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తర్వాత ఖమ్మం మెట్టును ఖమ్మంగానూ అదేవిధంగా అప్పటివరకూ వరంగల్ జిల్లాలో భాగంగా మాత్రమే వున్న ఖమ్మ జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగానూ గెజిట్ ద్వారా మార్చారు. ఇలా జిల్లా పేరుకు ప్రధాన కారణంగా ఈ ఆలయం కావటం మరింత ప్రత్యేకత.

శ్రీ గట్టు నరసింహస్వామి దేవాలయము ఖమ్మం జిల్లా ప్రధానకేంద్రం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఒక ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. ప్రహ్లదుడిని రక్షించేందుకు నరసింహస్వామివారు ఒక స్థంభంలోనుంచి బయటకు వచ్చారని కథనం. అటువంటి స్థంభాన్నికలిగివున్న ప్రాంతం కాబట్టి స్థంభాద్రి, స్థంభశిఖరి, కంభంమెట్టు అనే పేర్లనుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడింది అని చెపుతారు.

శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు. ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

సాధారణంగా దేవాలయాలు తూర్పులేదా ఉత్తరదిశలకు తిరిగి వుంటాయి కానీ ఇక్కడి నరసింహస్వామి మాత్రం దక్షిణాభిముఖుడుగా వుంటాడు. ఎత్తైన కొండలపై వెలసిన స్వయంభూవుగా వెలసిన నారసింహ స్వామి శిల్పం సహజంగానే వెలసిందని, శతాబ్ధాల కాలం నుంచి అది అక్కడే వున్నట్లు భావిస్తారు.

ఈ ఆలయ స్థంభాలపై కనిపించే స్థంభాల శిల్పనిర్మాణ శైలి కాకతీయుల స్థంభాలను పోలి వున్నప్పటికి అంతటి పూర్తి స్థాయి నగిషీలు లేక చాలా ప్రాదమిక దశలోనే వున్నట్లు కనిపిస్తుంది. అంతేకాక గర్భగుడికి ముందున్న నిర్మాణంలో ముందస్తుగా ఏర్పరచిన స్థంభాలకూ ఆ తర్వాత విస్తరణలో అభివృద్ధి పరచిన స్థంభాలకూ మధ్య బేధాన్ని గమనించ గలుగుతాం.

ఇక్కడి ధ్వజస్తంబం పూర్తిగా శిలతో నిర్మించినదే, మరి అత్యంత ఎత్తుగా కాక గుడికంటే కొంత ఎత్తుగా మాత్రం వుంటుంది. అంతే కాకుండా ధ్వజస్తంభం గుండ్రని నిర్మాణంతో స్తూపం ఆకారంలో కాక ఇది నలుపలుకలుగా దీర్ఘఘనం ఆకారంలో వుంటుంది.

సాధారణంగా దేవాలయాలలో గర్భగుడిలోని మూలవిరాట్టుకు ఖచ్చితంగా ఎదురుగా వుండేలా ధ్వజస్తంభ నిర్మాణం చేస్తారు.కానీ ఇక్కడ మూల విగ్రహానికి ఎడమ వైపు ఐమూలగా కొంత కోణంలో ధ్వజస్థంభం వుంటుంది. ఇలా వుండటానికి కారణం మూలవిరాట్లు ముందుకు లంభంగా కాక కొంత కోణంలో పక్కకు చూస్తున్నట్లుగా వుండటమే అని వంశపారంపర్యంగా ఇక్కడి పూజాదికాలు నిర్వహిస్తున్న అర్చకులు వివరించారు.

రాతి ధ్వజస్తంభంపై అత్యంత ప్రాదమిక రూపంలో గీసిన ఒక పక్షివంటి రూపం వుంది. అంటే దానిని నరసింహావతారం ప్రాధమిక రూపమైన విష్ణుమూర్తికి వాహనం అయిన గరుత్మంతునిగా భావించి గీచి వుండవచ్చు. అలాగే మరోపక్క ధ్వజస్తంభంపై చేపవంటి ఆకారం కనిపిస్తోంది. బహుశా స్థంభం తొడుగులోపల పరిశీలిస్తే దశావతారాలు పూర్తిగా వుంటాయేమో. ఈ చేప మత్చావతారానికి ప్రతీకగా గీచి వుండవచ్చు.

ఇంత ఎత్తుగా వున్న కొండపై సంవత్సరం పొడవునా నీటినిల్వలు వుంటాయి. కొండను రెండుగా చీల్చినట్లున్న ప్రాంతంలో అంతమైన కొలను కనిపిస్తుంది.

ఉగ్రరూపుడైన నరసింహుని శాంతిపజేయటానికా అన్నట్లు కొలను నిండుగా వున్నప్పుడు అక్కడినుండి వున్న నాభివంటి అంతర్గత మార్గాల ద్వారా స్వామివారిని చల్లబరిచే అభిషేకం జరుగుతుందట. కొన్నిసార్లు కేవలం చెమ్మవంటి తడిమాత్రమే కాక ఏకంగా ప్రవాహంలాగా నీరు కొండమీది కొలనునుంచి గర్భగుడిలోని స్వామివారి విగ్రమాన్ని తడుపుతూ నీళ్ళు చేరుటాన్ని ఈ అర్చకులు చాలా సార్లు గమనించారట. దీనిని దేవాలయ మహత్మ్యానికి విశేష ఉదాహరణగా పేర్కొంటారు.

మూలవిరాట్టుకు కొంత కోణంలో రాతి ధ్వజస్తంభం నిర్మిస్తే సరాసరి ఎదురుగా ఒక నిలువెత్తు రాతి స్థంభం భూమిలో పాతి నిలబెట్టి వుంటుంది.దానికి మధ్యలో ఒక గంటుకూడా వుంది. దీనిని మొక్కుబడులు తీర్చుకునే కోడె స్తంభంగా ఆలయ అర్చకులు పేర్కొన్నారు. మొక్కుబడులను అనుసరించి ఈ స్థంభానికి వారు దారంతో కొంత సమయం మేర కట్టేసుకోవడం ద్వారా మొక్కుబడిని చెల్లించుకుంటారని తెలియజేసారు. బహుశా జంతుబలులకు కట్టుస్థంభంగా కానీ వధ్యశిలగా కానీ ఇది వాడుకుని వుండొచ్చనే విశ్లేషన కూడా ఒకటి వుంది.

ఈ నారసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడు హనుమంతుడి, దక్షిణదిశగా తిరిగి వున్న ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో క్షేత్రపాలకుని మందిరం వుంటుంది.

చాలా నరసింహ క్షేత్రాలతో స్వామివారికి నైవేద్యపానియంగా పానకాన్ని సమర్పిస్తారు. మంగళగిరి నరసింహస్వామి కి ఎన్నిబిందెలు పానకం పోసినా స్వీకరిస్తాడని అయినప్పటికి భక్తులకు ప్రసాదంగా కొంత మిగుల్చుతాడని కథనంగా చెప్పుకుంటారు. ఆవిధంగా మిగిల్చే పద్దతిలో శిల్పాన్ని నిర్మిస్తూ శిల్పులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడి ఖమ్మం గట్టు నరసింహస్వామికి పానకంతో అభిషేకం చేయడం ప్రత్యేకత. అత్యంత ఉగ్రరూపుడైన స్వామివారిని శాంతింపజేసేందుకు పానకంతో అభిషేకం చేయడం అనే పద్దతి పూర్వకాలం నుంచి వస్తోందని తెలియజేసారు.

సర్పదోష మొక్కుబడులకూ దోష నివారణకూ సర్పశిల లేదా ఇప్పటి రోజుల్లోలాగా లోహసర్పాలనూ పూజలో వుంచి దేవాలయాల వద్దవదిలేసే ఆనవాయితీ వుంది. దానిని సూచిస్తున్నట్లు ఇక్కడ అనేక రకాలైన అనేక సర్పశిలలు కనిపిస్తాయి.

వివిధ ప్రాంతాలనుంచి ఖమ్మం పట్టణానికి రైలు లేదా బస్సుద్వారా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి కేవలం 195 కిలోమీటర్ల దూరంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడనుంచి కేవలం 125 కిలోమీటర్ల దూరం లోనూ వుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML