గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 August 2015

మహాగణాధిపతి స్వరూపంమహాగణాధిపతి స్వరూపం

ఓంకార సంకేతమే వినాయక స్వరూపం
ప్రణవాక్షరమైన ‘ఓం’ వినాయక స్వరూపానికి ఒక సంకేతం అని విఘ్నేశ్వర తత్త్వ విదులు సోపపత్తికంగా చెప్తారు. ఎలాగంటే ఈ క్రింది విధంగా చిత్రీకరించి తెలియజేస్తారు.
శూర్పకర్ణం (చేట చెవి)
గంధ తిలకం
ఏకదంతం
సమస్త విశ్వంభర
లంబోదరం
ఓంకారపు కొమ్ము
(తుండము)
లంబోదరం అంటే పెద్ద పొట్ట. శక్తి అనేదానికి ఆదికారకాలయిన బీజాక్షరాలలో మొదటిది ఓం. సమస్త సృష్టి (విశ్వం) అందులోంచే పుట్టింది. అందులోనే ఇమిడి ఉంటుంది. అదే గణపతి లంబోదరం.
కుడివైపు తిరిగి ఉండే కొమ్ము బిందు సహిత ఓంకార ధ్వనిని సూచిస్తుంది. అది వక్ర (వంకర తిరిగిన) తుండమునకు సంకేతం. దానిపైన కనిపించే అరసున్న వినాయకుని ఏక దంతానికి చిహ్నం. ఆపైన ఉండే చుక్క ఆ స్వామి యొక్క నుదుటన ఉండే బొట్టుకు గుర్తు.
విఘ్నేశ్వరుడు శూర్పకర్ణుడు. అంటే చేటలంత చెవులు గలవాడని భావం. పై అక్షర చిత్రంలో లంబోదరాన్ని సూచించే వక్రరేఖ మీద ఉన్న ఊర్ధ్వ వక్రరేఖ చెవులకు సంకేతం.
ఇక్కడ అంత పెద్ద చెవుల గుఱించి మనకు తెలియాల్సింది ఏమిటంటే గణేశుడు శ్రవణాభిరుచి చాలా ఎక్కువగా కలవాడు; ఆ వినటంలో కూడా మంచిని గ్రహించి, ఆ మంచిని నలుగురికీ పంచి పెట్టి, తాను విన్నదాంట్లో చెడుగాని, పాపపు మాటలు గాని ఏమన్నా ఉంటే వాటిని తన చేటలంతటి చెవులతో దూరంగా విసిరేస్తాడు అని.
విఘ్నదేవుని ప్రతి అవయవము, గమనము, రూపము, ఆయన వాహనమైన ఎలుక- అన్నిటిలోను ఒక ఉదాత్త భావము, చక్కని సందేశము ఉన్నాయి.
దంతము:
ప్రతి ప్రాణికి ఏదో ఒక అభిమాన వస్తువో, శరీర భాగమో ఉంటుంది. నెమలికి తన పింఛము ప్రీతి. సింహానికి జూలు. ఏనుగుకు తన దంతం అంటే ప్రాణం. వేదవ్యాసుడు ఆశుధారగా భారతం చెబుతుంటే వినాయకుడు తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడదీసుకొని, దానిని కలంగా చేసుకొని వ్యాసుని ఆశుధారావేగంతో సమానంగా తాను భారతాన్ని రాసి పెట్టాడు లోకపు మేలుకోసం. జన శ్రేయస్సుకోసం తన ప్రాణప్రదమైన దాన్నైనా లెక్కచేయకూడదు అనే సందేశం ఇస్తుంది వినాయకుడు చేసిన దంత వినియోగ ఉపకారం.
కన్నులు:
చెవులైతే చాలా పెద్దవిగాని కన్నులు మాత్రం చాలా చిన్నవి. అంత చిన్న కళ్ళు ఆస్వామి సూక్ష్మ దృష్టిని సూచిస్తాయి. భక్తుని యొక్క ఎంత చిన్న కష్టాన్నైనా గమనించి కాపాడుతాడు అని భావం.
ఉదరం:
హేరంబునికున్న అంతపెద్ద బొజ్జ ఆయన ఎంతో జ్ఞానాన్ని ఆపోశన పట్టి జీర్ణం చేసుకున్నాడు అన్న విశేషాన్ని తెలియజేస్తుంది.
నాలుగు చేతులు:
తన నాలుగు చేతులతో ధర్మ-అర్థ- కామ-మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను సాధించి తాను పురుషార్థి అయినానని చెప్పటం ఆ స్వామి ఉద్దేశం. అందులో సగం (రెండు) చేతులున్న మనము పురుషార్థతను సాధించటంలో కనీసం సగం వఱకైనా కృషిచేయాలని సందేశాన్ని ఇస్తాయి కరిముఖుని కరాంబుజాలు.
ఎలుక వాహనం:
ఎలుక చాలా చిన్న ప్రాణి. అలాంటి దానిని వాహనంగా పెట్టుకొని దానిని అనుగ్రహించి తరింపజేశాడు. మనకంటే చాలా బలహీనులైన వారిని గూడా సమాదరించాలి అని అందులోని సందేశం. ఇంకా చెప్పాలంటే ఆ వాహనం సూక్ష్మదేహం కలది. అంటే అది మనస్సుకు ప్రతీక. దానిని వాహనం చేసుకోవటం అంటే మసన్సును నియంత్రించుకోవాలి అని భావం. మనో నిగ్రహం కలవాడే మహనీయుడు.
వినాయకుని విషయంలో అద్భుతం ఏమిటంటే ఆయన స్థూల కాయుడైనప్పటికీ తన వాహనానికి శ్రమలేకుండా లఘిమా సిద్ధితో తాను బెండువలె తేలికయిపోయి దానిని అధిరోహిస్తాడు. దీని పరోక్ష సందేశం ఏమిటంటే మనము దీనులు, బలహీనులు, పేదలు, కష్టజీవులు మొదలైన వారి యెడ ఏ మాత్రం గర్వాహంకారాలు చూపకుండా సౌమ్యంగాను, నిరాడంబరంగాను, నమ్రంగాను ఉండాలని.
మార్గదర్శక లక్షణం:
అడవిలో మొదట ఒక ఏనుగు తనకు తాను చెట్ల పొదల మధ్యగాను, తుప్పల గుండాను జాగ్రత్తగా దారిచేసుకుంటూ ముందుకు పోతుంది. దాని వెనకనే దాని అడుగుజాడల్లో ఇంకా కొన్ని ఏనుగులు నడుస్తూ పోతాయి. క్రమంగా అలా ఒక కాలిదోవ ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ దారులనే మన గిరిజనులు తమ కాలి బాటలుగా ఉపయోగించుకుంటారు. ఇలా అడవిలో హస్తి మనకు మార్గదర్శకం అవుతుంది. గజముఖుడైన గణేశుడు తన భక్తులకు ఎప్పుడూ మార్గదర్శకుడుగా ఉంటాడు. ఉదాహరణకు నారాయణ మంత్రం జపించి ముల్లోకాలను చుట్టి రావచ్చు అని మనకు కుమారస్వామి- వినాయకుల లోకయాత్రా స్పర్ధ సందర్భంలో ఒక సులభ ఉపాయ మార్గాన్ని తెలియజేశాడు హేరంబుడు.
వినాయకచవితి:
గణపతికి హస్తముఖుడు అని కూడా ఒక నామం ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే గణపతి యొక్క మూర్తి హస్తానక్షత్ర ముఖాన కనిపిస్తుంది. హస్తానక్షత్రం అయిదు వేళ్ళతో కూడిన హస్తం లాగా ఉంటుంది. హస్తి అంటే ఏనుగు. భాద్రపద శుద్ధ చతుర్ధినాడు చంద్రుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో హస్తానక్షత్ర దర్శనం అవుతుంది. గణపతి హస్తముఖ నామధేయుడు కనుక ఆరోజు వినాయక చవితిగా ఋషులు నిర్ణయించారు. హస్తానక్షత్రం కన్యరాశిలో ఉంటుంది. కన్య అంటే అవివాహిత. అందుచేతనే బుద్ధి, సిద్ధిలకు గణపతి పతిదేవుడైనప్పటికీ నిత్య బ్రహ్మచారి అనే పేరు గూడా ఉన్నది. అంటే ఎంతో నిగ్రహమూర్తి అని భావం.
కన్యరాశికి బుధుడు అధిపతి. బుధుని వర్ణము ఆకుపచ్చ. అందుకనే వినాయకుడిని ఆకుపచ్చని పత్రితో పూజించాలి. అదీగాకుండా వినాయక చవితి వర్షఋతువులో వస్తుంది గనుక వానలు బాగా కురిసి భూమి అంతా మారేడు, మొక్కజొన్న పొత్తులు, సీతాఫలాలు, జామలు మొదలైన వాటితో పచ్చపచ్చగా ఉంటుంది.
మనిషిలోని షడ్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రంలో విఘ్నేశ్వరుడుంటాడు. మూలాధారం శక్తి నివాసం. అంటే కుండలినీ శక్తి మూడున్నర చుట్టలు చుట్టుకొని సర్పరూపంలో ఉంటుంది. అది యోగ కేంద్రం. కాబట్టే విఘ్నేశ్వరుడు జగన్మాత అయిన ఆదిశక్తికి కావలికాస్తూ ఉంటాడు అని పురాణాలలో సంకేతాత్మక గాథ కనిపిస్తుంది. అలా వినాయకుడు సర్పరూప కుండలినీ శక్తిని ధరించి ఉండటంవల్ల నాగయజ్ఞోపవీతం (పామే జంధ్యముగా) కలవాడు అని వ్యాసుడు ఒక ఆధ్యాత్మిక దేవ రహస్య సంకేతాన్ని తెలియజేశాడు.
సమగ్రరూప సందేశం:
హరిహరులు, అమరేంద్రుడు, కుమారస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు- ఇలా దాదాపు పురాణ దేవతలందరూ సుందర రూపులే.
కానీ వినాయకుడు?! చూడబోతే ఏనుగు ముఖం, పెద్ద పొట్ట, గుజ్జు రూపం, నడవలేక నడవలేక నడిచే నడక, జందెముగా పాము, ఒక విరిగిన దంతం, వాహనమేమో పంటలు పాడుచేసే ఎలుక- ఇలా అన్నీ వికృతులే. అయినా ఆయన సర్వజన సమాదృతుడై, సకల ప్రజాపూజితుడై యావద్దేవ గణాధిపత్యార్హుడై, విఘ్న నివారణకు ఆదిదేవుడైనాడు. ఇందులోనే చక్కని సందేశం ఇమిడి ఉంది.
రూపం కాదు; గుణం ప్రధానం
నడక కాదు; నడత ప్రధానం
మనిషి ఎత్తు కాదు; మనసులోతు ముఖ్యం
తినేది ఏమిటి కాదు; ఇచ్చేది ఏమిటి?
– ఈ నాలుగు అంశాలూ ప్రతి మానవుడూ మనసులో పెట్టుకొని మనుగడ సాగించాలి అనేదే ఆ మహాగణాధిపతి స్వరూపం మానవాళికి ఇచ్చే మహోదాత్త సందేశం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML