
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 11 August 2015
విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి గణపతి.
విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి గణపతి. అందుకే విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. దేవతాగణాలన్నింటికీ కూడా ఆయనే అఽధిపతి. విఘ్నాలను తొలగించటమే కాకుండా- మనిషికి జీవితంలో కావలసిన విద్యలు, సిద్ధులు ఇచ్చేది కూడా గణపతే గణపతికి బుద్ధి, సిద్ధి అనే ఇద్దరు భార్యలు. వాస్తవికంగా ఆలోచిస్తే ఈ బాంధవ్యం అంతరార్థం వేరు. దేవతా స్వరూపం తాలూకు శక్తికి భార్య అని పేరు. అలాంటి ఇద్దరు భార్యలున్న గణపతి జీవిత సూత్రాలను తెలియజెప్పే నాయకుడు.
గణపతి ప్రస్తావన మనకు అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో కనిపిస్తుంది. వేదకాలంలో గణపతితోపాటు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు ఇలా అనేక మంది దేవతలకు సమప్రాధాన్యం ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో గణపతికి తప్ప మిగతా దేవతలందరికీ చేసే ఆరాధన తగ్గుతూ వచ్చింది. కేవలం గణపతి ఒక్కడే నాలుగు యుగాల్లోనూ పూజలందుకున్న విశిష్టుడు. కృత యుగంలో మహోద్ఘటుడు, త్రేతా యుగంలో మయూరేశుడు, ద్వాపర యుగంలో గజాననుడు, కలియుగంలో ధూమ్రకేతువుగా గణపతి పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు మనం పూజ చేస్తున్న గణపతి ద్వాపరయుగంలోని గజముఖుడే!
ప్రస్తుతం మనం విఘ్నాలు తొలగించే నాయకుడిగా గణపతిని కొలుస్తాం. దీనికొక కారణముంది. మన శరీరంలో అన్ని అవయవాలు ఏకోన్ముఖంగా పనిచేస్తాయి. అదే విధంగా ఒక పనిలో అనేక కోణాలుంటాయి. ఇవన్నీ విజయం దిశలో ప్రయాణించాలంటే గణపతి ఆశీర్వాదం అవసరం. అందుకే పెళ్లి, పూజ, పితృకార్యాలైన తద్దినాలు పెట్టాలన్నా ముందుగా గణపతిని పూజించాల్సిందే! ఆఖరికి వినాయక చవితినాడు కూడా మొదట పసుపు వినాయకుడికి- మహాగణాధిపతియే నమః అంటూ పూజ చేశాకే వినాయక విగ్రహాన్ని పూజిస్తాం.
54 రూపాలు
మన శాస్త్రాలలో నృత్య గణపతి, ఉత్తిష్ట గణపతి, విద్యా గణపతి, ఆనంద గణపతి, యోగ గణపతి, అక్షర గణపతి ఇలా మొత్తం 54 గణపతి రూపాలను పేర్కొన్నారు. ఈ మూర్తుల ముద్రల్లోను, భంగిమలలోను తేడాలుంటాయి. . ఈ 54 రూపాల్లో 16 మాత్రమే ప్రధానమైనవి. వీటిన్నింటిలోను చాలా ముఖ్యమైనది అక్షర గణపతి. . ఒక అక్షరం పలకాలంటే నోటి నుంచి బయటకొచ్చే గాలికి విఘ్నం కలిగించాలి. ఎక్కడ గాలికి విఘ్నం కలిగిస్తే ఆ అక్షరాన్ని స్పష్టంగా పలకగలుగుతామో తెలిపే ప్రఙ్ఞ మనకు ఇచ్చినందుకు అక్షర గణపతిని మనం పూజించాలి. ఇదే అక్షర గణపతి తత్వం. అందుకే వినాయక చవితినాడు పుస్తకాలను దేవుడి ముందుంచి దండం పెట్టుకుంటారు.
ఆరాధించే పద్ధతి
మన కన్నా అధిక శక్తిని ఆరాధిస్తున్నప్పుడు, ఆ శక్తిని మనం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. వీటిని ఆగమ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం డాన్స్ చేస్తున్న వినాయకుడు, క్రికెట్ ఆడుతున్న వినాయకుడు, మోడర్న్ వినాయకుడు...ఇలా ఇష్టమొచ్చిన తీరులో రక రకాల భారీ ఆకారాల్లో వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఈ విగ్రహాలను పూజించటం సరికాదు. ఇవి అలంకారానికే తప్ప పూజకు పనికిరావు. అందుకే ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా దాని పాదాల దగ్గర 12 అంగుళాలు మించనటువంటి మట్టి వినాయకుడిని పెట్టి ఆ విగ్రహానికే పూజ చేస్తారు. ఒకవేళ భారీ విగ్రహాలకే ప్రాణప్రతిష్ట చేయదలిస్తే దానికి అంతటి పూజ చేయాలి. అంతే సమానంగా అన్నదానం కూడా చేయాలి.
నిమజ్జనం చేసే పద్ధతి
వినాయకుడి పూజ చేశాక కచ్చితంగా నిమజ్జనం చేస్తాం. ఇలా నిమజ్జనం చేయకుండా ఉండకూడదా? అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. శాస్త్ర ప్రకారం 365 రోజులు ఇంట్లో ఉంచి పూజ చేయని విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేయాలి. నిమజ్జనాన్ని నీళ్లలోను, మట్టిలోను చేయవచ్చు. నీళ్ల సౌకర్యం లేనప్పుడు విగ్రహాలను పొలాల్లో వేయొచ్చు. ధాన్యపు గాదెల్లో దాచొచ్చు. వడ్లన్నీ అయిపోయాక విగ్రహం బయటపడుతుంది కదా! అప్పుడు దాన్ని తీసుకెళ్లి పొట్లపాదుల్లో ఉంచుతారు. వానాకాలం కాబట్టి వర్షం కురిసినప్పుడు పాదులోని మట్టిలో విగ్రహం కూడా కరిగి కలిసిపోతుంది.
గణపతిలో పృధ్వీతత్వం
గణపతి పృధ్వీతత్వానికి సంబంధించినటువంటి వాడు. అందుకే గణపతి మన శరీరంలో మూలాధారంలో ఉన్నట్టు చెప్తారు. మన శరీరానికి ఫ్రేమ్‌వర్క్ ఇచ్చేది మూలాధారం. ఈ మూలాధారం పృధ్వీతత్వానికి సంబంధించినది. సాలిడ్ మ్యాటర్‌ని బట్టే కదా ఆకారం బాగుండేది. ఆ సాలిడ్ మ్యాటర్ చక్కగా ఉండాలంటే భూమి బాగుండాలి. భూమి బాగుండాలంటే దాన్ని పాడుచేసేటటువంటి కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారైన బొమ్మలను వాడకూడదు. పూర్వం చెరువు మట్టితో బొమ్మలు తయారుచేసేవారు. ఇలా చేయటం వల్ల చెరువులో పూడిక తీసిన ప్రయోజనంతోపాటు మట్టి వినాయక విగ్రహాలు తయారుచేసిన ఫలం కూడా దక్కేది.
డాక్టర్ అనంత లక్ష్మి, డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
విగ్రహం ఇలా ఉండాలి
పూజకు పద్ధతులు ఉన్నట్టే విగ్రహం తయారీకి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే...
-విగ్రహం బోలుగా (డొల్లగా) ఉండకూడదు. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో అచ్చులు పోసి తయారుచేసిన విగ్రహాలు పూజకు పనికిరావు.
-విగ్రహం వెండిదైనా, బంగారంతో తయారైనదైనా బోలుగా ఉంటే అలంకరణకే తప్ప పూజకు పనికిరాదు.
- విగ్రహం ఆకారాన్ని బట్టి పూజ, సంకల్పం, నివేదన, అన్నదానం, సంతర్పణ చేయాలి.
- గణపతిని గూర్చి మనం ఏ శక్తిని ఆశిస్తూ పూజ చేస్తున్నామో ఆ ఽశక్తి అందాలీ అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజ చేయాలి.
- నీటిలో కరిగే మట్టి విగ్రహాలే తయారుచేయాలి.
మన దేహాన్ని ఆరోగ్యవంతంగా పోషించుకుంటేనే మనకు ధర్మ సాధన సాధ్యమవుతుందనే విషయం ‘‘శరీర మాధ్యంఖలు ధర్మసాధనమ్’’ అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది. అందుకే మనం జరుపుకుంటున్న పండుగలు, దైవారాధనలు పలు ఆరోగ్య సంబంధిత సూత్రాలతో ముడిపడి ఉన్నాయి. గణనాథునకు మనం చేసే ‘ఏక వింశఽతి పత్ర పూజ’లో ఉపయోగించే 21 రకాల ఔషధీవర్గ పత్రుల వెనుక ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుందాం..
మాచీ పత్రం పూజయామి!!
1. మాచీపత్రం/నాగదమని : ఆర్త్‌మీసియా వల్గారిస్- మంచి సువాసన గల పత్రి. తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.
బృహత్పత్రం పూజయామి!!
2. బృహత్పత్రం/ వాకుడాకు/ సోలానమ్ సురాటెన్స్ : దగ్గు, ఉబ్బసం, నంజు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.
బిల్వపత్రం పూజయామి!!
3. బిల్వపత్రం/ మారేడు/ ఈగల్ మార్మెలోస్ : ఈ వృక్షం బహు ప్రయోజనకారి. ఆకు పసరు పలు చర్మ దోషాలను నివారిస్తుంది.
దూర్వాయుగ్మం పూజయామి!!
4. దూర్వాపత్రి / గరిక గడ్డి/ సైనోడానీ డాక్టైలాన్ : రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలకు పనిచేస్తుంది.
దత్తూరు పత్రం పూజయామి!!
5. దత్తూర పత్రం/ ఉమ్మెత / దతూర ఇనాక్జియా : ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతములకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రీ, ఎలుక కాటులకు విషహరిణిగా పనిచేస్తుంది.
బదరీపత్రంం పూజయామి!!
6. బదరీ పత్రం / రేగు / జిజిఫస్ మౌరిషియానా : అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.
అపామార్గపత్రం పూజయామి!!
7. అపామార్గ పత్రం / ఉత్తరేణి/ ఎభిరాంఢస్ అస్పెరా : గాయాలను మాన్చటంలో, ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.
తులసీపత్రం పూజయామి!!
8. తులసీదళం/ బృందావని / ఆసిమమ్ సాంక్టమ్ : దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు, క్రిములను నశింపజేసేందుకు, మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది.
చూతపత్రం పూజయామి!!
9. చూతపత్రం/మధుఫల/ మాంజిఫెరా ఇండికా: మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కరవీర పత్రం పూజయామి!!
10. కరీవీర పత్రం/గన్నేరు / నీరియమ్ ఇండికమ్: తలచుండ్రును తగ్గిస్తుంది. ఈ మొక్కఅంతయూ విషతుల్యం కావున తగిన జాగ్రత్తలు తీసుకొని వాడాలి.
విష్ణుక్రాంత పత్రం పూజాయామి!!
11. విష్ణుక్రాంత పత్రం/వరకాంత ఇవాల్యులస్ అల్సినాయిడెస్ : దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది.
దాదిమీపత్రం పూజయామి!!
12. దాదిమీపత్రం /దానిమ్మ/ పునికాగ్రానేటమ్: శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది.
దేవదారుపత్రం పూజయామి!!
13. దేవదారు పత్రం / దేవదారు/ సెడ్రస్ దియోదారా: దేవదారు తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, ప్రేవుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి, లైంగిక ఉత్ర్పేరణకు ఉపయుక్తంగా ఉంటుంది.
మరువక పత్రం పూజయామి!!
14. మరువక పత్రం/ మరువం/ మాజోరానా హారైన్‌సిస్ : నరాల ఉతే్త్ప్రరణకు, చెవిపోటు, నొప్పులకు దీన్ని ఔషధంగా వాడవచ్చు.
సింధువారపత్రం పూజయామి!!
15. సింధువారపత్రం/ వాదిలి వైటెక్స్ నెగుండో: ఇది వాతం, శరీరం, తలమాడు నొప్పిని తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.
జాజిపత్రం పూజయామి!!
16. జాజిపత్రి/జాజి పువ్వు / జాస్మినమ్ గ్రాండిఫ్లోరమ్ : ఆకులు శరీరానికి వేడినిచ్చి శక్తిని కల్పిస్తుంది. వాపు, నొప్పిని తగ్గిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది.
గణకీపత్రం పూజయామి!!
17. గణకీపత్రం/ కామంచి/ కాకమాసి/ సోలానమ్ నైగ్రమ్ : కడుపులో నులిపురుగులను హరిస్తుంది.
శమీపత్రం పూజయామి!!
18. శమీపత్రం/జమ్మి ప్రోసోపిస్ సైనరేరియా: ఈ ఆకురసం తల చల్లదనానికి, జుట్టు నిగనిగ లాడేందుకు ఉపకరిస్తుంది. ఈ వృక్షం పైనుంచి వీచే గాలిని స్వచ్ఛంగాను, ఆహ్లాదంగాను ఉంచును
అశ్వత్థపత్రం పూజయామి!!
19. అశ్వత్థపత్రం / రావి/ ఫైకస్ రెలిజియోజా: శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు వినియోగిస్తారు.
అర్జునపత్రం పూజయామి!!
20. అర్జునపత్రం/ తెల్లమద్ది/ వీరతరు: దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి పనిచేస్తుంది.
ఆర్కపత్రం పూజయామి!!
21. ఆర్కపత్రం/ తెల్లజిల్లేడు కాలోట్రాపిస్ ప్రాసెరా : తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతివంతం చేస్తాయి.
- డాక్టర్ ఎస్.వి. రామారావు
ప్లాంట్ సైంటిస్ట్, ప్రగతి హెర్బల్ గార్డెన్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment