జలమే సమస్త జగతికి ఆధారము. సృష్టిలోని చరాచర ప్రాణికోటికి జలమే ఆధారభూతమైనది. జలం లేకుంటే ప్రాణికోటి మనుగడే కష్టమైపోతుంది. జలావిర్భావం తర్వాతనే ప్రాణి కోటి ఆవిర్భవించింది. అట్టి జలాన్ని దేవతగా భావించి, పూజించి తరిస్తున్నదీ మానవజాతి.
ఇది మన హిందువులకు అనాదిగా వస్తున్న సంప్రదాయము, సదాచారము. నదీస్నానాలు, కోనేటిస్నానాలు, సముద్రస్నానాలు, మాఘస్నానాలు, మంగళస్నానాలు మొదలగు ఎలా అయితే ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారాలో ఈ పుష్కర స్నానం కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. 12 ఏళ్ళకొకసారి వచ్చే నదీపుష్కరాలు మన హిందువులకేంతో పవిత్ర మయినవి. పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు. ఈ పుష్కరాలు మన దేశంలోని ముఖ్య నదులన్నిటికీ వస్తాయి.
గురుడు సింహరాశిలో ప్రవేశించగానే మూడు కోట్ల యాభై లక్షల తీర్థములతో కూడి పుష్కరుడు గోదావరి నదిని ఆశ్రయిస్తాడు. అలా ఆయన ప్రవేశించిన సంవత్సరములో మొదటి పన్నెండు దినములు, చివరి పన్నెండు దినములు ఆశ్రయించి ఉంటాడు.
మొదటి పన్నెండు దినములను ఆది పుష్కరములుగా, చివరి పన్నెండు దినములను అంత్య పుష్కరములుగా వ్యవహరించటం, ఉత్సవం జరపటం మనకు అనాదిగా వస్తున్న ఆచారము. ఒకసారి ఒక నదికి పుష్కరం వచ్చిన తరువాత మరల, పన్నెండేళ్ళకే ఆ నదికి పుష్కరాలు వస్తాయి.
ఈ ఏడాది గోదావరికి పుష్కరాలు వచ్చాయి. నాసిక్ లో పుట్టి ప్రవహించే గోదావరి మనకు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో పారుతూ ఉండటం వలన ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. అది 2015 సంవత్సరం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం అనగా 14 జూలై 2015 నాటి ఉదయం 6గం. 25ని. లకు గురువు సింహరాశిలో ప్రవేశించే దినం. అదే పుష్కర సమయం, పుష్కర ప్రారంభం.
ఈ పుష్కర సమయములో సూర్యుడు ఉదయించక ముందే లేచి నదిని స్మరిస్తూ స్నానం చేయాలి. దీనివలన పాపాలు పోతాయని నమ్మకం. ఇంకా నదిని స్తుతిస్తూ, భజనలు చేస్తూ మంగళ హారతులిస్తారు. ఈ సమయములో దేవుళ్ళందరూ ఆ నదిలో ఉంటారని గాఢంగా విశ్వసిస్తారు. పుష్కరాల కాలంలో నదీమతల్లికి హారతి యివ్వటం అంటే సకల దేవతలకు హారతులిచ్చినట్లే!! ఈ నమ్మకంతో భక్తులంతా తమ శక్తిననుసరించి హరతులిచ్చి, పుణ్యప్రదులౌతారు. పాప ప్రక్షాళనం చేసుకొన్న తృప్తి ననుభవించి తమ జీవితాలు ధన్యమైనాయనే మహదానందంతో శేషజీవితాన్ని గడుపుతారు
జీవులకు మూడు కర్మల ద్వారా ముక్తి లభిస్తుందట!!
1. రేవానదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి.
2. గంగాతీరాన తనువును వదిలితే ముక్తి.
3. కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి.
ఈ మూడింటి ఫలము పొందాలంటే పుష్కర సమయంలో పవిత్ర గోదావరి లో స్నానం చేస్తే ఫలితం లభిస్తుందని వేదం చెపుతోంది.
No comments:
Post a comment