ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 13 July 2015

కుంతిదేవికుంతిదేవి

నలుగురు వీరకుమారుల కన్నతల్లి, వివాహం కాకమునుపు సూర్యవర ప్రసాదంగా కర్ణుణ్ణి కన్నది. కన్నతోడనే కుమారున్ని గంగపాలు కావించింది. వివాహానంతరం పాండురాజు అనుమతితో యమధర్మరాజు, ఇంద్రుడు, వాయు అంశాన ధర్మజ, భీమార్జునులను కన్నది.

కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పదవీ స్వీకారం చేసి మహారాజు అయినా వారివద్ద రాజమాతగా అష్టైశ్వర్యాలు అనుభవించక ఆశ్రమవాసానికి వెళ్లుతున్న ధృతరాష్ట్ర దంపతులతో పయనమై వెళ్లిన సాధ్వి కుంతి.

"యదుకుల విమల పయఃపయోనిధి సుధాకరరేఖ, కమనీయకాంతినిలయ, అనవరతాన్నదానాభితర్పిత మునివిప్రజనాశీః పవిత్రమూర్తి వినయాభిమానవివేక సౌజన్యాది సదమల గుణరత్నజన్మభూమి పరమపతివ్రతాభరణాభిశోభిత, తామరసేక్షణ, దాల్మి యందు పృథివి బోనిదాని, బృథ యను కన్యక".

యదువంశమనే నిర్మల సముద్రానికి, చంద్రరేఖ వంటిది, మనోహరమైన తేజస్సుకు స్థానమైనది, ఎడ తెగని అన్నదానం చేత మునులను, బ్రాహ్మణులను తృప్తిపొందించి వాళ్ల ఆశీర్వచనం చేత పవిత్రమైన ఆకారంగలది, వినయం, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమ గుణాలచే రత్నాలకు జన్మ భూమి అయినది, పరమపతివ్రతలకు అలంకారం వలె ప్రకాశించేది, కమలాల వంటి కన్నులు గలది, ఓర్పులో భూమితో పోల్చదగింది, అయిన పృథ (కుంతి)ని పాండురాజు స్వయంవరంలో వరించి, వివాహం చేసుకున్నాడు.

సురల వరప్రసాదం చేత ఈమె నలుగురు బిడ్డల కన్నతల్లి అయింది. వారే కర్ణ-ధర్మజ-భీమార్జునులు.

ఈమె పుణ్యవతిగా, పవిత్రమూర్తిగా, ఆదర్శమాతృమూర్తిగా మనకు మహాభారతకావ్యంలో దర్శనమిస్తుంది.

కుంతిభోజుని యింట కుంతి కన్యగా పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి, వడ్డించి భక్తితో సేవించింది కుంతి. ఆ ముని సంతోషించి, ఒక దివ్యమంత్రాన్ని ప్రసాదించాడామెకు. ఆ మంత్రంతో ఏ వేల్పునైనా ఆరాధిస్తే, అతడు కోరిన పుత్రుని ఇచ్చి సంతోషపెడతాడు. అది ఆపద్ధర్మంగా వాడుకోతగినది మాత్రమే.

ఆ ముని వెళ్లిపోగానే ఆ మంత్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగ ఒడ్డుకేగి కుంతి, సూర్యుడిని స్మరించి అతని వంటి కొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు దివ్యతేజస్సుతో ఆమె వద్దకు దిగి వచ్చాడు. సహజకవచకుండలశోభితుడైన బిడ్డనిచ్చాడు. అతడే కర్ణుడు. అయితే కుంతి కోరికపై ఆమె కన్యాత్వం యథాతథంగా ఉండేటట్లు వరమిచ్చాడు సూర్యుడు. కుంతి సూర్యప్రేరితమై వచ్చిన ఒక మందసంలో కర్ణుడిని ఉంచి నదిలో వదిలింది. సూతుడొకడు ఆ పెట్టెను పట్టి కర్ణుని తన కుమారుడుగా పెంచుకున్నాడు. కుంతి కర్ణుని జన్మరహస్యము బైటపెట్టలేదు. అది దేవరహస్యంగానే ఉండిపోయింది.

కుంతి, మాద్రులను పాండురాజు వివాహమాడాడు. ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. ఒకచోట రెండు మృగాలు క్రీడిస్తుంటే చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందముడనే ముని తన భార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ, శాపంబెట్టాడు. నేను నా భార్యతో కూడినప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపొతావు అని శపించి ఆ ముని దంపతులు కన్నుమూశారు. పాండురాజు విషణు్ణడు, విరక్తుడు కూడా అయ్యాడు. భార్యాసమేతుడై శతశృంగపర్వతం చేరి ఘోరతపస్సు చేయనారంభించాడు. అది బ్రహ్మలోకానికి వెళ్లే దారి. కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే, పాండురాజు వారితో తానూ వస్తానన్నాడు. కాని వారు "అపుత్రస్య గతిర్నాస్తి" అని, నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హత లేదని చెప్పారు. వారి మాటలు పాండురాజును మరీ కృంగదీశాయి.

సంతానాన్ని గురించి కుంతీమాద్రులతో కలసి ఆలోచించాడు. దుర్వాసమహర్షి తనకిచ్చిన మహామంత్ర మొకటి ఉన్నదని, ఆపద్ధర్మంగా దానిని పుత్రలబ్ధికి వాడుకోవచ్చని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. కుంతిని పుత్రసంతానం కొరకు మంత్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. ఆమె భర్తకు ప్రదక్షిణం చేసి సమాహితచిత్తంతో మంత్రాన్ని జపించింది. సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైన ధర్ముని స్మరించి ఉత్తమధర్మవర్తనుడైన పుత్రుడిని కోరుకున్నది. ధర్ముని అంశాన, కురుకులదీపకుడైన యుధిష్ఠిరకుమారుడు అగ్రజుడుగా జన్మించాడు.

యుధిష్ఠిరుడు పుట్టినట్లుగా హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని గాంధారి అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని పొందలేకపోయి, అసూయతో కడుపుపై బాదుకొన్నది. గర్భపాతమై పోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను 101 లెక్కించి వేరు వేరు తైలభాండాలలో భద్రపరచాడు. వందమంది కుమారులు, ఒక్క కూతురు పుడతారని చెప్పివెళ్లాడు.

అక్కడ శతశృంగపర్వతం మీద పాండురాజు, కుంతిని వాయుదేవుని ఆరాధించి ఉత్తమజవసత్వుడైన కుమారుని పొందమన్నాడు. ఆమె అలాగే చేసింది. వజ్రదేహుడైన, విక్రమోన్నతుడైన భీమసేనబలుడు పుట్టాడు.

అదేరోజున హస్తినలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్ని, లోకాన్ని నాశనం చేయగల దుశ్శకునాలు పొడసూపాయి. దుశ్శాసనుడు మొదలైన 99 మంది సోదరులు, సోదరి దుస్సల జన్మించారు. కులనాశకుడైన దుర్యోధనుని వెలివెయ్యలేక పుత్రవ్యామోహంతో ధృతరాషు్ట్రడు పెంచుకున్నాడు.

పాండురాజు త్రిలోకవిజయుడైన పుత్రుని కొరకు ఒక సంవత్సరకాలం ఎకపాదంపై తపస్సు చేసి ఇంద్రుని వరం వల్ల లోకోత్తరుడు, స్థిరపౌరుషుడు, వంశకరుడైన అర్జునుని మూడవ కుమారుడుగా పొందాడు.

ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడు లోకాలు జయించినట్లు పొంగిపోయేవాడు.

రెండవ భార్య మాద్రి కూడా భర్త కోరికపై అశ్వినీ దేవతల వరప్రసాదంతో కవలపిల్లలను పొందింది. వారే నకులసహదేవులు. ఇలా పంచపాండవులు పుట్టి, దినదినప్రవర్ధమానులగుచున్నారు.

వసంతమాసం వచ్చింది. ఒకనాడు కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలైంది. మాద్రి ఒక్కతే పాండురాజు ప్రక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం వసంతప్రభావంతో అతని మనస్సు ఆకర్షించింది. మాద్రియొక్క పొందు కోరిన పాండురాజు మునిశాపం చేత మరణించాడు. మాద్రి పాండురాజుతో సహగమనం చేసింది. కుమారరక్షణకు కుంతి దృఢచిత్తంతో జీవించ సంకల్పించింది.

మాద్రీపాండురాజుల అంత్యక్రియల తర్వాత, వారి అవశేషాలతో అందరూ హస్తినాపురం చేరారు.

వీళ్లు దైవశక్తి వలన పుట్టిన వాళ్లనటంలో సందేహం ఏముంది? ఈ మనోహరమైన కాంతి, పోల్చి చూస్తే వీరు దేవతలే, ఈ విధమైన రూపసంపద, తేజస్సు సామాన్యమానవులకు ఉంటాయా? అని పౌరులు, పాండవులను కొనియాడుతూ సింహకిశోరులైన వారిని చూచారు.

రాజ్యమొకప్పుడు తన భర్తదే. ప్రస్తుతం అది బావగారి చేతిలో ఉన్నది. బావగారికి పుత్రులున్నారు. అందుచేత ఆ రాజ్యము తన కొడుకులకు వచ్చుటెట్లు? ఇది ఒక పెద్ద సమస్య. కాలము పరిస్థితులలో పెద్ద మార్పు తేగలదు. పాండవులు పెద్దవారైనారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పదిమంది ప్రశంసలందుకున్నారు.

కుమారాస్త్ర విద్యాప్రదర్శన మొక మలుపు. అర్జునుని అస్త్రవిద్యాకౌశలము జూచి అశేషప్రేక్షకలోకం ప్రశంసించుచుండగా ఆ తల్లి అనంత హర్షవిస్ఫారితలోచనయై రాకుమారులలో తన కుమారుని చూచుకొని ఎంతో పొంగిపోయింది. ఇంతలో పిడుగువలె కర్ణుడు రణరంగమున దూకినాడు. భుజ మప్పళించి పార్థునితో తలపడినాడు. ఎప్పుడో ఏటిలో పారవేయబడిన మొదటి కుమారుడింత ఘనుడై, కవచకుండలశోభితుడైన వాడిని గుర్తించి, ఆనందాశ్చర్యములు పెనుకొనగా, పుత్రులిద్దరు ప్రత్యర్ధులై సలుపు పోరులో ఎవ్వరేమగుదురో యన్న భయము ఆమెను క్రుంగదీసినది, అది చూసి తట్టుకొనలేక కుంతీదేవి మూరి్ఛల్లినది.

సేద తీరిన కుంతి గాంచిన దృశ్యము, ఆమెను నిలువునా దహించివేసింది. కర్ణుడందరి చేత కులము తక్కువవాడుగా అవమానింపబడినాడు. ఆ విషమసమయమున కర్ణుడు నిస్సహాయుడై, నింగినున్న సూర్యుని సాక్షిగా నిలువబడినాడు. ప్రత్యక్షసాక్షిగా నిలిచిన తాను ఆ పరిస్థితిలో ఎలా బయటపడగలదు? తోడికోడళ్ల ముందు, బావగారి ముందు, భీష్మ ద్రోణ కృపాది పూజ్యవృద్ధుల ముందు, కౌరవులముందు, కన్న కుమారుల ముందు, అశేష ప్రజానీకము ముందు తాను కన్యగానున్నప్పుడు జరిపిన అనుచిత శృంగార ఫలమీ కర్ణుడని కుంతియే గాదు, లోకమున ఏ స్త్రీయైనా ఎట్లు చెప్పగలదు? అందుచేత ఆమె ప్రథమ పుత్రస్నేహ మెరుక పడకుండనున్నది. కర్ణుడిని విధికి వదిలివేసింది.

కర్ణుడు కౌరవపక్షం చేరినాడు. పాండవులకు ప్రబల ప్రత్యర్థియైనాడు. పాండవుల కొరకు కర్ణుని వదలుకొనవలెను లేదా కర్ణుని కొరకు పాండవుల పరిత్యజింపవలెను, లేదా ఇరువురకు సంధి గూర్చవలెను. స్త్రీమూర్తి కుంతికది అసాధ్య విషయము. అప్పటి పరిస్థితులట్టివి. వ్యక్తుల ప్రవృత్తులట్టివి. పైగా ఆమెది బయటపడలేని మానసికస్థితి, ఎన్నో విషమసన్నివేశముల సహించి తల వంచి ఊరకున్నది.

యుధిష్ఠిర యౌవరాజ్యపట్టాభిషేకము, ద్రౌపదీ స్వయంవరము, రాజసూయ మహాయాగము, కుంతిదేవి జీవితంలో కొండంత ఆనందము నొసగు ఘట్టములు. తన జన్మచరితార్థమయ్యెనన్నంత తృప్తి నిచ్చు అంశములు. కాని ఈ ఆనందము గూడ ఆమెకెంతో కాలము నిలువలేదు. ద్యూతపునరూ్ద్యతములు, పాండవపరాజయ, ద్రౌపదీపరాభవములు, అరణ్యాజ్ఞాతవాసములు ఆ తల్లి హృదయమును మరల కల్లోలపరచినవి.

కానీ కొడుకుల తోడిదే లోకమని, కొడుకుల కొరకే జీవించి, వారి అభ్యుదయమునకే తన సర్వశక్తులు ధారబోసిన కుంతివంటి మాతృమూర్తి అడవుల పాలైన కొడుకులను విడిచి హస్తినలో ఉండడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించు విషయమే. వనవాసక్లేశమునకు ఒర్వలేదన్నది, ఒక కారణం కావచ్చును, కాని కుంతి మనోభావంలో పాండవులు 13 ఏండ్లు పదవికి, ప్రజలకు దూరమగుచున్నారు. పాండవులు మరల వత్తురన్న విశ్వాసము ప్రబలముగ ప్రజలలో నెలకొనుటకు, పాండవ ప్రతినిధిగా ఒక ప్రముఖ వ్యక్తి హస్తినాపురమున వుండటం, ఎంతో ముదావహం. అందుకు తగిన వ్యక్తి కుంతిదేవియే. ఆమె ఉండదగిన ఇల్లు పాండవుల హితైషియైన విదురుని గృహమే. ఆమె కురుపాండవ రాజ్యవ్యవహారము తెగిపోలేదని తెలుపు దృఢతంతువుగా నిలిచింది.

కుంతి, పాండవుల అరణ్యాజ్ఞాతవాసముల తరువాత, ద్రుపద పురోహితు రాయబారము, సంజయరాయబారము విఫలమగుట గుర్తించినది. సామా్రజ్య మేలవలసిన సుతులు దిక్కులేనివారై ఊరకుండుటకు, వీరమాతగా, రాజమాతగా, విరాజిల్లవలసిన తాను పరుల పంచన పొట్టపోసికొనుటకు ఆమె హృదయము కుమిలిపోయినది. రాయబారమునకు వచ్చిన కృష్ణునితో తన హృదయవేదనను తెలియపరచింది. స్త్రీ స్వభావ సహజముగా మేనల్లుని కౌగిలించుకుని ఎలుగెత్తి రోదించింది.

కొడుకుల దుఃస్థితిని, కోడలి ఘోరావమానమును గుర్తు చేసినది. 13 ఏండ్లు బావ కొడుకు పెట్టే దయమాలిన తిండి తినటం ఒక ఎత్తుగా ఉన్నది. నేనేమి చెప్పగలను అంటూ, ఇట్లాంటి కఠినచిత్తుల ఇంటికి నన్ను కోడలిని చేసిన నా పుట్టింటి వారినే దూషించాలి. అట్లా దూషించటం కూడా సమంజసం ఔతుందా అని ప్రశ్నించింది.

ఆమె వీరమాతగా కొడుకులకు పౌరుషము కూర్చుట అవసరమని భావించి, శ్రీకృష్ణునితో "కొడుకు గాంచు రాచకూతురెద్దానికి? నట్టి పనికి నుచితమైన సమయ మొదవె దడయు టింక నొప్పుడు, జనములు, నట్లు గాని పురుషు లనరు మిమ్ము"
-క్షత్రియకన్య పెండ్లాడి కొడుకును ఏ కార్యానికై కంటుందో అట్టి ప్రతాపప్రదర్శనకు తగిన అదను సంప్రాప్తించింది. ఇక ఆలసించటం తగదు. అప్పుడు గాని మిమ్మల్ని ప్రజలు మగవారిని అనరు సుమా!
ఆకలి తెలిసి అన్నం పెట్టేది, అదనెరిగి ఆగ్రహించేది, అనువుగా మందలించేది, ఆదర్శంతో తీర్చిదిద్దే తల్లి కుంతి. వీరమాతగా శ్రీకృష్ణుని ద్వారా కుమారులకు పంపిన సందేశం కొరడాతో జళిపించేదిగా ఉంది.

"భుజబలమున జీవించుట నిజధర్మము మెత్తబడుట నింద్యము, మాద్రీప్రజలకు జెప్పుము ద్రుపదాత్మజకార్యం బడుగు మనుము తగ నందరతోన్"
మాద్రీనందనులైన నకులసహదేవులతో, బాహుబలంతో బ్రతకటం క్షత్రియధర్మమనీ, అణగిమణగి ఉండటం దూషింపదగిన విషయమనీ చెప్పుము. తన కర్తవ్యమేమిటో ద్రౌపది నడిగి తెలిసికొండని పాండవులందరితో చెప్పుము - అంటూ కన్న కొడుకులకు కర్తవ్యబోధ చేసింది మాతృమూర్తి కుంతీదేవి.

కురుపాండవ రాజ్యసమస్యను పరిష్కరించుటకు, మహాభారత సంగ్రామమును నివారించుటకు, కొడుకులందరు సుఖముగా జీవించుటకు, కుంతీదేవి ఎంతో సాహసంతో ఏకాంతమున కర్ణుని కలిసినది. అతని జన్మరహస్యమును చెప్పినది. పాండవపక్షమునకు రమ్మని కోరినది. పరిస్థితులను చక్కదిద్ద ప్రయత్నించినది. కాని ప్రయోజనము లేకపోయినది. ప్రయత్నమాలస్యమైనది. పరిష్టితులు పాకము దప్పినవి. కర్ణుడు పాండవపక్షమునకు ససేమిరా రానన్నాడు. కర్ణుని కుంతి వరము కోరినది. దీని వలన కర్ణుని కాళ్లకు బంధము పడినది. కాని కర్ణుడు వరమిచ్చాడు. పాండవులు ఐదుగురే కాని, ఆరుగురు కారన్నాడు. కర్ణపార్థులలో ఒక్కరే దక్కుతారని సెలవిచ్చాడు. తల్లి మాటకు కట్టుబడ్డాడు.

మహాభారత సంగ్రామానంతరం మృతవీరులకు ధృతరాష్ట్ర ధర్మజులు తిలోదకములు వదులుచున్నారు. కర్ణుడు సూతుడని ఇద్దరూ ఉదకములు వదలలేదు. కుంతి గుండెలో అగ్నిపర్వతం బ్రద్దలైనది. కర్ణునికి జీవితములో తానెంతో అన్యాయము చేసినది. అతని మృతికి గూడ తాను పరోక్షకారణమైనది. ఇప్పుడింకను అతని జన్మరహస్యమును దాచి, తిలోదకములు కూడా ఆ కుమారునకు దక్కకుండా జేయుచున్నది. కుంతి దుఃఖావేశమిక ఆగలేదు. అది ఉప్పెన వలె పైకి పొంగినది. స్త్రీ సహజమైన లోకాపవాదభీతిని దాటినది. తెగించి ధర్మజునితో "మీకు అగ్రజుండు నాకు భాస్కరు దయ లలిత కవచకుండలముల తోడ బుట్టినాడు గాన, బోయంగ వలయు దిలోదకంబులమ్మహోన్నతునకు"
"మీ ఐదుగురికీ ఆయన అన్నగారు. సూర్యుడి వరప్రసాదంగా నాకు సుందరమైన కవచకుండలాలతో పుట్టాడు. అందువలన ఆ మహానుభావుడికి తిలోదకప్రదానం మీరు చేయాలి" అని కర్ణ జన్మరహస్యము వెళ్లగ్రక్కి తిలోదకములు వదలమని కోరినది.

జీవితంలో ఎంతో శ్రమపడి, ఎన్నో కష్టములకు ఓర్చి పాండవులను పెంచి పెద్దచేసి, వారు ప్రత్యర్థులను గెల్చి పట్టాభిషిక్తులైన సమయమున, రాజమాతగా భోగభాగ్యములనుభవింపకుండ, పుత్రశోకపరితాత్ములైన గాంధారీధృతరాషు్ట్రల వెంట మనశ్శాంతికై తాను గూడ ఆశ్రమవాసమునకు ఏగినది.

ఆశ్రమవాసమేగు కుంతితో వెళ్లవద్దని వారించిన కుమారుడు ధర్మజునితో, "నేను గాంధారీ ద్రుతరాషు్ట్రలకు సేవ చేయటానికి మాత్రమే సమర్థురాలిని, వారు అడవులకు పోగా ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్పదు. కర్ణుని మనస్సులో స్మరిస్తూ దేవుడు వంటి ఆ కర్ణుడు నాకు జన్మించిన సంగతి వంచనతో మరుగు పరచాను. ఆ కర్ణుడి జననాన్ని గురించి తెలియకుండా చేయటం పాపం. అందుకు నా మనస్సులో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. నిర్మల హృదయుడివైన ధర్మరాజా! ఆ పాపం తొలగిపోయేటట్లు నీవు గొప్ప గొప్ప వస్తువులు దానాలు చేయుము. కర్ణుడావిధంగా మరణించటం తెలిసి కూడా నా మనస్సు నూరు ముక్కలైపోలేదు. చూడగా ఈ మనసును ఎంతో బలమైన రాయితో తయారు చేసి ఉంటాడు ఆ దేవుడు. నీవు, నీ తమ్ములూ మహాత్ముడైన ఆ కర్ణున్ని భక్తితో స్మరిస్తూ ఉండండి. ద్రౌపదిని సగౌరవంగా ఎప్పుడూ ఆదరించండి. సహదేవుణ్ణి ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా చూచుకో" అంటూ తుదిపలుకులు పలికింది తల్లి కుంతీదేవి.

కర్ణుడు బ్రతికి ఉన్నన్నాళూ్ల అగ్రజుడు అని తెలియక ఆదరించలేకపోయారు పాండవులు. అందుకే ఇప్పుడు ఎలాగూ మరణించాడు కాబట్టి గతకాలవైరం మనసులో ఉంచుకోకుండా భక్తిభావంతో తలచుకొమ్మంటుంది కుంతి. ఆమె హృదయవ్యథ ఎంత తీవ్రమో తెలియగలదు.

ఆశ్రమవాస సమయమున తన కడుపుకోతను మామయైన వ్యాసమహర్షితో తెలుపుకొన్నది. ఆయన ఓదార్పు మాటలతో, ఆయన యోగమహిమచే కూర్చిన కర్ణస్వర్గసుఖానుభవదర్శనముతో కుంతి కొంత ఊరట చెందింది. గాంధారీ ధృతరాషు్ట్రల సేవతో గంగాద్వారమున వారితోపాటు ప్రశాంతచిత్తయై దావాగ్నిమధ్యమున తనువు చాలించినది. ధన్యజీవి పాండవ రాజమాత కుంతీదేవి!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML