ఆ దేవిని కొలిస్తే బంగారమే..
(అష్టాదశ శక్తిపీఠాలు-7)
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో శ్రీమహాలక్ష్మీదేవికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో 7వదిగా విరాజిల్లుతోంది. సతీదేవి నయనాలు ఈక్షేత్రంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం క్రీ.పూ 4,5 శతాబ్దాల క్రితం నిర్మించి ఉండొచ్చని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రళయకాలంలో నీట మునిగిన ఈ క్షేత్రాన్ని అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి ‘కరవీర క్షేత్రమనే’పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ కథ ఉంది.
అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు .. ప్రతి ఏటా కాశీ వెళ్లి శివుడిని దర్శించుకునేవాడు. అయితే వయోభారంతో సుదూరంలో ఉన్న కాశీక్షేత్రాన్ని దర్శించుకోలేక శివుని గురించి తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన పరమశివుని ..కాశీక్షేత్రదర్శనం కష్టమౌతోందని.. ప్రత్యామ్నాయంగా మరో క్షేత్రం చూపించమని అగస్త్యుడు శివుడిని కోరతాడు.
కాశీతో సమాన ప్రాశస్త్యమున్న నగరం కొల్హాపూర్ క్షేత్రమని.. అక్కడ శ్రీమహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారని.. ఆమెను దర్శించుకుంటే తనను కాశీలో దర్శించుకున్న పుణ్యఫలితాన్నిస్తుందని శివుడు చెబుతాడు. ఆయన ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్ లో ..మహాలక్ష్మిని.. అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని..ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.
ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించినంత మాత్రానే కష్టాలు తొలగి.. సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
- భారత్ టుడే
No comments:
Post a Comment