ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 13 July 2015

పుష్కరం అంటే?పుష్కరం అంటే?

మానవ జీవనానికి మూలాధారమైంది నీరు. నదీ తీరాలలోనే నాగరికతా సుమాలు వికసించాయి. నీరు, మట్టి, మానవుడు అనే మూడు అంశాలకు గల అవినాభావ సంబంధం తెలియజేసేవే పుష్కరాలు. అయితే, పుష్కరం అన్న పదానికి జలం, ప్రాణాధారం అన్న అర్థాలున్నాయి.

పుష్కరం అన్న పదం విస్తృతార్థ సంబంధమైంది. పుష్కం పోషణం రాతి ఆదత్తే అసౌ పుష్కరా పుష్క-పోషణమును రాతి-పొందునది అనగా పోషించునది అని అర్థం. సంస్కృతంలో రలయోరభేదః అన్న సూత్రం ప్రకారం పుష్కర, పుష్కరా అని చెప్పబడింది. పుష్కర అంటే వ్యాపించునది అని కూడా అర్థం వస్తుంది.


పుష్కరమన్న పదానికి తామర, ఆకాశం, పాలు, ఏనుగు తొండపు కొనలు, ఓషధి, ద్వీపం, పక్షి తీర్థం, రాగం, స్వర విశేషం, సూర్యుడు, ముఖము, కాండము, ఖడ్గ ఫలము అన్న అర్థాలను విశ్వకోశం చెప్పింది.

పద్మ పురాణంలో పుష్కరమంటే యోగమని చెప్పబడింది. సూర్యుడు విశాఖ నక్షత్రములో, చంద్రుడు కృత్తికలో ఉన్నప్పుడు అది పుష్కరమను యోగము. యోగములందతి దుర్లభమిది అని పేర్కొనబడింది.
పుష్కరమంటే భూమి. పద్మ పురాణం నారాయణుని నాభిమండలం నుండి భూమి ఉద్భవించిందని చెబుతోంది. కమలానికి పుష్కరమని పేరు. కనుక భూమి కూడా ఆ పేరుతోనే పిలవబడుతున్నది.
పుష్కరమంటే మఱ్ఱిచెట్టు. మత్య్స పురాణంలో పుష్కర ద్వీపాన పుష్కర వృక్షములు గలవు అని చెప్పబడింది. ఆ క్షేత్రంలో మఱ్ఱి చెట్లుండటం వల్ల ఈ అర్థం వచ్చింది. విష్ణు పురాణం కూడా ఈ అర్థమే చెప్పింది. విష్ణువు వటపత్రశాయి. ఈ సంబంధానికి ఆ పేరు ప్రసిద్ధమైంది.

పుష్కరమంటే నీరు, పవిత్రీకృత జలం. ఈ అర్థమే ప్రస్తుతం ప్రసిద్ధిని పొందింది.

ప్రకృతి పంచ భూతాత్మకం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం - ఇవే పంచభూతాలు. ఈ క్రమంలో జలం ద్వితీయ స్థానమేగాదు, అద్వితీయ స్థానాన్ని అక్రమించింది. నీరు నుండి భూమి, భూమి నుండి ఓషధులు, వనస్పతులు, తరువాత ప్రాణులు పుట్టాయన్నది వేదం. అద్జ స్సంభూత అంటే-నీటి నుండి విష్ణువు పుట్టాడని, నారములనగా జలములు., అవి స్థానముగా గలవాడు కనుకనే నారాయణుడయ్యాడని శ్రుతి తెలిపింది. త్రిమూర్తులలో విష్ణువుకు పోషకత్వ బాధ్యత అప్పగించబడింది. కాగా, జలమునకు పుష్కరమని కూడా పేరు. పుష్కరాఖ్య తీర్థ రూపావా అన్నారు. పుష్కరమంటే పోషించునది అని కూడా అర్థం. బాహ్యాంతరాలను పోషించేది నీరు గనుక జలముకు పుష్కరమని కూడా పేరు. పుష్కరం ప్రాణాధారం -అంటే నీరే ప్రాణాధారం అని వేదం చెప్పింది కూడా.
పుష్కర కాలంలో నదులలో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, పితృదేవతలు, రుషులు నివసిస్తారట. మూడున్నర కోట్ల తీర్థాలు అందులో కలుస్తాయట. అందుకే పుష్కర స్నానం అనంత ఫలదాయకం.
చివరగా, పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలనీ అర్థం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ పుష్కరాలు వస్తాయి. ఈసారి జరుగుతున్నది మహా పుష్కరం. అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML