ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 5 June 2015

ఋష్య శృంగుడు

ఋష్య శృంగుడు

ఋష్యశృంగ మహర్షి అందరిలోను విశిష్టమయిన మహర్షి. ఋష్య శృంగుడు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రకృతి వికశిస్తుంది.సువృష్టి కుదురుతుంది అని పురాణవచనం. అంతే కాకుండా ఏమీ తెలియక తన ప్రవృత్తి తన తండ్రి ఆజ్ఞ తప్ప వేరొక లోకం తెలియని అమాయకమైన విజ్ఞాని తన ఆశ్రమవాసమే లోకంగా పెరిగిన చక్కటి బ్రహ్మచారి ఋష్యశృంగుడు. ఈయన తండ్రి విభాండక మహర్షి. విభాండక మహర్షి తండ్రి కశ్యపుడు. విభాండక మహర్షి తొలినాటి నుండి అస్భలిత బ్రహ్మచారిగా తపము ఆచరించు చుండెను. ఒక నాడు ఒక మడుగులో స్నానమాచరించు సమయంలో ఒక ఊర్వశి అతనిని చూడవచ్చి తన విలాసహాసములు ప్రదర్శించి అతని కామప్రేరణ జరిగేలా చేసినది. అంతట విభాండకుని నుండి వీర్యము ఆమడుగులో పడెను. దానిని ఒక మృగము తాగి వెంటనే గర్భము దాల్చెను. ఆమృగము శాప ప్రభావంలో ఉన్న ఒక అప్సరస. ఆమె ఇంద్ర సభలో నాట్యము చేయుచుండగా కొన్ని లేళ్ళు అచ్చటకు వచ్చి వినోదము చేయసాగినవి. ఈ అప్సరస పేరు "చిత్ర రేఖ". ఈమె ఆ లేళ్ళ మీద దృష్టి ఉంచి నాట్యము చేయుచున్నది. నాట్యము మీద దృష్టి లేక కేవలము లేళ్ళ మీద దృష్టి ఉంచి నాట్యమాడు అప్సరస మీద కోపముతో ఇంద్రుడు "నీవు మృగివై పుట్టుము" అని శపించెను. అంతట బాధతో చిత్రరేఖ శాపోపశమనం తెలుపమని ఇంద్రుని వేడుకొనెను. అందుకు ఇంద్రుడు కరుణించి విభండకుడు అను మహర్షి వీర్యము చేత నీవు పుత్రుని కనెదవు.అటు పిమ్మట నీకు శాపవిమోచనం కలుగును అని తెలిపెను. ఆ శాప ప్రభావము చేతనే విభాండకుడు స్నానమాడు మడుగు దగ్గరకు వచ్చి అతని వలన పతనమయిన వీర్యము కలిసిన నీటిని త్రాగి గర్భిణి అయ్యెను. కొంత కాలమునకు ఆమృగము మనుష్య రూపము దాల్చిన పుత్రుని కనెను. అంతట శాపవిమోచనం కాగా ఆమె ఇంద్రలోకము చేరెను. ఆ బాలుడు మనిషికి మృగమునకు పుట్టిన కారణంగా ఆ బాలునికి మానుష్య రూపము మరియు ఒక శృంగము(కొమ్ము) ఉండెను. అందుకే అతనికి ఋష్యశృంగుడు అను పేరు వచ్చినది. అతడు అరణ్యంలోని పశుపక్ష్యాదుల సమక్షంలోనే పెరగసాగెను. ఒకనాడు విభాండకుడు పిల్లవాడిని చూచి తన దివ్య దృష్టితో గమనించి ఈ పిల్లవాడు నా కుమారుడే అని గమనించి తన ఆశ్రమమునకు తీసుకుపోయి పెంచసాగెను. బాల్యము నుండి ఋష్యశృంగునకు తండ్రి , తండ్రి ఆశ్రమమే లోకము. యితర వ్యాపకము లేదు. యితరులెవ్వరు తెలియదు. స్త్రీస్పర్శ, స్త్రీ రూపము ఎరుంగక పెరిగిన వ్యక్తి ఋష్యశృంగుడు. విభాండకుని ఆశ్రమంలో స్త్రీ ప్రవేశం లేదు. అక్కడ ప్రకృతి కూడా విభాండకుని ఆజ్ఞానుసారమే జరగాలి. తన ఆజ్ఞలేనిదే ఆశ్రమంలో ఎటువంటి చర్యలు జరగవు. అటువంటి వాతావరణంలో ఋష్యశృంగుడు ఉపనయనము పూర్తి గావించుకొని అద్వితీయ బ్రహ్మచర్య దీక్షతో ఘోరతపము చేయుచుండెను. అతని తపమునకు మెచ్చిన ఇంద్రుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ సువృష్టి కలుగు రీతిలో వరమిచ్చెను. అంతే కాకుండా ఋష్యశృండు సంచరించు ప్రాంతములో అథి వ్యాధులు ఏమీ ఉండవని వరమిచ్చెను.

ఋష్యశృంగ వివహము :- ఇది ఒక పెద్ద ఘట్టము చాలా విచిత్రమ. సృష్టిలో ఈ రీతిగా ఈ ప్రక్రియ ఎవ్వరికీ జరగలేదు. దీని విషయం తెలుసుకోవడానికి రామాయణం బాలకాండ పూర్తిగా ఎనిమిదవ సర్గ నుండి పదిహేనవ సర్గ వరకు చదవవలసినదే. దాని సారము ఏమనగా దశరధుడు పుత్ర ప్రాప్తికై అశ్వమేధయాగం చేయ నారంభించినాడు. సరయూనదికి ఉత్తర దిక్కులో యజ్ఞ భూమిని ఏర్పరిచారు. ఈ సందర్భంలో దశరధునితో ఆయన మంత్రి సుమంతుడు ఋష్యశృంగుని చే ఈ యాగము చేయింప ఒక ప్రస్తావన చేయుట మరియు ఋష్యశృంగ రోమపాద- శాంతల కథ తెలిపెను. ఒకనాడు రోమపాదుడు చేసిన పొరపాటుకు అతని రాజ్యమంతయు క్షామము వచ్చెను. అతనికి వేదపండితుల సలహా మేరకు తన రాజ్యమునకు ఋష్యశృంగుని రప్పింప ఆలోచన కలిగెను. కానీ ఆ మహర్షిని తెచ్చు ధైర్యము ఏ మహర్షి , ఏ బ్రాహ్మణుడు చేయుటలేదు. ఋష్యశృంగుని తండ్రి విభాండకుడంటే అందరీకీ భయము. అందువలన అందరూ ఏమీ చేయ లేక పోయిరి. అప్పుడు ఆయన పురోహితులద్వారా ఒక ఉపాయము చేసెను. అందమైన వేశ్యలకు బాగా ఆలంకరింపజేసి వారిద్వారా చక్కటి విచిత్రమైన బహ్రమానము ఋష్యశృంగునికి అందునటుల చేయు ఆలోచన చేసెను. అందులో బాగంగా వారు విభాండకుని ఆశ్రమం బయట బస ఏర్పాటు చేసుకొని వారు విభాండకుడు లేని సమయంలో ఋష్యశృంగుని దృష్టి వారి మీద పడునటులుగా చేసుకొనిరి. ఋష్యశృంగునికి స్త్రీ పురుష బేధం లేకుండ పెరిగిన కారణంగా ఆ వేశ్యలను చూచి వారు ఏదో ఆశ్రమమునకు చెందిన వారిగా భావించిరి. వారిని తమ ఆశ్రమమునకు విచ్చేయమని ప్రార్థించిరి. వారు అడుగగా తాను విభాండక మహర్షి పుత్రుడనని తెలిపి తన వివరములన్నియు పూర్తిగా తెలిపెను. విభాండకుడు లేని సమయములో ఈ వేశ్యలు ఆశ్రమంలో ప్రవేశించిరి వారు ఋషి పుత్రులని భావించి ఋష్యశృంగుడు వారికి అర్ఘ్యపాద్యాదులు యిచ్చి వారికి తన ఆశ్రమంలోని మధుర ఫలాలను భక్షణ యిచ్చిరి. వారు వారి దగ్గర ఉన్న లడ్డూ భక్ష్యభోజ్యాదులు ఋష్యశృంగునిచే తిని పించి అతనికి ఈ రుచుల మీద ఆశక్తి కలుగునటుల ప్రేరణ చేసిరి. అంతేకాక ఈ వేశ్యలకు విభాండకుడు తిరిగి ఆశ్రమంలోకి వచ్చే లోపల ఆశ్రమం వదలి వెళ్ళాలి అనే కాంక్ష బాగా కలిగెను. అందునిమిత్తంగా వారు బయలు దేరి వెళుతూ ఋష్యశృంగుని కౌగిలించుకొని వెళ్ళిరి. వారు ఋషిపుత్రులనే భావనలో ఉన్న ఋష్యశృంగుడు వారి నడవడి వారి భక్ష్యభాజ్యదులు బాగా ఆకర్షించినవి. అయితే ఆనాటి నుండి మరలా వారిని కలవవలెను అనే భావనలో వున్నాడు. మరుసటిరోజు విభాండకుడు ఆశ్రమంలో లేని రోజున ఋష్యశృంగుడు వేశ్యలు ఉన్న ప్రాంతమునకు చేరెను. అతనికి కూడా వారు సాదరంగా ఆహ్వానం పలికి అతడికి అర్ఘ్యపాద్యాదులు యిచ్చి సత్కరించిరి. మీరు మా ఆశ్రమమునకు వస్తే యింకా విశేషములు చూడవచ్చు మా ఆశ్రమ విశేషాలు తెలుసుకొన వచ్చు అని చెప్పి అతనిని అంగదేశమునకు గొని పోయిరి. రోమపాదుడు ఋష్యశృంగుని అర్ఘ్యపాద్యాదులతో ఆహ్వానించెను. వెంటనే అంగదేశము సువృష్టిని నోచుకొనెను. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగుని కి యిచ్చి వివాహము చేసెను. శాంత దశరధుని ఔరసపుత్రిక రోమపాదుని దత్తపుత్రిక.

దశరధునికి సుమంత్రుడు ఈ వివరములు తెలిపి ఋష్యశృంగుని పర్య వేక్షనలో ఈ అశ్వమేధయాగము చేయింపగోరెను. యిది సనత్కుమారుడు రోమపాదునితో తెలిపిన విషయంకూడ. అందువలన వెంటనే దశరధుడు, అంగదేశమునకు తన రాణులతో సహ బయలు దేరి వెళ్ళి రోమపాదుని ఇంట ఎనిమిది దినములు గడిపి రోమపాదునితో తన రాకలో గల ఆంతర్యమును తెలిపి ఋష్యశృంగుని అనుమతి తీసుకొని ఋష్యశృంగశాంతలను తన అయోధ్యకు గైకొనిపోయెను. అయోధ్యావాసులకు ఋష్యశృంగశాంత ల ఆగమన వార్త తెలిసి నగరాన్ని బహుసుందరంగా అలంకరించిరి. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు దశరధుని చేత వశిష్టాదులు ఋష్యశృంగుని పర్య వేక్షణలో యాగారంభము చేసితిరి. సంవత్సర కాలమునకు యాగము పూర్తయినది. అనంతరం ఋష్యశృంగుడు అధర్వ వేద మంత్రాలతో కూడిన పుత్రకామేష్టి యాగము చేసిరి. ఋష్యశృంగ సలహా మేరకు చేసిన ఈ యాగ ప్రభావము గానే రామలక్ష్మణభరతశతృజ్ఞులు ఉదయించిరి

ఋష్యశృంగ పూజ చేసినను సువృష్టి కలుగునని పురాణ వచనము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML