అష్టావక్రుడు
పూర్వము " ఏక పాదుడు " అనే సద్ర్బాహ్మణుడు ఒకరు వుండేవారు. అతనికి " సుజాత " అనే భార్య కూడా ఉండేది. ఆమె భర్తకు సకలోపచారములు సంతోషముగా చేయుచుండేది. వేద వేత్తగు ఏకపాదుడు ఎప్పుడూ వేదధ్యాయనము చేయుట మరియు విద్యార్ధులకు వేదము నేర్పుట యిదే ఒక తపస్సుగా చేయుచుండేవాడు. కొంత కాలమునకు సుజాత గర్భధారణ చేసినది. గర్భమున ఉన్నవాడు అష్టావక్రుడు. అష్టావక్రుడు గర్భంలోనే ఉండగానే తన తండ్రిచేయు అధ్యయన అధ్యాపనల ప్రభావంగా వేద వేదాంగములు నేర్చుకొనెను. అధ్యయనం అనగా తను చదువుకోవడం అధ్యాపనం అనగా యితరులకు భోధించడం. అయితే ఒకనాడు ఏకపాదుని విద్యార్ధులు వేదములోని స్వరము సరిగా పలకకపోవుట గమనించిన అష్టావక్రుడు తన తండ్రికి గర్భము నుండే "స్వరము తేడా పలుకుచున్నారు సరి చేయండి"అని తెలిపెను. వేదంలో అక్షరాలకు సంభంధించినటువంటి " ఉదాత్తము " " అనుదాత్తము " " స్వరము " " దీర్ఘస్వరము " అనునవి ఉంటాయి. అక్షరము కిందకు పలుకుట సమంగా పలికుట, అక్షరము పైకి పలుకుట, అక్షరము పైకి పలుకుచూ దీర్ఘముగా పలుకుట వంటివి ఈ స్వరములతో కూడిన అక్షరములు పలికుటలో తేడా పలికిన ఎడల మంత్రమునకు అర్ధము మారిపోవును. వేదమంత్రములకు స్వరమే ప్రాణము. నిరంతరం వేదాధ్యయనము చేయు విద్యార్ధుల విషయంలో అష్టావక్రుడు ఏకపాదునితో గర్భము నుండి నేను యింత అధ్యయనం చేశాను. ఈ నీ విద్యార్ధులు ఎందుకింతకాలం అధ్యయనం చేయుచున్నారు అని అడిగెను. ఏక పాదుడు గర్భంలో ఉన్న తన కుమారుని ప్రతిభకు సంతోషించాడు. అయితే తండ్రితో ఈ రీతిగా వక్రసంభాషణలు చేయుట క్షమార్హము కాదు. అందువలన ఏకపాదుడు ఆగ్రహించిన వాడయి గర్భస్థ శిశువును " అష్టావక్రములతో " జన్మించుము అని శపించెను.
సుజాత ప్రసవ సమయం దగ్గరకు వస్తుండగా ధనార్జనకు జనకమహీపాలుని సభకు వెళ్ళమని సలహా యిచ్చింది. ఏకపాదుడు అట్లే చేసెను. ఆసమయంలో జనక మహారాజు ఆస్థానంలో ఒక విశేషం జరుగుతున్నది. వరుణుని పుత్రుడు " వంది " జనక రాజాస్థానంలోనే వున్నారు. ఆయనతో వాదనలు జరిపి గెలిచినవారికి సన్మానం చేయడం గెలవని వారికి " జలమజ్జనం " చేయడం అనేది ఒక విధానంగా జరుగుతున్నది. దానికి కారణం వరుణుడు ఒకయాగం చేయుచున్నారు. దానికి చాలా మంది విద్వాంసులు కావలసి ఉన్నది. అయితే విద్వాంసులను జలమజ్జనం అనే నెపంతో ఆ జలమజ్జనం నుండే వరుణ యాగమునకు పంపుతున్నారు. చూపరులకు అది శిక్షలాగ అని పిస్తున్నది గానీ యాగవసర నిమిత్తంగా చేయుకార్యమే. అయితే ఏకపాదుడు మాదిరిగానే ఎందరో విద్వాంసులు తపో నిష్టాగరిష్టులు వారి అవసరాల నిమిత్తం జనకమహారాజు కొలువుకు వస్తున్నారు. వంది చాలా గొప్ప పండితుడు కావున అతనిని సాధారణంగా ఓడించడం కష్టము. అతని పాండిత్యము దైవదత్తము. అందువలన యిటువంటి విధానం ఒకటి రూపొందించారు. ఏకపాదుడు వాదనకు అంగీకరించి వందితో ఓడిపోయి- యధాప్రకారం జలమజ్జితుడు అయ్యారు.
ఈ లోపల సుజాత ప్రసవించినది. పుత్రుడు ఎనిమిది వంకరలతో పుట్టిన కారణంగా అతడికి ' అష్టావక్రుడు ' అనే పేరు సార్ధకమయినది. తండ్రి శాపం నిజమైనది. అదే సమయంలో సుజాత తండ్రి ఉద్దాలకునికి శ్వేతకేతు అనే పుత్రుడు జన్మించాడు అష్టావక్రుడు శ్వేతకేతు ఇరువురూ ఏకసంథాగ్రాహులు. వారిరువురూ ఉద్దాలకుని దగ్గర విద్యాభ్యాసం చేయసాగిరి. వారిరువురూ విద్యాభ్యాసములందు మంచి శూరులయిరి. ఒకనాడు ఉద్దాలకుడు అష్టావక్రునితో నీ తండ్రి కడకు పొమ్ము అని కోపముతో చెప్పెను. అప్పటిదాక ఉద్దాలకుడే తన తండ్రియని శ్వేతకౌతు తన సోదరుడనే భావనలో ఉన్నారు. యిది విధి ప్రభావం. అయితే అష్టావక్రునితో ఉద్దాలకుడు కోపంగా మాటలాడటం వలన అతనికి మంచియే జరిగినది అని చెప్పాలి. తల్లి సుజాత ద్వారా అష్టావక్రుడు - ఏకపాదుని వివరములు పూర్తిగా తెలుసుకున్నాడు.తన తల్లితో ఓదార్పుగా అమ్మా నేను తండ్రిని విడిపించి తీసుకురాగలనని తెలిపి శ్వేతకేతును తీసుకొని జనకమహారాజు కొలువుకు బయలుదేరెను. జనకుని ఆస్థానంలో ద్వార పాలకులే వీరిని అడ్డగించారు. కారణం ఆడుగగా పండితులైన వృద్ధులకే ప్రవేశము గాని పిల్లలకు ప్రవేశము లేదు. అని చెప్పిరి. జనకుని కొలువులో అందరూ వేదాంత విచారణ చేయువారే. అందుకు అష్టావక్రుడు వారితో " జ్ఞాన వృద్దుడే వృద్ధుడు " " వయో వృద్ధుడు వృద్ధుడు కాడు " అనే వాదనను బలపరచి జనక మహారాజుకు కబురుపంపి ఆయనచే ఆహ్వానింపబడి జనకుని కొలువుకు చేరెను. అచట వందితో చర్చ సాగెను చివరకు అష్టావక్రుని విజయము వరించినది. జనకుడు ఆశ్చర్య పడెను. అష్టావక్రుని పాండిత్యమునకు జనకుడు ప్రసన్నమయి ఏమి కావాలో కోరుకోమనెను. అందుకు గాను వంది ద్వారా జలమజ్జితులైన బ్రాహ్మణులను అందరినీ విడిపింపమని వందిని జలమజ్జితుని చేయమని కోరెను. అప్పుడు వంది అష్టావక్రునితో తన తండ్రి యాగ వృత్తాంతము తెలిపి అతనిని ఆశీర్వదించి తాను జలమజ్జితులను చేయించిన బ్రాహ్మణులకు ఎటువంటి బాధలు కలుగ చేయలేదని తెలిపెను. అష్టావక్రుని అనుజ్ఞతో వెడలిపోయెను. వంది అష్టావక్రుల వేదాంతచర్చలే అష్టావక్ర సంహిత మయి అద్వైత వేదాంత రహస్యములను తెలియ జేయుచున్నది. ఏకపాదుడు పుత్రుని పాండిత్యమునకు సంతసించెను.
ఏకపాదుడు అష్టావక్రునితో నాయనా! నీ అంగవైకల్యమునకు కారణం నేనే! నీ పితృభక్తికి పాండిత్యమునకు సంతసించితిని. సమంగానది యందు స్నానం చేసిన యెడల నీకు వక్రము పోవును. అది చేసి ఇంటికి రమ్మని చెప్పి ఏకపాదుడు ఇంటికి వెడలిపోయెను. సమంగా నదిలో స్నానం చేయగానే అష్టావక్రుని వంకరలు అన్నీ పోయి. అతడు సుందర రూపము కలవాడయ్యెను. తండ్రి ఆజ్ఞతో వదాన్య మహర్షి పుత్రిక ' సుప్రభ ' ను వివాహమాడెను. అయితే వదాన్యుడు వివాహమునకు ముందు ఒక పరిక్షపెట్టెను. అది ఏమనగా తన కుమార్తెను వివాహమాడు వాడు ఉత్తర దిక్కుకు పోయి కుబేర నగరమును దాటి హిమగిరిపై ఉన్న పార్వతీ పరమేశ్వరులను పూజించి రావలెను..
అష్టావక్రుడు నిభందన ప్రకారంగా పార్వతీ పరమేశ్వరుని పూజించి అక్కడ నుండి అలకాపురం చేరి కుబేరుని ఆశ్రమంలో ఒక సంవత్సరం గడిపెను. అష్టావక్రుని సేవ నిమిత్తంగా రంభాది అప్సరసలను పరిచారకులుగా నియమించెను. అయినను మనసు చలింపక అష్టావక్రుడు కాలం గడిపెను. అనంతరము కుబేరుని కడ శెలవు తీసుకొని పార్వతీ పరమేశ్వరులను దర్శించి కొంతకాలము వారి చెంతనేగడిపి అక్కడ నుండి ఉత్తరదిశకు వెళ్ళి వదాన్యుడు చెప్పిన ప్రాంతమునకు చేరెను. సువర్ణ సౌధ్యముతో వెలుగొందు నగరమును రాణీ అయిన ఆమె అష్టావక్రునికి ఆర్ఘ్యపాధ్యములు ఇచ్చి కావల్సిన ఏర్పాట్లు చేసినది. ఆమె అతనిని పొందుటకు ఎన్నో ప్రయత్నాలు చేసినది. అయితే ఆమెకు వేదాంత ఉపన్యాసం చేసి మంచి మాటలు చెప్పి అతను తన బ్రహ్మచర్య పరిరక్షణ కావించెను. ఆమె ఎవరో కాదు అష్టావక్రునిని పరీక్షించగోరిన వదాన్యుడు ఏర్పాటు చేసిన స్త్రీయే. ఇది మొత్తం గమనించిన వదాన్యుడు అష్టావక్రుని గొప్పతనమునకు కఠిన బ్రహ్మచర్యమునకు ఆనందించి తన పుత్రిక అయిన సుప్రభను ఇచ్చి వివాహము చేసెను.
అష్టావక్రుడు గృహస్థాశ్రమము అద్వితీయంగా ఉన్నది. మంచి పుత్ర సంపద కలిగెను. తర్వాత అష్టావక్రుడు జలమధ్యమున చేరి ఘోర తపస్సు ప్రారంభించెను. ఒకనాడు రంభాదులు అక్కడకు వచ్చి మీరు మా నృత్యమును చూచి చాలా రోజులయినది. ఒకసారి ప్రదర్శించి మీ ద్వారా మన్ననలను పొందగోరు వచ్చితిమి అని చెప్పిరి. వారి నృత్యమునకు సంతసించి రంభాదులను మీకు ఏమి కావలెను కోరుకోమనగా వారు శ్రీ మహావిష్ణువుతో సంభోగము కావలెనని కోరిరి. దానికి ప్రతిగా అష్టావక్రుడు రాబోవు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ద్వారా మీ కోరిక తిర్చుకోగలరు. మీరు గోపికలుగా ఉండి ఈ విషయం జరుగును అని చెప్పెను. అయితే అతని ఆకారము చూసి రంభాదులు నవ్విరి. దానికి ఆగ్రహించిన అష్టావక్రుడు వారిని శపించెను " మీరు శ్రీకృష్ణుని పరోక్షములో బోయవారిచే పట్టి పీడింపబడుదురు " అని శపించి తన ఆశ్రమమునకు పోయెను. భగీరధుడు కృశించిన శరీరముతో బాల్యము నుండి ఉండగా అతనిని సుందరాకృతుడు అగునట్లు వరమిచ్చెను.
అష్టావక్రుని పూర్వజన్మములో దేవలుడు. అతడు మాయావతి అను రాజకుమారిని వివాహం చేసుకొని సంతానం పొంది మహావిరాగిగా తపోవృత్తి ప్రారంభించెను. అతని తపోభంగము కావింప ఇంద్రుడు రంభను నియోగించెను. ఆమె అతనిని చలింపచేయలేకపోగా కోపించి "నీవు వచ్చే జన్మమున అష్టావక్రుడై జన్మించెదవు" అని శపించెను. మరల ఆమయే పశ్చాత్తాప పడి నేను అనవసరంగా శపించాను. నీవు అష్టావక్రుడై జన్మించినను నీ తండ్రి అనుగ్రహంతో మరల సుందరపురుషుడవై మంచి జ్ఞానివై మంచి జీవనం చేసెదవు అని శాపవిమోచనం తెలిపెను.
ఇది ఈ మహర్షి చరిత్ర.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment