గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 5 June 2015

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమిజ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమి. ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంటపొలాలు, నాగలి అని అర్థం వుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం. ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో వుండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము. "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం.

విష్ణు పురాణంలో కృష్ణ పరమాత్మ తన బాల్య క్రీడలలో ఒక భాగంగా నందుని గృహంలో వున్నటువంటి కాలంలో గోపాలకులు, గోపికలందరూ కూడా ఎప్పటివలె ఈ సంవత్సరం కూడా మనం ఇంద్రునికై అర్చన చేద్దాం; ఇంద్రపూజ ఆరంభం చేద్దాం అని విన్నవిస్తారు. ఆ విన్నపాన్ని విన్న నందుడు సరేనని కృష్ణునితో నాయనా! ఇంద్రపూజని ఆరంభించదలచుకున్నాం అని అంటాడు. ఇంద్రుని మదాన్ని అణిచే నిమిత్తమై కృష్ణ పరమాత్మ ఇంద్రునికి పూజలు చేయడం అనవసరం. గిరిపూజ గోపాకులకు, గోపికలకు గోజంతుజాలం ఆధారంగా జీవించే వారందరికీ ప్రధానం కనుక గిరిపూజను చేద్దాం అని అంటాడు. మంత్ర పూజ మంత్ర జపము, బ్రాహ్మణులకు యేవిధంగా ప్రాశస్త్యమో నాగలితో వ్యవసాయం చేయడం సీతాయజ్ఞం అన్న పేరుతో కర్షకులకు ప్రాశస్త్యం. అదేవిధంగా గిరిపూజాస్తు గోపః అని చెప్తాడు. అనగా గిరిని అర్చించడం మనకు ప్రధానము అంటూ ఆ గోపాకులందరికీ కూడా చెప్తాడు కృష్ణపరమాత్మ. జ్యేష్ఠ ఆషాఢమాసములు గ్రీష్మఋతువులు కానీ వర్షఋతు ప్రభావం ఎక్కువగా వుంటుంది. కనుకనే సూర్యుడు ఈమాసంలో వుండే కార్తెలలో (మృగశిర, పునర్వసు, ఆర్ద్ర) వర్షం పడితే ఇతోధికమైన పంటలు లభిస్తాయని ప్రచారంలో వుంది. ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది; మృగశిర చినుకు పంటలకు నెలవు; పునర్వసు కురిస్తే గాబు అంతా ధాన్యం. ఇటువంటి సామెతలు వ్యాప్తిలో వున్నాయి. అంటే వర్షానికీ, జ్యేష్ఠమాసానికీ, ఆర్ద్రా నక్షత్రానికీ అవినాభావ సంబంధం అన్నమాట.

విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశమంటే శూన్యం. ఏమీలేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలోనుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులోనుంచి అగ్నితత్త్వం పుట్టింది. ఆ అగ్నిలోనుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఓషధులు మొలకెత్తుతాయి. పాడిపంటలు, సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒకరూపంలో ఈ మాసంలో అమ్మవారిని(ప్రకృతి), అయ్యవారిని(భూమి) అర్చించాలి.

జ్యేష్ఠ మాసంలో పౌర్ణమినాడు, బహుళ సప్తమి నాడు తాము నివసించే గ్రామానికి నాలుగువైపులా నాలుగు కుండలని పెట్టాలి. గ్రామ మధ్యలోకి వచ్చి వరుణదేవుని ప్రార్థించాలి. మరునాడు సరిగ్గా అరవై ఘడియలు/24గంటలు గడిచిన పిమ్మట ఆ నాలుగు కుండలని తీసుకువచ్చి వాటిలో ఒకవేళ వర్షం పడినట్లైతే యేమేరకి యేస్థాయికి యే దిక్కున వున్న కుండలో పడిందో గ్రహించి గణన చేసి ఆ సంవత్సరము ఆ వైపున అటువంటి వర్షము పడుతుంది అని సూచించాలి. ఇవన్నీ ప్రాచీన జ్యోతిష శాస్త్ర రహస్యాలు, సంబంధిత సూత్రాలు. వ్యవసాధారిత పండుగలకు అంతగా ప్రాశస్త్యం/ప్రచారం లేకపోవడం వల్ల క్రమేణా ప్రపంచంలో పర్యావరణ శాస్త్రవేత్తలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. నెమ్మదినెమ్మదిగా అడవులన్నీ అంతర్థానమైపోతున్నాయి అని. మనిషి దురాశకు అడవులు బలిఅయిపోతున్నాయి అని చెప్తున్నారు. కాంక్రీటు అరణ్యాలు పెరిగిపోతున్నాయి. హరితవన అరణ్యాలు తగ్గిపోతున్నాయి. అంటూ బాధపడుతున్నారు. కారణం మానవుని అత్యాశకు అంతులేకపోవడమే. అడవులు వుంటేనే వర్షం, వర్షం వుంటేనే పంటలు పండుతాయి. పంటలు పండాలంటే వ్యవసాయాధారిత పండుగలన్నింటినీ కూడా ఉద్ధరించవలసిన అవసరం ఎంతైనా వుంది.

వ్యవసాయాధారిత పండుగలలో ఇది ప్రధానమైనది. వైశాఖమాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాం. బలరాముడు వర్షాధార భూములన్నింటికీ నాయకుడుగా వ్యవహరించాడు. నాగలిని ఆయుధంగా ధరించాడు. బలరామక్షేత్రం అని మన ఆంధ్రప్రాంతానికి వున్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమినాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రీ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి. మర్రిచెట్టుకు చుట్టూ అయిదుసార్లు దారం చుట్టాలి. ప్రదక్షిణలు చేయాలి. పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో వుంది. ప్రకృతిని కాపాడుకోవడమే. ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవడమే ఇందులోని అంతరార్థం. ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం కానీ ఒక పుష్పాన్ని వికసింపజేయగలమా? ఒక చెట్టుని కొట్టినంత సమయంలోనే ఒక చెట్టుని పాతి పెంచగలమా? కాలాధీనం ఈ ప్రపంచం. కాలానికి అధినేత పరమేశ్వరుడు. ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి.

జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ. వ్యవసాయేతరులు కనీసంగా ఈ రోజు ఒక వృక్షాన్ని/మొక్కని పాతాలి. ఇది భవిష్యత్ తరాలకోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతిఒక్కరూ స్వీకరించాలి. ప్రకృతిని పరిరక్షించే నియమాలలో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం, రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లైతే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరుని ప్రతీక. ప్రకృతి పార్వతికి ప్రతీక. గరిమనాభి (central point) గణపతికి ప్రతీక. ఈ భూమి యే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ వుంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సంప్రదాయ జీవన ధార విశేషము, ఫలితాంశము కూడా. వీటన్నింటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో వుంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్త్యం మనకర్థమౌతుంది. ఏవిధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను వున్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో ఆవిధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు కీర్తిప్రతిష్ఠలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనలను జ్ఞాపకం వుంచుకునేలా వ్యవహరిమ్చాలి. ఈ వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరిద్దాం. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి. కానీ అవి ఏవీ కూడా వాటి పండ్లని అవి తినవు కదా! ఆవులు పాలు ఇస్తాయి, కానీ అవి త్రాగవు కదా! ఆవిధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరులకోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. చెట్లను పాతుదాం. కనీసం ఒక మొక్కనైనా సంరక్షిద్దాం. ఈ పండుగను అందరం పాటిద్దాం. అందరమూ కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML