చతుర్వేదాలు -వేదములు
ఋగ్వేదము
ఇది అన్నింటికంటె పురాతనమైనది, ముఖ్యమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది.ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. స్తుత్యర్థకమైన మంత్రానికి ఋక్కు అని పేరు. మిగిలిన వేదాలలోని చాలా విషయాలు ఋగ్వేదానికి అనుసరణగానో, పునరుక్తిగానో ఉంటాయని చెప్పవచ్చును. ఋగ్వేదంలో 1028 దేవతా స్తుతులున్నాయి. వీటిలో అతి పెద్దది 52 శ్లోకాలు గలది. ఈ స్తోత్రాలన్నింటినీ 10 మండలాలుగా విభజించారు. తత్వ, అలౌకిక విషయాలను వివరించడంవలన పదవ మండలం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొన్నది.
ఋగ్వేద బ్రాహ్మణాలు: ఐతరేయ, కౌశీతకీ, పైంగి, సాంఖ్యాయన
ఋగ్వేద ఆరణ్యకాలు:: ఐతరేయ, కౌశీతకీ
ఋగ్వేద ఉపనిషత్తులు:: ఐతరేయ, కౌశీతకీ
ఋగ్వేదమునకు ఉపవేదం ఆయుర్వేదము.
యజుర్వేదము
యజ్ఞపరాలైన మంత్రాలకు యజస్సులు అని పేరు.యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యజుర్వేదంలో 109 అధ్యాయాలున్నాయి. కాని ప్రధానంగా రెండు ఉపభాగాలున్నాయి.
1. కృష్ణ యజుర్వేదము (తైత్తిరీయము) ఇది చాలావరకు గద్యరూపంలో ఉంటుంది. దీనికి క్రియావిధులు ఉంటాయి.
దీనిలో బ్రాహ్మణాలు: తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు
2. శుక్ల యజుర్వేదము (వాజసనేయము) ఇది 40 అధ్యాయాలు గల గ్రంథం. యజ్ఞాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి.
ఈ వేదం ముఖ్యంగా మాధ్యందిన, కాణ్వ సంప్రదాయాలలో ఉన్నది.
దీనిలో బ్రాహ్మణాలు:శతపథ
దీనిలో ఆరణ్యకము, ఉపనిషత్తు: బృహదారణ్యక
యజుర్వేదమునకు ఉపవేదం ధనుర్వేదము
సామవేదము
ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగాకీర్తించేది. ఇందులో వెయ్యి అధ్యాయాలున్నాయి. నియమ పూర్వకంగా గానం చేసే మంత్రాలకు సామములు అని పేరు. దీనిలో 75 మంత్రాలు తప్ప మిగిలినవన్నీ ఋగ్వేదంలోని 8,9వ మండలాలనుండి తీసికోబడ్డాయి.
సామవిధాన, మంత్ర, ఆర్షేయ, వంశ, దైవతాధ్యాయ, తలవకార, తాండ్య, సంహిత ఉపనిషత్తులు, ఛాందోగ్య, కేనోపనిషత్తులు సామవేదంలోనివే. సామవేదానికి ఆరణ్యకాలు లేవు.
సామవేదమునకు ఉపవేదం గాంధర్వ వేదము
అధర్వణ వేదము
ఇందులో 50 అధ్యాయాలున్నాయి. ఈ వేదంలో ముఖ్యంగా ప్రాపంచిక అభ్యుదయానికి అవసరమైన మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. దీనికి ఏ ఆరణ్యకమూ లేదు. గోపథ బ్రాహ్మణము, ముండక, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులు ఈ వేదానికి సంబంధించినవే.
అధర్వణవేదమునకు ఉపవేదం స్థాపత్య శాస్త్ర వేదము.
No comments:
Post a Comment