గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 March 2015

కాణిపాకంకాణిపాకం

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.

స్థలవిశిష్ఠత:

ఈ కాణిపాకం గ్రామాన్ని పూర్వం 'విహార పురి ' అని పిలిచేవారు. విహరపురి గ్రామంలో పుట్టకతోనే అవిటివాళ్లైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరిలో పెద్దవాడు అంధుడు, రెండోవాడు మూగవాడు, మూడోవాడు చెవిటివాడు. విహారపురి పరిసరప్రాంతాలు ఓ ఏడాది వర్షభావాపరిస్థితుల వల్ల తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది పడసాగాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు బ్రతుకు తెరవు కోసం దూరప్రాంతాలకు వలసలు పోయారు. విహారపురి గ్రామస్థులు కూడా నీటికరువుతో పంటలు ఎండిపోయినందున, ఇతర ప్రాంతాలకు జీవనోపాధికై వెళ్లిపోవడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు , అ ముగ్గురు సోదరులు వలస వెళ్లాలా? లేక అక్కడే ఉండాలా అని తీవ్రంగా తర్జనభర్జన చేశారు. పుట్టుకతోనే అవిటివాళ్లమైన మనం ఒకరిపై ఒకరు అధారపడి ఉన్నందున, వేరే చోటికి వెళ్లే కన్నా ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుందామని ముగ్గురు సోదరులూ నిర్ణయించుకున్నారు. భగవంతునిపై భారం వేసి వ్యవసాయం చేసుకుందామనుకున్నారు.

తమ వ్యవసాయపు బావిలో పూడిక తీస్తే పంటలకు సరిపోయే నీరు లభించవచ్చని వారు భావించి, పూడిక తీయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. తమ పొలానికి సమీపంలో ఉన్న వరదరాజస్వామి దేవాలయంలో పూజలు చేసి, ఆ సోదరులు బావి దగ్గరకు చేరుకుని, పూడిక తీయడం ప్రారంభించారు. పెద్దవాడైన అంధుడు ఏతం తొక్కగా, చెవిటి, మూగలిద్దరూ బావిలో దిగి పూడిక మట్టిని తవ్వి, తీసి ఏతం బానలో పోస్తున్నారు. ఏతం బానలోని మట్టిని పైనున్న గుడ్డివాడు పైకి చేది, దూరంగా వేస్తున్నాడు. బావిలో పూడిక కోంత లోతు తవ్విన తరువాత , ఓ బండరాయి బయల్పడి పనికి ఆటంకమైంది. సొదరులిద్దరూ ఎంత ప్రయత్నించినప్పటికీ అ రాయిని పెకలించలేకపోయారు. బండరాయి తమ ప్రయత్నానికి అడ్డుపడుతుందనే బాధ, కోపంగా మారడంతో ఓ సోదరుడు చేతిలోని పారతో బండరాతిపై బలంగా మోదాడు. ఆ దెబ్బ తగిలిన చొటి నుంచి, మనిషి తల పగిలితే వచ్చే శబ్దం వచ్చింది. బండరాతి మీద దెబ్బ తగిలిన వెంటనే, ఆకాశంలో వినిపించిన భయంకరమైన ఉరుముల శబ్దనికి బావిపై వున్న గుడ్డివాడు భయంతో వణికిపోతూ ఏమి జరిగిందని తమ్ములను గట్టిగా అడిగాడు. లోపలున్న సోదరులిద్దరికీ ఇవేమీ పట్టలేదు. దెబ్బ తగిలిన రాతి నుండి ధారాళంగా కారుతున్న రక్తాన్ని అశ్చర్యంగా చూస్తున్న మూగవాడు, భయంతో 'కెవ్వున' కేక వేయగా, ఆ కేకను చెవిటివాడు స్పష్టంగా విన్నాడు. బావిలో నుంచి తమ్ములిద్దరి కేకలకూ భీతిల్లిన గుడ్డివాడు పట్టుతప్పి, బావిలోకి జారిపడ్డా డు. గుడ్డివాడు బావిలోని నీటిని తాకగానే అతని 'అంధత్వం' నశించి, చూపు వచ్చింది.

బావి లోపల బండరాతి నుంచి ధారాళంగా స్రవిస్తున్న రక్తాన్ని చూసిన సోదరత్రయం భయంతో కేకలేస్తూ, గ్రామంలోకి పరుగెత్తి, జరిగిన విషయాన్ని గ్రామస్థులందరికీ వివరించారు. సోదరులతో పాటూ బావి వద్దకు చేరుకున్న గ్రామస్థులు బావిలోకి దిగి బండరాతి చుట్టూ ఉన్న మట్టిని పెకలించగా, వారికి ఆ రాయి విఘ్నేశ్వరుడి తల వలె కనిపించింది. అంగవైకల్యాన్ని రూపుమాపిన బండరాతిని వినాయకుడిగా గుర్తించిన గ్రామప్రజలు, ఆ రాతికి గంధ పుష్పాక్షతలతో పూజలు చేసి, అర్చించి, అప్పాలు, పానకం, పిండివంటలతో నైవేద్యం సమర్పించారు. భక్తులు వినాయకునికి భక్తి పూర్వకంగా కొబ్బరికాయలు సమర్పించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో భక్తులు సమర్పించిన నారికేళాల నీరు, దాదాపు "కాణి " పొలం మేర పారాయి. (కాణి అనగా ఎకరం పాతిక భూమి) కొబ్బరి నీటితో, 'కాణిపొలం'లో పారినందున ఈ గ్రామానికి కాణిపారకం అనే పేరు వచ్చింది. ఆ కాణిపారకం కాలక్రమేణా "కాణిపాకం" గా రూపాంతరం చెందింది.

విశేషాలు:

సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం స్వామికి చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహానికి వెనుక వైపు పార వేటుతో పడిన గాయం గుర్తు, నేటికీ కనిపిస్తుంది. నాడు తల మాత్రమే కనిపించిన వినాయకుని విగ్రహానికి నేడు ఉదరం, మోకాళ్లు కూడా కనిపిస్తున్నాయి.

బావి నీటి ప్రాముఖ్యం:

వరసిద్ధి వినాయకస్వామి వెలసిన బావిలోని నీరు చాలా శ్రేష్ఠమైనదని పండితుల ఉవాచ. వర్షాభావపరిస్థితులు ఎంత తీవ్రమైనప్పటికీ, కరువుకాటకాలు చుట్టుముట్టిన సందర్భాల్లో కూడా ఈ బావిలోని నీరు ఇంకిపోదు. ఈ నీటి స్పర్శతో అంగవైకల్యం నుంచి ముగ్గురు సోదరులు విముక్తి పొందిన విషయం తెలిసిందే కదా! అంతటి మహత్తు కలిగిన నీటిని పూజారులు వినాయకుని తీర్థంగా భక్తులకు నేటికీ ఇస్తున్నారు. ఈ నీటిని సేవించిన భక్తులకు సకల రోగాలూ తొలగిపోయి, మనోభీష్టాలూ పొందుతారని ఇక్కడి ప్రజల నమ్మకం.

" ప్రణమ్యా శివసాదేవం గౌరీపుత్రం వినాయకం..
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే"

అని తలిచిన భక్తులకు ఆపన్నహస్తం అందించి ఆదుకునే దైవంగా, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ప్రసిద్ధి కెక్కాడు. తన దగ్గర తప్పుడు ప్రమాణాలు చేసిన వారిని శిక్షించి, నిజాయితీగా ఉన్నవారిని రక్షించడం ఈ వినాయకుని విశిష్టత. అందుకే కాణిపాకంలో వెలిసిన వరసిద్ధి వినాయకుడు సాక్షిగణపతిగా కూడా పేరొందినట్లు స్థానికుల వల్ల తెలుస్తోంది.

బ్రహ్మోత్సవాలు:

ప్రతీ ఏడాది భాద్రపద శుద్ధచవితి నుంచి వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు జరుపుతారు. దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం సంప్రదాయం. ఐతే కాణిపాకంలో మాత్రమే, వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను చవితి రోజు మొదలుపెట్టి 21 రోజులు నిర్వహిస్తారు. హంస, నెమలి, మూషికం, శేషవాహనం, వృషభం, గజవాహనం, రథోత్సవం, తిరుకల్యాణోత్సవం, ధ్వజారోహణం, వడాయత్తు ఉత్సవం, అధికారనందివాహనం, రావణబ్రహ్మవాహనం, యాళివాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, కల్పవృక్షం, పుష్పపల్లకి, కామధేనువాహనం, విమానోత్సవం, తెప్ప తిరుణాల వంటి సేవలు బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు.

ఇతర దేవాలయాలు:

ఈ ఆలయానికి పడమట రెండు ఫర్లాంగుల దూరంలో ఈశ్వరాలయం ఉంది. పార్వతీ దేవి, కుమార స్వామి ఆలయాలు ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. గర్భాలయం వెలుపల నందీశ్వరుడున్నాడు. నందీశ్వరుని కొమ్ముల దగ్గర గర్భాలయం గోడకు చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి గుడి లోకి చూచి నట్లైతే ఈశ్వర లింగం కనిపిస్తుంది. వినాయకుని ఆలయానికి ఎడప వైపున కళ్యాణ కట్ట, దుకాణాల సముదాయం, ముందు వైపున చతురస్రాకారంలో ఉన్న పెద్ద పుష్కరిణి ఉంది. వినాయకాలయం లోపల ఎడమ వైపున ఆంజనేయ స్వామి గుడి, గర్భాలయం వెనుక వైపున నాగుల కట్ట, కుడి వైపున నవ గ్రహాలు ఉన్నాయి.

రవాణా, వసతి సదుపాయాలు:

ఆలయం లోపల దేవస్థానం వారి దుకాణ సముదాయం ఉంది. ఆలయానికి చేరువలో బస్ స్టాండ్‌ ఉంది. కాణి పాకానికి వివిధ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. తిరుపతి నుంచి ప్రతి అర్ధ గంటకూ ఒక బస్సు ఉంది. చిత్తూరు నుంచి లెక్కలేనన్ని బస్సులు రాత్రి పది గంటల వరకూ యాత్రికులను చేర వేస్తూనే ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చిత్తూరు వరకూ రైలులో ప్రయాణించే సౌకర్యం ఉంది.

భక్తుల కోసం టి.టి.డి. వసతి సౌకర్యం కల్పించింది. ఇవే కాకుండా చాలా ప్రైవేటు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML