గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 March 2015

శివ మహా పురాణం, కామ దహన ఘట్టం"ఒకప్పుడు తారకాసురుడనే రాక్షసుని వల్ల నానా కష్టము లు అనుభవించుచున్న దేవతలంతా బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన వారినందరినీ తోడ్కుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళగా - ఈశ్వరుని తపస్సు భగ్నం చేస్తేగాని, దీనికి మార్గం లేదన్నాడు. వివరించమన్నారు దేవతలు. తారకాసురుని సంహరించాలంటే, అది శివాంశతో కూడినట్టి ఆయన పుత్రుని వల్లనే సాధ్యం! ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షతో ఉగ్రతప మాచరిస్తున్న శూలి మొక్కోపి. ఆయన సమాధి స్థితి నండి బైటికి వస్తేనేగాని, శరీర స్పృహ కలుగదు. అది కలిగితే తప్ప - ఆయన కామపరవశుడు కాలేడు. అది జరిగితే గానీ - శివునికి వివాహప్రయత్నం గానీ, తద్వారా కుమారజననం గాని సాధ్యం కావు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా జరగవలసిన ఈ కార్యక్రమాలన్నిటికీ ఒకే ఒక ఉపాయమున్నది. మొట్టమొదట శివ తపోదీక్షకు భంగం కలగాలి. దానికి సమర్థుడు నా పుత్రుడైన మన్మథుడు మాత్రమే! సమస్త జీవరాసులకు కామావేశము కలిగించగల కందర్పుని దర్శించి, మీ కార్యాన్ని సానుకూల పరుచుకోండని వివరించాడు విష్ణువు.


దేవతలంతా పంచబాణుని బ్రతిమాలి, పరమశివుని దీక్షకు భంగం కలిగించమని వేడుకున్నారు. నిటలాక్షుడు అగ్నినే మూడోకన్నుగా ధరించినవాడు కనుక, పుష్పబాణాలు ప్రయోగించేటప్పుడు చాటుగా ఉండి - శరసంధానం చేయవలసిందని సలహాలూ, జగ్రత్తలూ చెప్పి పంపారు.

పంచశరుడు మలయమారుతుని, జయంత; వసంతుల్ని వెంట బెట్టుకుని, శివుని తపస్సు చాలించేలా చేయడానికి సన్నద్ధుడయ్యాడు.

కేవలం ఒక మహాత్కార్యసిద్ధి కోసం, రూపొందించిన ఈ ప్రయత్నంలో - అవసరార్థం అక్కడ ఆకాలంలో అడుగుపెట్టింది వసంతం. అదంతా మన్మథుని మిత్రుడైన వసంతుడు చలవే! పిల్లగాలులు రువ్వేపని మలయమారుతుడు చేపట్టాడు. వసంతానికి ప్రతిస్పందించే జీవులు, ప్రాణులను అక్కడకు చేర్చేపని జయంతుడు తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు.

మన్మథుడు చాటుగా ఉండి, పుష్పబాణాలను ప్రయోగించాడు. అవి తగిలి శివునికి తపోభంగం జరిగింది. నలుదిక్కులా కలయజూసే సరికి, ఓ చెట్టుప్రక్కగా నక్కి నిలుచున్న పుష్పశరుడు కనిపించాడు. ఫాలనేత్రం పరమవేగాన తెరుచుకున్నది. శివుని కంటి మంటలకు ఆహుతయ్యాడు కాముడు.

కీడు శంకించిన కాముని సతి, రతీదేవి గోడు గోడున ఏడుస్తూ శివుని శరణువేడింది. పెక్కురీతుల ప్రార్థించింది. శివుడామెను కరుణించి "ఇక పై నీ పతి నీకు మాత్రమే సశరీరుడిగా దర్శనమిస్తాడు. మిగిలిన దేవ దానవ యక్ష రాక్షస మానవ మునివరేణ్య గణాలకు ఎవరికైనా సరే అతడు అనంగుడు".. (శరీర రహితుడు) అని కొంతవరకు ఉపమించే రీతిలో రతీదేవికి అభయప్రదానం గావించాడు. ఇతరులకు ఎవరికీ కనబడనప్పటికీ, అతని విధినిర్వహణయైన మరుబాధాక్రమం మాత్రం నిర్వర్తిస్తూనే ఉంటాడు - మన్మథుడు.

ఆ విధంగా మరుని శరీరం భస్మమైనప్పటికీ - 'ఆత్మజుభావం' నశించనందున, ప్రపంచంలో సమస్త జీవరాశీ అతని వల్ల కామ మోహ పరవశమవుతూనే ఉన్నాయి.

ఏ స్థలంలోనైతే - మన్మథుడు శివుని ఫాలనేత్రం బారినపడి బుడిదగా మారాడో, ఆ స్థలంలో మాత్రం మన్మథుడి మహత్తులూ, మాయలూ ఏవీ పనిచేయకుండు గాక!" అని శివుడు ఆనతిచ్చి, ఉన్నందున అక్కడే తపస్సు చేస్తూన్న నారదుల వారి విషయంలో మన్మథ ప్రతాపం ఎంత బలీయంగా ఉన్నప్పటికీ ఫలితమివ్వడం లేదు. మునీంద్రునికి తపోభంగం కలగడం లేదు. శివుడా రీతిన ఇచ్చిన ఆనతిని అంతా విస్మరించారు. అదీ శివమాయాధీనమే!

ఇటు రతిపతి గానీ , అటు శచీపతి గానీ ఈ శివమాయ కతీతులు కారు కదా! అదంతా నారద మునిశ్రేష్ఠుని అసాధారణ తపోనిష్ఠగా భావించి ఆయనకు నమస్కరించి, తన మిత్రబృంద సమేతంగా వెను దిరిగి పోయాడా మదనుడు.

"పురాణపురుషా! మా కొక్క ధర్మసందేహము! ఈ మన్మథునికి మరేం పనిలేదా? ఎంతసేపూ పూలబాణాలు పట్టుకు తిరుగుతూ, అవి ఎవరికి సంధిద్దామా అనే పనిగట్టుకు సంచరిస్తుండడమే పనా?" సనందనుడనే ఒక మునివరేణ్యుడు అడిగాడు.

దానికి సూతుడిలా చెప్పసాగాడు: -

"చక్కని ప్రశ్న! నిజమే మరి! అతడికి నియుక్తమైన పని అదే కనుక - దానినే ఆచరిస్తున్నాడు అతడు."

మహర్షులకు ఆసక్తి అధికమైంది. మన్మథుని ఆవిర్భావం గురించీ, అతడికా పదవి ఇచ్చిన వైనం గురించీ పలురకాలుగా ప్రశ్నించారు. అందరి సందేహాలూ విన్నపిమ్మట సూతమహర్షి "మన్మథుని కథ " వివరించడానికి ఉద్యుక్తుడయ్యాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML