గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 1 March 2015

పానకాల లక్ష్మీ నరసింహ స్వామిపానకాల లక్ష్మీ నరసింహ స్వామి

మన రాష్ట్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం మంగళగిరి. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారుగా పూజలందుకుంటున్నారు.
మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ!
మంగళాద్రి నివాసాయ తుంగమంగళదాయినే!
రాజ్యలక్ష్మీ సమేతాయ శ్రీ నృసింహాయ మంగళం!
రత్న సింహాసనస్థాయ రమాలింగితవక్షసే!
రమేశాయ సురేశాయ శ్రీ నృసింహాయ మంగళం!
అంటూ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం మంగళగిరి. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కొలువైన దివ్యధామంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారు తపస్సు చేసిన పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రం నృసింహ దేవునికి అత్యంత ప్రియమైన ధామంగా విరాజిల్లుతోంది.
మంగళగిరిని కోటాద్రి అని, స్తుతాద్రి అని, మంగళాద్రి అని కూడా పిలవడం జరుగుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లీలా విశేషాలకు వేదికలా ఉన్న ఈ దివ్య క్షేత్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలకు కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది.
పురకుత్సుడనే మహారాజు ఇక్కడ స్వామివారిని సేవించి అనేక గోదాన, భూదాన, సువర్ణ దానాలిచ్చినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే రఘువంశజుడైన శంఖ భూపాలుడు, యయాతి మహారాజు; చంద్ర వంశజుడైన ఇంద్రద్యుమ్నుడు ఇక్కడ స్వామిని సేవించి మాన్యాలు ఇచ్చినట్లు ప్రతీతి. సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మంగళాద్రిపై తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్రానికి మంగళాద్రి అని పేరు వచ్చినట్లు చెప్తారు. ఇక్కడ స్వామివారు కొలువైన పర్వతాన్ని ముక్తి పర్వతం అని పిలుస్తారు. ఉగ్రనరసింహ స్వామి వారు ఇక్కడ కొలువై ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఆకారణంగా ఈ పర్వతం ముక్తి పర్వతంగా విరాజిల్లుతోంది. శ్రీస్వామి వారు కొలువైన ఎగువ, దిగువ ఆలయాలకు 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయలు ముఖ మండపాలు కట్టించినట్లు చారిత్రిక ఆధారాలద్వారా తెలుస్తోంది. క్రీశ. 1550వ సంవత్సరంలో విజయనగర రాజైన సిద్దిరాజు రాజయ్య దేవర స్వామివారికి 28గ్రామాలతో 150 కుచ్చళ్ల భూమిని ధర్మంగా ఇచ్చినట్లు, అలాగే 1807-09 సం.ల మధ్య కాలంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కొండ దిగువన తూర్పు గాలిగోపురాన్ని నిర్మించినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
భక్తులు ముందుగా అతిపురాతనమైన ఈ మెట్ల మార్గంలో శ్రీ రామకృష్ణ మఠాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ మఠంలో ఉన్న శ్రీకృష్ణ పాదుకల దర్శన భాగ్యం చేతనే ఆ జగన్మోహనుడి సాక్షాత్కారం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామి దర్శనం అనంతరం మెట్ల మీదుగా కొండ పై భాగానికి చేరుకుంటారు. మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు వేదికలా ఉన్న శ్రీ పానకాల నరసింహ స్వామి వారి ఆలయం ముక్తి పర్వతం మీద దర్శనం ఇస్తుంది. హ్రస్వ శృంగి అనే భక్తుని అనుగ్రహించడానికి స్వామివారు అతని ఏనుగు ఆకారంలో గల ఈ పర్వతం మీద కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమౌతోంది.
మంగళాద్రి క్షేత్రాన్ని క్రీ.శ.8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు దర్శించినట్లు 1512లో శ్రీ కృష్ణ చైతన్య ప్రభువులు స్వామిని దర్శించి తరించారని పురాణాల ద్వారా అవగతమౌతోంది. కొండ మీదకు చేరుకున్న భక్తులు స్వామివారికి పానకాన్ని సమర్పించడానికి వరుసలో నిలబడతారు.
ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉండడానికి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో నముచి అనే రాక్షసుడు బ్రహ్మచేత వరం పొంది ఇంద్రాది దేవతలను విపరీతంగా వేధించేవాడట. అతని బాధలకు తాళలేని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు కోరగా స్వామి ఉగ్రనరసింహావతారంలో నముచి ని సంహరించాడట. స్వామి ఉగ్రరూపం చూసి వణికి పోయిన ఇంద్రాది దేవతలు స్వామికి పానకం సమర్పించి స్తుతించారట. ఆ కారణంగానే స్వామివారికి ఇక్కడ పానకం పోస్తారని పురాణాల ద్వారా అవగతమౌతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని స్వామికి భక్తి శ్రద్ధలతో పానకాన్ని సమర్పించుకుంటారు. వరుసలో నిలబడిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః అంటూ గర్భాలయానికి ముందు భాగంలో ఉన్న అంతరాలయానికి చేరుకుంటారు. అతిపురాతనమైన ఈ అంతరాలయంలో ఉన్న స్తంభాలు, ప్రాకారాలు అలనాటి కట్టడాలను స్ఫురింపజేస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో స్వామి వారికి ఎదురుగా ఆంజనేయుడు దర్శనమిచ్చి ఈ ఆలయానికి వచ్చే భక్తుల అభీష్టాలను నెరవేరుస్తాడంటారు. వాయు పుత్రుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన ఉగ్రనరసింహ స్వామి దర్శనం చేసుకొని “తండ్రీ! ఉగ్రనరసింహా! మేమిచ్చే ఈ పానకాన్ని స్వీకరించి మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రీ “ అంటూ ప్రణమిల్లుతూ తమతో తెచ్చిన పానకాన్ని స్వామివారి నోట్లో పోస్తారు.
ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు. భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న రాజ్యలక్ష్మీ అమ్మవారిని, ఇతర దేవీ దేవతలను కూడా భక్తితో దర్శించుకుంటారు. అనంతరం భక్తులు కొండపై భాగంలో ఉన్న రాజ్యలక్ష్మీ అమ్మవారిని చేరుకొని గర్భాలయంలో కొలువై ఉన్న అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. అనంతరం వల్లభాచార్యుల వారి మఠాన్ని, శ్రీ రంగనాయక స్వామి వారిని, భక్తితో దర్శించుకుంటారు. రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి సమీపంలో ఆంజనేయ స్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది.
మంగళగిరిలో పూర్వం కళ్యాణ పుష్కరిణి కూడా ఉండేదిట. ప్రస్తుతం అది శిథిలమయింది. అలాగే 1594లో గోల్కొండ సుల్తాన్ సేనాపతియైన కుతుబ్ అలీ స్వామి వారిని దర్శించినట్లు తెలుస్తోంది. అనంతరం భక్తులు దిగువ సన్నిధిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. దిగువ సన్నిధిలో ఉన్న తూర్పు గాలిగోపురం 153అడుగుల ఎత్తులో ఉండి దేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయంలోకి చేరుకున్న భక్తులకు స్వామి వారికి ఎదురుగా గరుడాళ్వార్ దర్శనమిస్తారు. గర్భాలయానికి ముందు జయవిజయుల శిలా విగ్రహాలకు నమస్కరించి భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి నామ స్మరణతో మారుమ్రోగే గర్భాలయంలో ఒక ప్రక్క ఆళ్వారుల సన్నిధి మరొక ప్రక్క శయన మందిరాలు దర్శనమిస్తాయి. స్వామివారి గర్భాలయానికి ముందు ఉత్సవ మూర్తులు దర్శనమిస్తారు. పండుగలు, శుభకార్యాలప్పుడు ఈ ఉత్సవ మూర్తులే పల్లకి మీద ఊరేగుతారు. ప్రసిద్ధ హిందూ ప్రవక్త వల్లభాచార్యుల వారు మంగళాద్రికి నైరుతి భాగాన ఉన్న వట తీర్థమందు తపస్సు చేసి స్వామివారి ఆజ్ఞానుసారం హైందవ సముద్ధర సిద్ధాంతాన్ని ఇక్కడి నుంచే యావత్ భారత దేశానికీ వ్యాప్తి చేశారని ప్రతీతి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML