గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 28 March 2015

రామాయణం (అయోధ్యకాండ )

రామాయణం


అయోధ్యకాండ -1భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకుపోయాడు. శత్రుఘ్నుడు వెంట లేనిదే ఎన్నిభోగాలు తనకు రుచించవు గనక, భరతుడు శత్రుఘ్నుణ్ణీ తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటూ లేకుండానే జరుగుతున్నది. అయితే, ముసలివాడైన తండ్రిని విడిచి వచ్చామే అన్నది అప్పుడప్పుడూ వారిని బాదించేది.


అయోధ్యలో దశరథ మహారాజుకూడా తన కొడుకులలో ఇద్దరు దూరమై పోయారే అని చింతించేవాడు. కాని నిజానికి ఆయన పంచప్రాణాలూ రాముడే. అతనిలోలేని సద్గణం లేదు. ప్రజలకు కూడా రాముడంటే ఎంతో అభిమానం. "నేను ముసలివాణ్ణి అయిపోయినాను. త్వరలో రాముణ్ణి రాజును చేసి అతడు చక్కగా రాజ్యాపాలన చేస్తుంటే చూడాలని నా మనసు ఉబలాట పడుతున్నది," అనుకున్నాడు దశరథుడు.


మంత్రులతో ఆలోచిస్తే వారు కూడా ఈ ఆలోచనను అమోదించారు. ఇందుకు ప్రజలూ, ఇతరరాజులూ ఏమంటారో తెలుసుకోవలిసి ఉన్నది . అందుచేత దశరథుడు రాజులందరికి ఆహ్వానాలు పంపాడు. చాలాదూరాన ఉన్న కారణంచేత కైకేయి తండ్రి అయిన కేకయ మహారాజుకూ, సీత తండ్రి అయిన జనక మహారాజుకూ ఆహ్వానాలు పంపక, ఈ శుభవార్త వాడికి పట్టాభిషేకం అయిన తరవాత తెలుపుదామనుకున్నడు.


ఆహ్యానాలు అంది రాజులందరూ వచ్చి దశరథుడి కోలువు కూటంలో ఉచితాసనాలపై కూచున్నారు. నగరం లోని పౌరులూ, పల్లెటూ ళ్ళవాళ్ళూ కూడా సభకు వచ్చారు. దశరథుడు వారితో తాను ఎంత శ్రద్దగా రాజ్యం చేసినదీ వివరించి, "ఇప్పుడు నేను ముసలివాణ్ణీ అయిపోయి విశ్రాంతి కోరుతున్నాను. మీ అందరూ సమ్మతిస్తే నాపెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని ఉన్నది.


రాముడు పరాక్రమశాలి; ఎందులోనూ నాకు తీసిపోడు. అతను మూడు లోకాలూ ఏలదగినవాడు. అతనికి పట్టం గట్టటం రాజ్యానికి గొప్ప మేలు చేయటమేనని నా నమ్మకం. నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి. సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి," అన్నాడు. ఈ మాటలు విని సభలో అందరూ పరమానందం చెంది, రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. "మాహారాజా, ఆ రామపట్టాభిషేక మహొత్సవం ఊరేగింపు త్వరగా జరిపించండి,"అన్నారు.


వెంటనే దశరథుడు అమాయకత్వం నటిస్తూ, "నేనింకా రామపట్టభిషేకం అనీ అనకూండానే మీరంతా సమ్మతిస్తూన్నారే ? ఏమిటి కారణం ? నాపరిపాలన మీకు నచ్చలేదా ? నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నా మీరు రాముణ్ణీ రాజుగా కోరటానికి కారణమేమిటి ? మరేమీ లేదు, తెలుసుకోగోరి. అడుగుతున్నాను!" అన్నాడు.


ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలిసినది జరిగింది; సభికులు రాముణ్ణి తెగ పొగడేశారు. సుగుణ సంపన్నుడైన ఆయన్ను రాజుగా చేస్తే ఇక అంత కంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు. వారి మాటలన్నీ విని దశరథుడు, "మీరుకూడా నాలాగే భావిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది," అంటూ అప్పుడే తన పురోహితులైన వసిష్ఠ వామదేవాదులను పిలిపించి, "మహామునులారా, ఈ చైత్రమాసం శుభకార్యాలు చేయదగినది. అందుచేత రామపట్టాభిషేక యత్నాలు ఇప్పుడే సాగించండి. అందుకు కావలసిన సామగ్రి అంతా తెప్పించండి, " అని అందరూ వింటూండగా అన్నాడు. వసిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్ళతో ఏయో సామగ్రి సిద్దం చేయాలో చెప్పేశాడు. పట్టాభిషేక మహొత్సవానికి కావలసిన సరంజామా అంతా సిద్దమయింది.


దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్ళీ రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో " నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగినవిధంగా నీవు రాజ్యం ఏలుకో," అని చెప్పి అతన్ని పంపేశాడు. తరవాత, దూరదేశాల నుంచి వచ్చిన రాజులూ, ప్రజలూ ఎవరి దారిన వారు వెళ్ళిపో యారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారమూ, ఆవులూ, రత్నాలూ బహూకరించింది.


అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, "రేపు పుష్యమీ నక్షత్రం. పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది. అందు చేత రేపే జరుపుదాం," అని నిశ్చయించి, రాముణ్ణి తీసుకురుమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పాగానే రాముడు , "నే నిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మళ్ళి ఎందుకు రమ్మన్నారు?" అని అడిగాడు. "నిజమే. అయినా మహారాజుగారు తమరిని చూడాలన్నారు. వెంటనే తీసుకురమ్మ న్నారు," అన్నాడు సారథి.


రాముడు తత్తరపడి సారథి వెంట బయలుదేరాడు. పై వాళ్ళెవరూ లేరుగనక దశరథుడు ఈసారి తన కాళ్ళకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి, ఆలింగనం చేసుకుని, ఉన్నతాసనంపై కూచోబెట్టి, "నాయనా, రామా!నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి, నా జన్మనక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి. కనక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో. ఇవాళ పుష్యమి. రేపు పునర్వసు. శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవూ, నీ భార్యా దర్భలపై పడుకుని ఉపవాసం చెయ్యండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగిరాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తిగల వాడే; ఈ పట్టభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవస్వభావం అమిత చంచలమైనది," అని చెప్పాడు.


రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపీంచింది. రాముడు రాక పూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్రా లక్షణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, "అమ్మా, రెపటి పట్టాభిషేకానికి నేనూ, సీతా ఏమేమి అలంకారాలు చేసులోవాలో అవన్నీ చేయించు," అని కోరాడు.


రాముడు లక్ష్మణుడితో, "లక్ష్మణా, నాతో బాటు నీవుకూడా ఈ భూమినంతా పాలింతువుగాని. మనిద్దరమూ ఒకటేగదా. నేను రాజయితే నీవూ రాజువే. మనిద్దరమూ సమస్త సుఖాలూ ఒక్కటిగా అనుభవించుదాం," అన్నాడు. తరవాత అతను తల్లుల అనుమతి పొంది సీతతోసహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడిచేతనూ, సీతచేతనూ ఉపవాసవ్రతం సక్రమంగా చేయించ టానికి దశరథుడి కోరికపై వసిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరుకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి తెరిగి వచ్చే సమయంలో వీధులన్నిటా జనంతండోపతండా లుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోష ధ్వానాలు చేస్తున్నారు వీధులలో నీళ్ళు చల్లి, పూలదండలు కట్టారు. ప్రతి ఇంటిమీదా జెండా ఎగురుతున్నది. స్త్రీలూ, పిల్లలూ, వృద్దులూ ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురుచూస్తునారు.


వసిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి, సీతతో కూడా హొమం చేసి, హొమశేషం తిని, నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్వానం చేసి అక్కడే పడుకుని ఒక ఝాముసేపు నిద్రపోయి, వందిమాగధుల మేల్కొలుపులకు లేచాడు. ఆయన ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తిచేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మాణులు వచ్చి పుణ్యాహావాచనం చేశారు. మంగళవాద్యాలతో అయోధ్య యావత్తూ మారుమోగిపోయింది.


తెల్లవారుతూనే మళ్ళీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు.


అయోధ్యకాండ -2


రాముణ్ణి అడవులని నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను విను. విని నేను చెప్పినట్టు నడుచుకో. ఒకప్పుడు దెవాసుర యుద్దంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు. ఆయన వెంట నీవూ వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్యజుడేలే వైజయంతం వద్ద శంబరుడనే మహా బలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్దంచేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడాయనను నీవు యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి, ఆయన ప్రాణాలు కాపాడావు. స్పృహ తెలిసినాక ఆయన నీ సేవకు సంతోషించి, నీకు రెండు వరాలిచ్చాడు. కాని వాటిని నీవు తరవాత కోరుకుంటానన్నావు. ఆ సంఘటన జ్ఞాపకం ఉన్నదికదా. చూశావా? ఇప్పుడా రెండు వరాలూ కోరుకునే సమయం వచ్చింది.


రాముణ్ణి పద్నాలుగేళ్ళు అడవులకు పంపమనీ, భరతుడికి పట్టభిషేకం చెయ్యమనీ నీవిప్పుడు నీ భర్తను కోరు!" అని మంధర కైకేయికి హితవు చెప్పింది. కైకేయి, పాపం, సహజంగా మంచి స్వభావం కలదేగాని, మంధర చేసిన బోధనతో ఆమె మనస్సు పెడదారి పడింది. ఆ మంధర తన తలలో ఒక చెడ్డ భావం ప్రవేశపెట్టడంతో బాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది.


కైకేయి మంధరను, "నిజంగా నీ వెంత తెలివిగల దాననే! నామేలు నీవు కోరినట్టుగా మరెవరూ కోరరు గదా!" అని ప్రశంసించింది. ఆమె మంధర సలహాతో తన నగలన్నీ తీసివేసి, చిరిగిన కోక ఒకటి చుట్టుకుని, కోపగృహానికి వెళ్ళి, కటిక నేల మీద అలిగిన దానిలాగా పడుకున్నది.


"నీ భర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికీ మంటికీ ఏకధారగా ఏడువు. నీ కోపంగాని, నీ శోకంగాని రాజు కొంచెమైనా భరించలేడు. వాటిని పోగొట్టటానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన రెండు వరాలూ ఇచ్చినదాకా నీవు మెత్తబడకు! నీకు మణులూ, మాణిక్యాలూ, ముత్యాలూ, బంగారమూ ఇస్తానంటాడు. అక్కలేదని బెట్టు చెయ్యి. బాగా ఆలోచించులకో, భరతుడు పధ్నాలుగేళ్ళు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరూ రాజ్యాధికారం నుంచి కదిలిందలేరు," అన్నది మంధర. "ఆ శంబరాసురుడి కన్న నీ కెక్కువ తంత్రాలు తెలుసు గదే!" అని కైకేయి మంధరను మెచ్చుకున్నది. తన భర్త తనకు వరాలివ్వని పక్షంలొ చచ్చిపో వటానికి కూడా అమె నిశ్చయించుకున్నది.


దశరథుడు రామ పట్టాభిషేక యత్నాలకాజ్ఞ ఇచ్చి, ఈ శుభవార్త కైకెయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో కైకేయి శయన గృహానికి వచ్చి, అక్కడ ఆమె లేకపోవటం చూసి ఆశ్చర్యపడి, "కైకేయీ, ఎక్కడునావు?" అని పిలిచాడు. జవాబు లేదు. ఆయన అంతఃపుర ద్వారం దగ్గిరికి వచ్చి అక్కడి ద్వారపా లికను, "కైకేయి ఎక్కడ?" అని అడిగాడు. ద్వారపలిక భయంతో చేతులు జోడించి, "ప్రభూ,వారు కోపగృహంలో ఉన్నారు, అని చెప్పింది. దశరథుడు కలవరపడుతూ కోపగృహానికి వెళ్ళి, అక్కడ నేలపై పడుకుని ఉన్నకైకేయిని చూశాడు.


లక్షవరహాల విలువచేసే ముత్యాల హారాలూ, ఇతర ఆభరణాలూ నేలపై చెల్లా చెదురుగా పడి ఉండి, ఆకాశంలో నక్షత్రాల లాగా మెరుస్తునాయి. దశరథుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ, "దేవీ, నీ కెందుకిలా కోపం వచ్చింది? ఎవరుమీద? ఎవరన్నా నిన్ను తిట్టారా? అవమానించారా? ఒంట్లో సరిగా లేదా? వైద్యులను పెలిపించనా? ఎందు కేడుస్తావు? ఊరుకో! కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళను దండిస్తాను! నిర్దోషులైన సరే! నీ కోసం ఏ దరిత్రుణ్ణి అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతో బాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి ? నీ కోరిక ఏమిటో చెప్పు ; నాప్రాణాలు ఒడ్డి అయినా సరే, ఆ కోరిక తీరుస్తాను! లే, కైకేయీ, లే!" అన్నాడు.


ఈ మాటలు విని కైకేయి, "నాకెవరూ అపకారం చెయ్యలేదు, అవమా నమూ చెయ్యలేదు. నా కొక కోరిక ఉన్నది. దానిని మీరు తీరుస్తానని ప్రమాణం చేసేటట్టయితే చెబుతాను," అన్నది. దశరథుడీ మాటలకు చిరునవ్వు నవ్వి, కైకేయి జట్టు చేతితో నిమురుతూ, తన ప్రాణంతో సమానమైన రాముడిపైన ఒట్టుపెట్టుకుని, ఆమె కోరిక తీర్చటానికి ప్రమాణం చేశాడు.


అప్పుడు కైకేయి దశరథుడికి శంబరాసురుడితో జరిగిన యుద్దాన్నీ, మూర్ఛి తుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్నీ, ఆ సమయంలో ఆయన రెండు వరాలిస్తాను కోరమంటే తాను తరవాత కోరుకుంటానన్న సంగతీ జ్ఞాపకం చేసింది. తరవాత ఆ వరాలు రెండూ బయట పెట్టింది: రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చెయ్యాలి, రాముడు నారబట్టలనూ, కృష్ణాజినాన్నీ, జడలనూ, మునివేషాన్నీ ధరించి పధ్నాలుగేళ్ళు దండకారణ్యంలో నివసించాలి! ఈ మాటలు వింటుంటే దశరథుడి కెదో భయం పుట్టుకొచ్చింది, స్పృహతప్పి నట్టయింది. కాళ్ళూ, చేతులూ వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ, ఆయన కైకేయిని నానాతిట్లూ తిట్టాడు.


"నీవు రాజకుమార్తె వనుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. కాని నీవు విషం కక్కేపామువు. నిన్ను తల్లిగా చూసుకుంటాడు గదా, ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్తావు? నేను నీకేం చేశాను? ఏమహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను? నా ప్రాణాలనైనా వదలగలను గాని రాముణ్ణి చూడకుండా బతకలేనే! ఈ దిక్కు మాలిన ఆలోచన మనుకో! నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చెయ్యటానికి ఇలా అని ఉంటావు. రాముడు చేసిన సేవలో నూరోవంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు. నీకు రాముడి కంటె భరతుడెక్కువ అంటే నేను నమ్మను. నీ మాటలతో నన్ను చాలా బాధపె ట్టావు. చూడూ, నేను ముసలివాణ్ణి. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. కావలిస్తే భూమండలమంతా తీసుకో. కాని రాముడిపై మాత్రం ఆగ్రహించకు. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను," అని కైకేయిని దశరథుడు ఎంతో సేపు వేడుకున్నాడు.


దశరథుడు ఇల దిగజారిపోతున్న కొద్దీ కైకేయికి అగ్రహం రెచ్చింది. మొదట వరాలిస్తాననీ, కోరిక తీరుస్తాననీ ప్రమాణాలు చేసి ఇప్పుడు దశరథుడు బేలగా మాట్లాడటం రాజకులానికే కళంకమని ఆమె అన్నది. తన వరాలను ఉప సంహరించుకోననీ, రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చచ్చిపో తాననీ అన్నది. దశరథుడు మానసిక వేదనతో దహీంచుకుపోయాడు. ఎటువంటి విషమపరిస్థితి ! "నాయనా, అడవికి పోరా!" అని రాముడితో ఎలా చెప్పటం? కైకేయి కోరిక ప్రకారం రామపట్టాభిషేకం మానేస్తే ఇతర రాజులంతా, "పట్టాభి షేకం చాలా బాగా చెశారే ?" అని హేళన చెయ్యారూ? కౌసల్య ముఖం ఎలా చూడటం? ఆయన తనలో తాను దుఃఖించాడు, కైకేయిని తిట్టాడు, బతిమాలాడు, మధ్య మధ్య మూర్ఛపోయాడు. ఆ రాత్రి ఆయనకు భయంక రమైన కాలరాత్రి లాగా గడిచి తెల్లవారింది.


వసిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరుకు వచ్చి, దశరథుడి అంతఃపుర వాకిలి దగ్గిర సుమంత్రుడెదురుకాగా, తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయనీ, రాజుగారు కదిలిరావటమే వ్యవధి అనీ వసిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్చగా అంతఃపురం ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్దుడు కావటంచెతా, రాజుగారికి ఆబల్య మిత్రుడు గనకా, ఆయనను ఎవరూ అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్ళి, రాజుగారి మనస్థితి ఊహించక, ఆయన నిద్రపోతు న్నాడనుకుని, "మహారాజా, లేవండి సూర్యోదయం కూడా అయింది. రామపట్టభిషేకం జరిపించటానికి అందరూ తమ రాక కోసం చాలాసేపుగా ఎదురు చూస్తున్నారు," అని చెప్పాడు. దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చూసి, "సుమంత్రా, నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖపెడతావు?" అన్నాడు.


దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చెతులు జోడించి, రెండడుగులు వెనక్కు వేశాడు. దశరథుడు సుమంత్రుడితో మాట్లాడేస్థితిలో లేనందున కైకేయి, "సుమంత్రుడా, తెల్లవార్లూ మహారాజుకు రామపట్టభి షేకమన్న ఆనందంతో నిద్రలేదు . ఇప్పుడే కాస్తా కునుకు పట్టింది. నీవు వెళ్ళి రాముణ్ణి పిలుచుకురా. ఇదే రాజుగారి అజ్ఞ అనుకో," అన్నది.


"రాముడు ఇక్కడికి వచ్చి పట్టభిషేకం చెసుకుంటాడు కాబోలు !" అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు. నగరమంతా ఉత్సవం లాగా కోలాహ లంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది. రాజులందరూ కానుకలు తెచ్చారు. వారు తమలోతాము, "రాజుగారు కనిపించరు. మనం వచ్చిన సంగతి వరికెలా తెలియడం ?" అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, "తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి తెలియజేస్తాను. వారి దగ్గిరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను," అని చెప్పాడు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి దశరథుడి అంతఃపురానికి వెళ్ళి, దశరథుడు పడుకుని ఉన్న చోటికిచేరి, "మహారాజా, విజయీభవ. రాత్రిగడిచి, తెల్లవారి, సూర్యోదయంకూడా అయింది. మీ కోసం బ్రహ్మణులూ సేనాపటులూ, పట్టణంలోని పెద్దలూ ఎదురు చూస్తున్నారు. నిద్రమెలుకుని జరగవలసిన కర్మకాండ జరిపించండి," అన్నాడు.


"రాముణ్ణి తీసుకు రమ్మని కైకేయి నీతో చెప్పనే? తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె అజ్ఞ నా ఆజ్ఞకాదా? నేను నిద్రపోవటం లేదు. మేలుకునే ఉన్నాను. వేగిరం రాముణ్ణి తీసుకురా!" అన్నాడు దశరథుడు.


సుమంత్రుడు చిత్తమని చెప్పి, రాజుకు నమస్కారంచేసి, "ఏదో గొప్ప ఏర్పటే జరగబోతున్నది!" అని తనలో తాను సంతోషపటుతూ, రాజవీథి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడుండే నగరుకు రథం తోలుకుని వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు.


రాముడి అంతఃపురం చుట్టూ ఏనుగులూ, గుర్రాలూ, సైనికులూ, మంత్రులూ కిటకిట లాడుతున్నారు. సుమంత్రుడు వారి నందరినీ తోసుకుంటూ వెళ్ళి, రాముడుండే ఏడంతస్తులమేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టు రాముడికి కబురు పంపి, అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్ళాడు. రాముడు చక్కగా అలంకరించుకుని బంగారు చక్కీపై కూచుని ఉన్నాడు. సీత పక్కనే నిలబడి వింజామర వీస్తున్నది. సుమంత్రుడు అతన్ని సమిపించి, నమస్క రించి, "తండ్రిగారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు. నిన్ను చూడాలంటు న్నారు," అని చెప్పాడు. ఈ మాటలువిని రాముడు ఆనందంతో పొంగిపో యాడు. అతను సీతను లోపలికి పంపి, పట్టాభిషేకానికి చేసిన అలంకారా లన్నిటితోనూ సుమంత్రుడి వెంట బయలుదేరాడు.


రాముడు పులితోలు పరిచిన రథం ఎక్కికూచోగానే, లక్ష్మణుడుకూడా వెనకగా ఎక్కి, ఒక చేత్తో అన్నగారికి ఛత్రం పట్టి, రెండవ చేత్తో చామరం వీచాడు. రాముడి వెనకగా గుర్రాలూ, ఏనుగులూ ఎక్కెన రౌతులూ, కోలాహలంగా వేలకొద్దీ జనమూ నడిచారు. రాముడి రథం దశరథుడి నగరు ప్రవేశించి, మూడు ప్రాకరాలు దాటి నిలిచి పోయింది. తన వెంట వచ్చిన బలగమూ, ప్రజలూ అక్కడ నిలిచిపోగా, రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశిందాడు.


ఒక అందమైన ఆసనంపైన దశరథుడూ, కైకేయి కూచుని ఉన్నారు. రాముడు తండ్రి కాళ్ళకు, తరవాత కైకేయి కాళ్ళకూ నమస్కరించాడు. "రామా," అంటూ ఏదో చెప్పబోయి, దశరథుడు గొంతు పెగలక, కళ్ళు మూత పడి, కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివశుడయ్యాడు.


అయోధ్యకాండ -3


తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును తొక్కినట్టుగా భయం కలి గింది. అతను కళవళపడి కైకేయితో, "అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తండ్రిగారు ఇలా కలవరపడగటానికి కారణమేమిటి? ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు. నాకేమో ఆందోళనగా ఉన్నది," అన్నాడు.కైకేయి కొంచెంకూడా బిడియం లేకుండా, "రాజుగారికి కోపమూ లేదు, తాప మూ లేదు. ఆయనకు ఒక కోరిక ఉన్నది. అది నీకు చెప్పటానికి జంకుతు న్నాడు. ఒకప్పుడీయన గారు నాకు ఒక వర మిస్తానన్నాడు. ఎందుకన్నానా అని ఇప్పుడు చెప్పరాని బాధతో కుళ్ళుతున్నాడు. ధర్మం జరగటం ప్రధానం కద. నీ తండ్రి ఆడినమాట తప్పకుండా చూసేభారం నీ మీద ఉన్నది. మంచో, చెడో ఆయన కోరిక తీర్చుతానని నీవు ముందు నాకు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను. ఆ సంగతి ఆయన నోటంట రాదు, అందుచేత నేనే చెప్పాలి మరి," అన్నది.


"అదేమిటమ్మా? నన్నలా శంకించవచ్చా? నా గురించి నీకు తెలియనిదే మున్నది? నాయనగారు కోరితే నిప్పులో దూకనా? ఆయన కోరిక ఏమితో చెప్పు, తప్పక చేస్తాను. నెను ఆడి తప్పను," అన్నాడు రాముడు. కైక రాముడితో దేవసుర యుద్ధం నాటి విషయాలుచెప్పి, ఆయన ఆ సమ యంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు పధ్నాలుగేళ్ళు అరణ్యవసానికి పోవలసి ఉంటుందని చెప్పింది.


"ఈ పట్టాభిషేక యత్నం వృథాపోదులే. భరతుడు పట్టాభిషేకం చేసుకుని భుమి నాలుగు చెరగులూ పాలిస్తాడు. నీవు నారబట్టలూ, జడలూ ధరించి పధ్నాలుగేళ్ళూ అరణ్యవాసం వెళ్ళీనట్టయితే నీ తండ్రికి ఆడి తప్పాడన్న అపఖ్యాతి చుట్టుకోకుండ పోతుంది," అన్నదామె.


ఇంత దారుణమైనమాట, ఇంత పరుషంగా చెవిని పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి, మధనపడి, కైకేయి మొహం చూడడానికి కూడా సిగ్గుపడి ఉండును. కాని రాముడటువంటి వికారలేమీ లేకుండా, "అమ్మా, అలాగే కాని, నేను నారబట్టలు కట్టి అరణ్యానికి పోతాను. భరతుడి కోసం వెంటనే కబురు పంపండి. తండ్రి గారి ప్రతిజ్ఞా, నీ కోరికా ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా? భరతుడికి పట్టంకట్టనిశ్చయించానని తండ్రిగారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది," అన్నాడు. ఈ మాటలకు కైకేయి సంతో షీంచి, "మరేం లేదులే. ఆయనమాట దక్కిస్తావో, దక్కించవో అనే జంకుచేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు. నువ్వు మాత్రం జాగుచేయక అడవికి బయలుదేరు. నీవు వెళ్ళెదాకా మీ తండ్రిగారు స్నాన భోజనాదులు చెయ్య డు," అన్నది.


కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోలోపల కుమిలిమూర్చపోయాడు. రాముడాయనను మెల్లగా లేవదీసి కూచోబెట్టి కైకేయితో, "అమ్మా, నాకు లోపల నిజంగా రాజ్యకాంక్షా, ధనకాంక్షాలేవు. నే నింకేమైనా చేయవలసినది ఉంటే చెప్పు. నీవు రాజు గారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి. నీవు నిజం గా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు," అన్నాడు.


దశరథుడు బావురుమని ఏడ్చి స్పృహతప్పి పడిపోయాడు. రాముడు తండ్రికీ, కైకేయికీ ప్రదక్షిణ నమస్కారంచేసి అంతఃపురం నుంచి బయటికి వచ్చి తన చెలికాళ్ళ కేసిచూసి, పట్టాభిషేక సంబారాలకు ప్రదక్షిణం చేసి బయలుదెరాడు. లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోనూ, ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్న ను వెంబడించాడు. రాముడు రధమెక్కలేదు. ఛత్రచామరాలు నిషేధించాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన యోగియొక్క మనస్థితి తెచ్చి పెట్టుకుని, ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే దశరథుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవటం వినపడింది.


రామలక్ష్మణులు కౌసల్య నగరుకు వచ్చెసరికి అక్కడ ఎవరికీ జరగ బోయేది తెలియదు. రాముడు మొదటి ప్రాకర ద్వారంనుంచి లోపలికి పోతూంటే, అక్కడ ఉండిన ఒక వృద్దుడూ, మరికొందరూ లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు. రెండవ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మాణులకు నమస్కరించి, రాముడు మూడో ప్రాకారం చేరాడు. అక్కడి కావలివాళ్ళంతా స్త్రీలు. రామలక్ష్మణులను చూడగానే వారిలో కొందరు కౌసల్యతో రామలక్ష్మణుల రాక చెప్పటానికి పరిగెత్తారు. మిగిలినవాళ్ళు, "మహారాజుకు జయం కలగాలి!" అని అన్నారు.


రాముడు వచ్చేసరికి కౌకల్య అగ్నిలో హొమం చేస్తున్నది. ఆమె రాముడి కెదురు వచ్చి, కౌగలించుకుని, శిరస్సు ముద్దుపెట్టుకుని, "నాయనా, భోజనం చేద్దువుగాని పద!" అన్నది. తల్లికి ఈ విషాదవార్త ఎలా తెలపాలో తెలియక తికమకపడుతూ రాముడు, "అమ్మా, నీకింకా తెలియదులాగుంది. అంతారారుమారై పోయింది. నేను పధ్నాలుగేళ్ళు మునిలాగా, కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను. నేను కూచునేది సింహాసణం మీద కాదు, దర్భల చాపమీద. నాన్న గారు భరతుడికి పట్టంగట్టబోతున్నారు, " అన్నాడు.


ఈ మాట విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది. రాముడామెను లేవదీసి కూచోబెట్టి దుమ్మాంతా దులిపాడు. కౌసల్య రాముడితో, "నాయనా, నా జన్మకు సుఖంలేదు కాబోలు. నిన్ను కని ఈ బాధ భరించే కన్న గొడ్రాలుగానే ఉండిపోయినట్టయితే, పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది. ఎన్నడూ నేను సుఖపడి ఎరగను; నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను. కావటానికి నేను రాజుగారి పెద్ద భార్యనే కాని, సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను. ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యంలేదు, నాకు స్వాతంత్ర్యమూ లేదు. ఇక నేను కైకేయి పరిచారికలకంటే హీనంగా బతకాలి. నీవు పుట్టిన ఈ పది హేడేళ్ళూ నీ వెప్పుడు రాజువవుతావా అని ఎదురు చూస్తూ వచ్చాను. ఆ ఆశ కూడా పోయింది. నాకు చావు వచ్చినా బాగుండును, కాని అది కావాలన్నప్పుడు రాదు. నాయనా, నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను," అన్నది.


కౌసల్య మాటలు వింటుం టే లక్ష్మణుడికి ఒక ఆలో చన వచ్చింది. అతడు కౌసల్యతో, "అమ్మా, ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవటం నాకు సవ్యంగా కనపడలేదు. రాజు ముసలివాడు, ఆయన మనసు దుర్బలమైనది. ఆయన అన్యాయమైన పని చెయ్యామంటే కొడుకులమైన మేము చేయాలని ఎక్కడ ఉంది?" అని, రాముడితో, "అన్నా, రాజు నిన్ను అడవికి పొమ్మాన్న మాట అందరికీ తెలి యక ముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వశపరుచు కుందాం.


నేను విల్లుపట్టి మనని వాళ్ళందరినీ చంపుతాను. మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు. వయోభారం కారణంగా న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నాడు. మా అందరిలోనూ పెద్దవాడవు. ఈ రాజ్యం నీది? రాజు మాత్రం దీన్ని మరొక రికి ఎలా ఇస్తాడు? నీవేమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతా డు? నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు? ఇదుగో నావిల్లు! నేను యుద్దానికి సిద్దంగా ఉన్నాను," అన్నాడు పట్టరాని ఆవేశంతో. కౌసల్య రాముడితో, "నాయనా, లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి. అందులో ఎలాంటి తప్పూ లేదు. నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది? నేను తల్లిని కానా ? నీవు అడవుల పాలు కావటానికి నేను ఒప్పను. ఓకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది," అన్నది.


రాముడు తల్లితో, "నేను నాన్నగారి మాట అబద్దం చేయలేను, జవదాటలేను. పితృవక్యం పాలించటానికి ఎందరో ఎన్నెన్నో కార్యాలు చేశారు. కండుడు అనే ముని గోవధ చేశాడు. పరసురాముడు కన్న తల్లినే చంపాడు. మామూల పురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి, అరవైవేల మందీ ఒక్క సారిగా మరణించారు. అమ్మా, నేను నిన్ను ధిక్కరించటానికి అరణ్యానికి పోతున్నానా?" అని , లక్ష్మణుడితో, "లక్ష్మణా, నీకు నాపైగల ప్రేమా, నీ పౌరుషమూ నేనెరగనా? అన్నిటికన్నా ధర్మం గొప్పది. దానిని మనం నిలబెట్టాలి. అందుచేత నా బుద్ధినను సరించే నీవు కూడా ఆలోచించు," అన్నాడు గంభీరంగా.


తల్లిన సమాధాన పరచటానికి రాముడు ఎన్నో దర్మాలు చెప్పాడు. కౌసల్య వృద్ధుడైన భర్తను విడిచి తన వెంట రావటం భావ్యం కాదన్నాడు. అతను లక్షమణుడితో కూడా, "ఇది దైవ నిర్ణయం. కాకపోతే, నే నంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు పొమ్మంటుందా? పట్టభిషేకం నిలిచి పోయిందంటే నీ కింత బాధగా ఉన్నదే, పట్టభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధ పడిందో? నేను ఇంతవరకు తండ్రిగారి మనసుగాని, అమె మనసుగాని నొప్పించినట్టు నాకు జ్ఞపకం లేదు. ఇప్పుడాపని చేయలేను," అన్నాడు.


రాముడు తండ్రి అజ్ఞ పాలించటానికి గాను అడవికి వెళ్ళే దృఢనిశ్చయం చేసుకున్నాడని గ్రహించి, కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణులచేత హొమం చేయించి, ఆశీర్వదించి పంపింది.


రాముడు సీతయొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా, తల వంచి కన్నీరు కార్చుతూ, వెంట ఎవరూ లేకుండావచ్చే భర్తను చూసి సీత కూడా కంపించీంది. ఆమె అతని దిగులుకు కారణమడిగింది. జరిగినదంతా చెప్పి రాముడామెతో, "అనుకున్నవి జరిగి తీరాలని, అనుకోనివి జరగకూడదనీ చెప్పలెముకదా? విధినిర్ణయానుసారం ఏది జరిగినా ధర్మాన్ని వీడకూడదు. నేను అడవుల నుంచి తిరిగి వచ్చేవరకూ నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడచుకో . అతని ఎదట నన్నేప్పుడూ పొగడకు. బంధుత్వం తప్పిస్తే, భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు. అందుచేత నీవు అతను సంతోషించేట్టు మసలుకో. వృద్దులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు," అని చెప్పాడు.


ఈ మాటలు విని సీత, ప్రణయంతో కూడిన కోపంతో, "ఇవేం మాటలు?నన్ను తేలికజేసి పరాజకాలాడుతున్నావా? ఆడదానికి భర్తే కదా గతి! నిన్ను వనవా సం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా? నీవు అడవిలో సంచరించటమే జరిగితే, ముళ్ళన్నీ నా కాళ్ళతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవ నా? నీ వంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్యభయం ఉండబోదు. అడవిలోని వారందరిని కాపాడగల వాడివి నన్ను కాపాడలేక పోవు. అడవిలో నేను, అది కావాలి, ఇది కావాలి అని అడగబోను. నీవు లక్షచెప్పినా సరే నా మనసు మారదు, " అన్నది.


సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ కష్టాలను వివరించి చెప్పాడు. కాని సీత వాటిని లక్ష్య పెట్టలేదు. "నిన్ను చూసి సాముద్రికవేత్తలు వనవాసయోగం ఉన్నదని చెప్పినట్టే, నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు. అందు చేత నేను నీ వెంట అరన్యానికి వచ్చి తీరుతాను," అన్నది. అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలెదు. సీతకు కోపమూ, దుఃఖమూ ముంచుకు వచ్చాయి."అయ్యో, మా నాన్న జనకమహారాజు, ఈ సంగతి తెలిస్తే ఏమనుకుంటాడు? నేనేం తప్పు చేశానని నన్ను విడిచి పెట్టి పోవాలనుకుం టున్నావు? నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు కదా! నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కళంకం తీసుకురావాలా? నీ వున్న చోటే నాకు స్వర్గమని చెప్పానే!" అంటూ భోరున ఏడ్చింది.


రాముడామెను రెండు చేతులా దగ్గిరికి తీసుకుని , సముదాయించి, తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ, " వనవాసానికి సిద్దంకా! నీవద్ద ఉన్నదంతా దానం చెసెయ్యి. నీ వస్తుసామగ్రి యావత్తూ ముందు పనివాళ్ళ కిచ్చి, మిగిలి నది బ్రహ్మణులకియ్యి. సన్యాసులకు భోజనం పెట్టించు, బిచ్చగాళ్ళకు దానాలు చేయించూ," అన్నాడు ఎంతో ఆప్యాయంగా . సీత పరమానందంతో వెంటనే ఆ పనులన్నీ సాగించింది.


అయోధ్యకాండ -4

ఆ భార్యా భర్తల సంభాషణ అంతా వింటూ ఉండిన లక్ష్మణుడు, ``అన్నా! నీవు అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించినట్టయితే నేను కూడా వస్తున్నాను,'' అన్నాడు. ఇందుకు రాముడు సమ్మతించక, ``నీవూ, నేనూ కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్యా సుమిత్రలు బొత్తిగా దిక్కులేని వాళ్ళవుతారు. వాళ్ళను కనిపెట్టుకుని ఉండు,'' అన్నాడు. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. ``నేను రాత్రీ, పగలూ నీకు కావలసిన పనులన్నీ చేస్తాను. నేను నీ వెంట వచ్చితీరాలి,'' అన్నాడు. రాముడు సంతోషించి సరే నన్నాడు. వసిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకు రమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు.


వాటిలో అక్షయతూణీరాలూ, ధనుస్సులూ, దుర్భేద్యమైన కవచాలూ, బంగారు పూతగల రెండు కత్తులూ ఉన్నాయి. లక్ష్మణుడు వెళ్ళి, తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి, వసిష్ఠుడి వద్దవున్న ఆయుధాలు తెచ్చాడు. తరవాత రాముడు యాత్రాదానాలు చేశాడు. వసిష్ఠుడి కొడుకైన సుయజ్ఞుణ్ణి పిలిపించి, ఆయన భార్యకు సీతచేత ఆమె నగలూ, మంచమూ, పరుపులూ దానం చేయించి, తాను శత్రుంజయమనే ఏనుగునూ, అనేక ఇతర ఏనుగులనూ ఇచ్చి పంపాడు.


అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకూ, కౌసల్యను ఆశ్రయించుకుని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికీ, దశరథుడికి ఇష్టుడైన చిత్రరథుడనే సారథికీ, బ్రహ్మచారులకూ అంతులేని గోవులూ, బంగారమూ, బట్టలూ దానం చేశాడు. అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయనకు గంపెడు పిల్లలూ, పడుచు భార్యా ఉన్నారు.


ఆయన పరిగ ఏరుకునీ, కందమూలాలు తవు్వకునీ సంసారం నెట్టుకొస్తున్నాడు. రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు, చిరిగిన పైబట్ట కప్పుకుని రాముడి వద్దకు వచ్చి, ``రాజపుత్రా, నేను పేదవాణ్ణి. చాలామంది బిడ్డలు గలవాణ్ణి. ఇంత కాలంగా పరిగ ఏరుకు బతుకుతున్నాం. నన్ను కటాక్షించు,'' అన్నాడు. రాముడాయనతో, ``అయ్యా, నీవు నీ బలం కొద్దీ కర్ర విసురు.


అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవుల నిస్తాను,'' అన్నాడు. త్రిజటుడు నడుము బిగించి, ఒక కర్ర తీసుకుని గిరగిరా తిప్పి విసిరే సరికి, అది సరయూనది అవతలి గట్టున వెళ్ళి పడింది. రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ``అయ్యా, నవు్వల కన్నాను, కోప్పడ వద్దు. నీ తపశ్శక్తి ఎంతో తెలుసుకుందామనిపించింది. అన్నప్రకారం గోవుల నివ్వటమేగాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను,'' అన్నాడు. త్రిజటుడు రాముణ్ణి దీవించి ఆవుల మందలను తోలుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


ఈవిధంగా దానాలతో ఆబాలగోపాలాన్నీ తృప్తి పరచి రాముడు సీతా లక్ష్మణులతో తండ్రి నగరుకు బయలుదేరాడు. వారు ముగ్గురూ వీధులవెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచీ చూసే పౌరులు బాధతో రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు. ``చూడండర్రా, రాముడు కాలినడకను భార్యనూ, తము్మణ్ణీ వెంటబెట్టుకుని ఎలా పోతున్నాడో! కాకపోయినా ఈ దశరథుడికేదో అయింది. ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా రాజైనవాడు అడవులకు పంపడుగదా, బంగారంలాటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే! మన మందరమూ కుటుంబాలతో సహా రాముడి వెంట పోతే సరిపోతుంది!'' పౌరులు అనుకునే ఈ మాటలన్నీ వింటూ సీతారామలక్ష్మణులు దశరథుడి నగరు చేరి, సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు.


దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. చేతులు జోడించి వచ్చే రాముడు కన బడగానే రాముడి కెదురు పోబోయి మధ్య దారిలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టారు.


స్పృహ వచ్చి దశరథుడు కళు్ళ తెరవగానే రాముడు, ``మహారాజా, నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి,'' అన్నాడు. దశరథుడు రాముడితో, ``నాయనా, రామా! కైకేయికి వరమిచ్చి నేను మోసపోయాను. నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో!'' అన్నాడు. ``మీరు అసత్యదోషం కట్టుకోకండి. అడవికి పోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు.


పధ్నాలుగేళూ్ళ వనవాసం చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాము,'' అన్నాడు రాముడు. ``మీరు ఇవాళే వెళ్ళాలని ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలిసినవన్నీ పొంది, ఈ ఒక్క రాత్రీ మమ్మల్నందరినీ సంతోష పెట్టి, రేపు ఉదయం అరణ్యానికి బయలుదేర వచ్చు,'' అన్నాడు దశరథుడు. ``తండ్రీ, మా కోరికలన్నీ మీరు తీర్చినట్టే భావించి మమ్మల్ని వెళ్ళ నివ్వండి. మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి.


అరణ్యంలో మా కేమీ కష్టాలుండవు. అనేక పర్వతాలూ, సరస్సులూ, వింతలూ చూస్తాం,'' అన్నాడు రాముడు. రాముడడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చినవాడై, కైకేయితో, ``దుష్టురాలా! నిన్ను ప్రాణంకన్న ఎక్కువగా చూసుకునే మహారాజు కింత శోకం తెచ్చిపెట్టావే, నీ వింకేమి చెయ్యలేవు? నీ వాలకం చూస్తే భర్తను చంపుకునేదానివిగానూ, వంశనాశనం కలిగించే దానివిగానూ కనిపిస్తున్నావు. అందరిలోకీ పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీ అభ్యంతర మేమిటి? భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? అయోధ్యలో ఒక్క బ్రాహ్మడుంటాడా? ఎందుకు చేస్తున్నావీ పాడుపని? మొత్తానికి ఆ తల్లి కూతురనిపించు కున్నావు! నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు.


దానితో ఆయన పశు పక్ష్యాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడాయన మంచం మీద పడుకుని ఉండగా జృంభమనే ఒక చీమ ఏదో అనే సరికి ఆయన పకపకా నవ్వాడు. అది చూసి మీ అమ్మ, ఎందుకు నవ్వావో చెప్పు అన్నది. ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చిపోతాన న్నాడు మీ తండ్రి. నువు్వ చస్తావో, బతుకుతావో నాకు తెలీదు; నన్ను చూసి నవ్వలేదని నా కేమిటి నమ్మకం? అందుచేత నవ్విన కారణం చెప్పాలిసిందే నన్నది మీ అమ్మ.


అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గిరికి పోయి ఆయన సలహా అడిగాడు. నీ భార్య చచ్చిగీపెట్టినా చెప్పకు అన్నాడు ముని. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు. నీ ధోరణి కూడా అలాగే ఉంది. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది. అందుచేత నీ వక్రబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో!'' అని హితవు చెప్పాడు. ఈ మాటలకు కైక సిగ్గు పడలేదు సరికదా, చలించను కూడా లేదు.


దశరథుడు మాత్రం సుమంత్రుడితో, ``రాముడి వెంట అడవికి చతురంగ బలాలనూ, విశేషమైన ధనాన్నీ, అందగత్తెలయిన స్త్రీలనూ, సంబారాలతో వర్తకులనూ పంపించు. బళు్ళ కూడా వెంట ఇచ్చి పంపించు. రాముడికి రాజ్యం లేదన్న లోపం ఏమాత్రం తెలియకుండా చూడు,'' అన్నాడు.


సుమంత్రుడి శాపనార్థాలకు చలించని కైకేయి ఈ మాటలు విని తెల్లబోయి, బెదిరి, గొంతు ఆర్చుకుపోయి, ``మహారాజా, అయోధ్యను పాడుబెట్టి అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించడు!'' అన్నది. ``ఓసి దుర్మార్గురాలా! నా మీద మొయ్య రానంత బరువు వేసింది చాలక, ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి? ఇదంతా ఆ వరాల లోనే చేర్చి అడగక పోయావా?'' అన్నాడు దశరథుడు కోపంగా. కైకేయి అంతకన్న హెచ్చు కోపంతో, ``అది వేరే అడగాలా ఏమిటి? అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టి పోవటం కాదా? మీ పూర్వీకుడు సగర చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్ళగొట్టినప్పుడు వాడి వెనకగా సైన్యాన్ని పంపాడా?'' అని అడిగింది. ఈ మాట విని సిద్ధార్థుడనే మంత్రి, ``అమ్మా, అసమంజుడి మాట ఇక్కడ దేనికి? వాడు పరమ దుష్టుడు.


వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో పడేసి ఆనందించే పాపాత్ముడు. అందుచేత పౌరులు కడుపుమంటతో రాజువద్దకు వెళ్ళి, `అయ్యా, తమరు అసమంజుణ్ణి వెళ్ళగొడతారా, మమ్మల్ని దేశం విడిచి వెళ్ళి పొమ్మన్నారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి!' అని అడగగా సగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకునూ, వాడి భార్యనూ, పరివారాన్నీ వెళ్ళగొట్టి, వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వ వద్దని కట్టుదిట్టం చేశాడు.


జనద్రోహి అసమంజుడికీ జనప్రియుడైన రాముడికీ సాపత్యం చెప్పావే!'' అన్నాడు. ఈ మాటలకు కైక చలించక పోవటం చూసి దశరథుడు, ``ఓసి పాపాత్మురాలా! నిన్ను చూస్తే నీకు హితం తల కెక్కేటట్టు లేదు. నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను. నీవూ, భరతుడూ సుఖంగా రాజ్య మేలండి,'' అన్నాడు. ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో, ``మహారాజా, అన్ని సుఖాలూ విడిచి, అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట సేన కూడా దేనికి? ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గిర లోభించే పద్ధతి మానండి. మాకు నారబట్టలూ, దుంపలు తవు్వకునే పరికరాలూ, ఒక బుట్టా ఇప్పించండి, చాలు,'' అన్నాడు.


మానాభిమానాలు విడిచిపెట్టిన కైకేయి, ``ఇదుగో, నారబట్టలు తెస్తున్నాను,'' అంటూ వచ్చింది. రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి, తండ్రి ఎదటనే నారబట్టలు ధరించారు. సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడి కేసి చూసింది. తరవాత ఒక బట్ట మెడకు చుట్టుకుని, మరొకటి చేత పట్టుకుని, సిగ్గుతో తల వంచి నిలబడింది. అప్పుడు రాముడు ఆమె వద్దకు వెళ్ళి, ఆమె చేతిలో ఉన్న నారచీరె పైన దానిని చుట్టాడు. ఇది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ, ``నాయనా, నీవు తండ్రిమాట ప్రకారం అడవికి వెళ్ళదలిచావు, వద్దన్నా మానవు. కాని సీతను కూడా ఎందుకు తీసుకు పోతావు? ఆమె వనవాసం చెయ్య లేదు. మా వద్ద విడిచిపెట్టి వెళు్ళ.


నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం,'' అన్నారు. ఈలోపల వసిష్ఠుడు సీతకు నారచీరెలిస్తున్న కైకేయితో, ``గుణ హీనురాలా, నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నదే. సీత అడవికి వెళ్ళవలసిన అవసరమేమున్నది? రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చేయవచ్చు, తెలుసా? సీత ఈ నార చీరెలు కట్టవలసిన అవసరం లేదు సరే కదా, ఆమె తన వెంట వాహనాలూ, వస్తువులూ, పరిచారికలూ, సమస్తమూ తీసుకు పోవచ్చును. భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంత మాత్రమూ రుచిం చదు.


అతను దశరథుడి కొడుకే అయితే, తన తండ్రి వ్యథకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమూ సమ్మతించడు!'' అన్నాడు. చుట్టూ ఉన్నవారు, ``ఛీ,ఛీ!'' అనుకోవటం దశరథుడు విన్నాడు. ఆయన సీతను చూసి, ``సుకుమారి, చిన్న పిల్ల! ఆ సీత మునిపత్నిలాగా నారచీరె గట్టి ఎలా వెలవెల పోతున్నదో చూడండి! ఆమె నారచీరెలు కట్టటానికి వీల్లేదు,'' అన్నాడు.


రాముడు బయలుదేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి, తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు. దశరథుడు సుమంత్రుడితో, ``మంచి గుర్రాలను పూన్చిన మేలైన రథంలో వీళ్ళ నెక్కించి, నగరం బయట అరణ్యంలో విడిచి పెట్టిరా!'' అన్నాడు. ధనాధికారిని పిలిచి, ``పధ్నాలుగేళ్ళ పాటు సీతకు సరిపోయే మేలైన చీరెలూ, నగలూ తీసుకురా,'' అని ఆజ్ఞాపించాడు. సీత పెళ్ళికి పోతున్నదానిలాగా వికసించిన ముఖంతో తన కోసం తెచ్చిన నగలు పెట్టుకుంటూంటే కౌసల్య ఆమెను ఆలింగనం చేసుకుని, ``సీతా, నీ భర్త పేదవాడై పోయినాడని వనవాస కాలంలో అశ్రద్ధగా చూడకమ్మా!'' అంటూ నీతిబోధ చేసింది. రాముడు తల్లి దండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేసి, తల్లితో, ``అమ్మా, దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్నుమూసి తెరిచేసరికి గడిచిపోతాయి,'' అన్నాడు.


లక్ష్మణుడు కూడా తల్లి దండ్రులకు మొక్కి తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవు తీసుకున్నాడు. ఆమె, ``లక్ష్మణా, ఇక నీకు రాముడే తండ్రి, సీతే తల్లి, అరణ్యమే అయోధ్య! అన్నను ఆపదరాకుండా చూసుకో, నాయనా!'' అని చెప్పింది. ముగ్గురూ బయటికి వచ్చారు. పెళ్ళి కూతురులాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా, ముందుగా రథమెక్కి కూచున్నది. తరవాత రామలక్ష్మణులెక్కి కూచున్నారు. సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడిచ్చిన వస్త్రాభరణాలూ, ఆయుధాలూ, కవచాలూ, చిన్న గునపమూ, బుట్టా ఉంచాడు. రథం కదిలింది.


అయోధ్యకాండ -5


వీధిలో పౌరులందరూ దైన్యంతో నిలబడి చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తుతున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకుని వేళ్ళాడుతున్నారు. కొందరు రథానికెదురుగా వచ్చి సుమంత్రుణ్ణి, ``మళ్ళీ ఎప్పటికి చూస్తామో, కాస్సేపు చూడనియ్యి. రథం మెల్లిగాతోలు, బాబూ!'' అని బతిమాలారు.

ఉన్నట్టుండి దశరథుడు, ``నేను రాముణ్ణి చూడాలి!'' అంటూ తన ఇంటి నుంచి బయటికి వచ్చి వీధిన పడ్డాడు. ఆయనతో బాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు. ``సుమంత్రుడా, రథం కాస్త ఆపు!'' అని కేక పెట్టాడు దశరథుడు.


ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు. వెనక్కు తిరిగి చూస్తున్న రాముడికీ దృశ్యం దుర్భరమయింది. అతను సుమంత్రుడితో, ``రథం వేగంగా తోలు. ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను? ఎలా చూడటం? అంతగా మహారాజు అడిగితే, జనం చేసే గోలలో ఆయన కేక వినిపించ లేదని చెప్పు,'' అన్నాడు.


రాముడు రథాన్ని వెన్నంటి వచ్చేవారి వద్ద సెలవు పుచ్చుకున్నాక సుమంత్రుడు గుర్రాలను వడిగా తోలాడు. దశరథుడితో మంత్రులు, ``మహారాజా, వాళు్ళ త్వరగా రావాలనుకున్నట్టయితే వారిని ఎక్కువ దూరం సాగనంప గూడదు,'' అని చెప్పారు. దశరథుడు శరీర మంతా చెమటలు దిగ గారుతూ, భార్యలతో సహా అక్కడే నిలబడి, క్రమంగా దూరమై పోతున్న రథాన్ని చూశాడు. రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళి పోవటంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండి పోయింది.


దానితోబాటే అయోధ్యా నగరమంతా పాడు పడినట్టయి పోయింది. ఎక్కడి పనులక్కడ ఆగిపోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టుగా విస్తుపోయారు. రాముడి వెనుక కొంతదూరం వెళ్ళి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్యా, కైకేయీ చెరొక చేయీపట్టుకుని నిలబెట్టారు. దశరథుడు కైకేయితో, ``నన్నంటకు. నేను నీ భర్తను కాను. నిన్ను విడిచి పెట్టేశాను. నీ కొడుకు నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు,'' అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా విపరీతంగా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చేశాడు.


ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌసల్యా దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది. ఈ లోపల సీతా రామలక్ష్మణులెక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసా నదీ తీరం చేరింది. పురజనులు అక్కడిదాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి అరణ్యవాసం వెళ్ళవద్దని నిర్బంధం చెయ్యసాగారు. రాముడెన్ని చెప్పినా వారు ఏమాత్రం వినిపించుకోలేదు. సుమంత్రుడు గుర్రాలను విప్పి, కడిగి, నీరు తాగించి, నది ఒడ్డున తిరగనిచ్చి, తరవాత కట్టివేసి మేత పెట్టాడు. సుమంత్రుడూ, లక్ష్మణుడూ తయారుచేసిన ఆకుల పక్క మీద పడుకుని రాముడూ, సీతా నిద్రపోయారు.


సుమంత్రుడూ, లక్ష్మణుడూ రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపాయారు. తెల్లవారుతూండగా రాముడు లేచి, ఇళు్ళ వాకిళు్ళ విడిచిపెట్టి చెట్ల కింద నిద్ర పోతున్న పౌరులను చూసి, లక్ష్మణుడితో, ``వీరంతా లేవకముందే మనం రథ మెక్కి సాగిపోవటం మంచిది. లేకపోతే వీరు మనని వదలరు. మనతోపాటే వచ్చేస్తారు,'' అన్నాడు. సుమంత్రుడు రథం సిద్ధంచేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, ``రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకురా. అప్పుడు జనం మనం వెళ్ళిన జాడ తెలుసుకోలేక పోతారు,'' అన్నాడు. సుమంత్రుడు రథాన్ని అలాగే తిప్పి తెచ్చినాక సీతా రామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూర్చుని ఉత్తరంగా బయలుదేరారు.


తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీతా రామ లక్ష్మణులు లేరు. తమను వంచించిన నిద్రనూ, దైవాన్నీ తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు. తెల్లవారే సరికే రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని గడిచి, కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరవచ్చింది. గంగా నది సమీపాన శృంగిబేర పురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి, గుర్రాలను విప్పి, వాటికి మేతపెట్టాడు. సీతా రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు.


ఇంతలో గుహుడనే బోయరాజు, రాముడికి మంచి స్నేహితుడు, రాముడి రాక గురించి తెలిసి, తన మంత్రులతోనూ, కుల పెద్దలతోనూ చూడ వచ్చాడు. అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురు వెళ్ళి, గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, ``రామా, ఇదే అయోధ్య అనుకో! నీవు అతిథిగా రావటం నా అదృష్టం,'' అన్నాడు. తరవాత గుహుడు రాముడికీ, లక్ష్మణుడికీ, సీతకూ మంచి భోజనం సిద్ధంచేయించి, ``రామా, నీకు ఏ లోపమూ జరగదు. ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో,'' అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, ``గుహా, నా కోసం కాలి నడకన వచ్చావు.


అంతకన్న ఇంకేం కావాలి? నీ రాజ్యం నీవే ఏలుకో. నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చెయ్యక తప్పదు,'' అని నచ్చచెప్పాడు. ఆ రాత్రి రాముడూ, సీతా ఆ గారచెట్టు కిందనే పడుకుని నిద్రపోయారు. వారికి రక్షగా మేలుకుని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, ``నాయనా, నీవుకూడా పడుకుని విశ్రాంతి తీసుకో. తెల్లవార్లూ మీకు మేము కాపు ఉంటాంలే. అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే,'' అన్నాడు.


కాని లక్ష్మణుడు అలా చెయ్యక గుహుడితో తెల్లవార్లూ మేలుకుని కూచుని, జరిగినదాన్ని గురించీ, జరగబోయేదాన్ని గురించీ మాట్లాడాడు. అంతా విని గుహుడు చాలా దిగులుపడ్డాడు. ఆ రాత్రి గడిచి మర్నాడుదయం రాముడు కోయిల కూతలకూ, నెమళ్ళ కూతలకూ మేల్కొన్నాడు. అతను లక్ష్మణుడితో, ``సూర్యోదయం అవుతున్నది. మనం గంగానది దాటి వెళ్ళిపోదాం,'' అన్నాడు.


లక్ష్మణుడు వెళ్ళి బోయ రాజైన గుహుణ్ణీ, సారథి అయిన సుమంత్రుణ్ణీ పిలుచుకు వచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటటానికి మంచి పడవనూ, నావికుణ్ణీ సిద్ధంచెయ్యమన్నాడు. రాముడు సుమంత్రుడితో, ``సారధీ, నీ విక నగరానికి తిరిగి వెళు్ళ. మా తండ్రిగారితోనూ, తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి, పధ్నాలుగేళూ్ళ తీరగానే తిరిగి వస్తామని చెప్పు. తరవాత భరతుణ్ణి మేనమామ ఇంటి నుంచి తీసుకు వచ్చి రాజ్యాభిషేకం చేయించు,'' అన్నాడు.


సుమంత్రుడు, ``రామా, రణరంగంలో యోధుడు పడిపోగా సారధి ఉత్త రథాన్ని తీసుకుపోయినట్టుగా, మీరు ముగ్గురూ ఎక్కి వచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజల గుండెలు పగలవా? ఉత్త రథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు నా మొహం ఎలా చూపించను? నేనుకూడా ఈ పధ్నాలుగేళూ్ళ మీ వెంటనే ఉండి మీకు అడవిలోని ఫలాలను తెచ్చి పెడుతూ ఉంటాను,'' అన్నాడు. ``అలా కాదు, సారధీ.


నీ విక్కడే ఉండి పోతే మేము అరణ్యానికి వెళ్ళినట్టు కైకేయికీ, తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రిగారికీ ఎలా తెలుస్తుంది? కనక, నీవు తిరిగి వెళ్ళి తీరాలి,'' అన్నాడు రాముడు. తరవాత రాముడి కోరికపై గుహుడు మర్రిపాలు తెచ్చాడు. దానితో రామలక్ష్మణులిద్దరూ మునులలాగా జడలు కట్టుకున్నారు. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరవాత తానుకూడా ఎక్కాడు.


రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కికూచున్నాడు. గుహుడి బంధువులు తెడ్లువేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు. పడవ నడి ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి, ``గంగాదేవీ, పధ్నాలుగేళ్ళ అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులకు లక్ష గోవులూ, వస్త్రాలూ దానం చేస్తాను, అన్నదానం చేస్తాను. నీకు నైవేద్యం పెడతాను. నీ గట్టున ఉండే అన్ని దేవాలయాలకూ మొక్కుతాను. మేము సుఖంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించు,'' అని భక్తితో మొక్కు కున్నది. త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది.


సీతారామలక్ష్మణులు వత్సదేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు. ముందు లక్ష్మణుడూ, అతని వెనక సీతా, సీత వెనకగా రాముడూ-ఈ విధంగా వారు నడక సాగించారు. గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనపడకుండా వెళ్ళిన దాకా చూసి కంటతడి పెట్టుకున్నాడు. రామలక్ష్మణులు ఆ రోజు చుట్టుపక్కల చెట్లకు కాచిన సుమధుర ఫలాలను తిని ఆకలి తీర్చుకుని, ఆ రాత్రికి ఒక చెట్టు కింద చేరారు.


తన స్థితి తలుచుకుని రాముడు వశం తప్పి మాట్లాడసాగాడు. ఇదే అరణ్యవాసానికి మొదటిరాత్రి. ఇకనుంచీ సుమంత్రుడు కూడా తోడుండడు. నిద్రపోకుండా మేలుకుని ఉండి తానూ, లక్ష్మణుడూ సీతను జాగ్రత్తగా కాపాడు కోవాలి. ఇప్పుడు తండ్రి దశరథుడు పుట్టెడు దిగులుతో పడుకుని ఉంటాడు. ఆయనకు తీరని క్షోభకలిగించిన కైకేయికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. భరతుడు హాయిగా, సుఖంగా రాజ్యమేలు తాడుగద! అసలు ఈ కైకేయి దాపరించింది దశరథుడి కీడుకూ తనను అడివికి పంపటానికీనూ! సుకుమారి అయిన సీత తన కారణంగా ఇడుమల పాలు కావలసివచ్చింది.


అమ్మ ఏ జన్మ లోనో తల్లీ కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది. తాను తలుచుకుంటే, ఒక్క అయోధ్య ఏమిటి, భూమండలమంతా జయించ గలడు! తండ్రి మాటకు లోబడి, ధర్మం కోసం పట్టాభిషేకం మానుకున్నాడు గాని! అయినా, తానొకటి తలిస్తే విధి ఒకటి తలిచింది. ఇందులో ఎవరిని నిందించీ ప్రయో జనంలేదు. అంతా విధిప్రకారమే జరుగుతుంది.


ఎంతటి వారైనా విధికి తలవొగ్గక తప్పదు! రాముడికి నిద్ర రాలేదు. అతను కన్నీరు కారుస్తూ ఇదే ధోరణిలో మాట్లాడుకు పోతూ ఉండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఊరడించాడు. ఆ మాటలతో రాముడి మనసు కాస్త స్థిమితపడి, వనవాస దీక్ష అతనిలో దృఢపడింది. పక్కనే ఒక మర్రిచెట్టు కింద లక్ష్మణుడు ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు.


సీతారాములు ఆ రాత్రికి ఆ పక్కపైన పడుకున్నారు. తెల్లవారుతూనే ముగ్గురూ లేచి గంగా యమునా సంగమమైన ప్రయాగ కేసి నడిచారు. అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్త మయమయింది. రాముడు భరద్వాజుడితో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు. ``అవును, నీ తండ్రి నిన్ను అకారణంగా అడవులకు పంపాడని విన్నాను. నీ విక్కడికి వచ్చావు గనక నిన్ను చూడగలిగాను. ఈ ఆశ్రమంలోనే ఒక పర్ణశాల వేసుకుని పధ్నాలుగేళూ్ళ ఇక్కడే ఉండిపోవచ్చు.


ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది. ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైనది,'' అన్నాడు భరద్వాజుడు. దానికి రాముడు, ``మునీంద్రా, మేమీ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసి పోవటానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా, మాకు వాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగినది. ఆమెకు చూడ ముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే, అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉండి పోతాము,'' అన్నాడు. ``ఇక్కడ ఉండటం ఇష్టంలేక పోతే ఇక్కడికి పదికోసుల దూరాన చిత్రకూట మనే కొండ ఉన్నది. అది చాలా రమ్యమైన ప్రదేశం.


ఆ పర్వతంమీద కొండ ముచ్చులూ, కోతులూ, ఎలుగుబంట్లూ ఉంటాయి. కొన్ని వేల ఏళు్ళగా ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అది మీకు అనువైన ప్రదేశం. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు,'' అన్నాడు భరద్వాజుడు.


అయోధ్యకాండ -6


ఆ రాత్రి వారు ముగ్గురూ భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని సుఖంగా నిద్ర పోయారు. మర్నాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంతదూరం సాగనంపి, చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్ళి వచ్చిన తోవ గుర్తులు చెప్పాడు. సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యలమీద ఎండిన వెదుళ్ళతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు.


దానిపైన నేరేడు కొమ్మలతోనూ, పబ్బలి తీగలతోనూ ఒక సుఖమైన ఆసనం సీత కోసం అమర్చాడు. తెప్ప మీద తమ వస్తువుల నన్నిటినీ ఉంచి, తాము కూడా ఎక్కి నదిని దాటారు. ప్రవాహ మధ్యంలో సీత యమునా నదికి నమస్కరించి ఆవులూ, వెయ్యి కడవల పాలూ ఇస్తానని, గంగకు మొక్కుకున్నట్టే మొక్కుకున్నది.


వసంతకాలం కావటంచేత అడివి చెట్లు పుష్పించి మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్లనిండా ఎరట్రి పూలున్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించటం ప్రారంభించింది. లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ, ఆమె కోరిన ప్రతి పువూ్వ, ప్రతి పండూ కోసి తెచ్చి ఇస్తూ, ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నిటికీ వివరంగా సమాధానాలిచ్చాడు.


ఆ రాత్రికి వారు ఒక చదునైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి లక్ష్మణుణ్ణి లేపి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మిద్దామన్నాడు.


లక్ష్మణుడు మంచి గుంజలు నరికితెచ్చి, వాటితో దృఢమైన విభాగాలూ నిర్మించాడు. ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసి, పక్కనే ప్రవహించే మాల్యవతీ నదిలో స్నానాలుచేస్తూ, చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ, పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడపసాగారు. అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళిపోయారు.


రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి, రాముడు అయోధ్య విడిచి వెళ్ళిన అయిదు రోజులకు తిరిగివచ్చాడు. దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావటం చూసి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకున్నారు. సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్ళి, సింహాసంపైన కూర్చుని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు. దశరథుడు అమితమైన శోకోద్రేకంతో స్పృహతప్పి కింద పడి పోయాడు. కౌసల్య, సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ, ``మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపి వచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం? కైక ఏమన్నా అనుకుని పోతుందనా? ఆవిడగారిక్కడ లేదుగా!'' అని చెప్పింది.


దశరథుడితో బాటు కౌసల్యా, ఇతర అంతఃపురకాంతలూ రోదనాలు చేశారు. ``నా ఆజ్ఞకు ఎంత విలువ ఉన్నదో నాకు తెలియదు; నీవు మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా! లేదా నన్ను ఆ రాముడి దగ్గిరికైనా తీసుకుపో,'' అన్నాడు దశరథుడు. కౌసల్యకూడా సుమంత్రుడితో గర్భశోకంతో తనను రాముడున్న చోటికి తీసుకుపొమ్మన్నది.


సుమంత్రుడు కౌసల్యను ఊరడిస్తూ, రామలక్ష్మణులు సులువుగా అరణ్య వాసవ్రతం పూర్తి చేయగలరనీ, ఆ సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్టే లేదనీ, రాముడు లేని అయోధ్యే ఆమెకు అరణ్యమనిపించి ఉండేదనీ అన్నాడు. మర్నాడంతా కౌసల్య దశరథుడు చేసిన పనికి ఆయన్ను నిషూ్ఠరాలు పలికింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టుకున్నది.


దశరథుడూ బాధ పడ్డాడు. కౌసల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి, తన చావు కొన్ని ఘడియలలో ఉన్నదనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక మునివల్ల శాపం పొందాడు.ఇప్పుడాయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు: ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు.


ఆయనకు చప్పుడును బట్టి బాణం గురి చేసి కొట్టటంలో చాలా నేర్పుండేది. ఈ శబ్దవేధిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు. అందుచేత యువరాజై ఉన్న దశరథుడు తరుచు రాత్రివేళ సరయూ నదీ తీరానికి వెళ్ళి, అక్కడ వన్యమృగాలు నీరు తాగటానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని, నీటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులనూ, సింహాలనూ, ఇతర మృగాలనూ వేటాడుతూ ఉండేవాడు.


ఇలా ఉండగా ఒకసారి, వానకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీతీరాన పొంచికూచున్నాడు. ఆ సమయంలో నది నీటిలో బుడబుడ మని చప్పుడయింది. అడవి ఏనుగు అయి ఉంటుందనుకుని దశరథుడు చప్పుడుకు గురి చేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు. మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది. ``అయ్యయ్యో, తపస్సు చేసుకునే మా బోటివాళ్ళ మీద ఈ బాణం పడట మేమిటి? నేను ఎవరికి అపకారం చేశాను? నన్ను చంపిన వాడిక ఏం లాభిస్తుంది? ఎవడోగాని, ఒక్క బాణంతో మూడు ప్రాణాలు తీశాడే! నేను పోతే, ముసలివాళూ్ళ, గుడ్డివాళూ్ళ అయిన నా తల్లిదండ్రులెంతకాలం బతుకుతారు? ఎలా బతుకుతారు?'' అన్న మాటలు దశరథుడి చెవులపడ్డాయి.


ఆయన దగ్గిరికి వెళ్ళి చూసేసరికి తన బాణం తగిలి ఒక ముని కుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిల లాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉంది. మతిపోయి, చెయ్యీ కాలూ ఆడక నిలబడి ఉన్న, దశరథుడితో ఆ ముని కుమారుడు, ``ఎందుకు చేశావీ పాడుపని? నేనిక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్ళి చెప్పు. లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు. తెలిసినా ఆయన రాలేడు.


దాహం జాస్తిగా ఉన్నదంటే నీరు తీసుకుపోదామని వచ్చి నీ బాణం వాత పడ్డాను. ఈ బాధ భరించలేను. ముందు ఈ బాణం లాగి మరీ వెళు్ళ,'' అన్నాడు. కురవ్రాడు బాధపడి పోతున్నాడు, బాణం లాగేస్తే చస్తాడేమోనని దశరథుడు మొదట తటపటాయించినా, చివరకు ఆ కురవ్రాడి ప్రోద్బలం మీదనే బాణం లాగేశాడు. వెంటనే మునికుమారుడు ప్రాణాలు వదిలాడు. తరవాత దశరథుడు ఆ కురవ్రాడి పాత్రలో నీరు ముంచుకుని, అతడు చెప్పిన దారినే అతని తల్లిదండ్రులుండే కుటీరానికి వెళ్ళాడు.


దశరథుడి అడుగుల చప్పుడు విని తన కొడుకే ననుకుని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు, ``నాయనా, ఎప్పుడో అనగా మంచినీటి కోసరం వెళ్ళిన వాడివి ఇంత ఆలస్యం చేశావేం? లోపలికి రా! త్వరగా నీరు ఇయ్యి!'' అన్నాడు.``నేను మీ అబ్బాయిని కాదు, దశరథుణ్ణి, క్షత్రియుణ్ణి,'' అంటూ, తడబాటుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్తా ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు. వారి దుఃఖానికి అంతు లేదు.


దశరథుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్ళి, దాని మీద పడి పెద్ద పెట్టున ఏడ్చారు. ముసలి ముని దశరథుడితో, ``మాకున్న ఒక్క కొడుకునూ అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు గనక నీవు కూడా పుత్రశోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను,'' అన్నాడు.


తరవాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు. ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరథుడికి ఇప్పుడు, తన ఆయువు తీరిపోయే దశలో, జ్ఞాపకం వచ్చింది. దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు. కౌసల్యతో మాట్లాడుతుండగానే దశరథుడికి చూపు మందగించింది. క్రమంగా శ్రవణశక్తికూడా పోయింది. బుద్ధివికలమై పోసాగింది. ఆయన రాముణ్ణి కేకలు పెడుతూ, కైకేయిని తిడుతూ అర్ధరాత్రివేళ ప్రాణాలు వదిలాడు.


అది రాముడు బయలుదేరి వెళ్ళిన ఆరో రోజు అర్ధరాత్రి. ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ, కౌసల్యా సుమిత్రలు సహితం, నిద్రపోతున్నారు. రాజు మరణించిన సంగతి మర్నాడు తెల్లవారిగాని అంతఃపుర కాంతలకు తెలియ లేదు. అంతఃపురంలో శోకాలు సాగినాక పై వారికి జరిగిన సంగతి తెలిసింది. త్వరలోనే వసిష్ఠుడు మొదలైనవారు వచ్చారు. దశరథుడు అంత్యక్రియలు జరపటానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గిర లేడు.


రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళారు.భరత శత్రుఘు్నలు భరతుడి మేనమామ అయిన కేకయరాజు ఇంట ఉన్నారు. అందుచేత దశరథుడి శరీరాన్ని తైలంలో ఉంచారు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే వారిని పిలిచి వసిష్ఠుడు వారితో, ``మీరు వేగంగల గుర్రాల పైన కేకయ రాజుండే రాజగృహానికి వెళ్ళండి. భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యమున్నదనీ, మేము రమ్మన్నామనీ చెప్పండి.


తంగాని, రాజుగారు చనిపోయిన సంగతిగాని చెప్పనే వద్దు,'' అని చెప్పి, భరతుడికి మేలిమి వస్త్రాలూ, ఆభరణాలూ ఇచ్చి పంపాడు. వాళు్ళ అనేక నదులూ, పర్వతాలూ దాటి, దీర్ఘ ప్రయాణం చేసి, భరతుడి మేనమామగారి దేశం చేరి, వాటిని ఇచ్చి, అతని మేనమామకూ, తాతగారికీ కానుకలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి, వసిష్ఠుడు చెప్పమన్న మాటలు అదే విధంగా చెప్పారు.


భరతుడు పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని, అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి, పెద్ద బలగంతో సహా బయలుదేరాడు. మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి, భరత శత్రుఘు్నలు రథంలో ముందుగా అయోధ్యా నగరం చేరుకున్నారు. వారు ఏడు రోజులు ప్రయాణించారు. దూతలు అయోధ్య నుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడ కల వచ్చింది. అది వచ్చినప్పటి నుంచీ అతని మనుసులో ఏదో ఆందోళనగానే ఉన్నది. అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది. ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహమూ, ఉల్లాసమూ లేవు.


జనం నీరసించి నట్టున్నారు, నగరం పాడుపడినట్టున్నది. భరతుడు ముందు తన తండ్రి నగరుకు వెళ్ళి అక్కడ ఆయన కనిపించక పోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు. కొడుకును చూస్తూనే కైకేయి ఆసనం మీది నుంచి లేచి, తన కాళ్ళకు నమస్కారం చేసిన భరతుణ్ణి తన చెంత కూచోబెట్టుకుని కుశల ప్రశ్నలు చేస్తూ, ``నీవు బయలుదేరి ఎన్నాళ్ళయింది, నాయనా? నీ మామా, తాతా క్షేమంగా ఉన్నారా? నీకక్కడ సుఖంగా జరిగిందా?'' అని ప్రశ్నించింది.


భరతుడు అన్నిటికీ సమాధాన మిచ్చి, ``అమ్మా, నాన్నగారెక్కడ? పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నే నాయన కాళ్ళకు మొక్కాలి!'' అన్నాడు. ``ఆయన పెద్దల్లో కలిసిపోయారు, నాయనా,'' అంటూ కైకేయి చావు కబురు చెప్పింది. ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలి పోయాడు. కైకేయి అతన్ని ఊరడించ యత్నించింది.
అయోధ్యకాండ-7
కొంతసేపు భరతుడు తండ్రి కోసం శోకించి, ``అయితే, అమ్మా, ఆయన ఆఖరు క్షణంలో నాకేమన్నా చెప్పాడా? ఆయన ఆఖరు మాటలేమిటి?'' అని అడిగాడు. `` `ఓ రామా, ఓ లక్ష్మణా, ఓ సీతా,' అంటూ ప్రాణాలు వదిలారు, నాయనా,'' అన్నది కైకేయి. భరతుడు అమిత ఆశ్చర్యంతో, ``అదేమిటి? రాముడూ, సీతా, లక్ష్మణుడూ దగ్గిర లేరా?'' అని అడిగాడు.

``అరణ్య వాసానికి వెళ్ళారుగా, నాయనా? రాముడు నారబట్టలూ, జడలూ ధరించి అరణ్యానికి వెళుతుంటే, సీతా, లక్ష్మణుడూ కూడా వెళ్ళారు,'' అన్నది కైకేయి. భరతుడు మరింత ఆశ్చర్యపడి, ``ఏం? రాముడు ఏం పాపం చేశాడు? తను పాడుపనులేవీ చేయడే! భ్రూణహత్య చేసిన వాడికి విధించినట్టు అతనికి అరణ్యవాసశిక్ష ఎందుకు వేశారూ?'' అన్నాడు. ``అదేం కాదులే! మహారాజు రాముడికి పట్టాభిషేకం చేసే యత్నంలో ఉన్నట్టు విని, నేనాయనను రెండు వరాలు కోరాను: ఈ పట్టాభిషేకం నీకు చేసి, రాముణ్ణి పధ్నాలుగేళు్ళ అరణ్యవాసానికి పంపమన్నాను. మహారాజు సరే నన్నారు.

కనక వసిష్ఠుడు మొదలైన వారంతా చెయ్యవలిసిందంతా చేస్తారు. నీవు చక్కగా పట్టాభిషేకం చేసుకో!'' అన్నది కైకేయి. కైకేయి చెప్పిన ఈ మాటలు విని భరతుడు మండిపడి పెట్టవలసిన నాలుగు మాటలూ పెట్టాడు. ``నీవు భర్తను చంపావు, రాముణ్ణి అడవికి పంపావు, నీ ముఖం చూస్తే పాపం!'' అన్నాడు.

``జ్యేష్ఠుడికి రాజ్యాభిషేకం జరగటం క్షత్రియ వంశ ధర్మమని నీకు తెలి యదా? రామ లక్ష్మణులు లేకుండా నేనీ రాజ్యభారం ఎలా మోయగలననుకున్నావు?'' అని అడిగాడు. ``నే నిప్పుడే వెళ్ళి ఆ రాముణ్ణి పిలుచుకు వచ్చి రాజ్యాభిషేకం చేసి అతనికి దాస్యం చేస్తాను,'' అని తల్లితో చెప్పాడు. ఇంత పని చేసినందుకు కైకేయిని నిప్పుల్లో పడమన్నాడు, లేదా అరణ్యానికి వెళ్ళమన్నాడు, అదీ కాకపోతే గొంతుకు ఉరిపోసుకు చావమన్నాడు. ఇంతలో మంత్రులు వారున్న చోటికి వచ్చారు.

భరతుడు వారితో తనకు రాజ్యకాంక్ష ఏమీ లేదనీ, రాజ్యం కావాలని తాను తన తల్లితో చెప్పి ఉండలేదనీ, కైకేయి తన తండ్రిని వరాలు కోరటంగాని సీతా రామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళిపోవటంగాని, దూరదేశంలో ఉన్న తనకూ, శత్రుఘు్నడికీ తెలియనే తెలియవనీ స్పష్టంగా చెప్పేశాడు. తరవాత భరత శత్రుఘు్నలు కౌసల్య వద్దకు వెళ్ళారు. ఆమెను ఆలింగనం చేసుకుని ఆమెతోబాటు తాముకూడా ఏడ్చారు. ఆమె భరతుడితో కైకేయి తనకు చేసిన ద్రోహం గురించి చెబుతూంటే, భరతుడికి తననుకూడా తన తల్లితో జతచేసినట్టు అనిపించింది.

రాముడి అరణ్యవాసానికి తాను సమ్మతించలేదని అతను ఘోరమైన ఒట్లు పెట్టుకుని వేదన పడ్డాడు. కౌసల్య అతన్ని ఊరడించింది. దుఃఖ సముద్రంలో ఉన్న భరతుడితో వసిష్ఠుడు, ``నాయనా, ఈ విచారం కట్టిపెట్టి దశరథ మహారాజుకు ఉత్తర క్రియలు చెయ్యి,'' అని హెచ్చరించాడు. తైల భాండం నుంచి పైకి తీసిన తండ్రి శవాన్ని చూసి భరతుడు, ``నాయనా, నీవు పోయావు. రాముడడవిలో ఉన్నాడు. ఈ రాజ్యభారం ఎవరు మోస్తారు?'' అంటూ కడుదీనంగా దుఃఖించాడు.

దశరథుణ్ణి పల్లకీలో ఎక్కించి నగరం బయటకి తీసుకుపోయారు. శవానికి ముందుగా పురజనులు, వెండి బంగారు నాణాలు వెదజల్లుతూ; చందనమూ, అగరూ, గుగ్గిలమూ, మొదలైన ధూపాలు వేస్తూ నడిచారు. దశరథుడి భార్యలు పల్లకీలలో వెళ్ళారు. శవాన్ని చితిపై పెట్టాక దశరథుడి భార్యలు భరతుడితో బాటు చితి చుట్టూ అప్రదక్షిణంగా తిరిగారు. భరతుడు తండ్రికి నిప్పు పెట్టాక అందరూ నగరానికి తిరిగి వచ్చారు. భరతుడు తండ్రికి పది దినాలు మైలపట్టి తరవాత రెండు రోజులపాటు శ్రాద్ధాలు చేశాడు.

బ్రాహ్మణులకు అన్న దానమూ, వస్త్ర దానమూ, ఇతర దానాలూ చేశాడు. పదమూడో రోజు అస్థిసంచయనం చేసేటప్పుడు భరతుడూ, అతనితోపాటు శత్రుఘు్నడూ తండ్రిని తలుచుకుని వివశులై విలపించారు. తరవాత ఒక చోట భరత శత్రుఘు్నలు జరిగినదాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు; తన అన్న అయిన లక్ష్మణుడు తన తండ్రికి ఎందుకు అడ్డుపడలేదా అని శత్రుఘు్నడు ఆశ్చర్యం వెలిబుచ్చుతూండగా, మంధర మహారాణీలాగా అలంకరించుకుని ఆట కోతిలాగా తయారై అటుగా వచ్చింది.

ద్వారపాలకులు దాన్ని పట్టుకుని శత్రుఘు్నడి దగ్గిరికి తెచ్చి, ``ఇదుగో! అన్ని పాపాలకూ మూలమైన మంధర!'' అన్నారు. శత్రుఘు్నడు కోపావేశంతో మంధరను పట్టుకుని దాన్ని హతమార్చే ఉద్దేశంతో జరజరా ఈడ్చుకు పోసాగాడు. మంధర వెంట ఉండే దాసీలు బెదిరిపోయి కౌసల్య దగ్గిరికి పరిగెత్తారు. మంధర కప్పు ఎగిరిపోయేటట్టు కేకలు పెట్టసాగింది. కైకేయి మంధరను విడిపించటానికి వస్తే శత్రుఘు్నడామెను నోటికి వచ్చినట్టు తిట్టాడు. అప్పుడు కైకేయి పరిగెత్తి వెళ్ళి భరతుణ్ణి పిలుచుకువచ్చింది.

భరతుడు శత్రుఘు్నడితో, ``ఆడదాన్ని చంపుతావా? ఈ మాట తెలిస్తే రాముడు మన ముఖం చూస్తాడా? రాముడి ఆగ్రహానికి గురికావలిసి వస్తుందని ఆగాను కాని, నేను కైకేయిని ఎప్పుడో చంపకపోయానా? ఆ గూనిదాన్ని వదిలిపెట్టు,'' అన్నాడు. దశరథుడు పోయిన పధ్నాలుగో రోజు ఉదయం పెద్దలందరూ భరతుడి వద్దకు వచ్చి, ``రాజపుత్రా, రాజ్యానికి నాయకుడు లేడు. అదృష్టవశాత్తూ జనంలో అరాజకం సాగలేదు.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీవు వెంటనే పట్టాభిషేకం చేసుకోవటం మంచిది,'' అన్నారు. భరతుడు వారితో, ``జ్యేష్ఠుడే రాజు కావటం మా వంశాచారం. అందుచేత నన్ను రాజు కమ్మని మీరు కోరటం ఉచితం కాదు. నా తల్లి కోరిందిగదా అని పట్టం కట్టుకోను. నేను అరణ్యానికి వెళ్ళి జ్యేష్ఠుడైన రాముణ్ణి రాజును చేసి తీసుకువచ్చి, అతనికి బదులుగా నేనే అరణ్యవాసం చేస్తాను.

రాజ్యాభిషేకం అరణ్యంలోనే జరుగుతుంది గనక, అభిషేక సంబారాలన్నీ నా వెంట తీసుకు పోవటానికీ, నాతోబాటు చతురంగబలాలతో కూడిన సేనను వెంట బెట్టుకు వెళ్ళటానికీ అవసరమైన ఏర్పాట్లు చేయండి,'' అన్నాడు. భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి. అరణ్యం మధ్యగా చెట్లు నరికి, భూమి చదును చేసి దారులు వేశారు. నదులపై వంతెనలు కట్టారు.

దారిలో అడ్డు వచ్చిన గోతులూ, చెరువులూ పూడ్చారు. దారి పొడుగునా అక్కడక్కడా బావులు తవ్వారు. విడిదికి తగిన స్థలాలు చూసి అక్కడ వీధులూ, ఇళూ్ళ గలిగిన శిబిరాలు నిర్మించారు. ఇలాటి శిబిరాలు సరయూనదీ తీరం నుంచి గంగాతీరం వరకూ ఏర్పాటు చేశారు. ఆ రాత్రి శంఖాలు మోగటమూ, భేరి వాయింపూ, వందిమాగధుల స్తోత్రాలూ విని భరతుడు నిద్ర లేచి, కంట నీరు పెట్టుకుని, ``నేను రాజునుగాను. నాకు స్తోత్ర పాఠాలూ, మంగళ వాద్యాలూ వద్దు,'' అని వాటిని నిలిపించాడు.

వసిష్ఠుడు తన పరివారంతో రాజసభకు వచ్చి, భరతుడి పట్టాభిషేకం జరిపించే ఉద్దేశంతో పురప్రముఖులనూ, మంత్రులనూ, గణనాయకులనూ, భరతుణ్ణీ, శత్రుఘు్నణ్ణీ, ఇతర ముఖ్యులనూ వెంటనే పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. త్వరలోనే అందరూ వచ్చి సభను అలంకరించారు. దశరథుడు జీవించి ఉన్నప్పటిలాగే సభ కళకళలాడింది.

అప్పుడు అందరి సమక్షంలోనూ వసిష్ఠుడు భరతుణ్ణి రాజ్యాభిషేకం చేసుకోవలిసిందిగా కోరాడు. భరతుడు పెద్దలతో చెప్పిన మాటలే పేరోలగంలో మళ్ళీ చెప్పి, ``నేను మీ అందరి సమక్షంలోకి రాముణ్ణి తీసుకురావటానికి శాయశక్తులా యత్నిస్తాను. అతను రాకపోతే లక్ష్మణుడిలాగే నేను కూడా రాముడితోపాటు వనవాసం ఉండి పోతాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు ఇది వరకే ఆరంభమయ్యాయి.

మార్గం వేసేవారూ, మార్గరక్షకులూ మొదలైనవారు ముందే వెళ్ళిపోయారు. ఇంక నేను బయలుదేరటమే తరువాయి,'' అన్నాడు. ఈ మాటలకు అందరూ సంతోషించారు. ప్రయాణానికి సేనలను ఆయత్తం చేయవల సిందిగా సుమంత్రుడు సేనాధ్యక్షులకు చెప్పాడు. అయోధ్యా నగరానికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది. మర్నాడు భరతుడు పెందలాడే లేచి ప్రయాణమయ్యాడు.

అతని వెంట తొమ్మిది వేల ఏనుగులూ, అరవైవేల రథాలూ, లక్ష గుర్రాలూ యోధులతో సహా కదిలాయి. కౌసల్యా, సుమిత్రా, కైకేయీ వాహనాలలో బయలుదేరారు. కైకేయికి పట్టిన దయ్యం దిగిపోయింది. తాను చేసినదానికి పశ్చాత్తాపపడుతూ ఆమె మిగిలినవారి కంటె ముందు కదిలింది. పౌరులు గుంపులు గుంపులుగా భరతుణ్ణి వెంబడించారు.

రాముడికి ఇష్టులైనవారూ, వర్తకులూ, ఇతరులూ రాముణ్ణి చూడటానికి తాము కూడా ప్రయాణం కట్టారు. అనేక వేలమంది బ్రాహ్మణులు ఎడ్లబళ్ళెక్కి భరతుడి వెంట ప్రయాణమయ్యారు. ఇంత పెద్ద బలగాన్నీ వెంటబెట్టుకుని భరతుడు గంగాతీరాన్ని శృంగిబేరపురం వద్ద చేరుకుని, తన సైన్యాన్ని నది వెంబడి అక్కడక్కడా విడియమని ఉత్తరు విచ్చాడు.

అతను మంత్రులతో, ``మనం ఈ రాత్రికి ఈ తీరాన విశ్రమించి రేపు ఉదయానే గంగ దాటుదాం. నే నిప్పుడు నదిలో దిగి మా తండ్రికి తర్పణాలు వదులుతాను,'' అన్నాడు. మహా సముద్రంలాటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడియటం గుహుడు గమనించాడు. రథంయొక్క టెక్కెం గమ నించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు.

అతను తన ఆప్తులను చేరబిలిచి, ``భరతుడు ఇంత సేనతో ఎందుకు బయలుదేరి వచ్చి వుంటాడంటారు? రాముడు వనవాసం పూర్తిచేసి వచ్చి రాజ్యం అడుగుతాడేమో, అతన్ని అరణ్యం లోనే చంపేద్దామని వచ్చివుంటాడు. మనం రాముణ్ణి ఎలాగైనా రక్షించాలి. అతను నా మిత్రుడు. అందుచేత మన వాళ్ళను అయిదు వందల పడవలు సిద్ధం చెయ్యమనండి.

ఒక్కొక్క పడవలోనూ నూరేసిమంది యువకులను ఏర్పాటు చేసి, పడవలు గంగకు అడ్డంగా ఉంచి, అందులోనే మీకు అవసరమైన మాంసమూ, ఇతర ఆహారాలూ, ఉంచుకుని జాగ్రత్తగా ఉండండి. భరతుడికి రాముడి పట్ల ద్రోహబుద్ధి లేకపోతే అతన్నీ, అతని సైన్యాన్నీ నిరాటంకంగా నది దాటనిద్దాం, లేకపోతే మన పడవలతో అటకాయింతాం,'' అన్నాడు. గుహుడు ఈ కట్టుదిట్టాలు చేసిన అనంతరం రకరకాల ఫలాలూ, తేనే కానుకగా తీసుకుని భరతుడి వద్దకు వెళ్ళాడు.

గుహుడు వస్తూండటం ముందుగానే తెలుసుకుని సుమంత్రుడు భరతుడితో, ``నిన్ను చూడటానికి బోయ రాజైన గుహుడు వస్తున్నాడు. ఇతను బలవంతుడు, సమర్థుడు, రాముడికి మంచి స్నేహితుడు. అతన్ని తగిన విధంగా గౌరవించి నట్టయితే రామలక్ష్మణులు అరణ్యంలో ఎటు వెళ్ళారో వారి జాడకూడా తెలుస్తుంది,'' అన్నాడు. ``అయితే ఆ గుహుణ్ణి వెంటనే నా దగ్గిరికి తీసుకురా,'' అని భరతుడు సుమంత్రుణ్ణి పంపాడు. గుహుడు భరతుడి సమక్షానికి వచ్చి, తాను తెచ్చిన కానుకలు ఇచ్చి, ``తమరు వస్తారని ముందుగా తెలిసివుంటే మంచి ఆతిథ్యమూ, స్వాగతమూ ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి. ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి రేపు ముందుకు సాగిపోదురు గాని,'' అన్నాడు.

భరతుడు గుహుడికి సంతోషం కలిగేటట్టుగా, ``రాజా, ఇంత సేనకు నీవు ఒక్కడివే ఆతిథ్యం ఇస్తానన్నావు. ఆ మాటకన్న మాకు నీ నుంచి హెచ్చు గౌరవం ఇంకేం కావాలి? మేము భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళాలి, దారి చెప్పగలవా? ఇక్కడి నుంచి దారి చాలా కష్టమని విన్నాను,'' అన్నాడు. ``బాణాలు ధరించి మా బోయలు మీ వెంట వస్తారు లెండి. నేను కూడా వెంట ఉంటాను. అందుచేత మీకు దారి వెతుక్కునేపని ఉండదు,'' అన్నాడు గుహుడు.


అయోధ్యకాండ-8


గుహుడు భరతుడికి సహాయం చేస్తానన్నాడేగాని, లోలోపల అతన్ని సందేహం ఇంకా బాధిస్తూనే ఉన్నది. అతడు భరతుడితో, ``అయ్యా, నీ సేనా, అట్టహాసమూ చూస్తే నాకేదో అనుమానంగా ఉన్నది. నీవు వెళ్ళేది రాముడికి ద్రోహం తలపెట్టి కాదు గద?'' అని అడిగాడు. ఈ మాటకు భరతుడు బాధపడి, ``నీకీ అనుమానం కలగటం కన్న పెద్ద కష్టం నా కేమి ఉంటుంది? పెద్ద అన్న అయిన రాముడు నాకు తండ్రితో సమానం కాదా? రాముణ్ణి తీసుకురావటానికే నేను పోతున్నాను.

నా మాట నము్మ,'' అన్నాడు. ``మంచిమాట అన్నావు, బాబూ. నీలాగా చేతికందిన రాజ్యాన్ని విడిచిపుచ్చే వాళు్ళ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీ కీర్తి శాశ్వతం,'' అన్నాడు గుహుడు. అస్తమయమై చీకటి పడింది. ఆ రాత్రి భరతశత్రుఘు్నలు పడుకుని నిద్రపట్టక చాలా సేపు రాముణ్ణి గురించి చాలా దుఃఖించారు. వారి వెంట ఉన్న గుహుడు వారిని ఓదార్చాడు. అతడు లక్ష్మణుణ్ణి గురించి గొప్పగా చెప్పాడు: ``రాముడు నిద్రపోతున్నప్పుడు తాను మేలుకునే ఉండి రాముడికి ఏ భయమూ లేకుండా కాపాడతాను, నిద్రపొమ్మని చెప్పాను.

కాని విన్నాడుకాడు. రాముడూ, సీతా కటిక నేలపై పడుకున్నందుకే తన ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే ఇక నిద్ర ఎలా పడుతుందని అడిగాడు. రాముణ్ణి వదిలి దశరథుడు ఒక్క రోజు బతుకుతాడా అన్నాడు. పధ్నాలుగేళు్ళ వనవాసం చేసి మేము మళ్ళీ అయోధ్యకు తిరిగిపోతామా అని చింతించాడు. అదుగో, ఆ మర్రిచెట్టు కిందనే రామలక్ష్మణులు జడలు ధరించారు.

తెల్లవారినాక నేను వారి చేత గంగ దాటించాను.'' గుహుడు ఈ విధంగా చెప్పుకుపోతూ ఉంటే భరతుడికి దుఃఖం హెచ్చిపోయింది. కన్నీటి ధారలను ఆపుకోలేక పోయాడు. కౌసల్యా, సుమిత్రా, కైకా కూడా అతనున్న చోటికి వచ్చారు. వారి ఆసక్తి చూసి గుహుడు వారితో రాముణ్ణి గురించి ప్రతి వివరమూ చెప్పాడు. సీతారాములు గారచెట్టు కింద పడుకున్న చోటుకూడా చూపాడు.

దశరథ మహారాజు పెద్దకొడుకు ఆ చెట్టు కింద దర్భలు పరుచుకుని పడుకోవటం భరతుడు ఊహించనైనా లేకపోయాడు. ఆ రాత్రి గడిచినాక గుహుడు సూర్యోదయమవుతూండగా వచ్చి భరతుడికి నమస్కారంచేసి, ``రాత్రి సుఖంగా గడిచిందా? హాయిగా నిద్రపోయారా?'' అని అడిగాడు. ``మాకు ఏలోటూ జరగలేదు. మేము త్వరగా మా అన్న రాముణ్ణి చూడాలి.

మమ్మల్ని త్వరగా నది దాటించే ఏర్పాట్లు చేయించు,'' అన్నాడు భరతుడు. గుహుడు అయిదువందల పడవలూ, స్వస్తికాలనే పేరు గల మేలుజాతి ఓడలూ సిద్ధం చేయించాడు. తెల్ల కంబళి పరిచిన ఒక స్వస్తికంలో భరతశత్రుఘు్నలూ, వసిష్ఠుడూ, రాజభార్యలూ ఎక్కారు. భరతుడి సేనా, రథాలూ, బళూ్ళ, వాటినిలాగే జంతువులూ, సంబారాలూ, సమస్తమూ పడవలలోకి ఎక్కించారు. పడవలు నది దాటాయి. ఏనుగులు నదికి అడ్డంగా ఈదాయి. అలాగే కొందరు మనుషులుకూడా ఈదారు. మరి కొందరు తెప్పలమీదా, కుండల సహాయం తోనూ నది దాటారు.

తరవాత భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని, వసిష్ఠాదుల సల హాతో భరద్వాజ మహర్షిని చూడ బయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉందనగానే సైన్యమంతా ఆగి పోయింది. భరతుడు తన ఆయుధాలూ, ఆభరణాలూ తీసివేసి, పట్టుబట్టలు కట్టుకుని, వసిష్ఠుణ్ణీ, మంత్రులనూ వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. మంత్రులు ఆశ్రమంలో నిలిచిపోయారు. వసిష్ఠ భరతులు భరద్వాజుడి కుటీరానికి వెళ్ళారు. వారిని చూస్తూనే భరద్వాజుడు, ``అర్ఘ్యం తీసుకు రండి,'' అని కేక పెట్టి లేచి నిలబడ్డాడు.

భరతుణ్ణి వసిష్ఠుడు పరిచయం చేసినాక భరద్వాజుడు క్షేమసమాచారాలడిగి, ``నాయనా, నీవు హాయిగా రాజ్యపాలన చేసుకోక ఇలా ఎందుకు వచ్చావు?'' అన్నాడు. భరతుడు రామలక్ష్మణులకు ద్రోహం తలపెట్టి వచ్చాడన్న అనుమానం ఆయనకుకూడా కలిగింది. భరతుడిందుకు మనసులో ఎంతో నొచ్చుకుని, గుహుడికి చెప్పినట్టే భరద్వాజుడితో కూడా తన ఉద్దేశం చెప్పాడు. అంతా విని భరద్వాజుడు సంతోషించి, ``సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో ఉంటున్నారు.

ఇవాళ ఇక్కడ ఉండి, రేపు పోదువుగాని,'' అన్నాడు. ఇందుకు భరతుడు సమ్మతించాడు. ``నీ సేనలకన్నిటికీ నేను విందు చేయాలనుకుంటున్నాను. వారి నందరినీ దూరాన ఎందుకు ఉంచి వచ్చావు? ఇక్కడికి వారిని కూడా నీ వెంట తేవలిసింది,'' అన్నాడు భరద్వాజుడు. ``మహాత్మా, ముని ఆశ్రమాలకు సేనలు దూరంగా తొలగివెళ్ళాలన్న నియమాన్ని బట్టి సేనను దూరంగా ఉంచాను,'' అని భరతుడు సవినయంగా చెప్పాడు. ``ఫరవాలేదు, నీ సేనను పిలిపించు,'' అని భరతుడితో చెప్పి భరద్వాజుడు తన అతిథులకు అపూర్వమైన ఆతిథ్యం ఏర్పాటుచేశాడు.

విశ్వకర్మ వచ్చి క్షణంలో అద్భుతమైన ఇళు్ళ ఏర్పాటుచేశాడు. నదులన్నీ వచ్చి నీరూ, మైరేయం అనే సుమధర పానీయం సిద్ధం చేశాయి. దిక్పాలకులు పిలిపించబడ్డారు. పాటలు పాడటానికి విశ్వావసువూ, హాహా, హూహూ, అనే గంధర్వులూ, అనేకమంది అప్సరసలూ పిలిపించబడ్డారు. చంద్రుడు వచ్చి చతుర్విధాన్నాలూ పుష్పమాలలూ, పానీయాలూ, సుమధుర ఫలాలూ సిద్ధంచేశాడు. మయుడు నిర్మించిన అద్భుతమైన భవనాలలో ఒక రాజగృహంలాటిది భరతుడికి ప్రత్యేకించబడింది. అందులో సింహాసనంతో కూడిన విశాలమైన రాజసభ ఉన్నది.

భరతుడు అక్కడి అందమైన సింహాసనం మీద కూచోక మంత్రుల ఆసనం పైన కూచుని, తన పరివారాన్నీ, గుహుణ్ణీ యథోచితస్థానాలలో కూచోబెట్టాడు. బ్రహ్మదేవుడూ, కుబేరుడూ, దేవేంద్రుడూ తలా ఒక ఇరవైవేల మంది అప్సరసలను పంపారు. భరతుడు కొలువుతీరి ఉండగా నారద తుంబుర గోపులనే గంధర్వ రాజులు గానం చేశారు. అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన అనే అప్సరసలు భరతుడి ముందు నృత్యం చేశారు.

భరధ్వాజాశ్రమంలో గల చెట్లూ, పొదలూ, లతలూ స్త్రీ రూపాలు ధరించి భరతుడి సైనికులకు భక్తి శ్రద్ధలతో చక్కటి అతిథి మర్యాదలు చేశాయి. సైనికులు రుచికరమైన భోజనాలు చేసి ఆనందించారు. వారిచ్చిన అతిథిసత్కారాలతో మైమరిచి, ``మేము అయోధ్యకూ పోము, దండకారణ్యానికి పోము, ఇక్కడే ఉంటాము. రాముడూ, భరతుడూ క్షేమంగా ఉంటారుగాక!'' అన్నారు. కొందరు పూల మాలలు ధరించి అటూ ఇటూ పరిగెత్తారు, పాటలు పాడారు, నృత్యాలుకూడా చేశారు.

రకరకాల వంటకాలతో, పాయసంతో, మజ్జిగ పెరుగులతో దివ్యంగా తయారు చేసిన ఆహారాన్ని ఎంతతిన్నా వారికి తనివి తీరలేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మర్నాడు భరతుడు భరద్వాజుడి దర్శనం చేసుకుని, తమకు జరిగిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పుకుని, రాముణ్ణి చేరటానికి మార్గం అడిగాడు. చిత్రకూటానికి వెళ్ళటానికి దక్షిణంగా ఒక మార్గమూ, నైరృతీ దిశగా ఒక మార్గమూ ఉన్నాయనీ, సేనలు నడవటానికి ఏది యోగ్యమో చూసుకుని వెళ్ళమనీ భరద్వాజుడు సలహా ఇచ్చాడు.

దశరథుడి భార్యలు ముగ్గురూ మునికి మొక్కారు. భరతుడు తగిన రీతిగా వారిని మునికి పరిచయం చేశాడు. తన తల్లిని పరిచయం చేసేటప్పుడు అతను పరుషంగా మాట్లాడుతూ, కోపంతో దహించుకు పోయాడు. అనుకోకు. అందువల్ల ముందు ముందు చాలా లాభం కలుగుతుంది,'' అన్నాడు. తరవాత భరతుడు భరద్వాజముని వద్ద యథోచితంగా సెలవు తీసుకుని తన బలగంతో చిత్రకూటానికి బయలుదేరాడు.

వారు చివరకు మందాకినీ నదినీ, దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్నీ చేరవచ్చారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదీ జాడ తెలుసుకు రమ్మని భరతుడు సైనికులను పంపాడు. కొందరు సైనికులు అడవి ప్రవేశించి ఒక చోట పొగ వస్తూండటం గమనించి ఆ సంగతి భరతుడితో చెప్పారు. ఆ పొగ వచ్చేచోట ఎవరో ఉన్నారు. అయితే వారు రామలక్ష్మణులు కావాలి. లేదా రామలక్ష్మణుల జాడ ఎరిగిన మునులైనా కావాలి.

భరతుడు సేనను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి, సుమంత్రుణ్ణీ, వసిష్ఠుణ్ణీ మాత్రమే వెంట తీసుకుని సైనికులు చెప్పిన దిక్కుగా బయలుదేరాడు. రాముడు చిత్రకూటానికి వచ్చి అప్పటికి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండ మీద విహరించటానికి బయలుదేరాడు. చిత్రకూటపర్వతం చాలా అందమైనది. అక్కడి చెట్లూ, పక్షులూ, మృగాలూ, చిత్రవిచిత్రమైన ధాతువులూ, పక్కనే గలగలా ప్రవహించే మందాకినీ నదీ, మనోహరమైన దృశ్యాలూ చూస్తూ వారిద్దరూ చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, ``నీవూ, లక్ష్మణుడూ నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్ళయినా ఇక్కడే ఉండి పోగలను,'' అన్నాడు.

ఇలా చాలాసేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒక చోట కూచున్నారు. రాముడు కులాసాగా కబుర్లు చెబుతూ సీత చేత సుమధుర ఫలాలు తినిపించాడు. అదే సమయంలో రాముడికి పరిగెత్తిపోతున్న అడవి ఏనుగులు కనిపించాయి. అవి చేసే అరుపులు వింటే భయపడి పరిగెత్తుతున్నట్టు కనబడ్డాయి. నిజానికవి భరతుడి వెంట ఉండే సేనను చూసి బెదిరినవే. అప్పటికి రాముడు లక్ష్మణుడితో, ``చూడు, లక్ష్మణా! ఏనుగులూ, ఎనుబోతులూ, సింహాలూ కూడా బెదిరి పారిపోతున్నాయి. అటువైపు ఎవరైనా రాజు వేటాడుతున్నాడా? లేక ఈ అడవి మృగాలను మించిన క్రూర మృగ మేదైనా వచ్చిందా? కారణ మేమిటో చూడు!'' అన్నాడు.

లక్ష్మణుడు ఎత్తయిన చెట్టెక్కి అన్ని దిక్కులా ఒకసారి కలయజూసే సరికి ఉత్తర దిక్కుగా పెద్ద సేన కనబడింది. అతను రాముడితో, ``ఏదో పెద్ద సేన మనకేసి వస్తున్నది వెంటనే అగ్ని చల్లార్చి, సీతను గుహలో భద్రంగా దాచి, కవచం తొడిగి, ధనుర్బాణాలు తీసుకో,'' అన్నాడు. ``సరిగా పరిశీలించి చూడు, లక్ష్మణా! అలా వస్తున్నది ఎవరి సేనలాగుంది?'' అన్నాడు రాముడు.

లక్ష్మణుడు సేన మధ్య కనిపించే రథాలకు కట్టిన ధ్వజాలను గుర్తించి, ``భరతుడు తల్లి ధర్మమా అంటూ రాజ్యాభిషేకం చేసుకుని, అంతటితో తృప్తిచెందక తన రాజ్యం నిష్కంటకం చేసుకోవటానికై మనని చంపటానికి సేనలతో వస్తున్నాడు-మనం పర్వతం మీద దాక్కుందామా? లేక యుద్ధ సన్నద్ధులమై ఇక్కడే ఉందామా?'' అని రాముణ్ణి అడిగాడు కోపంగా. అతను అంతటితో ఆగక, ``ఇప్పుడు భరతుడు మనకు చిక్కబోతున్నాడు. మనకీ కష్టాలన్నీ తెచ్చి పెట్టిన ఈ భరతుణ్ణి తప్పక చంపేస్తాను.

అందులో తప్పేమీ లేదు. పైగా భరతుడు చస్తే నీవు హాయిగా రాజువు కావచ్చు. కైకేయినీ, ఆ మంథరనూ, వాళ్ళవాళ్ళ నందరినీ కూడా చంపేస్తాను. అటువంటి పాపులు బతికి ఉండరాదు,'' అన్నాడు. ఈ మాటలు విని రాముడు తన తము్మణ్ణి మెత్తగా చివాట్లు పెట్టాడు: ``తనకుతానై భరతుడు మనను చూడవస్తూంటే యుద్ధం చేస్తానంటావేమిటి? తండ్రి మాట నిలబెట్టటానికి ఇక్కడికి వచ్చినవాణ్ణి, భరతుణ్ణి చంపేసి లోకనిందకు పాలుకమ్మంటావా? కొంచెం నష్టం కలగగానే తండ్రినీ, తము్మలనూ చంపుకుంటారా? భరతుణ్ణి ఎందుకు శంకిస్తున్నావు? అతను ఎన్నడైనా అనుమానించదగిన మాటలైనా నీతో అన్నాడా? అతను మామగారి ఇంటి నుంచి అయోధ్యకు వచ్చి, మన సంగతి విని మనని తిరిగి తీసుకుపోయే ఉద్దేశంతో వస్తూ ఉంటాడని నా నమ్మకం. నీకు నిజంగా రాజ్యకాంక్ష

ఉంటే చెప్పు, భరతుడు రాగానే రాజ్యం నీకిమ్మంటాను. అతను నా మాట కాదనడు.'' ఈ మాటలకు లక్ష్మణుడు సిగ్గుపడితల వంచుకుని, ``మన తండ్రే మనని చూడటానికి వస్తూ ఉండవచ్చు,'' అని మాట మార్చాడు. రాముడు లక్ష్మణుణ్ణి చెట్టు దిగి రమ్మన్నాడు. లక్ష్మణుడు దిగి వచ్చాడు.


అయోధ్యకాండ-9


లోపుగా భరతుడు రామాశ్రమాన్ని అంతదూరంలో చూసి, తన తల్లులను తీసుకు రమ్మని వసిష్ఠుడికి చెప్పి, సుమంత్రుణ్ణీ, శత్రుఘు్నణ్ణీ వెంటబెట్టుకుని ముందుకు వచ్చాడు. పర్ణశాల పరిసరాలలో మార్గం తెలిపే గుర్తులూ, ఎత్తుగా పేర్చిన కట్టెలూ, పిడకల పోగులూ, చెట్లకు గుర్తుగా కట్టిన పేలికలూ ఉన్నాయి. త్వరలోనే భరతుడు పర్ణశాలను సమీపించి, దానికి ఈశాన్యాన అగ్ని వేదికను చూశాడు. తరవాత పర్ణశాలలో తాపసి వేషంలో ఉన్న రాముణ్ణి చూశాడు. పక్కనే సీతా లక్ష్మణులున్నారు.

రాముణ్ణి చూడగానే భరతుడికి పుట్టెడు దుఃఖం వచ్చింది. అతను రాముడి దగ్గిరికి పరిగెత్తుకుపోయి, కన్నీరు కారుస్తూ, రాముడి పాదాలు కనబడక నేలపై బోర్లాపడ్డాడు. అతని నోట మాట రాలేదు. శత్రుఘు్నడు కూడా ఏడుస్తూ రాముడి కాళ్ళకు వందనం చేశాడు. రాముడు భరతశత్రుఘు్నల నిద్దరినీ కౌగలించుకుని కన్నీరు కార్చాడు. అతను భరతుడిపై ప్రశ్నల వర్షం కురిపించాడు: ``నాయనా, చాలా కాలానికి నిన్ను చూశాను. మారిపోయావు. గుర్తించ లేక పోయాను.

చాలా సంతోషం. ఇప్పుడెందు కిలా ఈ అరణ్యానికి వచ్చావు? నాయనగారు విచారం లేకుండా ఉన్నారా? తల్లులందరూ క్షేమమా? నీవు రాజధర్మాలు చక్కగా పాటిస్తూ పరిపాలన చేస్తున్నావా? నీ రాజ్యం ఎవరూ అపహరించలేదు గద? మంత్రులు అన్ని వేళలా తగిన సలహాలు ఇస్తూ నీకు సహాయంగా ఉంటున్నారా?''

భరతుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడనుకుని రాముడు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా, ``అన్నా, మన వంశంలో పెద్ద కొడుకుండగా చిన్నవాడు అభిషేకించుకునే ఆచారం ఎన్నడన్నా ఉన్నదా? పెద్దవాడివైన నువు్వండగా చిన్నవాడినైన నేనెలా రాజ్యాభిషేకం చేసుకోగలను? నా వెంట అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకుని, మన వంశాన్ని తరింపజెయ్యి. ఇప్పుడు మన తండ్రి కూడా లేడు.

నే నింకా కేకయరాజు నగరంలో ఉండగానే ఆయన పోయాడు. నీవూ, సీతా, లక్ష్మణుడూ వెళ్ళిపోయిన దుఃఖం ఆయనను తన పొట్టన పెట్టుకున్నది. ముందు తండ్రిగారికి జల తర్పణాలు చెయ్యి. నిన్నే తలచుకుంటూ పోయిన ఆత్మకు నీ జలతర్పణాలే ఫల ప్రదమవుతాయి,'' అన్నాడు. తండ్రి మరణవార్త విని రాముడు మూర్ఛపోయాడు.

సీతా భరత లక్ష్మణ శత్రుఘు్నలు చన్నీరు చల్లి రాముడికి మూర్ఛ తెలిసేటట్టు చేశారు. రాముడి విచారానికి అంతులేదు. తన కోసం దుఃఖించి తండ్రి చనిపోయినందుకూ, ఆయనకు తాను ఉత్తరక్రియలు చెయ్యనందుకూ తనను తాను తిట్టుకున్నాడు. తరవాత అతను తండ్రికి ఉదకదానం చెయ్యటానికి బయలుదేరుతూ,స్త్రీలూ పిల్లలూ ముందు నడవాలి గనక, సీతనూ లక్ష్మణుణ్ణీ తనకు ముందుగా నదికి బయలుదేరమన్నాడు.

సీతారామలక్ష్మణులు మందాకినీ నది రేవులో స్నానాలుచేసి దశరథుడికి నీళు్ళ వదిలారు. తరవాత రాముడు తండ్రికి సపిండీకరణం చేశాడు. గార గానుగుపిండిని రేగుపళ్ళతో కలిపి ముద్దలుచేసి దర్భలపై ఉంచాడు. తరవాత వారు ముగ్గురూ పర్ణశాలకు తిరిగివెళ్ళారు. అంతవరకూ దూరాన ఉండిపోయిన జనం పర్ణశాల నుంచి రోదన ధ్వనులు వినగానే అటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి మునివేషంలో ఉన్న రాముణ్ణీ, అతని తము్మలనూ, సీతనూ ఒక్క చోట చూశారు.

రాముడికి కొందరు నమస్కారాలు చేశారు. కొందరిని రాముడాలింగనం చేసుకున్నాడు. ఈ లోపల దశరథుడి భార్యలు వసిష్ఠుడి వెంట మెల్లగా నడుచుకుంటూ మందాకిని ఒడ్డు మీదుగా పర్ణశాల కేసి వచ్చారు. వారికి స్నానాలరేవూ, దానికి ఎడంగా రాముడు తండ్రి నిమిత్తం పెట్టిన పిండాలూ కనిపించాయి. కౌసల్య సుమిత్రతో, ``మన వాళు్ళ ఇక్కడే స్నానం చేస్తారు కాబోలు.

నీ కొడుకు రాముడి కోసం ఇక్కడినుంచే నీళు్ళ తీసుకుపోతాడు కాబోలు. ఇక లక్ష్మణుడి కష్టాలు తీరాయిలే. భరతుడు రాముణ్ణి తీసుకువచ్చి రాజ్యాభిషేకం చేయిస్తున్నాడుగా! ఈ గార గానుగుపిండి ముద్దలు చూశావా? భూమండలమంతా ఏలిన దశరథ మహారాజుకు ఈ ముద్ద లేమిటి, ప్రారబ్ధంగాకపోతే? పాపం, రాముడిదే తింటున్నాడు కాబోలు.

తలుచుకుంటే నా గుండె పగి లిపోతున్నది!'' అన్నది వచ్చే దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ. వారు పర్ణశాల చేరగానే రాముడు లేచి ముగ్గురు తల్లులకూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సీత కూడా వారికి నమస్కరించి ఎదురుగా నిలబడింది. వనవాసంతో చిక్కి పోయి ఉన్న సీతను కౌసల్య కౌగలించుకుని, ``జనకమహారాజు కూతురూ, దశరథ మహారాజు కోడలూ అయి ఉండి నీకీ వనవాసం గతి పట్టిందా, తల్లీ?'' అని ఎంతగానో వాపోయింది. రాముడూ, వసిష్ఠుడూ దగ్గిరగా కూచున్నారు.

రాముడికి మరొక పక్కగా భరతుడూ, మంత్రులూ, పురప్రముఖులూ మౌనంగా కూచున్నారు. భరతుడు తాను వచ్చినపని బయట పెట్టే సమయం వచ్చింది. అతడు ఎలా మొదలు పెడతాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు. రాముడే విషయం కదిపాడు. ``భరతా, నీవు జడలూ, నారబట్టలూ, కృష్ణాజినమూ ధరించి మునికుమారుడిలా ఈ అరణ్యానికి రావటానికి కారణ మేమిటి? వినాలని ఉన్నది,'' అన్నాడతను. భరతుడిలా చెప్పాడు: ``మన తండ్రి నిన్ను అడవికి పంపి నీ వియోగం భరించ లేక కాలధర్మం చెందాడు.

ఆయన ఈ పాపపు పని చేయటానికి ప్రేరణ ఇచ్చినది నా తల్లి కైకేయి. అందుకామె ఘోరనరకం ఎలాగూ అనుభవిస్తుంది. ఆమె కొడుకునైన నన్ను నీవు అనుగ్రహించాలి. వచ్చి రాజ్యాభిషేకం చేసుకో. ఇందుకే మన తల్లులూ, ఈ ప్రజలూ కూడా నిన్ను వెతుక్కుంటూ నావెంట వచ్చారు. వారి కోరిక తీర్చు. ఇంతమంది కోరికను తోసిపుచ్చకు.'' ఈ మాటలు చెప్పి భరతుడు తన తల రాముడి పాదాలకు తగిలేలాగా సాష్టాంగ పడ్డాడు. రాముడు భరతుణ్ణి కౌగలించుకుని నిట్టూర్చుతూ, ``నాయనా, నీవు చిన్నతనం చేత నీ తల్లిని నిందించావు.

పెద్దవారికి చిన్నవారిని ఎలా శాసించటానికైనా అధికారం ఉన్నది. దశరథుడికి నన్ను అడవికి పంపే అధికారం ఉన్నది. తండ్రి మీద లాగే తల్లి మీదా గౌరవం ఉంచాలి. పెద్దలు నన్ను అడవికి పొమ్మంటే నేను రాజ్యం ఎలా చేస్తాను? నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యం చెయ్యాలి, నేను నారబట్టలు కట్టి వనవాసం చెయ్యాలి. ఇది మన తండ్రి ప్రజల సమక్షంలో ఏర్పరచిన నియమం. పధ్నాలుగేళూ్ళ వనవాసం ముగించినాక తిరిగివచ్చి తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజ్యం చేస్తాను.

తండ్రి ఆనతి నెరవేర్చటంకంటె నాకు రాజ్యం ఏలటం ఎక్కువైనది కాదు,'' అన్నాడు. భరతుడి నోట మాటలు రాక అలాగే ఉండిపోయాడు. ఆ రాత్రి అలాగే గడిచిపోయింది. మర్నాడు అందరూ స్నానాలూ, జపహోమాలూ పూర్తిచేసి మళ్ళీ రాముడి చుట్టూ చేరారు. ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం మధ్య భరతుడు రాముడితో, ``నా తల్లిని గౌరవించి, నాకు రాజ్యం ఇచ్చావు. దాన్ని నీకిస్తున్నాను, తీసుకుని సుఖంగా ఏలుకో.

ఈ రాజ్యభారం మొయ్యటానికి నీవే సమర్థుడవు. గుర్రంలాగా గాడిద నడవలేదు గదా! మన తండ్రి నీకు చిన్నతనం నుంచీ ఎంతో శ్రమపడి రాజుకు అవసరమైన శిక్షణ ఇచ్చాడు. నీవు రాజువు కాకుండాపోతే, ఆయన పడిన శ్రమ అంతా వృథా అవుతుంది,'' అన్నాడు. భరతుడు చెప్పిన ఈ మాటలకు చుట్టూ చేరినవారంతా ఎంతో సంతోషం వెలిబుచ్చి, ప్రశంసించారు.

అప్పుడు రాముడు భరతుడికి కొంత తత్వబోధ చేశాడు: ప్రాణులకు మరణం నిత్యం. మనిషి ఏ పని చేస్తున్నా ఒక్కొక్క క్షణమే మృత్యువు దగ్గిరపడుతూ ఉంటుంది. ముసలివాడై అసమర్థుడైనవాడు చేయగలది లేదు; యౌవనం ఉండగానే ఆత్మవిచారం చెయ్యాలి. గడచిన క్షణం మరి రాదు. చనిపోయినవారి కోసం ఎంత చింతించీ లాభంలేదు.

ఏ ప్రాణి కూడా తన ఇష్టంవచ్చినట్టు నడుచుకోలేదు. దశరథుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అందుచేత భరతుడు మనోవైకల్యం మాని తండ్రి ఆజ్ఞను శిరసావహించి, తండ్రి జాడలలోనే నడుచుకుంటూ రాజ్యం చెయ్యటం ధర్మం. అలాగే రాముడు తండ్రి ఆజ్ఞ మీరక వనవాసం జరపటం ధర్మం. అంతా విని భరతుడు, ``నేను ధర్మానికి వెరిచే నా తల్లిని శిక్షించలేదు. తండ్రిని బహిరంగంగా దూషించలేదు.

కాని ఆయన తన భార్యకు దాసుడై, ఆమె విషం తాగుతానంటే బెదిరి, రాజ్యం చేయవలసినవాణ్ణి అరణ్యానికి పంపటం అధర్మం కాదా? తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచేసి తండ్రికి నరకప్రాప్తి కలగకుండా కొడుకు చూడవద్దా? వచ్చి రాజ్యంచేసి, తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచెయ్యి,'' అన్నాడు. రాముడు ఇందుకెంత మాత్రమూ ఒప్పుకో లేదు. కైకేయిని పెళ్ళాడేటప్పుడు దశరథుడు తన మామగారితో ఆమెకు పుట్టే కొడుకుకే పట్టం కడతానని మాట ఇచ్చిన సంగతి చెప్పాడు.

అప్పుడు అక్కడ ఉన్నవారిలో జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో, ``వెర్రివాడా? ఎవరు తండ్రి? ఎవరు కొడుకు? చచ్చిపోయిన వారి తృప్తి కోసం తద్దినాలు పెట్టేవాళూ్ళ, ఈ లోకంలో కష్టాలుపడేవాళూ్ళ మూఢులు. పరలోకం ఎక్కడున్నది? నీవు వెళ్ళి హాయిగా రాజ్యంచేసి సుఖపడు. ప్రతి ప్రాణీ ఒంటరిగా పుట్టుతుంది, ఒంటరిగా చస్తుంది.

బతికున్నంత కాలమూ ఈ ప్రపంచం ఒక మజిలీ. ఇదే నిజం, మిగిలినదంతా భ్రమ,'' అన్నాడు. ``ఇవి నాస్తికులనవలిసిన మాటలు. నీవు నాస్తికుడవని తెలియక మా తండ్రి నిన్ను చేరదీశాడు,'' అని రాముడు జాబాలిని నిందించాడు. వసిష్ఠుడు అడ్డువచ్చి, ``నాయనా, జాబాలి నాస్తికుడు కాడు. నీచేత రాజ్యాభిషేకానికి ఒప్పించటానికే అతను అలా చెప్పాడు,'' అన్నాడు. వసిష్ఠుడు కూడా పట్టం కట్టుకోమని రాముడికి ఎంతగానో చెప్పాడు.

కాని రాముడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. అప్పుడు భరతుడు సుమంత్రుడితో, ``వెంటనే వెళ్ళి దర్భలు తెచ్చి ఈ పర్ణశాల వాకిలికి అడ్డంగా పరు. రాముడు నా కోరిక తీర్చేదాకా నేను వాటిపై పడుకుని లేవను,'' అన్నాడు. సుమంత్రుడు, ``ఏం చెయ్యమంటావు?'' అన్నట్టు రాముడి కేసి చూశాడు. అది గమనించి భరతుడు తానే స్వయంగా వెళ్ళి దర్భలు తెచ్చి, వాటిని పర్ణశాల వాకి లికి అడ్డంగా పక్కవేసుకుని అలాగే పడుకున్నాడు. అది చూసి రాముడు భరతుడితో, ``నాయనా, ఈ పనిచేసేవారు అప్పులు వసూలు చేసుకోలేకపోయిన బ్రాహ్మణులు.

ఇది క్షత్రియులు చేసేపని కాదు. అదీగాక నేను నీకేమి ద్రోహం చేశానని వాకిలికి అడ్డం పడుకుంటావు? లే, నా మాట విని అయోధ్యకు తిరిగి వెళ్ళిపో,'' అన్నాడు. భరతుడు దర్భల మీది నుంచి లేవకుండానే చుట్టూ మూగిన జనాన్ని చూసి, ``మీరందరూ ఊరుకుంటారేం? రాముడికి చెప్పరేం?'' అని అడిగాడు. ``రాముడు తండ్రి ఆజ్ఞ పాలించి తీరాలని పట్టుపడుతున్నప్పుడు చేసేదేముందీ?'' అన్నారు వారందరూ.


అయోధ్యకాండ-10


భరతుడు రాముడి ఆజ్ఞానుసారం లేచి జలం స్పృశించి రాముణ్ణి తాకి అందరితోనూ ఈ విధంగా అన్నాడు : ``మీరంతా వినండి. నేను నా తండ్రిని రాజ్యం కోర లేదు, నా తల్లినీ కోరలేదు. రాముడడవికి వెళ్ళటం నాకు సమ్మతంకాదు. రాముడి బదులు నేను పధ్నాలుగేళూ్ళ వనవాసం చేస్తాను; నాకు బదులు రాముణ్ణి రాజ్యం చెయ్యమనండి.

తండ్రి ఆజ్ఞ పాలించినట్టవుతుంది.'' ఈ మాటలు విని రాముడు నిర్ఘాంత పోయి, ``ఇలా రాజ్యాన్ని, వనవాసాన్ని మార్పు చేసుకోవటం పితృవాక్య పరిపాలన ఎలా అవుతుంది? నేను వనవాసం చెయ్యటం మాని రాజ్యం ఏలటం కన్న ఘోరమైన తప్పు ఉండదు. ఈ పధ్నాలుగేళూ్ళ పూర్తికాగానే నేనూ, భరతుడూ కలిసి రాజ్యంచేస్తాం,'' అన్నాడు. చుట్టూ చేరిన వారు రాముడి మాటలకూ, భరతుడి మాటలకూ కూడా సంతోషించారు.

వారు భరతుడితో, ``నాయనా, రాముడు చెప్పినట్టు చెయ్యి, అతన్ని తండ్రి రుణం తీర్చుకోనీ!'' అన్నారు. రాముడు సంతోషించాడు గాని భరతుడి గుండెలో రాయిపడింది. చివర కతను రాముణ్ణి పాదుకలిమ్మని అడిగాడు. రాముడు ఆ పాదుకలను కాళ్ళకు వేసుకుని భరతుడికి ఇచ్చాడు.

భరతుడు రాముడితో, ``నువు్వ కాకపోతే నీ పాదుకలే లోకాన్ని రక్షిస్తాయి. నేను మునివేషంతో, ఫల మూలాలు తింటూ, రాజ్యభారం ఈ పాదుకలకు అప్పగించి, ఊరి బయట ఉండి నీ రాక కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాను.

పధ్నాలుగేళూ్ళ దాటిన మర్నాడు నువు్వ రాకపోయావో, మరుక్షణమే తప్పక అగ్నిప్రవేశం చేస్తాను,'' అన్నాడు వినయంగా. రాముడిందుకు సరేనని, భరతుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ``నీ తల్లిని రక్షించు. ఆమె మీద ఆగ్రహించావో నా మీదా, సీత మీదా ఒట్టు! ఇక వెళ్ళి రా,'' అంటూ కన్నీరు కార్చాడు. భరతుడు బంగారు అలంకారాలు గల రామపాదుకలను పూజించి, రాముడికి భక్తితో ప్రదక్షణం చేశాడు.

తరవాత రాముడు తన తల్లులనూ, ఇతరులనూ అక్కడి నుంచి సాగనంపి పర్ణశాలకు తిరిగివచ్చాడు. భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని, శత్రుఘు్నడితో సహా రథ మెక్కాడు. వసిష్ఠ నామదేవ జాబాలి మొదలైన వారు ముందు సాగారు. భరతుడు సపరివారంగా తిరుగుప్రయాణంలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆయనతో జరిగినదంతా చెప్పి, ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. శృంగిబేరపురం మీదుగా ప్రయాణించి అతను చివరకు అయోధ్య చేరుకున్నాడు.

అయోధ్య వీధుల గుండా రథ మెక్కి వస్తూంటే అతనికి నగరం నిర్జీవంగా కనబడింది. అతను శత్రుఘు్నడితో, ``అయోధ్య కళ అంతా రాముడితోనే పోయింది,'' అన్నాడు. భరతుడు తన తల్లులను అయోధ్యకు తెచ్చి వసిష్ఠుడు మొదలైన వారితో, ``రాముడు లేని అయోధ్యలో ఉండలేను, నందిగ్రామానికి పోయి, అక్కడినుంచే రాజ్యం చేస్తూ రాముడి రాకకు ఎదురుచూస్తూ ఉంటాను,'' అన్నాడు.

ఈ ఏర్పాటుకు మంత్రులు కూడా సమ్మతించారు. భరతుడు తల్లుల దగ్గిర సెలవు పుచ్చుకుని, శత్రుఘు్నడితో బాటు రథమెక్కి, మంత్రులనూ, వసిష్ఠుణ్ణీ వెంటబెట్టుకుని నందిగ్రామానికి బయలుదేరాడు. తన వెంట రమ్మని అతను ఆజ్ఞాపించక పోయినప్పటికీ సేనకూడా అతని వెంట నందిగ్రామానికి కదిలింది. నందిగ్రామంలో పాదుకలకు శ్వేతచ్ఛత్రమూ ఇతర రాజమర్యాదలూ జరగాలని భరతుడు ఉత్తరు విచ్చాడు.

తన తల్లి మూలంగా తనకు కలిగిన అపకీర్తి పోగొట్టుకోవటానికి మహాత్ముడైన భరతుడు జడలు ధరించి, నారబట్టలు కట్టి, మునివేషం వేసుకుని నందిగ్రామంలో ఉండి కోసలదేశాన్ని పరిపాలించాడు. రాజతంత్రం ప్రతిదీ ఆ పాదుకలకు చెప్పుకునేవాడు. సామంతులు తెచ్చిన కానుకలను పాదుకలకు భక్తితో నైవేద్యం పెట్టేవాడు. రాముడికి జరగవలిసిన పట్టాభిషేకం ఈ విధంగా రామ పాదుకలకు జరిగింది.

భరతుడు వెళ్ళినాక రాముడు కొంత కాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయం తెలిసివచ్చింది: ఆ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడు వారంతా తమ ఆశ్రమాలు విడిచి వెళ్ళిపోబోతున్నారని కూడా తెలిసింది. ఇదంతా ఏమిటో తేల్చుకోవాలనుకుని రాముడు మునులకు కులపతి అయిన వృద్ధ ముని వద్దకు వెళ్ళి, ``మీరంతా ఆశ్రమాలు విడిచిపోతున్నారట.

నేనుగాని, నా తము్మడుగాని, నా భార్యగాని తెలియక చేయగూడని పని ఏదైనా చేయలేదు గద?'' అని అడిగాడు. దానికి కులపతి, ``మీరేమీ చెయ్యలేదు గాని, నీ కారణంగా రాక్షసులు మునులకు మహాభయం కలిగిస్తున్నారు. రావణుడి తము్మడు ఖరుడనే వాడు జనస్థానంలో చేరి అక్కడి మునులను పారదోలాడు. ఎప్పుడో మాకూ పీడ చుట్టుకుంటుంది. అందుచేత ఈ ప్రాంతం వదిలి పోవాలనుకుంటున్నాం. యోధుడివి, అందులోనూ భార్యతో ఉంటున్నవాడివి; నీకైనా ఈ చోటు వదలటమే మంచిది,'' అన్నాడు.

తరవాత అక్కడి మునులు చాలా దూరాన ఉండే మరొక ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళిపోయారు. రాముడు మాత్రం మరి కొంతకాలం అక్కడే ఉండి తాను కూడా ఆ ప్రాంతం విడిచిపెడితే మంచిదని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారమే అతడు సీతాలక్ష్మణులతో బయలుదేరి అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన వారిని తన బిడ్డలలాగా ఆదరించి, తానే స్వయంగా వారికి అతిథి సత్కారాలు చేశాడు. తరవాత అత్రిమహాముని కుటీరం లోపల ఉన్న జగద్విఖ్యాతురాలైన తన భార్య అనసూయను పిలిచి, ఆమెకు రామలక్ష్మణులనూ, సీతనూ పరిచయం చేశాడు. అనసూయ ఇప్పుడు చాలా వృద్ధురాలు. జుట్టంతా బాగా తెల్లబడిపోయింది.

అవయవాలు సడలి పోయాయి. కాని ఆమె తపశ్శక్తి మాత్రం సాటిలేనిది. అత్రిమహాముని రాముడితో, ``అనసూయ తన తపశ్శక్తితో ఎన్నెన్నో మహిమలను చేసి చూపింది.ఒకప్పుడు వర్షంలేక పదేళ్ళపాటు కరువువస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింప జేసి మునులకు ఫల మూలాలు ఉత్పత్తి అయేటట్టు చేసింది. పది రాత్రులు ఒకే రాత్రిగా ఉండేలాగ మరొక సందర్భంలో చేసింది.

సీతను ఈమెకు నమస్కారం చెయ్యమను,'' అన్నాడు. రాముడు సీతతో, ``ఈ మహాత్ముడి మాట విన్నావు కదా. మహా తపస్సంపన్నురాలు అయిన అనసూయాదేవికి నమస్కరించు. అందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది,'' అన్నాడు. సీత అనసూయకు తన పేరు చెప్పుకుని అమిత గౌరవంతో నమస్కారం చేసి ఆమెను కుశల మడిగింది.

అనసూయ సీతను చూసి ఎంతో ముచ్చటపడి మందహాసం చేస్తూ, ``తల్లీ, నువు్వ బంధువులనూ, ఐశ్వర్యాన్నీ, అహంకారాన్నీ, సమస్తాన్నీ విడిచి భర్త వెంట పాతివ్రత్య ధర్మంగా అరణ్యాలకు వచ్చావే, నీ భాగ్యమే భాగ్యం! అమ్మా, నేను ఎంతగానో ఆలోచించి చూశాను, స్త్రీని సమస్తవేళలా భర్తలాగా రక్షించేవారు మరెవరూలేరు. నువ్విలాగే భర్తను అనుసరించి ఉంటూ పాతివ్రత్య ధర్మం నెరవేర్చు,'' అని చెప్పింది.

``నా భర్త గుణవంతుడు, దయామయుడు, ధర్మాత్ముడు, నా మీద అచంచలమైన ప్రేమగలవాడు, నాకు తల్లి వంటి వాడు, తండ్రి వంటివాడు, మోహనాకారుడు; అటువంటి భర్తను సేవించటానికేం? నేను చిన్నతనం నుంచీ పతివ్రతా ధర్మాలు తెలుసుకున్నాను. అడవికి వచ్చేటప్పుడు నా అత్త కౌసల్య కూడా నాకా ధర్మం బోధించింది. ఇప్పుడు మీ నోట కూడా అవే వింటున్నాను,'' అన్నది సీత ఎంతో వినయంగా.

సీత తియ్యగా మాట్లాడుతూంటే అనసూయకు ఎంతో ముచ్చట అయింది. ఆమె సీతతో, ``అమ్మా, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీర్చుతాను,'' అన్నది. సీత ఈ మాట విని ఆశ్చర్యపడి, ``మీరా మాట అనటమే నాకు పదివేలు,'' అని సమాధాన మిచ్చింది. ``అయినా నా సంతోషం కొద్దీ ఇచ్చేది నువు్వ తీసుకోవాలి,'' అంటూ అనసూయ సీతకు ఒక దివ్యమైన పుష్పమాలా, ఒక చీరా, కొన్ని అందమైన ఆభరణాలూ, శరీరానికి పూసుకునే పూతా, మంచి పరిమళగంధమూ ఇచ్చింది.

తరవాత అనసూయ సీతతో, ``నీ భర్త నిన్ను స్వయంవరంలో పెళ్ళాడాడని విన్నాను. ఆ కథంతా చెబుతావా, అమ్మా?'' అని అడిగింది. సీత తన వృత్తాంతమంతా అనసూయకు చెప్పింది: ``మా తండ్రి జనకమహారాజు మిథిలకు రాజు. ఆయన యాగం కోసం నాగలితో భూమిని దున్నుతూ ఉండగా మట్టిలో నే నాయనకు దొరికాను. ఆయన కప్పటికి సంతానం లేకపోవటం చేత నన్ను తన కుమార్తెగా భావించి, పెంచమని తన పెద్ద భార్య కిచ్చాడు.

నాకు పెళ్ళియీడు వచ్చాక ఆయ నకు పెద్ద విచారం పట్టుకున్నది. ఎంత ఆలోచించినా నాకు తగిన భర్త ఆయనకు దొరకలేదు. అప్పుడాయన నాకు స్వయంవరం చేద్దామని నిశ్చయించి, తన ఇంటనున్న గొప్ప విల్లును ఎక్కుపెట్టిన వాడికి నన్నిచ్చి పెళ్ళిచేయ నిర్ణయించాడు. ఎందుకంటే, దైవాంశ ఉన్నవారు తప్ప మామూలు మనుషులు దానిని ఎత్తనైనా శక్తిలేని వారవుతారు.

ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి, ధనుస్సును ఎత్తలేక దణ్ణంపెట్టి వెళ్ళిపోయారు. అంతలో విశ్వామిత్రమహాముని రామలక్ష్మణులతో సహా యజ్ఞం చూడవచ్చాడు. విశ్వామిత్రుడు కోరగా మా తండ్రి ఆ ధనుస్సును తెప్పించి వారికి చూపాడు. రాముడా ధనువును అవలీలగా ఎత్తి, తాడు తగిలించి లాగేసరికి ధనుస్సు పెళపెళా నడిమికి విరిగిపోయింది.

వెంటనే నా తండ్రి కన్యాదానం చెయ్యటానికి జలకలశం తెప్పించాడు. కాని రాముడు తన తండ్రి అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడనన్నాడు. తరవాత మా తండ్రి అయోధ్యకు కబురు చేసి దశరథ మహారాజును రప్పించిన తరవాత మాకిద్దరికీ పెళ్ళి జరిగింది.'' ఈ కథ విని అనసూయ ఎంతో సంతోషించింది. ఆమె సీతను తన ఎదుటనే అలంకరించుకోమని చెప్పి, తరవాత ఆమెను రాముడి వద్దకు పంపింది. రాముడు అందమైన ఆమె అలంకరణలన్నీ చూసి, ``ఇవన్నీ ఎక్కడివి?'' అని అడిగితే అనసూయ ఇచ్చిన కానుకలని సీత చెప్పింది. రామలక్ష్మణులు పరమానందం పొందారు.

సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అత్రి మహాముని ఆశ్రమంలో గడిపి, మర్నాడు సూర్యోదయం వేళ అత్రిమహాముని వద్ద సెలవు తీసుకున్నారు. ``నాయనా, ఈ అరణ్యంలో కొందరు నరభక్షకులైన రాక్షసులు కూడా ఉన్నారు. మునులు ఫలాల కోసం అడవికి వెళ్ళి వచ్చేదారి చూపుతాను, ఆ దారినే వెళ్ళండి,'' అని అత్రి చెప్పాడు. ఆయన చూపిన మార్గాన బయలుదేరి సీతారామలక్ష్మణులు భయంకరమైన దండ కారణ్యం ప్రవేశించారు.

[అయోధ్యాకాండ సమాప్తం]

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML