గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 28 March 2015

రామాయణం (బాలకాండ)

రామాయణం
బాలకాండ -1

ఒకనాడు నారదమహాముని తమసా నదీతీరాన గల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, "మహాత్మా, ఈ యుగంలో ఈ లోకంలోసకల సద్గణ సంపన్నుడూ, మహాపరాక్రముడూ అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా?" అని అడిగాడు.
అప్పుడు వాల్మీకికి నారద మహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు. నారదమహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయే సరికి మధ్యాహ్న స్నానానికి వేళ అయింది. వాల్మీకి, శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక క్రౌంచపక్షుల జంట కనిపించింది. నారబట్ట కట్టుకుని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహాన్ని చూస్తున్నంతలో ఒక బొయవాడు బాణంతో మగపక్షిని కొట్టాడు. అది కిందపడి గిలగిలా తన్నుకున్నాది. ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది. వాల్మీకి హృదయంలో ఆ పక్షిపైన జాలీ, కిరాతుడిపైన ఆగ్రహామూ తన్నుకునివచ్చాయి. "ఓరి కటిక వాడా, ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు," అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది.
తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకే విస్మయం చెందాడు. ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన శ్లోకం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు.
అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడ వచ్చాడు. వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగం చేసి, అర్ఘ్యపాద్యాలిచ్చి, స్తోత్రాలతో సన్నుతించి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ, "వాల్మీకీ, నాఅనుగ్రహంచేతనే నీకు కవిత్వం అబ్బింది. నీవు ఇంతకు ముందే రాముడి కథ విన్నావు గదా. ఆ కథను మహాకావ్యంగా రచించు. అది భూమి ఉన్నంత కాలమూ నిలిచి ఉంటుంది. అది ఉన్నంతకాలమూ నీవు ఉతమ లోకాలలో సంచరించగలిగి ఉంటావు," అని చెప్పి అంతర్థానమయ్యడు. ఈ విధంగా బ్రహ్మయొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు. వైవస్వతుడు సూర్యుడి కొడుకు. ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు. వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు. ఆయన ఆనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులనీ, సూర్యవంశం వారనీ పిలవబడి ప్రసిద్ధికెక్కారు. వీరిలో సగరుడు కూడా ఒకడు. ఈ సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనమడే.
సూర్యవంశపు రాజులు అయోధ్యా నగరం రాజధానిగా కోసలదేశాన్నిపాలించారు. అయోధ్యను వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు. శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరధుడు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరధుడు ఐశ్వర్యంలోఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు,మహాపరాక్రమ సంపన్నుడు.
దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్దార్ధుడు, అర్ధసాదకుడు, అశోకుడు, మంత్ర పాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిదిమందీ దశరధుడి మంత్రులు. వసిష్ట మహాముని ఆయనకు కులగురువు. వసిష్ఠుడూ, వామదేవుడూ ఆయన పురోహితులు. వేగులవాళ్ళ ద్వారా దేశంలో ఏమూల ఏమి జరుగుతున్నదీ తెలుసుకుంటూ, తన మంత్రుల సహాయంతో దశరధుడు న్యాయంగా రాజ్య పాలన చేస్తూ వచ్చాడు.
దశరధుడికి ఏలోటు లేదుగాని సంతానం లేని లోటు ఉండి, ఆయనను బాధించేది. ఒకనాడాయన అశ్వమేధయాగం చేసి దేవతలను మెప్పించి, వారి అనుగ్రహంతో సంతానం పొందుదామని ఆలోచించి, తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వసిష్ఠ వామదేవులనూ, సుయజ్ఞుడు, జాబాలి మొదలైన గురువులనూ, ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులనూ పిలిపించి, వారి సలహా అడిగాడు. అశ్వమేదాయాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు. వారందరూ వెళ్ళాక, దశరథుడితో సుమంత్రుడు, "మహారాజా, మీరు తలపెట్టిన అశ్వమేధయాగాన్ని జరిపించటా నికి ఋశ్యశృంగుణ్ణి మించినవాడు లేడు. అతని వృత్తాంతం చెబుతాను వినండి," అంటూ ఈ కథ చెప్పాడు:
అంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రులలో ఒకడు. అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది. రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది, బ్రాహ్మణులను పిలిపించి, కరువు తొలిగిపోయే ఉపాయం చెప్పమన్నాడు. "మహరాజా, విభండకమునికి ఋశ్యశృంగుడనే కుమారుడున్నాడు. అతను ఉండే చోట కరువు ఉండదు. అతనిని అంగదేశానికి రప్పించి, తమ కుమార్తె అయిన శాంతనిచ్చి పెళ్ళిచేసి, అంగదేశంలోనే ఉంచుకున్నట్లయితే, కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది," అని బ్రాహ్మణులు చెప్పారు. అప్పుడు రోమపాదుడు తన పురోహితుణ్ణి, మంత్రులనూ పిలిచి, "మీరు వెళ్ళి ఋశ్యశృంగ మహాము నిని ఇక్కడికి తీసుకు రండి," అని ఆజ్ఞాపించాడు.
ఈ మాట విని పురోహితిడూ, మంత్రులూ భయపడ్డారు. ఎందుకంటే ఋశ్య శృంగుడు సులువుగా అరంణ్యాలనూ, తన తపస్సునూ మాని, ఎవరో పిలవ గానే వచ్చే మనిషికాడు. ఆగ్రహించి శపించినా శపించగలుడు. అతన్ని రప్పిం చాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి. ఆ ఉపాయాన్ని రోమపాదుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు:
"మహారాజా, ఋశ్యశృంగుడు పసితనం నుంచి అరణ్యంలోనే ఉండి వేదాధ్యయనం లోనూ, తపశ్చర్యలోనూ జీవితం గడిపిన వాడు. అతనికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. మనం కొంతమంది నాట్య కత్తెలను పంపినట్లయితే వారు అతన్ని ఆకర్షించి తమ వెంట తీసుకురా గలుగుతారు."
రోమపాదుడిందుకు సమ్మతించి కొందరు నాట్యకత్తెలను చక్కగా అలంకరింపజే సి ఋశ్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు. ఆ ఋశ్యశృంగుడు ఎప్పుడూ తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళేవాడు కాడు. అలాటిది ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటివచ్చాడు.
వెంటనే నాట్యకత్తెలు పాటలు పాడుతూ అతన్ని సమీపించారు. వారి అందమైన ఆకారాలూ, అలంకరణలూ, పాటలు, శ్రావ్యమైన గొంతులూ విని ఋశ్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షిం చబడ్డాడు. నాట్యకత్తెలు అతన్ని సమీపించి, "నీవెవరు? ఎందుకీ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు?" అని అడిగారు "నేను విభండక మహాముని కొడుకును. మీరు ఆశ్రమానికి వచ్చినట్లయితే మీకు విధ్యుక్తంగా పూజ చేస్తాను, "అన్నాడు. వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్ళి, అతనిచ్చిన కందమూలాలూ, ఫలాలూ తిన్నారు. అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలిచ్చి, "ఇవి మా పళ్ళు. వీటిని రుచిచూడు! ఇకమేము వెళ్ళి తపస్సుచేసుకోవాలి, "అంటూ వెళ్ళిపోయారు. ఋశ్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవీ పళ్ళే అనుకున్నడు. అయితే అవి తాను తినే పళ్ళుకంటే చాలా రుచిగా ఉన్నాయి. మర్నాడు, వారు కనిపించవచ్చునన్న ఆశతో, ఆశ్రమం వదిలి కిందటరోజు వారు కనిపించిన చోటికే వెళ్ళాడు.
అతన్ని చూడగానే, "అయ్యా, నీవు కూడా మా ఆశ్రమానికి రా. అక్కడ నీకు చక్కగా మర్యాద చేస్తాము," అన్నారు. ఋశ్యశృంగుడు అందుకు పరమా నందంతో సమ్మతించి, వారి వెంట బయలుదేరాడు. ఋశ్యశృంగుడి వెంటనే అంగదేశానికి వర్షంకూడా వచ్చింది. రోమపాదుడు ఋశ్యశృంగుడికి ఎదురు వచ్చి, సాష్టాంగపడి మొక్కి, తాము అతనిని ఈవిధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకుని, తన కూతురైన శాంత నిచ్చి శాస్త్రోక్తంగా పెళ్ళి చేసాడు. ఋశ్యశృంగుడు శాంతతో కూడా అంగదేశంలోనే ఉండిపోయాడు.
సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరధుడు ఎంతో సంతోషించి, వసిష్ఠ మహాముని అనుమతి పొంది, తన భార్యలనూ, మంత్రులనూ వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు. రోమపాదుడు దశరధుడికి గొప్పగా ఆతిధ్యంఇచ్చి తన ఇంట వారం రోజులుంచుకుని, ఆయన వచ్చిన పని తెలుసుకుని, తన అల్లుడైన ఋశ్యశృంగిణ్ణీ, తన కుమార్తె అయిన శాంతనూ దశరథుడి వెంట పంపటానికి ఒప్పుకున్నాడు. ఋశ్యశృంగుడు అయోధ్యకు వచ్చి కొద్దిరోజులు గడిచాయి. వసంతరుతువు ప్రవేశించింది.
దశరథుడు ఋశ్యశృంగుడితో, "ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి," అన్నాడు. అశ్వమేధయాగం కోసం పెద్ద యెత్తున ప్రయత్నాలు సాగించారు. యజ్ఞాలు చేసే వారూ, వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడూ, వామ దేవుడూ, జాబాలీ, కాశ్యపుడూ మొదలైన మునులూ, బ్రాహ్మణ శ్రేష్ఠులూ పిలిపించబడ్డారు. సరయూనది ఉత్తరపుగట్టున యజ్ఞ శాల నిర్మించారు.
మంచిరోజూ, మంచి ముహూర్తమూ చూసుకుని దశరథుడు యజ్ఞశాలకు బయలు దేరివచ్చాడు. యజ్ఞకర్మ ఆరంభమయింది. మొదటి హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హొమం సాగించారు.
అశ్వమేధం మూడురోజుల యాగం. అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజులకు భూమి యవత్తూ, దానం చేశాడు. వారు రాజుతో, "మహరాజా, భూమిని పాలించటం మావల్ల అయ్యేపనికాదు. అందుచేత మాకు భూమి బదులు మణులో, బంగారమో, గోవులో, మరొకటో, ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించు," అన్నారు.
దశరథుడు వారికి పదిలక్షల గోవులూ, నూరుకోట్ల బంగారమూ, నాలుగు వందల కోట్ల వెండీ దానం చేశాడు.
తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋశ్యశృంగుడికీ, వసిష్ఠుడికీ సమర్పించాడు. వసిష్ఠుడు మొదలైనవాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు.
ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చెయ్యిచాచాడు. దశరథుడు వెంటనె తన చేతి కడియం తీసి ఆబ్రాహ్మడికిచ్చేశాడు. బ్రాహ్మణులందరూ దశరథుణ్ణి దీవించారు.
అశ్వమేధం పూర్తికాగానే ఋశ్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించాడు. ఆయన అగ్నిలో వేల్చే హవిస్సులు పుచ్చు కోవటానికి సమస్త దేవతలూ అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాలలో కూచున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాల వివరించి చెప్పుకున్నారు.
దానికి బ్రహ్మ, "దుర్మార్గుడైన రావణుడు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచేత చావు లేకుండా వరం అడిగాడుగాని, మనుషుల మీదితేలిక భావంకొద్దీ వారి వల్ల చావులేకుండా వరం కోరలేదు. ఇడుగో మహావుష్ణువు, దసరధుడి
భార్యలలో ఒకరికి కొడుకుగా పుట్టి నరరూపంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు," అని దేవతలతో అన్నాడు. దేవతలు పరమా నందం చెందారు. ఇంతలో హొమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక దివ్యస్వరూ పుడు పైకి వచ్చాడు. ఆ దివ్యస్వరూపుడు తన చేతులలో కలశాన్నిపట్టుకుని ఉన్నాడు. కలశం మేలిమి బంగారుతో చేసినది, దాని పై మూత వెండిది. ఆ దివ్యస్వరూపుడు దశరధుడితో, "ఓ రాజా, దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు. ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యలకిచ్చినట్లయితే వారికి గర్భోత్పతి అయి, కొడుకులు కలుగుతారు," అన్నాడు. దశరథుడు పరమానందంతో ఆ కలశాన్నిఅందుకుని, దివ్య స్వరూపుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. మరుక్షణమే ఆ దివ్యస్వరూపుడు అదృశ్యమై పోయాడు.
దశరథుడు ఆ కలశంలోని పాయసంలో సగం కౌసల్య కిచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్ర కిచ్చాడు. సుమిత్ర కివ్వగా మిగిలిన దానిలో సగం కైకేయి కిచ్చి, ముగ్గురూ తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు. త్వరలోనే కౌసల్యా, సుమిత్రా, కైకేయీ గర్బవతు లయ్యారు.
ఒక వంక మహావిష్ణువు మానవుడుగా అవతరించటానికి ప్రయత్నాలు సాగుతూంటే, ఇంకోవంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు. దేవేంద్రుడికి వాలీ, సూర్యుడికి సుగ్రీవుడూ, బృహస్పతికి తారుడూ, కుబేరుడికి గందమాదనుడూ, విశ్వకర్మకు నలుడూ, అగ్నికి నీలుడు, అశ్వనీదేవతలకు మైందద్వివిదులూ, వరుణుడికి సుషేణుడూ, పర్జన్యుడికి శరభుడూ, వాయుదేవుడికి హానుమంతుడూ పుట్టారు. వీరందరు మహా బలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానరమూక పుట్టింది. ఈవానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గిర స్థిరపడి, వాలి సుగ్రీవులను రాజులుగా పెట్టుకుని, నలుడూ, నీలుడూ, హనుమంతుడూ మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకుని జీవించసాగారు.
పుత్రకామేష్ఠి ముగిసిన పన్నెండవ నెలలో చైత్రశుద్ద నవమినాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు.
అశ్లేషా నక్షత్రంలో మిట్టమధ్యాహ్నంవేళ సుమి త్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. అయోధ్యానగరంలో పౌరులు ఉత్సవా లు చేసుకున్నారు. వీధులు జనంతోనూ, నాట్యం చేసేవాళ్లతోనూ, గాయకులతోనూ కిటకిట లాడిపోయాయి. దశరథుడు అంతులేని గోదానాలూ, అన్నప్రదానాలూ చేయించాడు.
నలుగురు పిల్లలూ క్రమంగా ఎదిగి పెద్ద వారవుతున్నారు. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా, రామలక్ష్మణులు ఎప్పుడూ కలసి ఉండేవారు. అదేవిధంగా భరతశత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు. వారు నలుగురూ వేదశాస్త్రలు అధ్యయనం చేసి, విలువిద్యలో ఆరితేరి,తండ్రికి శుశ్రూషలుచేస్తూయౌవనంతులయ్యారు. దశరథుడు వారివివాహాలను గురించి మంత్రులతోనూ, పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు.
రాజూ, మంత్రులూ ఈ ఆలోచనలో ఉన్నసమయంలో ద్వారపాలకులు వచ్చి, "మహారాజా, కుశికవంశం వాడూ, గాధిరాజు కుమారుడూ అయిన, విశ్వామిత్ర మహాముని తమ దర్శనంకోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు,"అనిచెప్పారు. వెంటనే దశరథుడు పురోహితుణ్ణి వెంటబెట్టుకుని, విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళి ఆర్ఘ్యపాద్యాలతో పూజించాడు.
విశ్వామిత్రుడు, "రాజా, నీవూ, నీ ప్రజలూ క్షేమంగా ఉంటున్నరా? శత్రు భయమేమీ లేదుగదా!" అని కుశల ప్రశ్నలు చేసి, వసిష్ఠాది మునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనంమీద కూర్చున్నాడు. "మహామునీ, మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నా వల్ల మీకు కావలిసినదేమిటి?" అని దశరథుడు అన్నాడు.
విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి, "రాజా, నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అనిపించుకో. నేనొక యాగం తలపెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు, బలపరాక్రమవంతులు, నా యజ్ఞవేదికపై రక్తమాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి, నా వ్రతసంకల్పం పాడుచేశారు. నా వెంట నీ పెద్దకొడుకైన రాముణ్ణి పంపించు. నా యజ్ఞాన్ని మారీచ సుబాహూలనే ఆ రాక్షసులు భగ్నం చెయ్యకుండా అతడు రక్షిస్తాడు," అన్నాడు.
ఈ మాటలు వినగానే దశరథుడి గుండెబద్దలయినట్టయింది, భయమూ దు:ఖమూ ముంచుకొచ్చాయి.
ఆయన సింహాసనం మీది నుంచి లేచి వణుకుతూ," మహామునీ, రాముడు పసివాడు. వాడికింకా పదహారేళ్ళయినా నిండలేదు. వాడికి విలువిద్య కూడా సరిగా రాదు. రాక్షసులతో ఎక్కడయుద్ధం చేస్తాడు. నా దగ్గిర ఒక అక్షౌహిణి సేన ఉన్నది. నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను. ఇంతకూ ఆ రాక్షసు లెవరు?" అన్నాడు.
దానికి విశ్వామిత్రుడిలా చెప్పాడు: "రావణుడనే రాక్షసరాజును నీ వెరుగు దువు కదా! అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులుపొందాడు. ఇంతకూ ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరుడికి సాక్షాత్తూ తమ్ముడు. అతను స్వయంగా యజ్ఞభంగం చెయ్యలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ సుబాహు లను పంపుతూ ఉంటాడు."
"హతవిదీ! రావణుడే? అతడి ముందునేనే నిలువలేను గదా. పసివాడు రాముడెలానిలుస్తాడు? ఆ మహా శక్తివంతుడి పైకి రాముణ్ణి పంపించటం ఎంత మాత్రమూ పొసగదు," అన్నాడు దశరథుడు.
కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి. "మహారాజా, ఆడినమాట తప్పే వాడివనే అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు!" అంటూ ఆయన చివాలున లేచాడు.
అప్పుడు వసిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ, "రాజా, నీవు చేయరాని పని చేస్తున్నావు. ఆడినమాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కళంకం తెస్తున్నావు. విశ్వామిత్రునికి తెలియని అస్త్రం లేదు, కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలవాడు. ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా? నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు. రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు. ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదమూ రాదు," అని బోధిం చాడు. ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామ లక్ష్మణులను పిలిపించి, వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామ లక్ష్మణులు ఒకరి వెనుక ఒకరుగా ఆయనను అనుసరించారు. వారిద్దరి వద్దా విళ్ళున్నాయి. వారు చేతులలో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడి వెనకగా నడవసాగారు.
బాలకాండ -2
విశ్వామిత్రుడూ, ఆయన వెనకగా రామలక్ష్మణులూ ఒక కోసు దూరం నడచి వెళ్ళి నిండుగా ప్రవహిస్తూన్న సరయూనది దక్షిణపు గట్టు చేరుకున్నారు."నాయనా, రామా! నీవు వెంటనే ఆచమనంచేసి రా. నీకు బల, అతిబల అనే రెండు విద్యలిస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసటా, జబ్బూ, రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుంచి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంత కాలమూ నిన్ను మించిన అందగాడూ, తెలివిగలవాడూ, నేర్పరీ, వాదనలో నిన్ను మించగలవాడూ ప్రపంచంలో ఉండరు. ఆకలిదప్పు లుండవు. గొప్ప కీర్తి కలుగు తుంది," అన్నాడు విశ్వామిత్రుడు.
రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బల, అతిబలలను గ్రహించాడు. ఆ రాత్రికి వారు సరయూనది తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి, సరయూనదిలో స్నానాలు చేయించాడు. వారు తమ అనుష్ఠానాలు పూర్తిచేసుకుని విశ్వామిత్రుడి వెంట మళ్ళీ బయలుదేరి, సరయూనది గంగలో కలిసే చోటికి వచ్చారు.
అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సుకు భంగం కలిగించటానికి వచ్చి, శివుడు తన మూడో కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు. అదిమొదలు ఆ ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులుంటున్నారు. మన్మధుడు తన అంగాన్ని-అంటే శరీరాన్ని-అక్కడ పోగొట్టుకున్నాడు గనక, ఆ ప్రాంతానికి అంగదేశమనే పేరు వచ్చింది.
రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకుని, ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి, మర్నాడు ఒకపడవలో గంగను దాటారు. ఆ తరవాత వారు కాలినడకను ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు. ఎక్కడా జనసంచారం లేచు. విడవకండా కీచురాళ్ళ అరుపులూ, సింహగర్జనలూ, పులుల గాండ్రింపులూ, అడవి పందుల గురగురలూ,ఏనుగుల ఘింకారాలూ వినవస్తున్నాయి. చండ్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొర రాకుండా ఉన్నది ఆ అరణ్యం.
రాముడా అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి, "మహామునీ, అతి భయంకరంగా కనిపిస్తున్న ఈ అరణ్యం పేరేమిటి?" అని అడిగాడు.
విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు:
ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదమూ, కరూశమూ అని రెండు గొప్ప దేశాలుండేవి. ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షినీ, దాని కొడుకు మారీచుడనేవాడూ చేరి రెండు దేశాలనూ నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవరూ అటుకేసి రావటం లేదు. తాటక సామాన్యురాలు కాదు, వెయ్యి ఏనుగుల బలం కలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న రెండు దేశాలనూ మహారణ్యంగా మార్చగలిగింది.
ఈ మాట విని రాముడు, "స్వామీ, యక్షులు అల్పశక్తి గలవారంటారు గదా, ఈ తాటక అనే యక్షిణికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?" అని విశ్వామిత్రుణ్ణీ అడిగాడు.
"నాయనా, తాటకవృత్తాంతం కూడా చెబుతాను, విను. సుకేతుడనే గొప్ప యక్షుడుండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సుచేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి, ఆయనకు కొడుకును ఇవ్వక, వెయ్యి ఏనుగుల బలంగల కూతురు కలిగే లాగుమటుకు వరమిచ్చాడు. బ్రహ్మవర ప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్తవయస్సు వచ్చి మంచి అందగత్తెగా తయారయింది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడనే యక్షకుమారుడి కిచ్చి పెళ్ళి చేశాడు. వారిద్దరికీ కొన్నాళ్ళకు మారీచుడునే కొడుకు కలిగాడు.
వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పొలినవాడు, మితిమించిన గర్వం గలవాడు.
ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందుకని తాటకా, మారీచుడూ అగస్త్యుడిపై ఆగ్రహించి, గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేటట్టుగా మీదికి వచ్చారు. ఆప్పుడగస్త్యుడు వారిద్దరినీ రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకరాకారం ధరించి, నరభక్షిణిగా మారిపోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక ఆయన సంచరించిన ఈ పుణ్య భూమిని పాడు పెట్టేస్తూ బీభత్సం కలిగిస్తున్నది. అందుచేత, ఓ రామా, నీవా తాటకను వధించు. ఆడదని సంకోచించకు. ఆమే చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఆమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు," అని విశ్వామిత్రుడు చెప్పాడు.
రాముడు చేతులు జోడించి, "మహామునీ, మాతండ్రి మీరు చెప్పినదెల్లా చెయ్యమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకను చంపుతాను," అన్నాడు.
ఆ తరవాత రాముడు బాణంచేత పట్టిదాని తాడును బలంగాలాడి ఖంగు ఖంగుమని మోగించాడు. ఈ చప్పుడు వినపడే సరికి తాటకా వనంలో ఉండేవారంతా ఉలిక్కి పడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వేపు అతివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. తమకేసివచ్చే తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో, "చూశావా, లక్ష్మణా, ఈమె ఎంత వికారాకారం కలిగి, ధైర్యవంతులకు కూడా భితి కలిగించేదిగా ఉన్నదో! అయినా, ఈ ఆడదాన్ని చంపడానికి నాకు చేతులు రావటంలేదు. దగ్గిరికి రానీ, ముక్కూ, చెవులూ కోసి, పొగరు అణచి తరిమేద్దాం!" అన్నాడు.
తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడు మీదికి వచ్చి, దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి, వారిపై రాళ్ళవాన కురిపించ సాగింది. రాముడు దాని చేతులు రెండు చేతులు రెండూ తన బాణాలతో తెగగొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కూ, చెవులూ కోసేశాడు. కాని మాయావి అయిన తాటక వాళ్ళపై మళ్ళీ రాళ్ళవాన కురిపీంచసాగింది.
అప్పుడు విశ్వామిత్రుడు, "రామా, ఈ పాపాత్మురాలిని దయతలుస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చెయ్యగలదు. సంధ్యాకాలం లోపల దీన్ని చంపెయ్యి. ఉదయవేళా, సాయం సమయానా రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించటం కష్టం," అని హెచ్చరించాడు.
ఈమాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేలమీద పడి, గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది.
విశ్వామిత్రుడు పరమానందభరితుడై రాముణ్ణి దగ్గరికి తీసుకుని, తల వాసన చూసి, "నాయనా, ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి, తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం," అన్నాడు.
మర్నాడు వేకువజామునే ఆయన రాముణ్ణిలేపి, తాను శుచి అయి, తూర్పు ముఖంగా కూచుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి, జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదట తమ రూపాలతొ నిలబడి, చేతులు జోడించి, "మేము నీ భృత్యులం. ఏ పని చెబితే అది చేస్తాం," అన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, "ఇప్పటికి మీరంతా నా మనసులోచేరి ఉండండి," అని చెప్పాడు.
తరవాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తరవాత వారు ముగ్గురూ ప్రయాణం సాగించారు.
వారు కొంతదూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడది చూసి, "స్వామీ, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇది ఒక ఆశ్రమమనికూడా తోస్తున్నది. దీని కథ ఏమిటి?" అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు:
"నాయనా, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహా బలపరాక్రమశాలి అయి, మూడులోకాలనూ జయించి స్వర్గలోకం ఆక్రమించే సరికి, మహావిష్ణువు కశ్యపుడికి వామనుడుగా పుట్టి, బలి చేసే మహాయాగానికి వెళ్ళి బలిని మూడడుగుల భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు మూడడుగులూ కొలిచి మూడు లోకాలూ పుచ్చుకుని బలిని అధో లోకానికి పంపేశాడు. ఆ వామనుడూ, ఆయన తండ్రి కశ్యపుడూ కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘతపస్సు చేశారు. అందుచేత నేను కూడైక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటి మాటికీ వచ్చి నన్ను చాలా క్షోభపెడుతున్నారు. వరందరినీ నీవు చంపాలి."
విశ్వామిత్రుడుంటున్న ఆశ్రమం పేరు సిద్దాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించి, రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రమించిప్రయాణపు బడలిక తీర్చుకుని, విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, "మహామునీ, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము," అని చెప్పారు.
విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు, కాని యజ్ఞవేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణిలతో, "నాయనలారా, విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండటంచేత మౌనంగా ఉండాలి. ఇవాళ మొదలు ఆరు రోజులదాకా ఎలాంటి విఘ్నాలూ రాకుండా మీరు మమ్మల్ని కాపాడాలి," అని చెప్పారు.
రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి, ఎంతో జాగ్రత్త వహించి రాత్రివేళ నిద్రకూడా మాని అయిదు పగళ్ళూ, అయిదు రాత్రులూ ఆశ్రమాన్ని కాపాడారు. ఆరో రోజు వచ్చింది.
యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమనంగా వెలుగుతున్నది. విధియుక్తంగా, మంత్రోక్తంగా యాగం నుడుస్తున్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెడబొబ్బలు వినిపించాయి. సుబాహు మారీచులూ, వారి బలగానికి చెందిన రాక్షసులూ కారుమేఘాల లాగా ఆకశం ఆవరించి యజ్ఞ వేదికపై రక్తవర్షం కురిపించసాగారు.
రాముడు రాక్షసుల ఆర్బాటాలు విని, తల ఎత్తి ఆకశంలోని రాక్షసమూకను చూశాడు. అతను మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచుణ్ణీకొట్టాడు. ఆ దెబ్బకు వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. తరవాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణీ, వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులనూ చంపేశాడు. విశ్వమిత్రుడి యాగంపూర్తి అయింది. ఆయన రాముడితో, "నాయనా, నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు," అంటూ అతన్ని ప్రశంసించాడు.
బాలకాండ -3
తాటకను సంహరించి, మారీచ సుబాహులను కొట్టి, విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామ లక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనేలేచారు. వారు కాలకృతాలు తీర్చుకుని,విశ్వామిత్రుడూ ఇతర మునులూ ఉండేచోటికి వెళ్ళి, వారందరికీ నమస్కారాలు చేసి, విశ్వామిత్రు డితో, "మహామునీ, మీ ఆజ్ఞ నిర్వర్తించాము. ఇంకా చెయ్యవలిసిన పనులేవైనా ఉంటే సెలవియ్యండి," అని అడిగారు వినయంగా.
అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు: "మిధిలానగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్పయాగం చెయ్యబోతున్నాడు. మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాము. ఒకప్పుడా జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనుస్సు సంపాదించాడు. దేదీప్య మానంగా వెలిగిపోయే ఆ ధనుస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకుని రోజూ సుగంధధూప దీపాలతో అర్చిస్తూఉంటాడు. ఆ ధనుస్సును దేవతలుగాని, రాక్షసులుగాని ఎక్కుపెట్టలేరంటే ఇక మనుషుల మాట చెప్పాలా? మహా బలశాలులైన రాజులూ, రాజకుమారులూ ఎందరో ప్రయత్నించి కూడా దాన్ని ఎక్కుపెట్టలేక పోయారు. కొందరయితే అసలు కదిలించలేక పోయారు. మీరు కూడా వచ్చినట్లయితే జనక మహారాజు చేసే యాగాన్నీ, ఆ అద్భుదమైన ధనుస్సునూ చూడగలుగుతారు."
అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. విశ్వామిత్రుడు వనపాలకులతో, "నేను మిగిలిన మునులందరినీ వెంట బెట్టుకుని ఇప్పుడే బయలుదేరి గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను," అని చెప్పి, సిద్దాశ్రమానికి మూడుసార్లు ప్రదక్షిణంచేసి తిరిగి వచ్చాడు.
తరవాత మునులందరూ రామలక్ష్మణులతో ఉత్తరాభిముఖులైబయలుదేరారు. వారి వెనుక కొన్నివందల బండ్లమీద సమిధలూ, ఇంధనా లూ మొదలైన అగ్ని సాధనాలువచ్చాయి. వారు పగలల్లా చాలా దూరం నడిచి అస్తమయ వేళకు శోణానదీ తీరాన్ని చేరుకున్నారు.అక్కడ వారంతా స్నానసంధ్యానుష్ఠానాలన్నీ తీర్చు కున్నాక రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఎదురుగా కూర్చుని, "స్వామీ, ఎటువైపుచూ సినా అందమైన వనాలుగల ఈ దేశం ఏదీ? దీని వృత్తాంతమేమిటి?" అని అడిగారు ఎంతో వినయంగా.
ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించీ, తన వంశం గురించీ ఇలా చెప్పాడు: "పూర్వం బ్రహ్మయొక్క కుమారుడు కుశుడనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమారైను పెళ్ళాడి, ఆవిడకు నలుగురు కుమారులను-కుశాంబుడు కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అనేవారిని-కన్నాడు. ఆయన క్షత్రియధర్మాన్ని పెంపొందించగోరి తన నలుగురు కొడుకులనూ భూమిని పంచుకుని, న్యాయంగా ప్రజా పరిపాలన చేయవలిసిందిగా ఆజ్ఞాపించాడు. వారు కూడా ఆ విధంగానే నాలుగు గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు.
కుశాంబుడి రాజధాని కౌశాంబి; కుశనాభుడి రాజధాని పేరు మహొదయం; ఆధూర్తరజసుడు ధర్మరణ్యమనే పట్టణన్ని రాజధాని చేసుకున్నాడు; వసువు అనేవాడు గిరివ్రజం రాజధానిగా పెట్టుకుని పాలించాడు. మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన అందమైన వనాలుగల దేశంలోనే. "ఈ దేశంచుట్టూ అయిదు అందమైన పర్వతాలున్నాయి. ఈ శోణానది ఆ పర్వతాలలోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగానూ, సస్యశ్యామలంగానూ చేస్తున్నది. ఇది తూర్పున పుట్టి పడమరకు ప్రవహీంచే నది.
కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడో కడని చెప్పానుగద. ఆయనకు ఘృతాచి అనే భార్య ఉండేది. వారిద్దరికీ నూరుమంది ఆడ పిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకనాడు ఆ నూరుమంది కన్యలూ ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తూండగా వాయుదేవుడు వారిని చూసి తనను పెళ్ళాడ మని కోరుతూ, అలా చేసినట్టయితే వారిని ముసలితనమూ, చావూ లేని దేవతలుగా చేస్తానన్నాడు. కాని ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి, తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప చేసుకోమన్నారు. వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరుగుజ్జులుగా చేసేశాడు. అప్పుడా కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గిరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకు న్నారు. "తన కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యమూ, వంశాభిమానమూ చూసి కుశనాభుడు ఎంతగానో సంతోషించాడు.
వారిని ఇక పెళ్ళిలేకుండా ఉంచటం అంత క్షేమం కాదనుకుని ఆయన, కాంపి ల్యపురాన్ని పాలించే బ్రహ్మదత్తుడనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్ళిచేశాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది. కూతుళ్ళ కందరికీ పెళ్ళిచేశాక కుశనాభుడు కొడుకునుకోరి పుత్రకామేష్టి చేశాడు. ఆయనకు గాధి అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు. ఆ గాధి రాజు కొడుకునే నేను.
నాకు సత్యవతి అనే అక్క ఒకామె ఉండేది. ఆమెను ఋచీకుడి కిచ్చి చేశారు. ఆవిడ మహా పతివ్రత. మేము కుసుశికవంశం వాళ్ళం గనక మమ్మల్ని కౌశికులని కూడా అంటారు. మా అక్కపేరుతో కౌశికి అనేనది ఏర్పడింది. మా అక్కపైగల అభిమనం కొద్దీ నేను హిమవత్ర్పాంతంలో కౌశికీ నదీ తీరానే ఉంటున్నాను. అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చానన్న మాట. మన కబుర్లతో అప్పుడే సగం రాత్రి గడిచిపొయింది. రామా, ఇక మీరిద్దరూ పడుకుని నిద్రపొండి!" ప్రయాణపు బడలిక మూలాన రామ లక్ష్మణులు ఆ రాత్రి గాఢ నిద్రపోయి, తెల్లవారి విశ్వామిత్రుడు లేపినదాకా లేవలేదు. అప్పుడు వారు కాలకృత్యలు తీర్చుకుని శోణానదిని అందరూ దాటే రేపులో దాటారు. అది ఆటే లోతైన నదికాదు; ఇసుకతిన్నెలతో చాలా అందంగా ఉన్నది.
వారా నదిని దాటి మళ్ళీ నడక సాగించి మధ్యా హ్నం వేళకు గంగాతీరాన్ని చేరుకున్నారు. పవిత్రమైన గంగను చూడగానే అందరికీ అంతు లేని ఆనందం కలిగింది. అక్కడవారు స్నానం చేసి, దేవతర్పణలూ, పితృతర్పణలూ చేసుకుని, హొమం చేసి, భోజనాలు పూర్తిచేసుకుని గంగా తీరాన విశ్వామిత్రుడి చుట్టూ కూచున్నారు. అప్పుడా మహర్షి వారందరికీ గంగ వృత్తాంతం ఇలా చెప్పాడు:
హిమవంతుడనే పర్వతరాజుకు గంగ, ఉమ అని ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన గంగను దేవతలు పర్వతరాజును బతిమాలి స్వర్గానికి తీసుకుపోయారు. ఉమను పరమశివుడు పెళ్ళి చేసుకున్నాడు. కాలక్రమాన సగర చక్రవర్తి మనమడికి మనమడైన భగీరధుడు గంగను అతి ప్రయాసతో స్వర్గం నుంచి భూమికి తెచ్చి, భూమి నుంచి పాతాళానికి కూడా తీసుకుపోయాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతరణకధా, కుమారస్వామి జన్మవృత్తాంతమూ సవిస్తరంగా చెప్పాడు. ఆ రాత్రి వారందరూ గంగయొక్క దక్షిణపు గట్టున గడిపి, మర్నాడు తెల్లవారగానే దర్భాసనాలు పరిచిన పడవలలో ఉత్తరపు గట్టుకు చేరుకున్నారు. అక్కడ వారికి విశాలానగరం కనిపించింది. ఆ నగరాన్ని చాలాసేపు చూసినాక రాముడు విశ్వామిత్రుణ్ణి, "మహామునీ, ఈ నగరాన్ని పాలిస్తున్నది ఏ వంశపు రాజులు? వారి కధ ఏమిటి?" అని అడిగాడు.
ఆప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు, దేవదానవులు క్షీరసాగరాన్ని మధించటమూ, అందులో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగటమూ, అమృతం పుట్టగా దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటూంటే విష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని హరించి, తనను ఎదిరించిన వారినందరినీ చంపి, తనను శరణు జోచ్చిన వారిని కాపాడటమూ మొదలైన విషయాలన్ని వివరంగా చెప్పి, ఇలా అన్నాడు:తన కొడుకులందరూ ఇంద్రుడి చేతిలో చనిపోయేసరికి దితి తన భర్త అయిన కశ్యపుడి వద్దకు వెళ్ళి, ఇంద్రుణ్ణి చంపగల కొడుకు తనకు కలిగేటట్టు వరమి య్యవలిసిందని వేడుకున్నది. "నీవు వెయ్యి సంవత్సరాలు నిష్ఠతో, ఎలాటిమై లకూడా సోకకుండా, తపస్సు చేసినట్టయితే, ఇంద్రుణ్ణి చంపి, ముల్లోకాలూ ఏలగల కొడుకు కలుగుతాడు," అని కశ్యపుడు దితికి వరమిచ్చాడు.దితి సంతోషించి కుశప్లవనమనే చోట చేరి కఠోరమైన తపస్సు ప్రారంభించింది.
ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఎంతో భక్తితో ఆమెకు సేవలు చేస్తూ, నీరూ, సమిధలూ, దర్భలూ, కందమూల ఫలాలూ తెచ్చి ఇస్తూ వచ్చాడు. తొమ్మిది వందల తొంబై సంవత్సరాలు గడిచాయి. ఇంకా పదేళ్ళు గడిస్తే దితి గర్బం నుంచి ఇంద్రుణ్ణి చంపగలవాడుబయటికి వస్తాడు. ఒకనాటి మధ్యాన్నం ఈ సంగతి దితి ఇంద్రుడితో చెప్పి, "నాయనా, నాకు విసురుతున్నావు, కాళ్ళు పిసుకుతున్నవు. అందుచేత నాకు పుట్టే కొడుకు నీతో సఖ్యంగా ఉండేటట్లు నేను చూస్తాలే!" అన్నది. అలా అంటూ ఆమె తలను కాళ్ళు పెట్టవలిసిన చోట ఉంచి పక్క మీద పడుకుని నిద్రపోయింది.
ఈ విధంగా ఆమెకు మైలసోకింది. ఇలాటి అవకాశం కోసమే వేచివున్న ఇంద్రుడు వెంటనే అమె గర్భంలో ప్రవేశించి, పిండాన్ని తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా నరికాడు. వారే దేవతా సమానులైన సప్తమారుతాలు.
"రామా, ఆ సమయంలో దితి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఈ ప్రదేశంలోనే ఆమెకు సేవలుచేశాడు. అటు తరవాత ఇక్ష్వాకు మహారాజుకు విశాలుడనే కుమారుడు కలిగాడు. అతనే ఈ మహానగరాన్ని నిర్మించాడు. అందుకే దీనికి విశాలా నగరమనే పేరువచ్చింది. ఇప్పుడీ నగరాన్ని వారి వంశానికి చెందిన సుమతి అనేవాడు పాలిస్తున్నాడు," అనివిశ్వాత్రుడు రాముడితో అన్నాడు.
ఈలోపల సుమతి కూడా విశ్వామిత్రాదుల రాక తెలిసి బంధు మంత్రి పురోహి తులు మొదలైనవారితో ఎదురువచ్చి స్వాగతం చెప్పాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సుమతికి పరిచయం చేశాడు. వారందరూ ఆ రాత్రికి సుమ తి అతిధులుగా ఉండి, తెల్లవారగానే మిధిలానగరానికి ప్రయాణమయ్యరు.
వారు మిధిలను చేరవచ్చే సమయంలో దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం అందంగా ఉన్నప్పటికీ అందులో జనసంచారం లేకపో వటానికి కారణమేమిటని రాముడు అడిగాడు. "నాయనా,ఒకప్పుడీ ఆశ్రమంలో గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో కూడా సాటిలేని తపస్సు చేసాడు. ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయన తపశ్శక్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో, ఇంద్రుడు గౌతముడుస్నానానికిగాను నదికి వెళ్ళి ఉన్న సమ యంలో గౌతముడి రూపం ధరించి అహల్య వద్దకు వచ్చాడు. అహల్య అతన్ని తన భర్తే అనిపొరబడింది.
తిరిగి వెళుతూన్న ఇంద్రుడికి గౌతముడు తడిబట్టలతో ఎదురై, ఇంద్రుడికి శాపమిచ్చి, ఆశ్రమానికి వచ్చి తన భార్యను కూడా శపించాడు. ఆ శాపం ఫలితంగా ఆమెగాలి తప్ప మరొక ఆహారం లేక, ఎవరికీ కనబడకుండా ఈ ఆశ్రమంలో తపస్సమాధిలో ఉండిపోయింది. నిన్ను చూడగానే ఆమెకు శాపవిమోచనం కలిగేలాగు గౌతముడు అనుగ్రహించాడు గనక, మనం ఈ ఆశ్రమం ప్రవేశించి, ఆ అహల్య అందరికీ తిరిగి కనబడేలాగు చేద్దాం," అన్నాడు విశ్వామిత్రుడు. వారు లోపలికి వెళ్ళేసరికి రాముడి కళ్ళకు సూర్యుడి కాంతితో వెలిగిపోతూ, దేవతను బోలిన అందంగల అహల్య కనిపించింది.
ఆమె రాముణ్ణి చూడగానే ఆమెను మిగిలినవారు కూడా చూడగలిగారు. రామలక్ష్మణులు వంగి ఆమె కాళ్ళుతాకి నమస్కరించారు. తన భర్త చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని అహల్య రామలక్ష్మణుల కాళ్ళుతాకి, వారికి అర్ఘ్యపాద్యాలిచ్చింది. ఆ సమయానికే గౌతముడు కూడా తిరిగి వచ్చాడు. విశ్వామిత్రుడు అక్కడి నుంచి బయలుదేరి, రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిధాలినగరం ప్రవేశించాడు.
బాలకాండ -4
రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్ళి జనక మహరాజు యజ్ఞం చేస్తున్న చోటికి చేరాడు . యజ్ఞశాల చుట్టూ అనేక ఋషి నివాసాలున్నాయి. విశ్వామిత్రుడు కాడా ఒక నివాసం తమకై ఏర్పాటు చేయించాడు .

ఈ లోపల జనకమహరాజుకు విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలిసింది . ఆయన తన పురోహీతుడైన శతానందుడితో సహా వచ్చి విశ్వామిత్రుడుకి అర్ఘ్యపాద్యా లిచ్చి పూజించాడు. జనక మహరాజు విశ్వాముత్రుడితో తన యజ్ఙంపూర్తి కావటానికి ఇంకా పన్నెండు రోజులున్నవని చెప్పి , రామలక్ష్మణులను చూసి, " ఈ రాజపుత్రులెవరు? ఎవరి కుమారులు" అని అడిగాడు. విశ్వామిత్రుడు జన కుడికి రామలక్ష్మణులను పరిచయం చేసి, " మీ వద్ద ఉండే వింటిని ఎక్కుపె ట్టటం సాధ్యమవుతుందేమో చూడడానికి, ఈ రాకుమారులు ముఖ్యంగా ఇక్క డికి వచ్చారు," అని తెలియపరిచాడు.

జనకుడి వద్ద పురోహితుడుగా ఉంటున్న శతానందుడు అహల్యా గౌతముల పెద్ద కుమారుడు.రాముడి వల్ల తన తల్లికి శాపవిమోచనం జరిగిందనీ, తన తల్లిని శపించి వెళ్ళిపోయిన తంద్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడనీ విని శతానం దుడు ఎంతో సంతోషించాడు.అతను రాముడి కేసి తిరిగి, " రామా, ఈ విశ్వా మిత్ర మహముని అనుగ్రహం సంపాదించటం వల్ల నీవు ధన్యుడవయ్యావు. ఈ మహనీయుడి విచిత్రగాధ చెబుతాను విను," అంటూ,విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు:

బ్రహ్మదేవుడికి కుశుడనే కుమారుడు పుట్టాడు. ఆయనకు కుశనాభుడు పుట్టాడు. కుశనాభుడి కొడుకైన గాధికి విశ్వామిత్రుడు కొడుకైపుట్టి, చాలా కాలం రాజ్యం చేశాడు. ఆ కాలంలో ఆయన ఒక అక్షౌహిణి సేవను వెంట బెట్టుకుని పర్యటన చేస్తూ వసిష్ట మహిముని ఆశ్రమానికి వచ్చాడు. తపస్సు లో నిమగ్నులై ఉండే ఋషులతో అ ఆశ్రమం రెండో బ్రహ్మలో కంలాగా ఉన్నది.

తన అశ్రమంలోకి వచ్చిన విశ్వామిత్రుడికి వసిష్ఠుడు అతిథీ సత్కారాలు చేశాడు. ఇద్దరూ కుశలప్రశ్నలు చేసుకున్నారు. కొంచెంసేపు ఇష్టాగోష్ఠి జరిగాక వసిష్ఠుడు తన అతిథికీ ఆయన పరివారానికి విందు చేస్తానన్నాడు. " తమ దర్శనమే నాకు గొప్ప విందు. వేరే విందు లెందుకు?" అంటూ విశ్వామిత్రుడు బయలుదేరబోయాడు. కాని వసిష్ఠుడాయనను బలవంతాన ఆపి, శబల అనే తన కామధేనువును పిలిచి, భక్ష్యభోజ్యలేహ్య చోష్య పానీయాలోతో అందరికీ షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయమన్నాడు. శబల అలాగే చేసింది. విశ్వా మిత్రుడీ విందుకు ఎంతో ఆనందించి, " మహర్షీ, నాకు శబలను ఇప్పించండి. దీనికి మారుగా లక్షగోవులను ఇచ్చుకుంటాను. శ్రేష్టమైన వస్తువులన్నీ రాజుకే చెందాలి గనక, న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందాలి," అన్నాడు.

"మహారాజా, లక్షగోవులు కాదు, నూరుకోట్ల గోవుల నిచ్చినా నేను శబల నివ్వను. ఇదే నాకున్న ధనం. మా ఆశ్రమం యావత్తూ దీనిపైనే ఆధారపడి ఉన్నది," అన్నాడు వసిష్ఠుడు.
విశ్వామిత్రుడు వసిష్ఠుడికి అడిగినంత బంగార మిస్తానన్నాడు. రత్నరాసులి స్తానన్నాడు. శబలను ఎలాగైనా తన కివ్వమన్నాడు. వసిష్ఠుడు నిరాకరిం చాడు. అప్పుడు విశ్వామిత్రుడు శబలను బలాత్కారంగా తీసుకుపోవటానికి ఉద్యమించాడు. శబల తనను పట్టవచ్చిన రాజభటులను కుమ్మి, రంకెలు వేస్తూ, కన్నీరుకారుస్తూ వచ్చి వసిష్ఠుడి కాళ్ళపై బడి, "ఏమిటీ అన్యాయం?" అన్నది. వసిష్ఠుడు శబలతో, "విశ్వామిత్రుడు అక్షౌహిణిసేనతో వచ్చిన బలశాలి. నాకాబలం లేదు. నేనేం చేసేది?" అని అడిగాడు.

"తమ తపశ్శక్తి ముందు ఈ విశ్వామిత్రుడి బలం ఏమిటి? ఈ సేనలను సర్వ నాసనం చేయగల బలాలను, నేనే సృష్టిస్తాను, నాకు అనుమతి నివ్వండి," అన్నది కామధేనువు.కామధేనువు రంకెలు వేస్తూంటే పప్లవులూ, మ్లేచ్చులూ అనంతంగా పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సేనలను నుగ్గు చెయ్యసాగారు. విశ్వామిత్రుడు రథమెక్కి తనకు తెలిసిన దివ్యాస్త్రాలను ఈ సేనలపై ప్రమోగించసాగాడు. కామధేనువు ఇంకా శకులనూ, కాంభోజులనూ, హరీతులనూ, కిరాతులనూ సృష్టిస్తూనే ఉన్నది. వారు విశ్వామిత్రుడి సేనను మట్టు పెట్టేస్తున్నారు. ఇది చూసి విశ్వామిత్రుడి కొడుకులు నూరుమంది ఆయుధాలతో వసిష్ఠుడిపైకి వెళ్ళారు.

ఆయన ఒక్కసారి హుంకారం చేసేసరికి నూరుగురూ భస్మమై పోయారు. తన సేన అంతా పోయింది, నూరుగురు కొడుకులు క్షణంలో చచ్చారు. విశ్వామిత్రుడికి తీరని పరాభవం జరిగింది. ఆయన రెక్కలు విరిచిన పక్షిలాగా అయిపోయి, చావగా మిగిలిన ఒక కొడుకుపై రాజ్యభారం వేసి, హిమాలయానికి వెళ్ళీ అక్కడ శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.కొంత కాలానికి శివుడు ప్రత్యక్షమై ఏమివరం కావాలో కోరుకోమన్నాడు.

దేవతలూ, గంధర్వులూ,యక్షులూ, రాక్షసులూ అధిదేవతలుగా గల అస్త్రాలన్నీ తనకు వశం కావాలనీ, సాంగోపాంగంగా ధనుర్వేదమంతా తనకు కరతలా మలకం కావాలనీ విశ్వామిత్రుడు కోరాడు. శివుడు ఆయన కోరిక తీర్చి అంతర్థానమైనాడు. ఈ విధంగా సాధించిన అస్త్రాలతో వసిష్ఠుణ్ణి నిర్మూలించదలిచి విశ్వామిత్రుడు వసిష్ఠాశ్రమం ప్రవేశించి, తన అస్త్రాలతో ఆశ్రమాన్ని దహించసాగాడు. అక్కడి ఋషులు చెల్లాచెదరుగా పరిగెత్తారు. పక్షులూ, మృగాలూ పారిపోయాయి. క్షణంలో ఆశ్రమం శూన్యమైపోయింది.

వసిష్ఠుడు ఆగ్రహావేశంతో తన బ్రహ్మదండం ఎత్తి విశ్వామిత్రుడి కెదురు వచ్చాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వసిష్ఠుడి బ్రహ్మదం డాన్ని తగలగానే అది కాస్తా చల్లారిపోయింది.

విశ్వామిత్రుడు కొన్నివందల అస్త్రాలను ప్రయోగించాడు. కాని వసిష్ఠుడి బ్రహ్మదండం అన్నిటినీ దిగమింగేసింది. వసిష్ఠుడి బ్రహ్మదండం నుంచీ, ఆయన శరీరం నుంచీ జ్వాలలు చిమ్ముతున్నాయి, రవ్వలు లేస్తున్నాయి. ఇతర మునులు వసిష్ఠుణ్ణీ సమీపించి, "ఓ మహర్షీ, విశ్వామిత్రుణ్ణి జయించావు. ఇక శాంతించు!" అని వేడారు.

"బ్రహ్మతేజోబలం ముందు క్షత్రియ బలం ఎంత? నేను తపస్సు ద్వారా బ్రహ్మ త్వం సంపాదిస్తాను," అనుకుని విశ్వామిత్రుడు భార్యాసమేతంగా దక్షిణదిశకు వెళ్ళి, అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు హవి ష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారధుడు అనే నలుగురు కొడుకులు కలిగారు. కొంతకాలానికి బ్రహ్మప్రత్యక్షమై విశ్వామిత్రుడితో," నీ తపస్సు చేత నీకు రాజర్షిలోకాలు స్వాధీనమైనాయి. ఇక ముందు అందరిచేతా నీవు రాజర్షివని పిలవబడతావు," అని చెప్పాడు. రాజర్షి అనే బిరుదుతో విశ్వామిత్రుడు తృప్తి చెందలేదు. ఆయనకు బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉన్నది. అందుచేత ఆయన మళ్ళీ తపస్సు సాగించాడు.

ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు అనే వాడు బొందితో స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఈ కోరికను తన కులగురువైన వసిష్ఠుడితో చెబితే, అది అసాధ్యమని ఆయన అన్నాడు. దక్షిణాన ఉంటున్న వసిష్ఠకుమారులు తనకు శాయపడతారేమోనని త్రిశంకు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు కోప్పడి త్రిశం కును వచ్చినదారి పట్టమన్నారు. అంతటితో బుద్దిరాక త్రిశంకు వాళ్ళను దెప్పి, మరెవరినైనా ఆశ్రయిస్తానన్నాడు. వసిష్ఠుడి నూరుగురు కొడుకులు మండి పడి, చండాలుడివి కమ్మని అతణ్ణీ శపించారు.

శాపం చేత త్రిశంకు నల్లటి ఆకారమూ, నల్లటి బట్టలూ, ఇనప సొమ్ములూ కలిగిన వడై వసిష్ఠుడి గర్భశత్రువైన విశ్వామిత్రుణ్ణి అశ్రయించాడు. విశ్వా మిత్రుడు త్రిశంకు చెప్పినదంతా విని, "నిన్ను ఈ ఆకారంతోటే స్వర్గానికి పంపుతాను, " అని మాట ఇచ్చాడు. ఆయన యజ్ఞం తలపెట్టి, అందుకు ఋషుల నందరినీ పిలుచుని తన శిష్యులను పంపాడు. ఆహ్వానాలు అందుకుని అందరూ వచ్చారు గాని, మహోదయుడనే వాడూ, వసిష్ఠుడి కొడుకులూ రాలేదు. రాని వరిని విశ్వామిత్రుడు ఘోరంగా శపించాడు. యజ్ఞం ఆరంభమయింది. కాని హవిస్సులు తీసుకోవటానికి దేవతలు రాలేదు. విశ్వామిత్రుడికి మండిపోయింది. ఆయన త్రిశంకుతో, "నే నింతకాలం తపస్సు చేసిసంపాదించిన శక్తితోనే నిన్ను స్వర్గానికి పంపుతాను," అన్నాడు.

మునులందరూ చూస్తుండగానే, త్రిశంకు తన శరీరంతోనే పైకి లేచి స్వర్గానికి వెల్లి పోయాడు. అయితే అక్కడున్న ఇంద్రాది దేవతలు త్రిశంకును స్వర్గానికి రానివ్వక, అతన్ని కిందికి తోసేశారు. త్రిశంకు తలకిందుగా పడిపోతూ, " మహాత్మా, రక్షించు!" అని అరిచాడు. విశ్వామిత్రుడు కోపావేశంతో దక్షిణ దిక్కున మరొక సప్తర్షి మండలాన్నీ, కొత్త నక్షత్రాలనూ సృష్టించి,"ఇంకొక స్వర్గాన్నీ, కొత్త దేవతలనూ కూడా సృష్టిస్తాను, " అన్నాడు. అప్పుడు దేవతలూ, ఋషులూ భయపడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, "మహానుభావా, శాపగ్రస్తుడైన త్రిశంకును స్వర్గంలో ఎలా ఉంచటం?" అని అడిగారు.

" ఇతణ్ణీ బొందితో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. అది జరిగితీరాలి," అన్నాడు విశ్వామిత్రుడు. త్రిశంకు కొత్తగా సృష్టి అయిన నక్షత్రాల మధ్య తలకిందులై శాశ్వతంగా ఉండి పోయేటట్టూ, విశ్వామిత్రుడు కొత్త దేవతలను సృష్టించే ప్రయత్నం మానుకునేటట్టూ ఏర్పాటు జరిగింది.

తరవాత విశ్వామిత్రుడు దక్షిణాన్ని వదిలి పెట్టి, పడమరగా ఉన్న పుష్కరమనే పెద్ద తపోవనానికి వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఈ సమయంలో అయోధ్యలో అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభింగా, ఇంద్రుడు యజ్ఞపశువును ఎత్తుకుపోయాడు. అప్పుడు రాజపురోహితుడు యజ్ఞప శువును ఎలాగైనా సంపాదించాలనీ, అది దొరక్కపోతే నరపశువును బలి ఇవ్వవలిసి ఉంటుందనీ రాజుతోచెప్పాడు. యజ్ఞపశువు దొరక్కపోవటంచేత అంబరీషుడు నరపశువు కోసం బయలుదేరాడు.

భృగుతుంద మనే కొండ ప్ర్రాంతంలో ఋచీకుడనే ముని తన భార్యా బిడ్డలతో ఉంటున్నాడు. అంబరీషుడు ఆయన వద్దకు పోయి తన కథ చెప్పి, "లక్షగో వులిస్తాను, మీ కొడుకులలో ఒకణ్ణి యజ్ఞపశువుగా ఇవ్వండి," అని ప్రార్థిం చాడు. పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు ఋచీకుడు. ఆఖరువాణ్ణీ ఇవ్వనన్నది ఋచీకుడి భార్య. శునస్సేపుడనే వాడు రెండోవాడు. వాడు రాజుతో, "మా అమ్మా, నాన్నా నన్ను అమ్మటానికి సిద్దంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు. నన్ను మీ వెంట యజ్ఞపశువుగా తీసుకుపోండి," అన్నాడు. అంబరీ షుడు శునశ్శేపుణ్ణి వెంటబెట్టుకుని మిట్టమధ్యాన్నానికి ఎండదెబ్బ తిని విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నాడు. శునశ్శేపుడు విశ్వామిత్రుణ్ణి చూస్తూనే ఆయన పాదాలపై పడి, తన కథ చెప్పుకుని, తనను కాపాడమని ఏడ్చాడు.

విశ్వామిత్రుడు వాణ్ణీ చూసి జాలిపడి తన నలుగురు కొడుకులతో, "వీడికి బదులుగా మీరు యజ్ఞపశువులై వీణ్ణి కాపాడండి," అన్నాడు. వాళ్ళు తండ్రిని లక్ష్యపెట్టక ఆయన మాట నిరాకరించారు. విశ్వామిత్రుడు మండిపడి తన కొడుకులను కూడా వసిష్ఠుడి కొడుకులను శపించినట్టే శపించాడు. తరవాత విశ్వామిత్రుడు శునశ్శేపుడికి రెండు మంత్రాలు ఉపదేశించి, "నిన్ను యజ్ఞప శువును చేసి యూపస్తంభానికి కట్టినప్పుడు ఈ మంత్రాలు చదివితే అగ్నిహొ త్రుడు నీకు సుముఖుడవుతాడు," అని చెప్పాడు.
అలాగే జరిగిందికూడా. అంబరీషుడి యజ్ఞంలో శునశ్శేపుడికి ఎర్రగంధం పూసి, ఎర్రబట్టలు కట్టి, దర్భలతో యూపస్తంభానికి కట్టారు. అప్పుడు వాడు తన మనసులో రెండు మంత్రాలు జపించుకున్నాడు. ఇంద్రుడు వాడికి ప్రత్యక్షమై దీర్ఘాయువునిచ్చాడు.


బాలకాండ -5


విశ్వామిత్రుడు పుష్కరంలో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మప్ర త్యక్షమై ఆయనకు ఋషి అనే బిరుదు ఇచ్చాడు. దానికి కూడా తృప్తిపడక విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు సాగించాడు. ఈ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థంలో స్నానం చేస్తున్న మేనక అనే అప్సరస కనిపించి మనస్సు చలించింది. ఆయన తన తపస్సు విడిచిపుచ్చి మేనకను తన ఆశ్రమానికి పిలుచుకుపోయి, ఆమెతో పదేళ్ళు సుఖంగా గడిపాడు.
ఆ తరవాత ఆయనకు తన పొరపాటు తెలిసివచ్చింది. తన తపస్సు భంగం చెయ్యటానికి దేవతలు మేనకకు పంపారేమోననుకున్నాడు. ఆయనలో మార్పు గమనించి, తను శపిస్తాడేమోనని మేనక భయపడింది. కాని విశ్వామిత్రుడామెను ఏమీ అనక, "ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. ఇక నీవు వెల్లిపో!" అన్నాడు.
ఆ తరవాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌశికీ నదీ తీరాన నివసిస్తూ, మహాదారుణమైన తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మతో సహా పలువురు దేవతలు వచ్చి ఆయనకు మహార్షి అనే భిరుదు నిచ్చారు.
విశ్వామిత్రుడు బ్రహ్మను, "ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించిన వాణ్ణేనా?" అని అడిగాడు. "ఇంకా నీవు జితేంద్రియుడవు కావు," అన్నాడు బ్రహ్మ. జితేంద్రి యుడు కావాలనే ఆశతో విశ్వామిత్రుడు వాయుభక్షణ చేస్తూ మహాఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సు చూసి చాలా దేవతలకూ, ఇంద్రుడికీ భయం పుట్టింది.
ఇంద్రుడు రంభను పిలిచి, "నీవు వెళ్ళి విశ్వామి త్రుడి తపస్సు భంగం చెయ్యాలి. మన్మథుణ్ణీ వెంటబెట్టుకుని నేను కూడా నీకు తోడు వచ్చి, కోయిల రూపం ధరించి కూస్తాను," అన్నాడు. రంభ భయపడుతూనే అందుకు ఒప్పుకున్నది. విశ్వామిత్రుడు తపస్సులో ఉండగా కోయిలకూత వినిపించింది. కళ్ళు తెరిచే సరికి ఎదురుగా రంభ కనిపించింది. ఇదంతా దేవతల పన్నాగమని తెలుసుకుని ఆయన రంభను రాయికమ్మని శపించాడు. ఇంద్రుడూ మన్మథుడూ పారిపోయారు..
మరుక్షణమే ఆయన, "ఆయ్యో, ఎందుకు శపించాను? కోపాన్ని ఎందుకు నిగ్రహించుకోలేక పోయాను?" అని పశ్చాత్తాప పడ్డాడు. ఎవరేమిచేసినా కోపపడరాదని ఆయన తీర్మానించుకున్నాడు. తపశ్శక్తిచేత బ్రాహ్మాణత్వం సాధించితీరాలని నిశ్చయించుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి తూర్పు దిక్కుకుపోయి, మౌనవ్రతం అవలంబించి, తపస్సు సాగించాడు. ఆ తపస్సు యొక్క వేడికి మూడు లోకాలూ దగ్థమయ్యేటట్టు కనిపించింది. ఆ స్థితిలో ఎంతగానో భయపడి పోయిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా , ఆయన వచ్చి విశ్వామిత్రుణ్ణి, "బ్రహ్మర్షీ, నీకు బ్రాహ్మాణత్వం వచ్చింది," అన్నాడు.
విశ్వామిత్రుడు చాలా సంతోషించి, "నేను బ్రహ్మర్షినని వసిష్టుడు ఒప్పుకుంటేనే తృప్తి పడతాను," అన్నాడు. దేవతలు వసిష్ఠుణ్ణి ప్రార్థించి ఆయన చేత విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు. వసిష్ట విశ్వామిత్రులకు కలహంపోయి స్నేహం ఏర్పడింది. ఈ విధంగా శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసేసరికి అస్తమయ మయింది. జనక మహారాజు విశ్వామిత్రుడి రాకకు తన సంతోషం తెలుపుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తెలుపుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవార గానే ఆయన విశ్వామిత్రుణ్ణీ, రామలక్ష్మణులనూ యజ్ఞశాలకు పిలిపించాడు.
జనకుడు తన వద్ద ఉండే ధనువును గురించి విశ్వామిత్రుడికి చెప్పాడు. దక్షయజ్ఞం నాడు పరమశివుడు ఆ ధనువును ఎత్తి దేవతలను చంపబో యాడు. చివరకు వారి మొర ఆలకించి, ఆ ప్రయత్నం మాని, ఆ ధనువును దేవతలకే ఇచ్చేశాడు. దేవరాతుడనే వాడి కాలం నుంచీ ఆ ధనువు జనక మహారాజు వంశంలోనే ఉంటున్నది. దాన్ని ఎవరూ ఎక్కుపెట్టలేరు; కదిలిం చను కూడా లేరు.
ఒకప్పుడు జనకడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా చాలులో నుంచి ఒక ఆడశిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని, జనకుడు తన కుమార్తెలాగే పెంచుతూ వస్తున్నాడు. శివధనువును ఎక్కు పెట్టినవారికి సీత నిచ్చి పెళ్ళీ చెయ్యటానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చి, ఆ ధనువును ఎక్కుపెట్టలేక పోయారు.
చివరకు ఈ ఓడిపోయిన రాజులు ఏకమైదండెత్తి వచ్చి ఒక ఏడాదిపాటు మిథిలకు ముట్టడివేశారు. జనకుడు ఏమి చెయ్యటానికీ శక్తిలేక దేవతలను ప్రార్థించగా వారు సేనలను పంపి, నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారదోలారు. ఈ వృత్తాంతం విన్న మీదట విశ్వామిత్రుడు జనకుడితో, ఆ ధనువును రాముడికి చూపమన్నాడు. దాన్ని తీసుకురావటానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు. ఎనిమిది చక్రాలు గల ఇనప పెట్టెలో ఉండే ఆ శివధనువును నగరం నుంచి యజ్ఞశాల వద్దకు తెచ్చారు.
"దీన్ని ఎత్తటానికీ, ఎక్కు పెట్టటానికీ నాకు శక్తి ఉందేమో చూస్తాను," అంటూ రాముడు పెట్టె తెరిచి, ధనువును మధ్య భాగం పట్టి పైకెత్తి, అవలీలగా తాడు తగిలించాడు. దానికి అతను బాణం పెట్టటానికి ప్రాయత్నించగా అది ఉరుములాంటి పెళపెళారావంతో నడిమికి విరిగి పోయింది. అందరూ నిర్ఘాంతపోయారు. జనకుడు పరమానందం చెంది, "సీతను శౌర్య వంతుడికే ఇవ్వాలనుకున్నాను. ఇప్పటికి నా ఆశయం ఈడేరనున్నది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరద్దరి వివాహం విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను," అన్నాడు.
జనకుడి దూతలు మూడు రోజులు ప్రయాణం చేసి, నాలుగోరోజు ఉదయానికి అయోధ్య చెరి, దశరధుడితో శివధనుర్భంగ వృత్తాంతం చెప్పి, సీతారాముల వివాహానికి తరలిరమ్మని కోరారు. దశరథుకు ఆవార్తవిని ఎంతగానో సంతోషించి తన మంత్రులతో సంప్రతించి, జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు. వసిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, మార్కండేయాదులను ముందుగా ప్రాయాణం చేసి, తాను తన బలగంతో వెనకగా ప్రాయాణమై, నలుగోరోజుకు దశరథుడు జనకుడి యజ్ఞశాల చేరాడు.
అప్పటికి యజ్ఞం పరిసమాప్తి అయింది సీతను పెళ్ళికూతుర్ని చేశారుకూడా. జనకుడూ, దసరథుడూ ఒకచోట చేరారు. జనకుడివెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వసిష్ఠుడు జనకుడితో దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు. తరవాత జనకుడు తనవం శావళిని తానే దశరథుడికి తెలుపుకున్నాడు రెండూ గొప్పవంశాలు. వియ్యం పొందదగినవి.
జనకమహారాజుకు సీత గాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి,శ్రుతకీర్తి అని ఇద్దరు కూతుళ్ళున్నారు. సీతా రాముల వివాహముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళనూ, భరతుడికి మాండవినీ, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తినీ ఇచ్చి చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమయించి. పెళ్ళికి ముందే దశరథుడు నాలుగు లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుడి మేనమాన అయిన యుధాజిత్తుకూడా మిథిలకు వచ్చాడు. అగ్నిసాక్షిగా నలుగురి వివాహాలూ జరిగిపోయాయి. దశరథుడి కొడుకులు నలుగురూ తమ భార్యలను వెంటబెట్టుకుని తమ విడిదికి వచ్చేశారు.
పెళ్ళీ కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయానికి వెళ్ళిపో యాడు. దశరథుడుకూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు. అలా వారంతా ప్రయాణం చేస్తూండగా దారిలో అకస్మాత్తుగా చీకటికమ్మింది. ధూలి లేచింది. పెనుగాలి వీచింది. అదే సమయంలో ప్రళయకాల రుద్రుడి లాగా పరశురాముడు వారికి ఎదురు వచ్చాడు. ఆయన భుజాన గండ్రగొడ్డలీ, చేతిలో కాంతి వంతమైన ధనుర్బాణాలూ ఉన్నాయి. ఆయన రాముడితో, "ఓరామా, నీవు శివుడి విల్లువిరిచావట, విన్నాను.
చాలా ప్రజ్ఞగలవాడవు. దానికన్న శక్తివంతమైన ఈ విష్ణుధనువు ఎక్కుపెట్టగలవేమో చూడు. అంతశక్తి నీకున్న ట్టయితే నాతో ద్వంద్వయుద్దం చేతువు గాని!" అన్నాడు. పరుశురాముడు రాముడితో విష్ణుధనువు గురించి ఇలా చెప్పాడు: దీనినికూడా విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. శివుని విల్లులాగే ఇదీ ధనుస్సులలో శ్రేష్ఠమైనది. దీనిని దేవతలు విష్ణువుకు ఇచ్చారు. శివవిష్ణువుల బలాబలాలు తెలుసుకు నేటందుకు వారు బ్రహ్మద్వారా ఇద్దరికీ కలహం పెట్టించారు. ఇద్దరికీ చెరొక గొప్ప విల్లూ ఉన్నది. వారు మహా భయంకరమైన యుద్ధం చేశారు.
ఆ యుద్ధంలో విష్ణువుదే పైచెయ్యి అయింది. శివకేశవులలో కేశవుడే ఎక్కువ ని దేవతలు గ్రహించి, యుద్దం మానవలసిందిగా ఇద్దరు దేవుళ్ళనూ ప్రార్థించారు. తనకన్న విష్ణువు ఎక్కువగా నిర్ణయం జరిగినందుకు శివుడు ఆగ్రహించి, తన ధనువునూ, బాణాలనూ విదేహదేశపు రాజైన దేవరాతుడి కిచ్చేశాడు. విష్ణువు తన ధనుస్సును భృగువంశంవాడైన ఋచీకుడి వద్ద దాచి పెట్టాడు. అది ఋచీకుడి కొడుకైన జమదగ్నికీ, ఆయన కొడుకైన పరశురా ముడికీ సంక్రమించింది. దశరథుడు భయంతో వణికిపోతూ, పరశురాముడి కాళ్ళపైపడి, "స్వామీ, ఇరవై ఒక్కసారి క్షత్రియులను నాశనంచేసి, అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞచేశావు. ఈనా కొడుకును కాపాడు. లేకపోతే మేమంతా నాశనమైపోతాం," అన్నాడు.
పరశురాముడు ఆయన మాటలు పెడచెవి పెట్టాడు. రాముడికి మండిపో యింది. అతను పరశురాముడి నుంచి విష్ణుధనువు తీసుకుని, అవలీలగా వంచి ఎక్కుపెట్టి, బాణం సంధించి, "ఓ బ్రాహ్మాడా, ఈ బాణంతో నీ ప్ర్రాణం తీయగలను. కాని బ్రాహ్మణ హత్య నా కిష్టంలేదు. అందుచేత దీనితో నీ కాళ్ళు విరగగొట్టమన్నావా? నీవు తపస్సు చేసిన ఉత్తమలోకాలు ధ్వంసం చెయ్య మన్నావా?" అని అడిగాడు.
పరశురాముడు నిర్వీర్యుడైపోయి తన ఉత్తమలోకాలను పోగొట్టుకోవటానికి సిద్దపడ్డాడు. రాముడు బాణం వదిలాడు. తరవాత పరశురాముడు మహేం ద్రగిరికి వెళ్ళి పోయాడు. రాముడు మూర్ఛపోయిన తన తండ్రిని లేపిన అనంతరం అయోధ్యకు వచ్చేశారు. కొద్దిరోజులు గడిచాయి. యుధాజిత్తు తన మేనల్లుడైన భరతుణ్ణి తన ఇంటికి తీసుకుపోతానన్నాడు. ఇందుకు దశర థుడు సమ్మతించాడు. భరతుడు శత్రుఘ్నుణ్ణి వెంటబెట్టుకుని తన మేనమామ వెంట వెళ్ళిపోయాడు.
సీతారాములు అన్యోన్య ప్రేమతో దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారు తమ ప్రేమను పైకి చూపకపోయినా ఒకరి మనసు నొకరు బాగా అర్థం చేసు కుంటున్నారు. రాముడు రాచకార్యాలలో తండ్రికి సహాయపడుతున్నాడు. రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి.
(బాలకాండ సమాప్తం)

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML