దీనిని బట్టి పురాణాలను కొట్టి పారేయనవసరం లేదనీ, సరియైన దృష్టితో పరిశీలించవలసిన బాధ్యతా ఉందనీ అర్థమౌతోంది.
సూక్ష్మమైన దైవీయ భూమికలలో జరిగే అంశాలని, మన లౌకిక స్థాయిలో అన్వయించరాదు. పురాణ కథల్లో కేవలం చరిత్ర మాత్రమే ఉండదు. మంత్రం సంకేతాలు, ఉపాసనా మర్మాలు, వైజ్ఞానిక సూత్రాలు, ఖగోళ విజ్ఞానాలు, తాత్త్విక మర్మాలు, ధార్మిక మార్గాలు కలగలసి ఉంటాయి. వాటి శాస్త్ర పరిచయంతో పురాణాలను సరిగ్గా విశ్లేషించాలి.
సృష్టి నిర్వహణకు ఉపకరించే పరమేశ్వరుని శక్తులే దేవతలు. వాటి స్పందనలు, ప్రకోపాలు, ప్రభావాలు వివిధ భావాలుగా సంకేతించారు. సృష్టి స్థితి లయకారకమైన భగవత్ భక్తులే పృథ్విలో జలదేవతలుగా, వాయు, అగ్న్యాది పంచభూత శక్తులుగా ప్రవర్తిల్లుతుంటాయి. చూడడానికి నదులన్నీ ఒకేలా ఉన్నా వాటి జల లక్షణాలలో తేడాలు ఉంటాయి. అవి భౌతిక విజ్ఞానానికి అందేవి కొంత మాత్రమే. అత్యంత సూక్ష్మమైన దైవీయ విజ్ఞానానికి సంబంధించిన దైవీయ విజ్ఞానాలు చాలా ఉన్నాయి. వాటిని దర్శించిన మహర్షులు ఆయా నదుల్లో ఉన్న దేవతాశక్తుల మహిమను మనం పొందాలని వాటి విషయాలను అందించారు.
దేవతాశాక్తులు పృథ్విపై అడుగిడడానికి దైవీయ భూమికలో జరిగే సంకల్పాలు, ప్రేరణలే పురాణ కథల్లో చెప్పారు. మన కోపతాపాలకి స్థాయి అల్పమైనది. దేవతల స్థాయి లోకకళ్యాణార్థం జరిగే లీలావిలాసం.
No comments:
Post a comment