గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 3 February 2015

తిరుమల వెళ్లేవారికి ఈ విషయం తెలుసా? స్వామి తో ఒక భక్తుడు పాచికలాడేవాడు అతని గురించి మీకు తెలుసా?

తిరుమల వెళ్లేవారికి ఈ విషయం తెలుసా? స్వామి తో ఒక భక్తుడు పాచికలాడేవాడు అతని గురించి మీకు తెలుసా?
హథీరాం బావాజీ కథ.!
పూర్వము ఉత్తరహిందుస్థానము నుండి తిరుపతికి ఒక బైరాగి వచ్చాడు. అతడు అచ్చట ఒక ఆశ్రమం కట్టుకొని నివసించ నారంభించాడు. ప్రతిదినం మూడు పూటలందు స్వామి పుషరిణిలో స్నానం చేసి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉండేవాడు. తన బసలో నిశ్చలంగా కూర్చుండి సర్వదా స్వామిని ధ్యానిస్తూ ఉండేవాడు. ఆ స్వామి తమ యెదుట ఉనట్టే భావించి "అదుగోస్వామి! అవిగో స్వామి పాదాలు" అంటూ తులసిదళములు పెట్టి పూజిస్తూ ఉండేవాడు. అతనిని అంతా దొంగభక్తుడు అనుకునేవారు.
ఒక్కొకప్పుడు అతడు పాచికలు ముందు పెట్టుకుని తీరుబడిగా కూర్చునేవాడు. స్వామి తనతో పాచికలు ఆడుతున్నట్లు భావించి స్వామివారి పందెంకూడా తానే వేస్తూ ఉండేవాడు. మధ్య మధ్య "స్వామి! మీ వంతు వచ్చింది. పాచికలు వేయండి!" అంటూ ఉండేవాడు. " స్వామి పాచికలు వేయడం లేదని చింతపడుతూ ఉండేవాడు. అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఆనందంగా "అగుగో స్వామి! వస్తున్నాడు స్వామి" అని పలవరిస్తూ ఉండేవాడు.
ఈ విధంగా జరుగుతుండగా ఒకనాడు అకస్మాత్తుగా అతని ఆశ్రమం బయట ఏదో చప్పుడయీంది. క్షణంలో ఆతని ఆశ్రమమంతా సుమనోహరమైన పరిమళంతోనూ, గొప్ప కాంతితోనూ నిండిపోయింది. భైరాగి ఆ చప్పుడు ఏమిటా అని తలయెత్తి చూచేసరికి మెరుపు వంటి కాంతీ, ఆ కాంతిమధ్య ఒక దివ్యమంగళ విగ్రహం కనబడింది. ఆ దివ్యమంగళ విగ్రహమును చూచి బ్రహ్మానంద భరితుడైనాడు. "గోవిందా! గోవిందా! హరే శ్రీనివాసా! హరే వేంకటేశా" అంటూ పరుగెత్తి వెళ్ళి ఆయన పాదములపై పడి పరవశమైనాడు.
శ్రీనివాసుడు తన పాదముల ముందు పడియున్న భైరాగిని చేతితో లేవనెత్తి బావాజీ! పాచికలు ఆడదాం పదండి! నేను త్వరగా వెళ్ళాలి" అన్న మాటలు విని భైరాగి స్వామికి తనపై కలిగిన దయకు ఎంతో పొంగిపోయాడు. భక్తి శ్రద్ధలతో స్వామిని తొడ్కొనిపోయి ఒక పరిశుభ్రమైన స్థలములో కూర్చుండబెట్టి నాడు. తనివితీర స్వామియొక్క జగన్మోహనాకారమును చూచి జగత్తునే మరచిపోయాడు.
"బావాజీ! పాచికలు ఆడరా!" అన్న వేంకటేశ్వరస్వామి మాటలు విని యథాస్థితికి వచ్చినాడు. పాచికలు ఆడసాగినాడు. వేంకటేశ్వరస్వామి అతని భక్తికి యెంతో ఆనందించి కొంతసేపు పాచికలు ఆడి, అతనిని సంతోషపెట్టి వెళ్ళిపోయాడు.
ఈ విధముగా ప్రతిదినము వేంకటేశ్వరస్వామి అతని ఆశ్రమమునకు వచ్చి పాచికలు ఆడి వెళ్ళుచుండెను. కొన్ని దినములు ఇట్లు జరిగినది ఒకనాడు రాత్రి వేంకటేశ్వరస్వామి ఆ భైరాగితో పాచికలు ఆడుతూ, ఆడుతూ "బావాజీ! మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లున్నారు. బయటకి పోయి చూచిరండి" అన్నారు. భైరాగి తక్షణం పైకిలేచి బయటకి వెళ్ళినాడు. ఆ సమయములో వేంకటేశ్వరస్వామి తమ కంఠాభరణమును అక్కడ వదలి మాయమైపోయెను. భైరాగి ఆశ్రమం చుట్టు వెదకినాడు. ఎవరూ కనబడనందున తిరిగి లోనికి వచ్చి చూడగా స్వామి కనబడలేదు. కాని స్వామి వారి కంఠాహారము మాత్రము కనబడినది. భైరాగి దానిని చూచి 'అయ్యో! స్వామివారు కంఠహారం మరచి వెళ్ళిపోయారు. దీనికోసం స్వామివారు తిరిగి రావచ్చు' అనుకుని స్వామి రాకకు ఎదురు చూచుచుండెను.
ఇట్లాతడు ఆ స్వామిరాకకు ఎదురుచూచు చుండగా తెల్లవారిపోయినది. భైరాగి ఆ విషయం గమనించి 'అయ్యో! స్వామి తిరిగిరానేలేదు ఇది లేని యెడల స్వామి వారి చక్కదనమునకు వెలితి కలుగుతుంది. తీసుకొనిపోయి యిచ్చి వస్తాను" అనుకొని హారం పట్టుకొని గబగబ ఆలయమునకు పోవుచుండెను.
అప్పటికే స్వామివారిని సేవించబోయిన పూజారులు స్వామి మెడలో హారంలేదని గమనించి, హారం ఎట్లు పోయినదో గ్రహించలేక తికమక పడుచున్నారు. ఆ విషయం దేవస్థానం అధికార్లకు కబురు చేసినారు. వారూ, వీరూ అంతా కలిసి కంఠహారం కొరకు వెదుకనారంభించినారు. అదే సమయంలో బావాజీ హారం పట్టుకొని ఆలయమునకు వెళ్ళుచున్నారు. అతని చేతిలో ఉన్న స్వామి కంఠహారమును చూచి కొందరు "అదిగో హారం! పట్టుకోండి! పట్టుకోండి! వీడు శుద్ధ దొంగ కాని భైరాగికాదు" అని అరువసాగినారు. ప్రజలంతా కలసి భైరాగి మీద విరిచుకు పడ్డారు. నానా దుర్భాషలు ఆడారు. తలొక దెబ్బ కొట్టనారంభించారు. భైరాగి ఏం చెప్పినా ఒక్కరూ వినడం లేదు. ఇంతలో ఒక అధికారి అచ్చటికి వచ్చి "అతనిని కొట్టకండి! ఆయన ఏం చెపుతాడో విని, తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. సరే అని అందరూ దూరంగా పోయి నిలబడ్డారు.
భైరాగి జరిగిన సంగతంతా ఆ అధికారికి చెప్పాడు. కాని ఎవరూ అతని మాటలు నమ్మలేదు. "స్వామికి పనీ పాటూ లేక ఈ దొంగవాడితో పాచిక లాట్టానికి వెల్ళారట! అప్పుడాయన హారం ఇతని ఆశ్రమంలో మరచిపోయారట ఎంత తీపిగా మాట్లాడుచున్నాడో చూడండి!" అని అరవడం ప్రారంభించారు. అధికారి బావాజీ చెప్పిన సంగతులు నిజమో అబద్దమో నిర్దారణగా తెల్సుకొనలేక పోయాడు. బావాజీని చెరసాలలో పెట్టించినాడు. దానితో బండెడు చెరకుగడలు కూడా పెట్టించి, భైరాగిని చూచి "బావాజీ! నీవు చెప్పిన మాటలు నిజమైతే స్వామివారి సహాయముతో తెల్లవారేసరికి ఈ బండెడు చేరకు గడలూ తినేయాలి. వక్కగడ మిగిలినా నీ తల నరికి గుడిముందు వ్రేలాడ గట్టిస్తాము" అని చెప్పి తలుపులకు తాలాలు వేయించి వెల్ళిపోయాడు.
బావాజీ వారి మాటలు విని ఏ మాత్రం దిగులు పడలేదు. నిశ్చలంగా కూర్చుండి చాలాసేపు వేంకటేశ్వరస్వామిని ధ్యానించి "స్వామీ! నేను నేరం చేయలేదని నీవు ఎరుగుదువు. నన్ను శిక్షింపజేసినా నీదే భారం" అనుకొని నిశ్చింతగా నిద్రపోయాడు. అట్లాతడు నిద్రపోయిన పిమ్మట కొంతసేపటికి ఒక ఏనుగు ఆ గదిలో ప్రత్యక్షమైంది. క్షణంలో ఆ గదిలోవున్న చెరకుగడలు అన్నిటిని తినివేసింది. తెల్లవారుజామున బావాజీని తొండముతో తట్టి లేపింది. తొండమెత్తి ఆశీర్వదించింది. బిగ్గరగా ఘీంకారం చేసింది. చెరసాల కాపరులు ఆ ఘీంకారం విని హడలిపోయారు. తాలాలు వేసిన గదిలోకి ఏనుగు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడినారు. పరుగు పరుగున పోయి అధికార్లను తీసుకుని వచ్చారు. అదే సమయములో ఆ ఏనుగు గది తలుపుపై తలతో ఒక్కపోటు పొడిచింది. దెబ్బతో ఆ తలుపులు ముక్క చెక్కలైపోయినాయి. అందరూ చూచుచుండగా ఆ ఏనుగు మహావేగంగా పరుగెత్తి వెళ్ళిపోయింది. కాని యెటుపోయినదో ఎవ్వరూ చూడలేకపోయారు. ఎంత ప్రయత్నించినా వారికి ఆ ఏనుగు కనబడలేదు.
తన భక్తుని కాపాడుటకై వేంకటేశ్వరస్వామియే ఐరావతము రూపమున వచ్చి ఆ గదిలో వుంచిన చెరకు గడలు అన్నీ తిని వెళ్ళిపోయినారని అందరూ నిశ్చయించుకున్నారు. స్వామి మహిమలను తలచుకొని బ్రహ్మానందభరితులైనారు.
బావాజీని దొంగ అని తిట్టికొట్టి బాధించిన వారందరూ అతని పాదములపై పడి క్షమింప గోరినారు. బావాజీ దృష్టంతా ఏనుగు దిక్కువైపునే ఉంది. అటువైపే చూస్తూ "శ్రీనివాసా! చిద్విలాసా! నన్ను కాపాడటం కోసం ఏనుగు రూపము దాల్చి వచ్చి బండెడు చెరకుగడలు తిన్నావా స్వామీ! హాథీరాం హథీరాం!" అంటూ ఆలయంలోనికి పరుగెత్తి వెళ్ళినాడు. ఆ భక్తుణ్ణి ఇక ఆడ్డుపెట్టేవారు ఎవరు? తిట్టికొట్టి బాధించిన ప్రజలు, అధికార్లు అతని పాదములపై పడి మ్రొక్కసాగినారు. క్రమంగా ఆయనను దేవాలయమునకు ప్రధాన అధికారిగా నియమించుకున్నారు. అంతా ఆయనను "హాథీరాం బావాజీ" అని పిలిస్తూ ఉండేవారు.
హాథీరాం బావాజీ చాలాకాలం శ్రీవేంకటేశ్వరస్వామిని సేవించాడు. స్వామివారి పూజలకు, ఉత్సవములకు ఏవిధమైన లోటుపాట్లు కలుగకుండా చక్కగా దేవస్థానపాలన సాగించి తుదకు స్వామియందు ఐక్యమైనాడు. ఆ భక్తుని జ్ఞాపకార్థము స్వామి ఆలయమునకు సమీపములో ఒక మఠము కట్టబడినది. స్వామిని దర్శించబోవు యాత్రికులు అందరూ బావాజీ మఠమును కూడా దర్శించుచుందురు. నేటికి సుమారు ఇరువది సంవత్స్రములకు ముందు చాలాకాలము తిరుపతి దేవస్థాన పరిపాలన బావాజీ, వారి శిష్యులు చేయుచుండెడివారు. ప్రస్తుతము మన ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వముచే "తిరుమల - తిరుపతి దేవస్థాన" పరిపాలకులుగా వుండి స్వామివారికి అన్ని సేవలు అతివైభవముగా జరిపించుచున్నారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML