మహాశివ రాత్రి వృత్తాంతం:-
మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.
అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
No comments:
Post a comment