గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 16 January 2015

భగవద్గీత అంటే ఏమిటి? ఇంటిటా భగవద్గీత! "గీత జ్ఞానం - జీవన సారం"

భగవద్గీత అంటే ఏమిటి? ఇంటిటా భగవద్గీత! "గీత జ్ఞానం - జీవన సారం"
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
“కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. చిన్నవయసులోనే అది జరగాలి” అంటున్నారు జయా రో. బయాలజీ చదువుకుని భగవద్గీత ప్రవచనాలకు తన కెరీర్‌ను మార్చుకున్న జయారో విశాఖపట్నంలో ప్రసంగాలివ్వడానికి వచ్చినప్పుడు ‘నవ్య’ కలిసింది. నయా తరంలోని ప్రతిభను విజయంగా అనువాదం చెయ్యడమెలాగో చెబుతున్న ఆమెతో మాటామంతీ….
“2030కల్లా మన దేశ జనాభాలో 55శాతం మంది యువతే ఉంటారు. వాళ్లంతా పాతికేళ్లలోపువారు. వారు విజ్ఞానవంతులయితేనే దేశం పురోగమిస్తుంది. వారు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి, విశిష్టమైన వ్యక్తులుగా రూపుదిద్దుకోవడానికి భగవద్గీత అడుగడుగునా సాయపడుతుంది. అందుకే నేను నా పూర్తి సమయాన్ని గీతా ప్రవచనాలకే కేటాయిస్తున్నా”నంటున్న జయారోకు ఆ రంగంలో ముప్ఫయ్యేళ్ల అనుభవం ఉంది. దాంతో ఆమె స్థాపించిన ‘వేదాంత విజన్‌’ ట్రస్ట్‌ దేశవిదేశీయులు భగవద్గీతను సరైన అర్థంలో గ్రహించడానికి పనిచేస్తోంది. జయారో మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. అయితే ఆమె పుట్టిపెరిగిందంతా ముంబై మహానగరంలోనే. మైక్రోబయాలజీలో పట్టా పుచ్చుకున్న ఆమె ఎనిమిదేళ్ల పాటు ఒక ఫార్మా సంస్థలో పనిచేశారు కూడా. “చిన్నప్పుడే మా అమ్మమ్మతాతయ్యలు నాకు భగవ ద్గీతను బోధించారు. పురాణాలూశాస్త్రాలను విపులంగా చెప్పేవారు. రోజూ ఒకేలా గడపడం బోర్‌, ఏదైనా వినూత్నంగా చెయ్యమని వాళ్లు చెప్పేవారు. ముఖ్యంగా మా తాతగారు…. ఆడపిల్లవని ఎప్పుడూ అనుకోకు, దేనిలోనూ వెనకబడకు అని పదేపదే చెప్పేవారు. పెరిగిన వాతావరణ ప్రభావమేమో మరి, ఫలితం – ఏదో సాధించాలన్న తపన నాలో రగిలింది. సంప్రదాయ సంగీతం, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగింది. ఫార్మా పరిశ్రమలో నేను మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్‌ని. నేను భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో విజయవంతమయ్యాను. దాన్నే ఇతరులకు అందించాలని ప్రయత్నిస్తున్నాను” అంటున్నారామె. ‘నేను ఆత్మికంగా ఎదగాలి, దేశానికి సేవచేయాలి’ అనేదే నా ధ్యేయం. దానికి నేనెంచుకున్న మార్గం ఇది’ అనే జయారో తన ఇరవైల్లో భగవద్గీత గురించి ప్రవచనాలిస్తున్నప్పుడు చాలామంది విచిత్రంగా చూసేవారు. “ఇదివరకు నా ప్రసంగాలకు వృద్ధులే ఎక్కువగా వచ్చేవారు, ఇప్పుడు యువతరమే వస్తుంటారు” అని ఉత్సాహంగా చెప్పారామె.
అందరూ గొప్పగా ఎదగగలరు
ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ఆధునిక పోకడలో యువతకు అందించడంలో జయారోది అందెవేసిన చెయ్యి. తన ప్రసంగాల ద్వారా ఆమె వారిలో స్ఫూర్తి నింపుతారు, కొత్త ఉత్సాహాన్ని ఎక్కిస్తారు. మొన్న ప్రసంగంలో దాదాపు ఆరు వందల మంది పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ “మీరు నైకీ టీషర్టులు వేసుకుని తిరిగితే ఆ బ్రాండ్‌కి ప్రచారం. దానికి ప్రచారకర్తగా ఉండటానికి మీరే కొంత డబ్బు చెల్లించి మరీ ఆ టీషర్టును కొంటున్నారు. మీ వీపు మీద దాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. అయినా మిమ్మల్ని చూసి మరొకరు దాన్ని కొంటారనేమీ లేదు. అదే సంస్థలు తమ బ్రాండ్‌ను విస్తరించడం కోసం మిమ్మల్ని అభ్యర్థించే స్థాయికి మీరు ఎదగాలి. ఆ ఉత్పత్తులను వాడటానికి అవి మీకు తిరిగి భారీ పారితోషికాలివ్వాలి. విశిష్టమైన వ్యక్తిగా ఎదగడం అంటే అదే…” అని చెప్పారు. ఇలా సరళమైన ఉదాహరణలతో స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రసంగం ముగిసిన తర్వాత విద్యార్థులకేం అర్థమైందో మూడు నాలుగు వాక్యాల్లో రాసివ్వమంటే తలా ఒక తీరున రాశారు. ‘వీ షుడ్‌ నాట్‌ యూజ్‌ బ్రాండ్స్‌. ఎ బ్రాండ్‌ షుడ్‌ కమ్‌ టూ మీ’ అని పదేళ్ల పిల్లాడు రాసిన వాక్యాల్లో వ్యక్తమైన ఆత్మవిశ్వాసం ఏ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదివినా రాదేమో. 12-15 మధ్య వయసున్న పిల్లల కోసం జయారో ‘ఎర్లీ ఫౌండేషన్‌ – ఎక్సెలెంట్‌ ఫ్యూచర్స్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. యానిమేషన్‌, కథలతో సరదాగా సాగే ఆ కార్యక్రమం ద్వారా వారికి నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలు, క్రమపద్ధతిని అలవర్చుకోవడం వంటివి మనసుకు హత్తుకుపోయేలా చెబుతారు. 16-25 వయసున్న వారికి జయారో ‘స్ట్రాంగ్‌ ఫౌండేషన్స్‌ – సక్సెస్‌ఫుల్‌ ఫ్యూచర్స్‌’ అనే మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బలమైన విలువల పునాదిపైనే బలమైన వ్యక్తిత్వం నిలబడుతుందని చెబుతూ మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి తమలోని ప్రతిభకు ఎలా పదునుపెట్టుకోవాలో యువతరంగాలకు తెలియజేస్తుందీ కార్యక్రమం. అందుకే విశాఖనగరం జయారో ప్రవచనాలకు మంత్రముగ్థమయింది, తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకొంది.
———————
* ‘భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.
* సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.
* సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.
* ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.
* ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.
అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||
సంజయుడు ఇంకా ఇలా అన్నాడు. "ధృతరాష్ట్ర మహారాజా!ఇక ఆయుధములు ప్రయోగింపబడే ముందుగా, యుద్ధ సన్నద్ధులైయున్న కౌరవ సైన్యాన్ని చూచి ధనస్సును చేబూని కపిధ్వజముగల రథారూఢుడైన అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు". "అచ్యుతా! ఉభయ సైన్యముల మధ్య నా రథము నిలుపుము."
యావదేతాన్నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||1-22||
ఎక్కడి నుండి నేను ఈ యుద్ధారంభమందు పోరు సలుపబోయే యుద్ధాభిలాషులను చక్కగా చూడగలనో అక్కడ (రథము నిలుపుము.)
యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేऽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||1-23||
దుష్టబుద్ధియైన దుర్యోధనునకు ప్రియమొనగూర్చుటకు ఇచటకుచేరిన యోధులను నేను చూచెదను.
సఞ్జయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24||
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25||
సంజయుడు చెబుతున్నాడు "ఓ భారతా! (ధృతరాష్ట్రా!) అర్జునుడిట్లు చెప్పగా కృష్ణుడు ఉత్తమమైన తమ రథమును భీష్మ ద్రోణాది ప్రముఖులు,ఇతర రాజుల ఎదుట నిలిపి “ఈ వేచియున్న కౌరవులను చూడుము"అని అన్నాడు. [గుడాకేశుడు = అర్జునుడు, శబ్ద కల్పద్రుమము ప్రకారము - నిద్ర, అలసత్వము, ఇంద్రియములు - వీనిని జయించినవాడు, జటాధరుడు అని మరియొక అర్థము. హృషీకేశ = ఇంద్రియములకు అధిపతి, విష్ణువు, పరమాత్మ]
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||1-26||
శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27||
అప్పుడు అర్జునుడు రెండు సేనలయందు నిలియున్న తాతతండ్రులను, అన్నదమ్ములను, పుత్రపౌత్రులను,ఆచార్యులను,మామలను, స్నేహితులను అందరినీ చూచెను. ఇది అర్జునుని కదిలించిన సన్నివేశం. ఎంత వీరుడైనా సన్నిహితులతో యుద్ధము చేసి వారిని చంపడము, లేక వారిచేతులో చావడమనేది భయంకరమైన ఆపద. తమంతతాము సుఖముగా ఉన్న అనేక రాజులు తమపోరుకై ఇరుప్రక్కలా ప్రాణాలు వదలడానికి సిద్ధంగా నిలిచారు.
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28||
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||1-29||
గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||1-30||
అర్జునుడు యుద్దభూమియందున్న బంధువులందరినీ బాగుగా పరికించి దయార్ద్ర హృదయుడై దుఃఖించుచు ఇట్లుచెప్పెను: నా శరీరమందు వణుకు పుట్టుచున్నది. నోరు ఎండుకొనిపోవుచున్నది. అవయవములు పట్లు తప్పుచున్నవి. గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము మండుచున్నది. నిలబడుటకుకూడా శక్తిలేకున్నది. మనసు గిఱ్ఱున తిరుగుతున్నది..


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML