దేవతల సంబంధాలన్నీ సంకేతాలుగా గ్రహించాలి. ఏకతత్త్వాన్ని ప్రకటించే స్వరూపాలను సోదరీసోదరులుగా సంకేతించాయి మన శాస్త్రగ్రంథాలు. సహాయకరమైన అవిభాజ్యశక్తుల్ని పట్నీపతులుగా చూపించాయి. వాటిని లౌకిక బంధాలతో పోల్చరాదు. పాంచభౌతిక దేహాలను ధరించిన వారం మనం. దేవతలు తేజశ్శరీరులు. వారికి మనవంటి బంధాలు వర్తించవు.
స్థితికారకశక్తి నారాయణుడు. ఆయనయొక్క స్త్రీరూపం లలితా, గౌరి. వీరు స్థితికారణ శక్తులు. ఈ శక్తి శివునికి సహకారి. లయకారకునికి స్థితితో సమన్వయము కావాలి. అదే హరిహరాత్మక తత్త్వం. హరి స్వరూపిణి గౌరీ. వీరిరువురూ ధర్మరక్షణార్థం దేవతలను కాపాడే శక్తులు. అందుకే సోదరీ సోదరులు "యా ఉమా సా స్వయం విష్ణుః" - అని స్మృతి.
ఈ యోగమాయా శక్తితోనే విష్ణువు అవతరించి ధర్మస్థాపన చేస్తాడు. "సంభవామ్యాత్మమాయయా" అనే గీతావచనం. "యోగమాయా సమాశ్రితః" అనే భాగవత వచనం ఈ విషయాన్నే దృఢపరుస్తున్నాయి. రాక్షస సంహారణార్థం గౌరీ విష్ణువులే ఉద్యుక్తులౌతుంటారు.
సృష్టికి పూర్వం బ్రహ్మాండంలోంచి స్త్రీ పురుషాకృతులు కలిసి మూడుగా వచ్చాయని - వారే కవలలుగా వచ్చిన రెండుమూడులు. బ్రహ్మ, లక్ష్మి సోదరీ సోదరులుగా, అలాగే సరస్వతీ శివులు, కాళీ విష్ణువులు అవతరించారు. సృష్టికారకమైన రజశ్శక్తి లక్ష్మి. బ్రహ్మకు సోదరి. ఈ సహకారంతో లక్ష్మి పత్నిగా సత్త్వగుణ నియామకుడైన విష్ణువు స్థితికారకుడయ్యాడు. జ్ఞానము ద్వారా ప్రాపంచిక కర్మబంధాలను లయం చేసే శివుడు, సరస్వతీ విద్యామూర్తులుగా సోదర స్థానంలో సంకేతాలు. ఈ జ్ఞానం సృష్టికి సహకరించేందుకు బ్రహ్మకు భార్యా స్థానం (సహకార స్థానం)
ఈ సోదరీసోదర, పతీపత్నీ భావనలు - ఒకే విశ్వచైతన్యం యొక్క వ్యక్తీకరణలు. బహువిధములైన ప్రధానమైన సృష్టి స్థితి లయలకు త్రిగుణాల వినియమం (పరస్పర సహకారం) ఈవిధంగా పోల్చబడింది. నిజానికి ఒకే పరబ్రహ్మము - ఆయన యొక్క ఒకే శక్తి ఎప్పుడూ ఉన్నవి. లోకరచనా వ్యవహారంలో ఆ రెండు భిన్నభిన్నముగా కలసి వివిధ కృత్యాలను నిర్వహిస్తున్నాయి.
ఇక - శ్రీవిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు దుర్గ ఆయనకు సోదరిగా నందుని యింట జన్మించిన గాథ భాగవతంలో, ఇతర పురాణాలలో వర్ణించబడింది. ఆమె 'నందా'దేవిగా వింధ్య పర్వతంలో స్థిరురాలై 'వింధ్యవాసిని'గా పేరుపొంది రాక్షస సంహారం చేసింది. ఈ విధంగా కూడా తన విష్ణు సోదరీ లక్షణాన్ని అవతార కార్యంలో సైతం ప్రదర్శించిన కారణంగా శివపత్ని 'విష్ణు సహోదరి'గా సుప్రసిద్దురాలు. 'లలితా సహస్రనామాలలో' "పద్మనాభ సహోదరి" అనే నామ ఉన్నది.
'రామ సహోదరి రాజరాజేశ్వరి' అని త్యాగబ్రహ్మము వారు, 'శ్యామకృష్ణ సహోదరి' అని శామశాస్త్రి గారు, విష్ణు సోదరి భావననే పలు కీర్తనలలో ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రస్తుతించారు. "ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం" అని ఆదిశంకరులు దేవీ నవరత్న మాలికా స్తోత్రంలో కీర్తించారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment