జయ వారము:
విధిని దాటుట ఎవరికిని శక్యముగాదు. ఎవరిమాట లెక్కజేయక రావణుడు శ్రీరామునితో యుద్ధము చేసినాడు. శ్రీరామ బాణములు ఒంటికి బాధ కల్గించినప్పుడు
శ్లో!! జాతో బ్రహ్మకులే2గ్రజో ధనపతిర్యః కుంభకర్ణానుజః
పుత్రశ్శక్రజయీ స్వయం దశశిరాః పూర్ణాభుజావింశతిః
దైత్యః కామచరో రధాశ్వ విజయైః మధ్యే సముద్రం గృహం
సర్వం నిష్ఫలితం తథైవ విధినాదైవే బలేదుర్బలే!!
రావణుడు బ్రహ్మ వంశ సంజాతుడు. అన్న కుబేరుడు - తమ్ముడు కుంభకర్ణుడు - కొడుకు ఇంద్రజిత్తు - పది తలలు, ఇరువది బాహువులు రథాశ్వములతో కామచారి. సముద్ర మధ్యమున గృహము. తుదకు రావణునకు అన్నియున్నను దైవబలము లేక హతుడనైతినను జ్ఞానము కల్గినది.
లంకాధిపతి రావణుడు యుద్ధమారంభించిన ఎనిమిదవ రోజున ఫాల్గుణ బహుళ అమావాస్య మంగళవారం నాడు శ్రీరాముని చేతిలో ఆగ్నేయాస్త్రమున సంహరింపబడెను. ఆనాడే హనుమ శ్రీరాముని ఆదేశముతో సీతమ్మ వద్దకు వచ్చి రావణ సంహారమును శ్రీరామ విజయమును తెల్పెను. సీతాదేవికి ఆనందము కల్గినది. సీతాదేవి హనుమకు ఏమి ఇత్తునాయని తలపోసినది. ఆమె భావము తెలిసి అమ్మా నీవు నాకేమియు ఈయనవసరము లేదు. కొడుకే తల్లి ఋణమును తీర్చవలెను. అనగా సీత సంతోషించి నాకృప వలన నీకు సమస్త భోగములు అష్టైశ్వర్యములు వచ్చియుండును. నీవు నీ యిష్టమైన భక్తులకు వానిని ప్రసాదింపుము. "ఆంజనేయా! రావణ సంహారము గూర్చి నాకు జయవారమున చెప్పినావు. నాకు శోకమును పోగొట్టినావు. జయమును కల్గించు మంగళ వారమునాడు సింధూరమును నీకు పూసి షోడశోపచారములు చేసిన వారికి దుఃఖములు పోయి వారి కోరికలు నెరవేరునట్లు నీకు వరమిచ్చుచున్నాను".
"భౌమవారే హనూమంతం సీతాం సంపూజ్యయత్నతః!
గతవ్యధో మనోవాంఛాసిద్ధిం శీఘ్రం మవాపహ!!
మంగళవారం నాడు హనుమను, సీతను పూజించిన వారికి కష్టములు గట్టెక్కును.

No comments:
Post a comment