గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

తూర్పుగోదావరిజిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామశివారైన పల్లెపాలెం పంచాయితీకి చెందిన నక్కారామేశ్వరం. కోనసీమలో ఈగ్రామానికి గొప్పశివక్షేత్రంగా మంచిప్రసిద్ధి ఉంది

నక్క రామేశ్వరం అనే ఈ బెస్తపల్లెను చూసి నేర్చుకోవాలి మనం ధర్మనిష్ఠ అంటే ఏమిటో !

బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం|
జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం||
తూర్పుగోదావరిజిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామశివారైన పల్లెపాలెం పంచాయితీకి చెందిన నక్కారామేశ్వరం ఒక చిన్నమారుమూలగ్రామం. కోనసీమలో ఈగ్రామానికి గొప్పశివక్షేత్రంగా మంచిప్రసిద్ధి ఉంది. వశిష్ఠగోదావరి పాయలుగా చీలి, సముద్రంలో కలిసేటప్పుడు ఏర్పడిన చిన్నద్వీపం ఈగ్రామం. గ్రామంలో స్త్రీలు, పురుషులు కలిసిన మొత్తం జనాభా 4,500మంది. వీరందరూ అగ్నికులక్షత్రియులు. సముద్రంమీద వేటకు పోయి, చేపలు పట్టుకుని జీవించటమే వీరి ప్రధానవృత్తి. అయితే ఈగ్రామస్తులందరూ వందలఏళ్ళుగా గొప్పశివభక్తులు. ఇందుకు కారణం ఆగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీసమేత రామేశ్వరస్వామివారు. ఈస్వామి మహిమల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఈగ్రామంలోకి పాదం మోపి ప్రచారం చేసుకోవడానికి అన్యమతాలవారు వందలఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మహమ్మదీయుల ప్రాబల్యం దేశమంతటా ఉన్నప్పుడు ఇక్కడికి ఒకానొక ఫకీరు వచ్చి, ఇక్కడ ఉండే స్వామివారి మహిమకు ఆకర్షింపబడి, తానే శివభక్తుడుగా మారాడనీ చెబుతారు. ఆయన పేరు నాగూరు మీరాసాహెబ్‌. ప్రజలు ఆయన భక్తికి, ఆయన ద్వారా ప్రదర్శింపబడిన మహిమలకు ఆకర్షింపబడి, ఆయనను సేవించేవారని తెలుస్తోంది. ఆయన దేహం చాలించిన తరువాత ఆయన సమాధిపై నిర్మించిన దర్గా ఒకటి ఇప్పటికీ అక్కడి ప్రజలచే గౌరవింపబడుతోంది. ఇంతటి మహిమాన్వితమైన శైవక్షేత్రంలో పాదంమోపి, ఎలాగైనాసరే తమమతాన్ని ప్రజలలో వ్యాపింపజేసుకుందామని కొన్ని మిషనరీలవాళ్ళు ఎంతోకాలంగా ప్రయత్నిస్తూవచ్చారు. అలాంటి ప్రయత్నాలలో ఒకటి ఈమధ్యనే విఫలమైన వైనం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఒక మిషనరీకి చెందిన మతప్రచారకుడు ఒకాయన ఈగ్రామంపై కన్నువేసి, కొంతమంది యువకులను చేరదీశాడు. గ్రామంలో ఒక ఆస్పత్రి, పాఠశాల, వసతిగృహం, కమ్యూనిటీహాలు నిర్మిస్తామని, అవి స్థానికులకు ఎంతో ఉపయోగపడతాయనీ మాయమాటలు చెప్పాడు. పంచాయితీవారినుండి ఆరుసెంట్లస్థలం సంపాదించాడు. అక్కడొక కమ్యూనిటీహాలు కడుతున్నాం అని చెప్పి, ఒకభవనాన్ని నిర్మింపజేశాడు. 2002వ సంవత్సరం అక్టోబర్‌ 29వ తేదీన ఉదయం 7గంటలకు ప్రభువుతోపాటు అందులో ప్రవేశించుదాం అని చెప్పి, ముహూర్తం కూడా నిర్ణయించాడు. గ్రామంలోని పెద్దలకు అక్కడ సిద్ధమైనది కమ్యూనిటీహలు కాదనీ, చర్చిభవనమనీ తెలిసిపోయింది. ఎలాగైనా సరే అక్కడ బలవంతపు మతాంతరీకరణలు జరగకుండా ఆపాలని వారు నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ఉండే విశ్వహిందూపరిషత్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ వంటి సంస్థల కార్యకర్తలను సంప్రదించారు. వారంతా కలిసి ఆయ్రత్నాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ 28వ తేదీ రాత్రికే గ్రామస్థులంతా సమావేశమై, అన్యమతప్రవేశాన్ని అడ్డుకోవాలని ముక్తకంఠంతో తీర్మానించారు. 29వ తేదీ బ్రాహ్మీముహూర్తంలో గ్రామస్థులందరూ సీతారామలక్ష్మణహనుమల విగ్రహాలతో సిద్ధమైపోయారు. అమలాపురం నుండి కార్యకర్తలందరూ ఉదయం 5గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. మేళతాళాలతో దేవతావిగ్రహాలను ఊరేగించి, హరేరామహరేకృష్ణ, జైజైరామ జానకిరామ, జైశ్రీరాం అంటూ సరిగ్గా ఉదయం 6గంటలకు నూతనంగా నిర్మించిన భవనంలో ప్రవేశించి, దేవతావిగ్రహాలను ప్రతిష్ఠించి, భజనను కొనసాగించారు. మరో అరగంటలో 7గంటల ముహూర్తానికని శిలువతో అక్కడికి చేరుకున్న మతప్రచారకునికి మతిపోయినట్లయింది. కాసేపు అటూఇటూ తచ్చాడాడు. అందరూ ఆయనకేసి చూశారు గానీ, ఒక్కరూ పలుకరించలేదు. జైజైరామ జానకిరామ అంటూ మరింత గట్టిగా గ్రామస్థులు భజన చేస్తుంటే, పరిస్థితిని అర్థంచేసుకున్న ఆపెద్దమనిషి కిమ్మనకుండా కారువెనక్కి త్రిప్పుకుని పలాయనం చిత్తగించాడు.
ఈగ్రామం కథాకమామీషు
ఈవిధంగా మతాంతరీకరణను త్రిప్పికొట్టిన ఈపల్లెకు పెద్దచరిత్రే ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని అపహరించిన రావణాసురుని సంహరించి, అయోధ్యకు తిరిగివెడుతూ, సముద్రతీరానగల ఈప్రాంతంలో కొంతసేపు విశ్రమించాడట. బ్రాహ్మణుడైన రావణుని సంహరించడంవల్ల తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని బాధపడ్డాడట. పాపపరిహారార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని సంకల్పించాడట. అందుకు తగిన ముహూర్తాన్ని నిర్ణయించుకుని, ఆసమయానికి తిరిగివచ్చేలా కాశీనుండి శ్రేష్ఠమైన శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయస్వామిని ఆదేశించాడట. హనుమ శివలింగంతో తిరిగిరావటం ఆలస్యమైందట. ముహూర్తం మించిపోకూడదని రాములవారు ఆసముద్రతీరాన ఇసుకతోనే ఒక శివలింగాన్ని చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, తన సంకల్పం నెరవేర్చుకున్నాడట. ఇక్కడ ఈప్రతిష్ఠ జరుగుతుండగా ఆంజనేయస్వామి కాశీనుండి శివలిగాన్ని తీసుకువచ్చాడు. దానిని ఏమి చెయ్యాలి అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో ”ఈలింగాన్ని నీవు ఈగోదావరిపాయకు ఆవలివైపున ప్రతిష్ఠ చెయ్యి. ఈరెండు శివలింగాలలో ఒకటి నాపేరుతో శ్రీరామలింగేశ్వరస్వామిగాను, మరియొకటి నీపేరుతో లక్ష్మణేశ్వరస్వామిగాను ప్రసిద్ధికెక్కి, ప్రజలచే పూజింపబడతాయి. వారిపాలిట ఈరెండుక్షేత్రాలూ కల్పవృక్షాలవలె కోరికలు తీరుస్తూ, వారిని తరింపజేస్తాయి” అని చెప్పాడట. ఆవిధంగా రాములవారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీరామలింగేశ్వరస్వామివారు పార్వతీసమేతంగా ఇప్పటికీ ఈప్రాంతప్రజలచే ఆరాధింపబడుతున్నారు. ఈఆలయం పశ్చిమముఖంగాను, లక్ష్మణేశ్వరస్వామి ఆలయం తూర్పుముఖంగాను ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండటం విశేషం. రాములవారు ఇక్కడ ఈప్రతిష్ఠ చేసిన సమయంలో నక్కలు కూశాయనీ, అందువల్ల ఈప్రాంతానికి నక్కారామేశ్వరం అనేఖ్యాతి వచ్చిందనీ ఇక్కడి పెద్దలు చెబుతారు. చాలాకాలం క్రితం ఇక్కడ కంచుతో నిర్మించిన ఆలయం ఉండేదనీ, అది సముద్రం పొంగిరావటంవల్ల కొట్టుకుపోయిందనీ, తరువాతికాలంలో ఇక్కడి ప్రజలు లింగప్రతిష్ఠ చేసి గుడి కట్టించుకున్నారనీ స్థానికులు చెబుతారు. పెద్దాపురం మహారాజులు ఈక్షేత్రమహిమను గురించి తెలుసుకుని ఈదేవుడికి మడిమాన్యాలు సమర్పించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పోయిన ఆస్తి పోగా, ఇప్పుడు స్వామివారిపేరున నలభయ్యెకరాల భూమి మిగిలింది. యాభైసంవత్సరాల క్రితంవరకు ఈఆలయంలో బంగారపు అమ్మవారి విగ్రహం, దేవుని ఊరేగింపుకు వాహనాలు ఉండేవిట. అయితే ఆలయానికి సరయిన రక్షణ లేకపోవటంవల్ల సమీపగ్రామమైన సామంతకుర్రు గ్రామస్తులు ఆవిగ్రహాన్నీ, వాహనాలనూ తమ ఊరి దేవాలయంలో భద్రపరుస్తామని చెప్పి తీసుకువెళ్ళారట. ఆనాటినుండి ఈనాటివరకూ అవి అక్కడే ఉన్నాయని ఈగ్రామప్రజలు చెబుతున్నారు.
శ్రీరామలింగేశ్వరస్వామి మహిమలు
గోదావరీ సంగమస్థానంలో నెలకొని ఉన్న ఈపార్వతీసమేత రామలింగేశ్వరస్వామివారి గురించి, వారి మహిమల గురించి ఎన్నెన్నో కథలూ, గాథలూ ప్రచారంలో ఉన్నాయి. చొల్లంగి అమావాస్యనాడు ఇక్కడ పెద్దతీర్థం జరుగుతుంది. పరిసరప్రాంతాలనుంచే గాక, సుదూరప్రాంతాలనుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. సముద్రస్నానం చేసి, శ్రీరామలింగేశ్వరస్వామిని సందర్శించి, ఫలపుష్పాలు సమర్పిస్తారు. సంతతిలేని దంపతులు ఇక్కడ సముద్రస్నానం చేసి, ఒకరాత్రి స్వామి సమక్షంలో నిద్రించి, గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తూ, స్వామిని సేవించుకుంటే తప్పకుండా వారికి పిల్లలు పుడతారట. అనారోగ్యంతో బాధపడేవారు తమకు స్వస్థత కలగాలని స్వామివారికి మ్రొక్కుకుంటే ఎలాంటివ్యాధులైనా తగ్గిపోతాయని, ఆతరువాత వారు వచ్చి, ఇక్కడ మ్రొక్కులు చెల్లించుకుంటారనీ తెలుస్తోంది. స్వామికి అర్చన చేసిన తీర్థజలాలు ఎంతోమహిమ గలవని, సర్వవ్యాధినివారకములని కూడా ప్రజల విశ్వాసం. శివరాత్రి పర్వదినమున, రధసప్తమినాడు ఇక్కడ విశేషపూజలు జరుగుతాయి. కార్తీకమాసంలో స్వామిని దర్శించి, అభిషేకాలు చేయించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
ఆలయపునరుద్ధరణ
అతిప్రాచీనమైన ఈశివాలయం శిధిలావస్థకు చేరుకోగా గ్రామపెద్దలు పూనుకుని 1982వ సంవత్సరంలో ఈఆలయానికి ప్రాకారం నిర్మింపజేశారు. వాస్తుశాస్త్రప్రకారం జరిగిన ఈప్రాకార నిర్మాణంవల్ల ఈఆలయానికి మంచిరోజులు వచ్చాయనే చెప్పాలి. 2004వ సంవత్సరంలో ఆలయపునఃప్రతిష్ఠ మహావైభవంగా జరిగింది. శిధిలమైన పానవట్టాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మార్చి, క్రొత్తవాటిని ప్రతిష్ఠించి, పూజలు జరిపించారు. శ్రీపుల్లేటికుర్తి పురుషోత్తమశర్మగారు ఈఆలయ ప్రధానార్చకులు. స్వామివారికి నిత్యపూజలు, మహానైవేద్యములు భక్తితో సమర్పిస్తూ, భక్తులకు పూజాదికములను జరిపిస్తున్నారు.
ప్రజల సహకారం
రెండుమూడు కుటుంబాలవారు తప్ప ఈగ్రామంలోని ప్రజలందరూ అగ్నికులక్షత్రియులే. ఈఆలయమన్నా, శ్రీరామలింగేశ్వరస్వామివారన్నా వీరికి ఎంతో భక్తివిశ్వాసాలు ఉన్నాయి. తమకు ఏకష్టం వచ్చినా స్వామికి నివేదిస్తే గట్టెక్కుతామని వారందరూ నమ్ముతారు. సునామీలవంటి ప్రకృతిభీభత్సాలను కూడా తట్టుకుని నిలబడగలిగామంటే అంతా ఆస్వామిదయే అంటారు ఇక్కడి ప్రజలు. ఈమత్స్యకారులకు ఒక సహకారసంఘం ఉంది. అసంఘానికి అధ్యక్షులైన శ్రీఅంగాడి కాళీస్వామిగారు ఈఆలయవిశేషాలను సహృదయంతో తెలియజేశారు. గ్రామస్తులంతా కలసి ఈఆలయ అభివృద్ధికి ఒకలక్షా ఎనభైవేల రూపాయిలు విరాళాలుగా సేకరించామని, ప్రభుత్వంవారు తమవంతుగా మరొక నలభైవేలరూపాయిలు ఇచ్చారనీ, ఈమొత్తమంతా స్వామిపేరున బ్యాంకులో ఉన్నదని చెప్పారు. దీనిపై వచ్చే వడ్డీతో ఇక్కడి కార్యక్రమాలు నడుస్తున్నాయని, అంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు దేవాదాయశాఖవారి సహకారం లేకపోవటమే కారణమని కూడా ఆయన చెప్పారు.
చేయవలసిన సదుపాయాలు
ప్రసిద్ధమైన ఈశైవక్షేత్రానికి సరయిన ప్రయాణసదుపాయం లేకపోవటం పెద్ద లోపంగా ఉంది. అమలాపురం నుండి చల్లపల్లిమీదుగా సామంతకుర్రు వెళ్ళేందుకు ఒకటిరెండు ఆర్‌టిసి బస్సులు తిరుగుతున్నాయి గానీ, రోడ్డు పెద్దపెద్ద గోతులతో ప్రమాదభరితంగా ఉండటంవల్ల ప్రయాణీకులు అసౌకర్యానికి లోనవుతున్నారు. పాడయిన ఈమార్గాన్ని తక్షణమే బాగుచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
భక్తులు మ్రొక్కులు చెల్లించుకోవటానికి వచ్చినప్పుడు విడిదిచేసేందుకు వసతిగృహాలు లేక చాలా ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి ఇక్కడ దూరప్రాంతాలనుండి వచ్చే భక్తులకోసం వసతిగృహాలు నిర్మించవలసి ఉంది. దేవుడి భూములను కొంతమంది స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించుకుని పక్కాభవనాలు నిర్మించుకున్నారు. ఆభవనాలను స్వామివారి ఆస్తిగా ప్రకటించి, స్వామివారికి దక్కేలా చెయ్యవలసి ఉంది.
కొమరగిరిపట్నంనుంచి గోదావరిపాయల మీదుగా ఈగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. గోదావరిపాయలపై వంతెనల నిర్మాణానికి జరిగిన ప్రయత్నం శంకుస్థాపన ఫలకాల వరకు వచ్చి ఆగిపోయింది. రాజకీయాలకు అతీతంగా ఈప్రయత్నాన్ని కొనసాగించి వంతెనలను నిర్మిస్తే, ఈగ్రామం మరింత అభివృద్ధికి నోచుకుంటుంది. అంతేకాక, దేవాలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈమార్గం ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. ఈఆలయానికి ఎదురుగా తూర్పుముఖంగా ఉండే శ్రీలక్ష్మణేశ్వరస్వామిని లక్ష్మణేశ్వరం వెళ్ళి సేవించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామికి సరయిన ఆవాసం కల్పించవలసి ఉంది. ఆస్తీ, ఆదాయమూ కూడా ఉన్న ఈపురాతన శైవక్షేత్రన్ని భక్తులందరికీ దర్శనీయమైన క్షేత్రంగా చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోనసీమప్రజలందరూ కోరుకుంటున్నారు.
శ్రీరాములవారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా చెప్పబడుతున్న ఈరామేశ్వరస్వామివారు తనప్రతిష్ఠకు కారకుడైన శ్రీరాములవారిని కూడా ఇక్కడ స్థాపించుకుని పూజింపవలసి ఉన్నది అనే సంకల్పాన్ని ఇక్కడి ప్రజల హృదయాలలో కలిగించి, శ్రీరామప్రతిష్ఠ తన భక్తులచే జరిపించటం విశేషం. ”శివస్యహృదయం విష్ణోః” అని కదా అంటారు. వాస్తవానికి దైవం విషయంలో నామభేదమే తప్ప వస్తుభేదం ఉండదు.
మహేశ్వరే వా జగతామధీశ్వరే
జనార్దనే వా జగదన్తరాత్మని|
నవస్తుభేద ప్రతిపత్తిరస్తిమే
తథా-పి భక్తిస్తరుణేన్దుశేఖరే||
అని కదా ఆర్యోక్తి.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML