గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 January 2015

తైత్తిరీయోపనిషత్తు ఏ వేదంలో, ఏ శాఖలో ఉంది? తైత్తిరీయోపనిషత్తు కృష్ణయజుర్వేదంలో తైత్తిరీయశాఖలో ఉంది.తైత్తిరీయోపనిషత్తు ఏ వేదంలో, ఏ శాఖలో ఉంది?
తైత్తిరీయోపనిషత్తు కృష్ణయజుర్వేదంలో తైత్తిరీయశాఖలో ఉంది.

తైత్తిరీయోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
తిత్తిరి పక్షుల ద్వారా గ్రహించబడి, ప్రకటించబడిన కృష్ణయజుర్వేదం లోని వేదశాఖకు తైత్తిరీయశాఖ అని పేరు వచ్చింది. ఆ వేద శాఖలో ఉన్న ఉపనిషత్తు గనుక తైత్తిరీయోపనిషత్తు అని పేరు వచ్చింది.

తైత్తిరీయోపనిషత్తులో ఎన్ని భాగాలు ఉన్నాయి.
తైత్తిరీయోపనిషత్తు లో నాలుగు భాగాలున్నాయి. అవి శీక్షావల్లి, ఆనందవల్లి, భ్రుగువల్లి, మహానారయణోపనిషత్తు.

శీక్షావల్లి లోని ప్రధానాంశాలు ఏమిటి?
శీక్షావల్లిలో వేదాభ్యాసంలో ముఖ్యమైన ఆరు అంశాలు వివరించబడ్డాయి. విద్యార్థిగా అధ్యయనం, గృహస్థుగా అధ్యాపనం, అతిథి సత్కారం, నిత్యకర్మానుష్టానం, దేవపిత్రుకార్యాలు ధర్మాలని ప్రవచించింది . విద్యార్థులు అధ్యయనం పూర్తి చేసుకుని గురుకులం వదలి గృహస్థాశ్రమం స్వీకరించబోయే సమయంలో వీడ్కోలుగా గురువిచ్చిన స్నాతకోపన్యాసం, జగత్ ప్రసిద్ధం, ఉత్తేజకరం, మన సనాతన ధర్మ సారం.

ఆనందవల్లి లోని ప్రధానాంశాలు ఏమిటి?
ఆనందవల్లి 'బ్రహ్మవిదాప్నోతి పరం' బ్రహ్మజ్ఞాని బ్రహ్మమే అవుతాడనే ప్రసిద్ధమైన వాక్యంతో ప్రారంభంఅవుతుంది . బ్రహ్మము నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి నీరు, దాని నుండి పృథివి, దానినుండి ఓషధులు (అన్నం), దానినుండి పురుషుడు ఉద్భవించారని సృష్టిక్రమాన్ని వివరించింది. మానవునిలో అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశాలనే కోశాలు - ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి - ఉంటాయని, అందులో ఆనందమయకోశంలో ఆనందస్వరూపంగా పరమాత్మ ఉంటాడని వివరించింది. పరమాత్మ వాన్జ్మానసులకు అవగతమయ్యే వాడు కాడని, సర్వోత్తముడని చెప్పి ఆనందంలో తరతమ భేదాలను విశదపరచింది.

భ్రుగువల్లిలోని ప్రధానాంశాలు ఏమిటి?
భ్రుగువల్లిలో, భ్రుగువు తన తండ్రి వరుణున్ని తనకు బ్రహ్మమునుపదేశించమని అర్థించగా, తండ్రి "అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోత్రం, మనస్సు, వాక్కు దేనినుండి ఉద్భవిస్తున్నాయో, దేనివల్ల వర్ధిల్లి, దేనిలో లయం అవుతున్నాయో అదే బ్రహ్మము, దాన్ని తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోగలవు" అని ఉపదేశించాడు. భ్రుగువు అలాగే తపస్సు చేసి ఆనందమే బ్రహ్మమని చిట్టా చివరకు తెలుసుకున్నాడు. ఈ వల్లిలో, అన్నప్రశంస, అతిథి సత్కారం, సృష్టి మూలం, బ్రహ్మోపాసన మొదలైన విషయాలు చక్కగా వివరించ బడ్డాయి.

ఈ ఉపనిషత్తు స్వరయుక్తంగా ఉండడంవల్ల గానం చేస్తుంటే మనోరంజకంగా ఉంటుంది.

నారాయణోపనిషత్తులోని ప్రధానాంశాలు ఏమిటి?
ఈ ఉపనిషత్తు పరిమాణంలో చాలా పెద్దది అవడం చేతనూ, పరమాత్మను నారాయణ స్వరూపంగా వర్ణించే ఉపనిషత్తు కావడం చేతనూ, దీనిని మహానారాయణోపనిషత్తని పిలుస్తారు.
ప్రతి పూజలోను మనం పఠించే మంత్రపుష్పం మంత్రాలు, యతీశ్వరుల సన్నిధిలో పఠించే మంత్రాలు, సంధ్యావందనంలో వచ్చే మంత్రాలు, విరజా హోమ మంత్రాలు, దుర్గాసూక్త మంత్రాలు మొదలైన అనేక ప్రసిద్ధమైన మంత్రాలన్నీ ఈ ఉపనిషత్తులోనివే.

వేద వేదాంగములను అధ్యయనం చేసి, వేదోక్తమైన కర్మలన్నింటినీ సంగ రహితంగా అనుష్టించి, ఆధ్యాత్మమార్గంలో సంపూర్ణంగా లీనమై, పరమాత్మ తత్వంతో తాదాత్మ్యం చెంది, తన దేహంలోని ప్రతి అణువణువునూ వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడూ అయిన నారాయణునికి సర్వ సమర్పణ చేస్తూ, ఆత్మసాక్షాత్కారాన్ని అనుభూతిపరంగా పొందే ఆదర్శవంతమైన ఒక మహాయోగి జీవన విధాన వర్ణన ఒక మహాద్భుత ఘట్టం.

ఆధ్యాత్మ మార్గంలో ఆసక్తి ఉన్న ప్రతివారూ తప్పక పఠించ వలసిన భాగం ఇది. ఈ సన్నివేశంతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది. కృష్ణయజుర్వేదానికి చెందిన తైత్తిరీయ శాఖలో ఈ ఉపనిషత్తు ఆఖరి పన్నం అవడం చేత ఈ వేదశాఖ కూడా దీనితో పూర్తయినట్లే అవుతుంది.

వేద మంత్రాల ఉచ్చారణ లోని అంతర్భాగాలు ఏమిటి?
ఓం శీక్షాం వ్యాఖ్యాస్యామః | వర్ణః స్వరః | మాత్రా బలం | సామ సంతానః | ఇత్యుక్తః శీక్షాధ్యాయః | (1.2)
'శీక్షా' అంటే స్వరశాస్త్రం (science of phonetics). వేద మంత్రాల అర్థం, ఫలితం కూడా స్వరం మీద ఆధారపడి ఉంటుంది . అందుచేత ఈ ఉపనిషత్తులోని మొదటి అధ్యాయంలో వేదోచ్చారణ పద్ధతి వివరించబడింది. ఈ ఉచ్చారణలో భాగాలు (1) అకారాది వర్ణములు; (2) ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే స్వర భేదాలు; (3) హ్రస్వ, దీర్ఘ, ప్లుతము (నిబ్బర గమనం - steady pace) అనే మాత్రలు; (4) ఉచ్చరించునప్పుడు చేయవలసిన ప్రయత్న విశేషం - దీన్ని బలం అంటారు; (5) అతి వేగంగాను, మందంగాను కాక మధ్యస్థ వృత్తిగా పలకడం - దీన్ని సామం అంటారు; (6) అక్షరాలను అలసత్వం లేకుండా పలకడం - దీన్ని సంతానం అంటారు. ఈ విధంగా మంత్రోచ్చారణ చెయ్యాలని వేదం శాసిస్తోంది.

గురు శిష్య సంబంధాన్ని ఈ ఉపనిషత్తు ఎలా వర్ణించింది?
ఆచార్యః పూర్వరూపం | అంతేవాస్యుత్తర రూపం | విద్యా సంధిః | ప్రవచనగ్ం సంధానం (1.3)
విద్యా విధానంలో ఆచార్యుడు మొదటి స్థానం; శిష్యుడు రెండవ స్థానం; వీరి కలయిక విద్య; కలిపేది బోధన.

మహా సంహితలు ఏమేమిటి?
ఈ క్రింది ఐదింటిని మహా సంహితలంటారు.
అధిలోకము; అధిజ్యౌతిషము; అధివిద్యము; అధిప్రజము; అధ్యాత్మము.

మనం తోటి వారితో మాట్లాడాలి?
మనం తోటివారితో మధురంగా భాషించాలి. నా నాలుక నుండి ఎప్పుడూ మధురమైన భాషణములే వెలువడు గాక! తోటి వారిని నొప్పించే విధంగా మాట్లాడడం వేదం అంగీకరించదు.

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం - సత్యం చెప్పండి, ప్రియం చెప్పండి, కాని సత్యమైనా నొప్పించే విధంగా చెప్పవద్దు అనేది భారతీయ సంప్రదాయం.

అన్నం ప్రాధాన్యత ఏమిటి?
అన్నం శ్రేశ్ఠమైనది. దానితోనే ప్రాణికోటి జీవిస్తున్నది. అందుచేత అన్నదానం గొప్పది. అన్నాన్ని వ్యర్థం చెయ్యకూడదు.

గృహస్థ ధర్మం ఏమిటి?
ధర్మాన్ని అనుసరిస్తూ, అధ్యయన, అధ్యాపనాలు చేస్తూనే సత్య సంధత, శమ దమాది సద్గుణాలు కలిగి ఉండాలని, అగ్ని కార్యాలు చేస్తూ అతిథులకు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని, తొమ్మిదవ అనువాకం గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంది.

సత్య ధర్మాల ప్రాధాన్యత ఏమిటి?
సత్యం వద | ధర్మం చర | అని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.
సత్య సంధత, ధర్మాచరణ ఈ రెండింటికి భారతీయ సంస్కృతి అపార ప్రాధాన్యత నిచ్చింది. అవి లోపిస్తే వచ్చే పరిణామాలను మనం ఇపుడు చూస్తున్నాం.

ప్రధాన నిత్య, నైమిత్తిక కర్మలేమితి?
వాటిని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.
దేవ ప్రిత్రు కార్యాభ్యాం న ప్రమదితవ్యం (1.11.2)
నిత్యం దేవతార్చన చెయ్యాలి. ఇది నిత్య కర్మ.
గతించిన తల్లితండ్రులకు ప్రతి సంవత్సరం ఆబ్దీకాలు విధిగా నిర్వహించాలి. ఇది నైమిత్తిక కర్మ.
ఇవి రెండూ గృహస్తు విధిగా నిర్వర్తించాలని వేదం శాసిస్తుంది.

మనం ఎవరెవరిని దైవ స్వరూపులుగా పూజించాలి?
వారి వివరణ ఉపనిషత్తులో ఇలా ఉంది.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ - అని జన్మ నిచ్చిన తల్లితండ్రులను, జ్ఞానబిక్ష పెట్టి జన్మను సార్థకం చేసిన గురువును, ఇంటికి వచ్చిన అతిథిని దైవ స్వరూపులుగా ఆరాధించమని వేదం ఆదేశిస్తొంది.

దానం ఎలా చెయ్యాలి?
దాన నియమాలను ఉపనిషత్తు ఈ విధంగా అభివర్ణించింది.

శ్రద్ధయా దేయం | ఆశ్రద్ధయా2 దేయం | శ్రియా దేయం | హ్రియా దేయం | భియా దేయం | సంవిదా దేయం | (1.11.3)
దానం చేయవలసినప్పుడు శ్రద్దగా చెయ్యాలి; అశ్రద్ద పనికి రాదు. తాహతును దృష్టిలో పెట్టుకుని వినయంతోను, భయ భక్తులతోనూ, ప్రీతి పూర్వకంగాను దానం చెయ్యాలి.

బ్రహ్మజ్ఞానం లభిస్తే పొందేది ఏమిటి?
'బ్రహ్మవిదాప్నోతి పరం' అంటే బ్రహ్మజ్ఞాని మోక్షాన్ని పొందుతాడు అని ఉపనిషత్తు చెబుతుంది. బ్రహ్మజ్ఞానం మోక్షానికి ప్రధానం గనుక ఈ వాక్యానికి ఉపనిషద్ వాంగ్మయం లో చాలా ప్రాధాన్యత ఉంది.

సృష్టి జరిగిన క్రమం ఏమిటి?
సృష్టి క్రమాన్ని ఉపనిషత్తు ఈ విధంగా అభివర్ణించింది.
బ్రహ్మము నుండి ఆకాశము, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి నీరు, దాని నుండి పృథ్వీ, దాని నుండి ఓషదులు, వాటి నుండి అన్నము, దాని నుండి జీవజాలము ఉద్భవించాయని సృష్టి క్రమాన్ని హేతుబద్ధంగా తిరుగులేని విధంగా వేదం వివరించింది.

మాటలకు, మనస్సుకు ఆత్మ అందుతుందా?
అందదు అని సమాధానం. దాని వివరణ ఈ విధంగా ఉంది.
పరమాత్మను మాటలతో వివరించలేము. మనస్సుతో ఆలోచించలేము. అందుచేత అవి రెండూ కూడా పరమాత్మను చేరుకోలేక వెనుదిరుగుతాయి. నిష్కామకర్మ,అచంచల భక్తీ, గురూపదేశం, నిరంతర ధ్యానమే పరమాత్మను చేరే మార్గాలని ఉపనిషత్తులు బోధిస్తాయి.

సృష్టికి పూర్వం ఏమి ఉండేది?
సృష్టికి పూర్వం అవ్యక్తం ఉండేది.
సృష్టికి పూర్వం ఈ నామ రూపాత్మక ప్రపంచం అవ్యక్తంగాఉంది. ఆ అవ్యక్తం నుండే జగత్తుపుట్టింది. మహా విస్ఫోటనం ముందు పదార్ధమేముందో శాస్త్రజ్ఞులు చెప్పలేక పోతున్నారు. అవ్యక్తం ఉందని ఇక్కడ స్పష్టంగా వేదం చెప్తుంది. అవ్యక్తం అంటే వ్యక్తం కాని ద్రవ్యం (matter) దీన్ని ప్రక్రుతి లేక ప్రధానం అంటారు. దాన్ని వ్యక్తం చెయ్యడం భగవంతుని లీల.

పరమాత్మ ఆనంద స్వరూపుడు అని చెప్పే వాక్యం ఏది?
యద్వైతథ్సుకృతం| రసో వై సః (2,7)
అవ్యక్త బ్రహ్మం విశ్వంగా వ్యక్తమవడాన్ని సుకృతం అంటారు. ఆ వ్యక్త బ్రహ్మమే రస స్వరూపి, ఆనంద హేతువు. అవ్యక్తంగా ఉన్నప్పుడు ఎవరిని ఆనందపరచాలి? వ్యక్తమైనపుడు జీవజాలం ఉంటుంది. ఆ జీవ జాలానికి వ్యక్త బ్రహ్మం ఆనంద స్వరూపంగామారుతుంది . కావ్యం నిర్మాణం పూర్తయినప్పుడే కదా రసస్వరూపంగా మారుతుంది.

ఆనందాన్ని ఎట్లా కొలవాలి?
ఆసిష్ఠొ ద్రఢిష్ఠొ బలిష్ఠః | తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణాస్యాత్ | స ఏకో మానుష ఆనన్దః (2.8)
సదాశాయము, బలము, ధృఢ చిత్తము కలిగిన వేద విదుడు, సాదు స్వభావుడు అయిన యువకునికి, సకల పృథివీ అంతా చెందితే అతడు పొందే ఆనందం ఒక మానుష ఆనందం అని ఉపనిషత్తునిర్ణయించింది. నిజానికి ఈ ఆనందం అత్యల్పం. ఆరోహణ క్రమంలో పదకొండవది హిరణ్య గర్భుని ఆనందం. ప్రతి మెట్టు దగ్గర క్రింది మెట్టు కంటే వంద రెట్లు పెరిగి హిరణ్య గర్భుని ఆనందం వరకు చేరుతుందీ ఆనందం. తరువాత బ్రహ్మానందం. ఇది ఎంత అన్నది ఎవరూ నిర్ణయించ లేదు గనుక, దాని పరిమాణాన్ని ఉపనిషత్తు ఇదమిత్థంగా చెప్పదు.

పరమాత్మ అంటే ఎవరు?
యతో వా ఇమాని భూతాని జాయంతే | యేన జాతాని జీవంతి | యత్ప్రయంత్యభిసంవిశంతి | తద్విజిజ్ఞాసస్వ | తద్బ్రహ్మేతి |(3.1)
పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఈ భూత జాలం ఎవని నుండి ఉద్భవించి, వృద్ధి పొంది చివరకు ప్రళయకాలంలో ఎవనిలో లీనమవుతున్నాయో ఆయనయే పరబ్రహ్మమని, లేక పరమాత్మ అని తెలుసుకో అని వరుణుడు తన కుమారుడైన భ్రుగువుకు ఉపదేశించాడు. అదే అందరికి శిరోధార్యము.

'తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ' అంటే అర్థం ఏమిటి?
తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకో. బ్రహ్మమును తెలుసుకొనుటకు తపస్సు మాత్రమే ఏకైక మార్గము, అని ఉపనిషత్తు ప్రవచిస్తుంది (3.2).

జీవజాలానికి ఆనందానికి అవినాభావ సంబంధం ఏమిటి?
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ | ఆనన్దాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే | ఆనన్దేన జాతాని జీవన్తి | ఆనందం ప్రయంత్యభిసం విశంతీతి | (3.6) అని ఈ ఉపనిషత్తు ప్రవచిస్తుంది. దాని అర్థం ఇది.

ఈ భూతజాలం ఆనందం నుండే పుట్టి, ఆనందం చేత వర్ధిల్లి ప్రళయకాలంలో ఆనందంలో లయమవుతున్నాయి గనుక ఆనందమే బ్రహ్మము, జీవజాలం యొక్క సృష్టి, స్థితి, లయాలకు కారణం.

ఆహారాన్ని వ్యర్థ పరచకూడదు అని చెప్పే వాక్యం ఏది?
అన్నం న నిన్ద్యాత్ | తద్ వ్రతం (3.7) అని ఉపనిషత్తు నందు అన్నాన్ని నిందించకూడదు, అది వేద విదుల వ్రతం. ప్రస్తుత కాలంలో విందుల్లో ఆడంబరానికి అనేక పదార్థాలను పెట్టి చివరకు వ్యర్థ పరుస్తున్నారు. అంతకన్నా పాపం లేదని గ్రహించాలి.

హరిత విప్లవం (Green Revolution) ఎప్పుడు మొదలయింది?
అన్నం బహుకుర్వీత | తద్ వ్రతం | (3.9)
అన్నాన్ని (ఆహార పదార్థాలను) విశేషంగా ఉత్పత్తి చెయ్యండి. దాన్నే వ్రతంగా పెట్టుకోండి అని హరిత విప్లవాన్ని సృష్ట్యాది లోనే మన వేద విజ్ఞానం బోధించింది.

దీనులను ఆడుకోవడం మన కర్తవ్యం! అని బోధించిన వాక్యం ఏది?
'న కంచన వసతౌ ప్రత్యాచక్షీత | తద్వ్రతమ్ | తస్మాద్యయా కయా చ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ |'(3.10)
నిరాశ్రయులు వస్తే వారికి ఆశ్రయం కల్పించాలి. నీతి నియమాలతో కూడిన పద్ధతులలో ఎక్కువ ఆహారాన్ని సంపాదించి నిరాశ్రయులకు, అన్నార్తులకు పెడితే అలాంటి దాతకు వృద్ధాప్యంలో అన్నానికి లోటుండదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML