గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 19 December 2014

బృహదారణ్యకోపనిషత్తుబృహదారణ్యకోపనిషత్తు

బృహదారణ్యకోపనిషత్తు ఏ వేదంలో ఉంది?

బృహదారణ్యకోపనిషత్తు శుక్లయజుర్వేదంలో శతపథబ్రాహ్మణంలో ఉంది.

బృహదారణ్యకోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?

ఈ ఉపనిషత్తు (అన్ని ఉపనిషత్తులకంటే) పరిమాణంలో చాలా పెద్దది (బృహత్తు). అందుకే దీనిని బృహదారణ్యకోపనిషత్తు అని అంటారు. ఇది పరిమాణంలోనే గాక, విషయ విశిష్టత, సమగ్రత, వివరణ లన్నిమ్తిలోనో కూడా విశేషమైనదే.

బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?

బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాలు 6 అధ్యాయాల్లో విస్తరించి ఉన్నాయి. 1, 2 అధ్యాయాలను మధుకాండ అంటారు. 3, 4 అధ్యాయాలను యాజ్ఞావల్క్యకాండ అంటారు. 5, 6 అధ్యాయాలను ఖిలకాండ అంటారు.

బృహదారణ్యకోపనిషత్తులోని ప్రధాన పాత్రధారులెవ్వరు?

యాజ్ఞవల్క్యుడు, జనకుడు, గార్గి, మైత్రేయి - ఇలా అనేకమంది ఈ ఉపనిషత్తులో ప్రధాన పాత్రధారులు. ఒకరు ఋషిపుంగవుడు, బ్రహ్మజ్ఞాని, ఒకరు రాజు, ఒకరు బ్రహ్మవాదిని, ఒకరు గృహిణి అయినా జిజ్ఞాసువు. అందరు వారి వారి ధర్మాలను నిర్వర్తిస్తూనే సత్యావిష్కరణలో పాలు పంచుకోవడం భారతీయ చింతనలో ఒక విశిష్టతను తెలియజేస్తుంది - సత్యాన్వేషణకు అందరూ అర్హులే - జిజ్ఞాస ఉండాలంతే.

గార్గ్యుని కథ ద్వారా ఈ ఉపనిషత్తు అందించిన సందేశం ఏమిటి?

గార్గ్యుడనే వానికి విద్యాగర్వం మెండు. ఆతను అజాతశత్రువు అనే రాజు వద్దకు వెళ్లి అర్థించబడకుండానే 'నేను నీకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తా' నన్నాడు. సరేనన్నాడు నిగర్వి, జ్ఞాని అయిన అజాతశత్రువు. గార్గ్యుడు భంగపడతాడు. చివరికి అజాతశత్రువు దగ్గరే ఉపదేశం పొందుతాడు. విద్యాగార్వం పనికి రాదనీ, ఎదుటి వారి సత్తా తెలుసుకోకుండా అహంకరించకూడదనే సందేశంతో ఈ ఉపనిషత్తు మొదలవుతుంది.

బృహదారణ్యకోపనిషత్తులో లభిస్తున్న విశేషాలను, జనకుని యజ్ఞసభలో జరిగిన వాదోపవాదాలను సంక్షిప్తంగా తెలపండి?

జనకుని యజ్ఞం, అక్కడ జరిగిన సభ, అందులోని వాదోపవాదాలు ఈ ఉపనిషత్తులోని పెద్ద ముచ్చట.

ఆత్మను ప్రత్యక్షంగా చూపమన్న ఉషస్తుడికి, కహోలుడికి, ఆత్మ బాహ్య ప్రపంచంలోని వస్తువు (object) కాదని అది మనలోనే ఉండే కర్త (subject) అని యాజ్ఞవల్క్యుడు బోధించాడు.

యాజ్ఞావల్క్యునితో గార్గి వాదోపవాదాలు అత్యంత ఆసక్తికరం, భారతీయ తత్త్వశాస్త్ర సారస్వతంలో ఒక మధుర ఘట్టం. మొదట హిరణ్య గర్భుడే మూలద్రవ్యం అని, ఆయన్ని ఆవరించేది ఇంకేది లేదని యాజ్ఞవల్క్యుడు ఉపదేశించాడు. గార్గి రెండవసారి వాదనకు దిగినప్పుడు సూత్రాత్మ అవ్యక్త ఆకాశంచేత వ్యాపింపబడిందని, ఆ అవ్యక్త ఆకాశం అక్షర బ్రహ్మం చేత వ్యాపింపబడిందని చెప్పి, ఆ అక్షర బ్రహ్మం మాటలకు, ఊహకు అందనిదని, దాని నుండే జీవజాలం ఉద్భవించి, మళ్ళీ దానిలోనే లయం అవుతుందని ఉపన్యసించాడు.

జనకుడికి ఆత్మజ్ఞానం మీద, దేహాత్మల మీద ఇంకా అనేక విషయాల మీద ఉపదేశం ఇచ్చాడు.

'ద' అనే అక్షరాన్ని ఉపదేశించడం అనే కథ ద్వారా ఈ ఉపనిషత్తు మనకు అందించిన సందేశం ఏమిటి?

భోగలాలసత్వం (దేవతల ప్రకృతి), పరపీడన పరాయణత్వం (ఆసుర ప్రకృతి), లోభం (మానవ ప్రకృతి) - ఇవి మూడూ మన సమాజంలోనే ఉన్నాయని, అవి వరుసగా శమ దమాల వల్ల, దయ వల్ల, దానం వల్ల, నివారించుకోవాలని ఈ ఉపనిషత్తు ఒక చక్కని కథా రూపకంగా వివరించింది.

యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఇచ్చిన ఉపదేశం ఏమిటి?

భార్య మైత్రేయికి, సంపదలు శాశ్వతానందాన్ని ఇవ్వలేవని, ఆత్మానందం అనుభవైకవేద్యమని, అది శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా మాత్రమే సాధ్యమని ఉపదేశించాడు.

ఈ ఉపనిషత్తులో లభిస్తున్న మహావాక్యం ఏమిటి? సంక్షిప్తంగా దాని అర్థం ఏమిటి?

ఈ ఉపనిషత్తులో లభిస్తున్న మహా వాక్యం "అహం బ్రహ్మాస్మి". సంక్షిప్తంగా దీని అర్థం "నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను".

ఈ ఉపనిషత్తులో మరికొన్ని అతి ప్రసిద్ధమైన వచనాలేమిటి?

ఆసతో మా సద్గమయ

తమసో మా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతం గమయేతి (1.3.28)

'నన్ను అసత్తు నుండి (చెడు నుండి లేక జడత్వం నుండి), సత్తు (మంచి లేక చైతన్యం) వైపుకునడిపించు . తమస్సు (చీకటి లేక అజ్ఞానం) నుండి జ్యోతి (వెలుగు లేక జ్ఞానం) వైపుకు నడిపించు. మృత్యువు (death) నుండి (అశాశ్వతమైన దాని నుండి) అమృతత్వం (శాశ్వతమైన దాని వైపు) (immortality) వైపుకు నడిపించు. అని ముముక్షువు ఆ పరమాత్మను వేడుకుంటున్నాడు. భారతీయ సంప్రదాయంలో, ధనంతో పొందగలిగే భోగాల కంటే చైతన్యంతో కూడిన సత్ ప్రవర్తన, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం (అమృతత్వం) మాత్రమే ఉన్నతమైనవి.

ప్రతి జీవికి అన్నింటికంటే ప్రియమైనది ఏది?

ప్రతి జీవికి అన్నిటికంటే ప్రియమైనది - తానే.

తనకు అన్నిటి కంటే ప్రియమైనది తానే (ఆత్మయే) అని చెప్పే వాక్యం ఏది?

తదేతత్ప్రేయః పుత్రాత్ప్రేయో విత్తాత్ప్రేయో2

న్యాస్మాత్సర్వస్మాదన్తరతరం యదయమాత్మా (1.4.8)

ఈ ఆత్మతత్త్వం పుత్రుని కంటే, సంపద కంటే ఇతరములైన అన్నిటి కంటే ఉత్తమమైనది. కనుక దానినే ప్రేమతో ఉపాసించవలయును.

నేను పరమాత్మ స్వరూపాన్నే అని చెప్పే వాక్యం ఏది?

బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావే

దాహం బ్రహ్మాస్మీతి, తస్మాత్తత్సర్వమభవత్ (1.4.10)

సృష్టికి పూర్వం ఉన్నది పర బ్రహ్మమే. నేనే పరబ్రహ్మమని తనకు తానే ఆ పరబ్రహ్మమును తెలిసికొనెను. మానవుడు కేవలం ఈ జడ స్వరూపం కాదు. పుట్టుకకు ముందు, తర్వాత కూడా మానవుడు నిజానికి ఆత్మ స్వరూపుడే. తరువాత జ్ఞాన సముపార్జన చేత 'అహం బ్రహ్మాస్మి' నేను ఆత్మ స్వరూపుడను అని తెలిసికుంటాడు. అదే ముక్తి.

బ్రహ్మోపాసన ఎందుచేత శ్రేష్టం?

తాను బ్రహ్మము కంటే వేరనే భ్రమతో ఇతర దేవతలనారాధిస్తే ఆ దేవతలు అటువంటి వారి చిన్న కోర్కెలు తీర్చి తమ ఆధీనంలో పెట్టుకొని పశువులను చూసినట్లు చూస్తారు. అందుచేత అలాంటి దేవుళ్ళను ఉపాసించడం కంటే బ్రహ్మోపాసన మేలని చెప్తుందీ ఉపనిషత్తు.

సత్యం, ధర్మం వేరు వేరా?

సత్యం, ధర్మం వేరు కాదు. ధర్మంలో భాగమే సత్యం అని ఈ మంత్రం చెప్తుంది.

తస్మాత్సత్యం వదంతమాహుర్ధర్మం వదతీతి ధర్మం వా

వదంతం సత్యం వదతీత్యేతద్దేవైతదుభయం భవతి (1.4.14)

సత్యం పలికే వాడిని ధర్మం పలికే వాడుగాను, ధర్మం పలికే వాడిని సత్యం పలికేవాడు గాను అంటారు. అంటే సత్యం, ధర్మంలో ఒక భాగమే అన్నమాట. పురుషార్థాలలో సత్యాన్ని ప్రత్యేకంగా పేర్కొనక పోవడానికి కారణం ఇదే.

కోరికలను పూర్తిగా త్యజించాలా?

కోరికలను పూర్తిగా త్యజించవలసిన అవసరం లేదు. ధర్మబద్ధమైన కోరికలుండటంలో తప్పు లేదు.

మొదట జీవాత్మ ఒకటిగానే ఉన్నాడు. తరువాత భార్య, సంతానం, సంపద కావాలనే కోరిక పుట్టి వాటిని పొందాడు. తరువాత కర్మలు చెయ్యాలనుకున్నాడు. ఈ విధంగా కోరికతోనే పరిపూర్ణత పొందాడు. 'అకామస్య క్రియానాస్తి' అని మనుస్మృతి. కోరిక లేకపోతే కర్మలేదు, ప్రపంచం స్తంభిస్తుంది. కనుక ధర్మబద్ధమైన కోరికలు ఉండవలసిందే. అయితే ఈ కోరికలు దురాశకు దారి తీయకూడదు.

ప్రపంచం అంటే ఏమిటి?

ప్రపంచం అంటే నామం, రూపం, కర్మ అని ఉపనిషత్తు చెప్పింది. నామములకు ముఖ్యకారణం వాక్కు. దీని నుండే నామాలన్నీ పుట్టుకు వస్తాయి.

అసలు సత్యమైనదేమిటి?

'సత్యస్య సత్యం' ఆత్మ అని ఉపనిషత్తు ప్రవచించింది.

ఏ ఆత్మ వలన సృష్టి, స్థితి, లయాలు జరుగుచున్నాయో, ఆ ఆత్మను గూర్చి చెప్పేది ఉపనిషత్తు. అందుచేత ఉపనిషత్తును సత్యస్య సత్యం అంటారు. అట్లాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణం అన్నీ సత్యాలే. కాని వాటికి మించిన సత్యం, అంటే ఆత్మను సత్యస్య సత్యం అని చెబుతుందీ ఉపనిషత్తు.

ఆత్మను ప్రత్యక్షంగా చూడగలమా?

చూడలేము. ఆత్మ కర్తగా హృదయకుహరంలో ఉంటుంది. గనుక దానిని చూడలేము.

ఉషస్తుడు ఆత్మను ప్రత్యక్షంగా చూపమని యాజ్ఞవల్క్య మహర్షిని అడిగినపుడు ఆయన ఆత్మ స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు. కంటిలో చూచే శక్తి ఉంది. ఆ శక్తిని కన్ను చూడగలదా? అట్లాగే చెవి శ్రవణ శక్తిని, మనస్సు మానస శక్తులను చూడగలవా? ఆత్మ కర్త (subject) దానిని నీవు బాహ్య వస్తువుగా (object) చూస్తున్నావు. ఆత్మ నీలోని కర్త గనుక దానిని నువ్వు ప్రత్యక్షంగా బాహ్య వస్తువుగా చూడలేవు. అది సర్వాంతర్యామిగా ఉండే శక్తి. దీనిని తెలుసుకో.

మునులుగా మారడం ఎలా?

ధ్యాన నిష్ఠ లో ఉండే వాడు మునిగా మారతాడు.

బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసి, జ్ఞాన బలంతో ఉండి, ఆత్మ జ్ఞాన సంబంధిత విషయాల మీద మాత్రమే మననం చెయ్యాలి. కేవలం పాండిత్యం సరిపోదు. దాన్ని ప్రక్కన విడిచి పెట్టి అమాయక బాలునివలె, ధ్యాన నిష్ఠలో ఉండాలి. ఆ విధంగా క్రమంగా మునులుగా పరివర్తన చెందాలి.

సూత్ర బ్రహ్మ అంటే ఎవరు?

సూత్ర బ్రహ్మ అంటే వాయువని ఉపనిషత్తు వివరించింది.

ఈ జన్మను, తరువాతి జన్మను, సర్వ భూతాలను పూలమాల వలే కలిపేది వాయువే. మన శరీర భాగాలను కూర్చి సంఘటితంగా ఉంచేది వాయువే. అది నిష్క్రమించిన తరువాత అవి విడిపోతాయి. అందుచేత వాయువే సూత్ర బ్రహ్మ.

'అక్షర బ్రహ్మం' అంటే ఎవరు?

అక్షర బ్రహ్మం అంటే నాశరహితమైన ఆత్మ.

అక్షరం (నాశనం లేని ఆత్మ) చూడబడదు గాని చూస్తుంది. వినబడదు గాని వింటుంది. మననం చేయబడదు గాని మననం చేస్తుంది. తెలియబడదు గాని తెలుసుకుంటుంది. ఆత్మ కర్తగా, అంతర్నిహితంగా ఉండేదే గాని మనచేత చూడ శక్యమైన బాహ్యవస్తువు కాదు, అది సర్వాంతర్యామి. సర్వ శక్తి శాలి.

శరీర త్యాగం ఎలా జరుగుతుంది?

శరీర త్యాగ క్రమాన్ని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.

గరిక యందలి పురుగు తను ఉన్న గడ్డి పోచ చివర వరకు వచ్చి దాని నుండి మరియొక గడ్డిపోచ మీదకు ప్రాకి, దాని ఆధారం దొరికిన తరువాత వెనుకటి గడ్డిపోచను విడుస్తుంది. అదే రీతిలో జీవుడు ప్రాణోత్క్రమణ సమయంలో మరియొక దేహాన్ని ధరించి వెనుకటి శరీరాన్ని అచేతనం చేస్తాడు.

ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా చేసుకోవాలి?

శ్రవణ, మనన, నిధి ధ్యాసలు ద్వారా చేసుకోవాలి అని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.

ఓ మైత్రేయా! చూడదగినది ఆత్మ మాత్రమే. ఆత్మావలోకనం చేసుకోవాలంటే ముందుగా సద్గురువు నాశ్రయించి, ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా విని దాన్ని మననం చేసుకుంటూ క్రమంగా దాని మీదే ధ్యానం చెయ్యాలి. ఆ విధంగా శ్రవణ, మనన, నిదిధ్యాసాల ద్వారా ఆత్మావలోకనం చేసిన తరువాత ఇంక తెలుసుకోవలసినదేమీ ఉండదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML