సాధారణంగా ఇటు వైష్ణవ ఆలయాల్లోనూ ... అటు శివాలయాలలోను ప్రదక్షిణలు ఒకే విధంగా చేస్తుంటారు. అయితే వైష్ణవ ఆలయానికి చేసినట్టుగానే శివాలయానికి ప్రదక్షిణలు చేయడం సరికాదని శాస్త్రం చెబుతోంది. వైష్ణవ ఆలయాల్లో 'ధ్వజ స్తంభం'దగ్గర నుంచి మొదలుపెట్టి కుడివైపు నుంచి ఎడమ వైపుకు తిరుగుతూ, మళ్లీ ధ్వజ స్తంభం దగ్గరకి రావడాన్ని ఒక ప్రదక్షిణంగా భావిస్తుంటారు. ఇక శివాలయాల్లో ప్రదక్షిణను సోమసూత్రాన్ని అనుసరించి చేయవలసి వుంటుంది.
'సోమసూత్రం'అంటే శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ నీరు బయటికి వచ్చే ప్రదేశం. ఇక్కడ చండికేషుడు ఉంటాడు కాబట్టి ఆ సోమ సూత్రాన్ని దాటకుండగా ప్రదక్షిణ చేయాలనే నియమం వుంది. ఇక ప్రదక్షిణ క్రమంలోకి వస్తే ... ముందుగా 'సోమ సూత్రం'నుంచి ప్రదక్షిణను ప్రారంభించి సవ్య దిశలో ధ్వజ స్తంభం దగ్గరికి రావాలి. అక్కడి నుంచి సవ్యంగానే తిరుగుతూ సోమసూత్రం దగ్గరికి చేరుకోవాలి. ఆ తరువాత సోమసూత్రం నుంచి వెనుదిరిగి అపసవ్యంగా ధ్వజ స్తంభం దగ్గరికి చేరుకోవాలి.
ఇలా సోమసూత్రం నుంచి సవ్యంగాను ... అపసవ్యంగాను అనుకున్న ప్రదక్షిణలు చేయవలసి వుంటుంది. ఈ విధంగా చేసే ప్రదక్షిణలను 'చండీ ప్రదక్షిణ' అని అంటూ వుంటారు. ఈ చండీ ప్రదక్షిణ చేయడం వలన అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి
No comments:
Post a comment