ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 14 December 2014

యోగా మరియు యోగాసనములు .యోగా మరియు యోగాసనములు .

యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనను యోగ విద్య నభ్యసించ వచ్చును. కాన స్త్రీ, పురుషులెల్లరు వయోభేదము లేక, యోగ విద్య నభ్యసించి తమ ఆరోగ్యమును కాపాడు కొనుచూ శత వత్సరములు వర్దిల్ల గలరు. ముఖ్యముగా ఉద్యోగము, వ్యాపారము చేయు వారిలో ఎక్కువమంది శరీర శ్రమ లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు తమ విధులను నిర్వర్తించుచుందురు. అట్టి వారు తప్పక యోగ, వ్యాయామము నభ్యసించవలెను. వారు యోగ విద్య నభ్యసించని యెడల వారి శరీరమునకు శ్రమ లేక, భుజించిన ఆహారము సరిగా జీర్ణము కాక క్రమముగా అజీర్ణవ్యాది ప్రారంబించును.అజీర్ణ వ్యాధి కారణముగా మధుమేహ వ్యాధి (షుగరు వ్యాధి )కి గురియగుదురు. మధుమేహ వ్యాధి ఇతర వ్యాదులన్నింటికి మూల కారణ మని (diabities is the root cause of all diseases ) శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు కనుక ప్రతివారు మధు మెహ వ్యాధి నుండి కాపాడ బడవలయునంటే యోగ, వ్యాయామము తప్పక అభ్యసించవలెను. ప్రతి వారు


ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులగుటకు తప్పక యోగాభ్యాసము చేయవలెను.

పాటించవలసిన నిబంధనలు:

1 . మితాహారమును సేవిన్చావలయును.అనగా ఎంత ఇష్టమైన పదార్ధమైనను అతిగా భుజించరాదు .

2 . మద్యపానము చేయరాదు .

3 . ధూమపానము చేయరాదు (పొగ త్రాగరాదు )

4 . కాఫీ, టీ, మొదలగు వుత్తేజకాలను అతిగా వాడరాదు.

5 . ఘాటైన పదార్ధములను అనగా సుగంధ ద్రవ్యములు, కూరలలో వాడుకొను మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు మొదలగునవి తగ్గించి వాడు కొనవలయును. అనగా మషాలా దినుసులు తగ్గించి వాడు కొనవలయును.

6 . మాంసాహారము విసర్జించుట మంచిది.మానలేనివారు వారమున కొకసారి లేక పది రోజులకొకసారి వాడు కొనవలయును.

7 . అతి చల్లని, అతి వేడి పదార్దములు వాడరాదు.

8 .గాలి వెలుతురు దారాళముగా ప్రసరించు ఇంటిలో నివసించవలయును .

9 . ప్రతి రోజు ఉదయం 4 .30 గం || లకు లేచి తన దినచర్యలు ప్రారంబించ వలయు

10 .మంచి వాతావరణము ఉన్నచోట నివాసయోగ్యము.

11 . ప్రతి రోజు కనీసము 6 గం || లు నిద్రించవలెను.

12 . పగటి నిదుర పనికి రాదు, రేయి నిదుర కాయరాదు.

13 . ప్రతి దినము ఉదయము 4 .30 గం ||ల నుండి 8 గం || ల మధ్య యోగ వ్యాయాయము చేయవలెను.

14 . చంటి పిల్లలు ప్రతి రోజు 8 గంటల నుండి 10 గంటలు, 12 గంటలు నిదురించవలయును.

15 . యోగ విద్య నభ్యసించు పురుషులు కట్ డ్రాయరు గాని, లంగోటా కాని వాడ రాదు. ప్రత్యేకముగా గోచీ గుడ్డ కుట్టించుకొని వాడవలయును .

16 .స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.

17 . మనిషికి రెండు ప్రక్కలు అనగా ఎడమ ప్రక్క, కుడి ప్రక్క. అందువల్ల ప్రతి భంగిమను రెండు ప్రక్కలు తప్పక చేయవలయును.

18 . యోగ భంగిమల నభ్యసించు నపుడు, కాళ్ళ నొప్పులు గాని, బెణుకులు గాని జరుగవచ్చును.అలాంటప్పుడు అభ్యసించుట మానరాదు. నెమ్మదిగా సమయము తగ్గించి అభ్యసిస్తే తొందరలో నివారణ యగును

యోగాసనాలు

ఆసనాలు అంటే ఒక వ్యక్తి ఒక ప్రత్యేక ప్రయోజనములు సాధించే నిమిత్తము కూర్చుండే, పరుండే శరీర స్థితిలో శరీరారోగ్యాన్ని రక్షించు కొనుట, మానసికంగా శారీరకంగాను అభివృద్ధి, రోగములనుండి కాపాడు కొనుటకు, తగ్గించు కొనుటకు, మందులతో పాటు ఆసనాలను వేసిన తొందరగా ఫలితములు పొందుదురు. శరీర బరువును తగ్గించు కొనుటకు మరియు పెంచు కొనుటకు చాలా ఉపయోగ కరంగా ఉండును. ఈ ఆసనాలను ఉదయము 4 గం || నుండి 6 గం || వరకు వేసిన చాలా మంచి ఫలితములు పొందుదురు.

ముఖ్యమైన కొన్ని రోగములకు ఆసనములను తెల్పుచున్నాము:

సిద్దాసనము : ఈ ఆసనము వేయుట వలన శరీరములోని 72 వేల నాడులు శుద్ధి అవుతాయి. 12 సం || లు వేసిన ముక్తిని ఆనందమును పొందవచ్చును.

బద్ధ పద్మాసనము : దీనివలన గర్భాశయ రోగములు, గ్యాస్ ట్రబుల్ ,కడుపునొప్పి ,అజీర్ణము వంటివి, గూని రాకుండాను, స్వప్న స్కలనాలను అరికట్టును.

కుక్కుటాసనము : దీనివలన నాడీ ప్రసారము బాగా జరుగును. చేతులకు కాళ్ళ కండరాలకు బలము కలుగును.

గోముఖాసనము : దీనివలన ఆర్శ మొలలు తగ్గును.కాళ్ళకు భుజకీళ్ళు, వెన్నెముక ,తొడలలోని వాతము వాపులు నివారించును.

వజ్రాసనము : జీర్ణశక్తికి బొర్ర తగ్గుటకు గర్భ దోషములకు మంచిది. సర్వాంగాసనము: దీనివలన తల, కండ్లు, చెవి, ముక్కు, గొంతు రోగములను తగ్గించు కొనుటకు, థైరాయిడ్ గ్లాండ్ ను పోషించును. ఈ ఆసనము అభ్యాసము వలన అన్ని రోగములను నివారించు కొనవచ్చును.స్త్రీలకు కూడా అనువైనది.వివాహితులకు ఈ ఆసనము మంచిది

మత్స్యాసనము : దీనివలన దీర్ఘ శ్వాస నిశ్వాసలు క్రమబద్దము అయి ముక్కు కండరాల వాపు, ముక్కు దిబ్బడ, జలుబు, తగ్గును. ముఖ రోగములు తగ్గును.మల విసర్జన జరిగి ప్రేవులు శుబ్రపడి మలబద్దకము తొలగి హుషారుగా యుండును.

హలాసనము : దీనివలన గర్భ కోశము, తొడల వాత నొప్పులు, నడుము నొప్పులు, బొజ్జ, లివర్ వ్యాధులు తొలగి పోవును.మధు మేహానికి చాలా మంచిది. భుజంగాసనము : దీనివలన స్త్రీలకు చాలా ఉపయోగకరము. గర్భాశయ బాధలు, నొప్పి, వెన్ను, నడుము నొప్పులకు, ముట్టుశూలకు, ఋతు దోష నివారణలకు చాలా ముఖ్యము.

ధనురాసనము : దీనివలన కాళ్ళు, చేతులు, కీళ్ళలోను, నొప్పులు నివారణ అగును.జీర్ణాశయము, బాగుగా పని చేయును. ఆకలిని పెంచును.కడుపులో నున్న అనవసర కొవ్వును తగ్గించును.

పశ్చిమోత్తాసనము : దీనివలన ఆర్శ మొలలున్న వారికి, మధు మేహంతో బాధ పడేవారికి మంచిది. సుషుమ్నలో ఉత్తెజము కలుగును. బుర్ర పెరిగిన వారికి కూడా ఉపయోగము.

మయూరాసనము : ఈ ఆసనము వేయుట కొంత కష్టము కాని, ఫలితములు అమోఘము. లావుగా యున్నవారు సన్నగా అగుటకు మరియు గర్భ రోగములు, మధు మేహాన్ని (డయాబెటిస్ ) తగ్గించును.

సిద్దాసనము , గోముఖాసనము
మత్స్యాసనము , ధనురాసనము
బుద్ధపద్మాసనము , వజ్రాసనము
హాలాసనము, పశ్చిమోత్తాసనము
కుక్కుటాసనము, సర్వాంగాసనము
భుజంగాసనము , మయూరాసనము

సిద్ధాసనము

ఇది ముఖ్యముగా సిద్దులు వేసే ఆసనం కావున దీనికి 'సిద్ధాసనం ' అనే పేరు వచ్చింది. ధ్యానం చేసే వారికి బాగా ఉపయోగ పడే ఆసనం. ఆసనములన్నింటిలో మిక్కిలి శ్రేష్టమైనది గా పేరు పొందింది. ఇది పురుషులు మాత్రమే వేయతగిన ఆసనం.

విధానము : కాళ్ళు చాపుకొని కూర్చొని, ఎడమకాలిని మడచి కాలి మడమును జననాంగ- తొడలమధ్య అదమి పెట్టి ఉంచి, కుడి కాలిని మడిచి, పాదాన్ని ఎడమ కాలు పిక్క పై ఉంచాలి. వెన్నెముక వంగకుండా నిటారుగా చేసి,దృష్టిని భూమి మీదకు సారించి, చేతులను తొడల మీద ఆనించుకొని, ధ్యాన ముద్ర వేయాలి .

ఉపయోగమ: దీనివలన అనేక సాధారణ వ్యాధులు నివారించ బడతాయి. నడుము నొప్పులను అరి కడుతుంది. వయసు పై బడుతున్నా నడుము వంగ కుండా చేస్తుంది. కండరాలు శక్తి వంతమవుతాయి. మానసిక చాంచల్యం పోయి, ఏకాగ్రత పెరుగుతుంది. తలపెట్టిన కార్యములు ఫలిస్తాయి. ఈ ఆసనము వేయుట వలన శరీరములోని 72 వేల నాడులు శుద్ధి అవుతాయి 12 సం || లు వేసిన ముక్తిని ఆనందమును పొందవచ్చును.

మత్స్యాసనము

మత్స్యాకారాన్ని పోలిన ఈ ఆసనం బాగా సాధన చేయుట వలన నీటి మీద ఎక్కువ సమయం తేలవచ్చును. ధ్యానం చేసే వారికి ఈ మత్స్యాసనం బాగా ఉపయోగ పడుతుంది. దీనిలో మూడు రకాలున్నాయి.

విధానము: 1 . ముందుగా కూర్చుని పద్మాసనం వేయాలి. అలాగే పద్మాసనం విడి పోకుండా వెల్లకిలా వాలాలి. రెండు చేతులను తల క్రింద వేసుకొని పడుకోవాలి.

విధానము: 2 . ముందుగా పద్మాసనం వేసి, వెనక్కి వాలి పడుకొని చేతులను ముందుకు చాచి రెండు పాదాలను పట్టుకొని , శ్వాస తీసుకొని నిదానంగా వదలాలి.

విధానము: 3 . ముందుగా కూర్చుని పద్మాసనం వేయాలి. తరువాత వెనక్కి వాలి పద్మాసనం విడిపోకుండా పడుకోవాలి. ఆ తరువాత రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకొని - తలను ఆధారం చేసుకొని వీపు భాగాన్ని పైకి వంచాలి.

ఉపయోగములు: దీనివలన ఉదార సంబందమైన వ్యాధులు నివారించ బడతాయి . గొంతు కండరాలకు శక్తి కలుగుతుంది. టాన్సిల్స్ కరిగి పోతాయి. కంఠం శుబ్రపడుతుంది. స్వరం మృదువుగా మారుతుంది. సంగీత సాధకులకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది . ఆస్త్మా వ్యాధిని అరికడుతుంది. ఊపిరి తిత్తుల వ్యాధులను నివారింప చేస్తుంది. వెన్ను గట్టి పడి ధృడ పడుతుంది. ముఖంలో తేజస్సు కనబడుతుంది.

బద్ధపద్మాసనము

పద్మాసనంలోనే మరొకరకమైన ఆసనం ఇది. కొంత సాధనానంతరం ఈ ఆసనాన్ని సంపూర్ణంగా వేయగలుగుతారు. ప్రారంభంలో కనీసం రెండు నిమిషాలైనా ఉండేట్లు ప్రయత్నించాలి.

విధానము : ముందుగా పద్మాసనం వేసి, చేతులను వీపు వైపునకు మేలి పెట్టి, కుడి చేతిలో ఎడమ కాలి బొటన వ్రేలును, ఎడమ చేతిలో కుడి కాలి బొటన వ్రేలును పట్టు కోవాలి. శ్వాసను పూర్తిగా తీసుకొని, వీలైనంత సేపు బంధించి, నిదానంగా గాలిని వదలాలి.

ఉపయోగములు : దీనివలన కాళ్ళకు, వేళ్ళకు మంచి బలం కలుగుతుంది. పొట్ట పెరగకుండా ఉంటుంది. గూని వున్నవారు ఈ ఆసనం ద్వారా సరిచేసుకోవచ్చును. వెన్ను బలంగా వుంటుంది. వీపు నిటారవుతుంది.కడుపు ఉబ్బరం, పుల్లని త్రేనుపులు,అజీర్తిని అరికడుతుంది. నడుము నొప్పులు తగ్గి పోతాయి. పొట్ట తగ్గి చాతి విశాలమవుతుంది. స్త్రీలకు స్థన సౌందర్యం వృద్ది చెందుతుంది. గర్భాశయ రోగములు, గ్యాస్ ట్రబుల్ , కడుపునొప్పి, అజీర్ణము వంటివి, గూని రాకుండాను, స్వప్న స్కలనాలను అరికట్టును.

హలాసనము

హలము అంటే ' నాగలి' అని అర్ధం. ఈ ఆసనము నాగలిని పోలి వుంటుంది. అందువల్ల దీనిని ' హలాసనం' అంటారు.

విధానము: వెల్లకిలా పడుకోవాలి. పాదాలు దగ్గరగా చేర్చి బాగా పైకెత్తి చేతులను పిరుదుల మీద ఆధారంగా వేసి నడుమును కూడా బాగా ఎత్తుతూ, కాళ్ళు ముఖం మీదుగా తల వెనుకకు వచ్చి, పాదాలను నెల మీద ఆనించాలి. అరచేతులను కూడా నేలమీద ఆనించి ఉండి, ఊపిరిని పీలుస్తూ నిదానంగా వదలాలి. వీలైనంతసేపు ఉండి, యధాస్థితికి రావాలి.

ఉపయోగములు: దీనివలన వెన్నెముక బాగా శక్తి వంతమవుతుంది . మలబద్దకము , అజీర్ణ వ్యాధులు తగ్గి పోతాయి. ఉదార కండరాలు బలాన్ని పుంజు కుంటాయి. శరీరంలో కొవ్వు తగ్గి, గట్టి పడుతుంది. వెన్నులోని నరములు, కండరములపై వత్తిడి కలిగి రక్త ప్రసరణ బాగుంటుంది. ఎప్పుడు యవ్వన వంతులుగా కనబడతారు. ఈ ఆసనము వలన శరీరము లావయ్యే అవకాశం లేదు. మధు మేహానికి చాలా మంచిది.

కుక్కుటాసనము

'కుక్కుటం ' అంటే సంసృతంలో ' కోడి' అనే అర్ధం ఉంది. ఈ ఆసనం వేసిన తరువాత ఆకారం కోడి శరీరాన్ని పోలి వుంటుంది.

విధానము: పద్మాసనంలోనే కూర్చుని చేతులను తొడలు, పిక్కల సందుల్లోంచి క్రిందకు తేవాలి. తరువాత అరచేతులను నేలమీద ఆనించి, శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. కొద్ది క్షణాలు అలాగే ఉండి, ఊపిరి వదులుతూ శరీరాన్ని క్రిందకి దించాలి. ఈ విధంగా ఐదారుసార్లు చేస్తూ క్రమేపి పెంచ వచ్చును.

ఉపయోగములు; దీనివలన పద్మాసనం , ఉద్దిత పద్మాసనం లోని ఉపయోగాలే కాక కడుపులో పురుగులను నివారిస్తుంది. శారీరక నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా స్త్రీలలో బహిష్టు సమయములో వచ్చే అన్ని నొప్పులు నివారిస్తుంది .సహనాన్ని పెంచుతుంది. ఆత్మ విశ్వాసాన్ని వృద్ది చేస్తుంది.

భుజంగాసనము

భుజంగం అంటే ' పాము' అని అర్ధము. ఈ ఆసనము వేసినప్పుడు పాము పడగ ఎత్తినట్టు ఉంటుంది. అందువల్ల దీనికి ' భుజంగాసనం ' అని పేరు వచ్చింది.

విధానము: ముందు నేలమీద బోర్లా పడుకోవాలి. తరువాత అరచేతులను నేలమీద ఆనించి, శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంతో శరీరాన్ని పైకి లేపాలి. తలను ఎంత ఎక్కువగా వెనక్కు వాల్చ గలిగితే అంతలా వాల్చాలి. ఈ ఆసనంలో ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండొచ్చును .

ఉపయోగములు: దీనివలన అజీర్తి వ్యాధి హరించి, బాగా ఆకలి కలుగుతుంది. నడుము నొప్పి, ఇతర శరీర నొప్పులు తగ్గిపోతాయి. ఉదర సంబందమైన అనేక వ్యాధులు నివారించ బడతాయి. మూత్ర పిండములు చురుకుగా పని చేస్తాయి. స్త్రీలకు చాలా ఉపయోగకరము. గర్భాశయ భాదలు, నొప్పి, వెన్ను, నడుము నొప్పులకు, ముత్తు శూలకు, ఋతు దోష నివారణలకు చాల ముఖ్యము.

గోముఖాసనము

ఆసనం వేసిన తరువాత చూడటానికి ఆవు ముఖం వలె వుంటుంది కాబట్టి ' గోముఖాసనం' అనే పేరు వచ్చింది. విధానము : నేలమీద కూర్చున్న తర్వాత ఎడమకాలిని మడిచి మదమను-మోకాళ్ళు, పిరుదులకు తగిలేటట్లు చేయాలి. కుడి కాలును ఎడమ తొడపై వేసి ఉంచాలి. తరువాత ఎడమ చేతిని వీపు వెనక్కి పోనిచ్చి, కుడి చేతిని పైకెత్తి వెనక్కు మడిచి, ఎడమ చేతిని పట్టుకోవాలి. నడుము భాగాన్ని నిటారుగా ఉంచాలి . ఈ ఆసనాన్ని రోజూ సమయాన్ని పెంచుతూ వేయాలి.

ఉపయోగములు : శరీరం లావుగా నుండేవారు కొంత శ్రమతో ఈ ఆసనాన్ని రోజూ వేస్తుంటే శరీరం సన్నపడుతుంది. ప్రాణవాయువు బాగా అందుతుంది. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గిపోతాయి. చేతులు, భుజాలు బలపడతాయి. గుండె, ఊపిరి తిత్తులు శుబ్రమవుతాయి. ఆకలి బాగా కలుగుతుంది. ప్రాణాయామం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

ధనురాసనము

ఈ ఆసనం ధనస్సు ఆకారంగా ఉంటుంది. కాబట్టి ' ధనురాసనం' అని పేరు వచ్చింది. హలాసనానికి వ్యతిరేకంగా వుంటుంది.

విధానము: ముందు నెల మీద బోర్లా పడుకోవాలి. తరువాత శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళను పైకెత్తి మడవాలి. తరువాత చేతులను వెనక్కు చాచి, చీల మండలను పట్టుకునే ప్రయత్నంలో పొట్ట నుండి, తల వరకూ వెనకకు ఎత్తాలి. ఈ విధంగా కాళ్ళ చీల మండలను చేతులతో పట్టుకొని, గాలిని వదులుతూ ఉండగలిగి నంత సేపూ ఉండాలి.

ఉపయోగములు: ఈ ఆసనము వలన పొట్ట మీద బాగా వత్తిడి కలగటం వలన దీర్ఘంగా ఉన్న జీర్ణ కోశ వ్యాధులు, ప్రేవులలో నొప్పులు తగ్గి పోతాయి. స్థూల కాయులు త్వరగా సన్న పడతారు. మధు మేహ వ్యాధి అరికట్ట బడుతుంది. కాళ్ళకు, చేతులకు,మెడకు బలం చేకూరుతుంది. స్త్రీలలో బహిష్టు సంబందమైన వ్యాధులు నివారించ బడతాయి

వజ్రాసనము

ఈ ఆసనములో ఎంతసేపయినా ఉండవచ్చును. శరీర కదలికలు ఎక్కువలేని ఆసనం ఇది.

విధానము: మోకాలును నేలమీద ఆనించి, కూర్చుంటూ పాదాలను పిరుదుల క్రిందన ఉంచుకోవాలి. రెండు చేతులతో కాళ్ళ ముడుకులు పట్టుకొని నడుము వంగకుండా, నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకుంటూ, సాధ్యమైనంత వరకూ శ్వాసను బంధించి, నిదానంగా వదలాలి.

ఉపయోగములు: భోజనానంతరం కొంత సేపు ఈ ఆసనం వేయడం వలన ఆహారం బాగా అరుగుతుంది. చెడు వాయువులు ఏర్పడే అవకాశం లేదు. కుండలినీ శక్తి వృద్ది చెందుతుంది. శరీరంలోని గ్రంధులన్ని బాగా పనిచేస్తాయి. ప్రతి రోజూ ఈ ఆసనం వేయడం వలన అజీర్తి వ్యాధి కలిగే అవకాశం లేదు.సాధారణ వ్యాధులు దరిచేరవు.

మయూరాసనము

ఈ ఆసనం ' నెమలి' ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి దీనికి ' మయూరాసనం' అని పేరు వచ్చింది. ఇది కష్టమైన ఆసనం. రోజూ సాధన చేస్తూ ఆసన పూర్తి దశకు చేరుకోవాలి.

విధానము: ఆసన మొదటి దశలో చూపబడిన విధంగా మోకాళ్ళ మీద కూర్చుని, అరచేతులను తిన్నగా నేలమీద ఆనించి ముందుకు వంగాలి. తరువాత రెండవ దశలో చూపబడిన విధంగా మోచేతులను నడుం వద్ద ఆధారం చేసుకొని కాళ్ళను బారుగా చాపాలి. ఆ తరువాత మూడవ దశలో చూపబడిన విధంగా అరచేతుల మీద పూర్తి భారాన్నుంచి కాళ్ళను తలకు బేలన్స్ అయ్యేటట్లు గా పైకి లేపాలి. ఈ ఆసనంలో ఏకాగ్రత ఎంతో అవసరం. సాధ్యమైనంత సేపు ఉండి యధాస్థితికి రావాలి.

ఉపయోగములు: ఈ ఆసనము వలన శరీరం మొత్తము శ్రమకు గురి అవుతుంది. కఫ వ్యాధులు నివారిస్తాయి. స్థూలకాయులు త్వరగా సన్న బడతారు. మధు మేహవ్యాధి అరి కట్ట బడుతుంది. మొలలు తగ్గి పోతాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది. ప్రేవులలో మలిన పదార్ధాలు బయటకు విసర్జించ బడతాయి.రక్తం శుద్ధి కాబడుతుంది. ఛాతీకి, భుజములకు శక్తి ఏర్పడుతుంది. కాళ్ళకు, చేతులకు, మెడకు బలం చేకూరుతుంది. స్త్రీలలో బహిష్టు సంబందమైన వ్యాధులు నివారించ బడతాయి.శరీరం కాంతి వంతంగా, సౌందర్యంగా వుంటుంది.

పశ్చిమోత్తసనము

ఈ ఆసనం వేయడానికి చాలా సాధన కావాలి. ఈ ఆసనాన్ని సంపూర్ణంగా వేయడం చాలా కష్టం. అందుకే దీనిని ' ఉగ్రాసనం' అని కూడా అంటారు. రోజూ కొద్ది కొద్దిగా సాధన చేస్తూ సాధ్య మైనంత సంపూర్ణంగా వేయడానికి ప్రయత్నించాలి.

విధానము: నేల మీద కూర్చుని, కాళ్ళు వంగ కుండా నిటారుగా ఉండేట్లు ముందుకు చాపాలి. నడుమును సాధ్యమైనంత గా ముందుకు వంచి, గడ్డం మోకాళ్ళకు ఆనేలా చేస్తూ చేతులను ముందుకు పోనిచ్చి, రెండు చేతుల వ్రేళ్ళతో రెండు పాదాల బొటన వ్రేళ్ళు పట్టుకోవాలి. నడుమును వంచేటప్పుడు బాగా గాలిని పీల్చుకొని, ఆసనంలోకి వెళ్ళిన తరువాత గాలిని నిదానంగా వదలాలి. ఈ ఆసనంలో కనీసం ఐదు నిముషాలైనా ఉండగలగాలి.

ఉపయోగములు: నడుము చుట్టూ వుండే కొవ్వును బాగా కరిగిస్తుంది. స్త్రీలకు నడుము తొనలు జారే అవకాశముండదు. నడుము నాజూకుగా తయారవుతుంది. జటరాగ్నిని వృద్ది చేస్తుంది. జీర్ణ శక్తిని పెంపొందింప చేస్తుంది. వెన్నెముకకు బలం కలుగుతుంది. దీనివలన ఆర్శ మొలలున్న వారికి, మధుమేహంతో భాద పడేవారికి మంచిది. సుషుమ్నలో ఉత్తెజము కలుగును.పొట్ట పెరిగిన వారికి కూడా ఉపయోగము.

సర్వాంగాసనమ

విధానము: కాళ్ళు రెండూ భూమి మీద తిన్నగా చాచి గాలి పీలుస్తూ వెల్లకిలా పడుకోవాలి. నెమ్మదిగా గాలి వదులుతూ రెండు కాళ్ళు, మొండెము పైకెత్తాలి. పైకెత్తి నపుడు కాళ్ళు, పిరుదులు, చట్రము,మొండెమును కలిపి రెండు చేతులతో పైకి నెట్ట వలెను.కాళ్ళు, మొండెమును చేతులతో పూర్తిగా పైకెత్తి దాని బలమంతయు మెడ, చేతుల మీద నిలిపి, కాళ్ళు , మొండెమును 90 డిగ్రీలు నిలబెట్టాలి. అపుడు పాదములను చూస్తూ 9 మాత్రల సమయము వరకూ వుండి తరువాత నెమ్మదిగా నడుము, కాళ్ళు గాలి నెమ్మదిగా వదులుతూ క్రిందకు దించి యధాస్థా నమునకు రావాలి. ఆ విధముగా రెండు సార్లు చేయాలి .

ఉపయోగములు: దీనివలన తల, కండ్లు, చెవి, ముక్కు, గొంతు రోగములను తగ్గించుటకు, థైరాయిడ్ గ్లాండ్ ను పోషించును. ఈ ఆసనము అభ్యాసము వలన అన్ని రోగములను నివారించు కొనవచ్చును. స్త్రీలకు కూడా అనువైనది. వివాహితులకు ఈ ఆసనము ఈ ఆసనము మంచిది.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML