గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 19 December 2014

పవిత్ర ధనుర్మాస ప్రారంభం సందర్భంగా..పవిత్ర ధనుర్మాస ప్రారంభం సందర్భంగా..

యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతు సతతం విష్వక్సేనం తమాశ్రయే

శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గోదాదేవ్యై నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యేవిశ్వమ్భరాం గోదాం వందే శ్రీరంగ నాయకీం

కర్కాటక రాశిలో పూర్వాఫల్గుణీ నక్షత్రములో శ్రావణ శుద్ధ తదియనాడు తులసీ వనంలో జనించినది, పాండ్యరాజ్య
పట్టమహిషి, శ్రీరంగనాయకి ఐన జగజ్జనని గోదాదేవికి వందనములు. పాండ్య రాజ్యములో వేంచేసియున్న శ్రీరంగనాథుని
ఇల్లాలు కనుక పాండ్యరాజ్య పట్టమహిషి, శ్రీరంగనాయకి ఐంది ఆమె.

ఉ. వింగడమైన యొక్క వనవీథిఁ గనుంగొనె నీడ సున్నపున్
రంగుటరంగు పచ్చల యరంగయిపో వెలిదమ్మి బావికిం
చెంగట నుల్లసిల్లు తులసీవన సీమ శుభాంగి నొక్క బా
లం గురువింద కందళదళ ప్రతిమాంఘ్రి కరోదరాధరన్

చక్కగా వేటికవే పూలచెట్లు, పండ్ల చెట్లూ, నీడను ఇచ్చే పెద్ద పెద్ద వృక్షాలూ ప్రత్యేకముగా విభజింప బడి, శ్రద్ధగా
పెంచబడుతున్న వనములో ఒక నీడన ఉన్న వెల్లవేసిన తెల్లని అరుగుకూడా చెట్ల పచ్చదనము ప్రతిఫలించి పచ్చలు
తాపినదా అన్నట్టు పచ్చగా మారిపోయిన అరుగు వద్ద, తామరపూలు వికసించి వున్న దిగుడుబావికి దగ్గిరగా ఉన్న
తులసీ వనములో కురువిందముల అంటే కెంపులను బోలిన లేత లేత ఎర్రని రంగులోనున్న అరికాళ్ళు, అరచేతులు,
ఉదరము, అధరము కలిగిన శుభాంగి ఐన ఒక్క బాలికను విష్ణుచిత్తుల వారు కనుగొన్నారు అని శ్రీకృష్ణ దేవరాయలు
తన 'ఆముక్తమాల్యద'లో అన్నారు. అలా విష్ణుచిత్తులవారికి కర్కాటక రాశిలో పూర్వాఫల్గుణీ నక్షత్రములో శ్రావణ శుద్ధ
తదియనాడు, తులసీ వనంలో లభించింది గోదాదేవి అమ్మవారు. కనుక ఈరోజు ఆండాళ్ తిరునక్షత్రం అంటారు
వైష్ణవ సంప్రదాయములో, అంటే ఆవిడ జన్మతిథి!

ప్రపత్తి మార్గ సులభాం ప్రపంచేశ్వర నాయకీం
వైకుంఠ రాజ మహిషీం గోదాం వందే శ్రీరంగ నాయకీం

ప్రపత్తి మార్గములో అంటే మధుర భక్తి మార్గములో, ప్రేమ మార్గములో, పెరుమాళ్ళకు తనను తాను అర్పించుకునే
సులభమైన మార్గాన్ని ప్రబోధించిన తల్లి, ప్రపత్తి మార్గములో సులభముగా ప్రపంచేశ్వరుడిని తన ప్రాణేశ్వరుడిని చేసుకుని,
వైకుంఠ సామ్రాజ్య పట్టా మహిషి ఐన, శ్రీరంగ నాయకి ఐన గోదామాతకు వందనములు.

తిరుప్పావై ఆధ్యాత్మిక సారస్వతంలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది. '' పారార్ధ్యం స్వం శృతి శత సిరస్సిద్ద
మధ్యాపయన్తీం..'' అన్నారు పరాశరభట్టారుల వారు గోదాదేవిని ప్రస్తుతి చేస్తూ. శృతి శిరస్సులు అంటే వేద శిరస్సులు
అంటే ఉపనిషత్తులు! ఆమె తండ్రి పండితుడు కారు. అమాయక సామాన్య అర్చకులు. ఆ అర్చన ఉదరపోషణం కోసం
చేసినవాళ్ళూ, చేస్తున్న వాళ్ళూ వున్నారు నాడూ నేడూ కూడా..ఆయన మాత్రం హృదయ ఘోషను తీర్చుకోవడం కోసం
హృదయ పూర్వకంగా ప్రతినిత్యమూ స్వామిని అర్చించే వారు. ఆయన పేరు విష్ణు చిత్తులు.పాండ్యదేశమని పిలువబడిన
ప్రాంతం లో విల్లిపుత్తూరు అనే గ్రామం వుండేది. దానికే ధన్వినవ్యపురం అనే పేరు కూడా వున్నది. ఆ గ్రామంలోని
శ్రీ వడపెరుంగోయిలాన్(వటపత్ర శాయి) ఆలయంలో ముకుందాచార్యులు అనే అర్చకులు వుండేవారు. ఆయన భార్య పద్మ.
యజుశ్శాఖ కు చెందిన, బోధాయన సూత్రానికి చెందిన ఆ బ్రాహ్మణ దంపతులకు కలిగిన కుమారునికి విష్ణుచిత్తుడు అని
పేరు పెట్టుకున్నారు. తండ్రి వద్ద నుండి వారసత్త్వంగా వచ్చిన అర్చక వృత్తిని విష్ణుచిత్తుల వారు అవలంబించారు. విశేష
పాండిత్యంలేనివారైనా పరమభక్తుడైన ఆయనకు సంతానం లేదు. భగవద్దత్తం గా తన తులసి తోటలో ఒక ఆడ శిశువు
దొరికింది..ఆ శిశువును తను పెంచుకున్నాడు. రెండువేల సంవత్సరాల క్రితం బయటికి పంపి అమ్మాయిలను ఎక్కడ
చదివించారు? ఇంట్లోనే..తండ్రి విశేష పాండిత్యం కలిగిన వాడు కారు..పరమ నైష్ఠి కూడిన భక్తుడు. కనుక ఉపనిషత్తుల
సారభూతమైన సత్యాలను ఆమెకు ఎవరూ ఉపదేశించిన వారు లేరు. ఆమె తను ఆ ఉపనిషత్తుల సత్యాలను 'అనుభవించింది'
అదే చూడడం, దానినే వేద మంత్రద్రష్టలైన మహర్షులు వేద మంత్రములను చూశారు అని చెప్పిన కారణం, వేదములు
ఎవరిచేత వ్రాయబడినవి కావు..అని చెప్పిన కారణం. కారణ జన్మురాలు కనుక, పరమేశ్వరీ తత్త్వం కనుక తన దివ్య జ్ఞానాన్ని
ప్రపంచానికి అభిముఖంగా ప్రసరింపజేయడం కొరకు ఆతల్లి తిరుప్పావై రూపంలో శ్రీ మహా విష్ణుభక్తి ప్రాశస్త్యాన్ని అద్భుతమైన
ఉపమానాలతో, సాధనారహస్యాలతో, వేదాంత రహస్యాలతో, సరళమైన పాశురాల అంటే గేయాలరూపంలో మనకు
అందించింది! ఆ సారాన్ని పంచుకోవడం కోసం చేశే ప్రయత్నమే ఈ వ్యాసము.

(1)
మార్గళి త్తింగళ్ మది నిరైంద నల్నాళాళ్
నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైయ్యీర్
శీర్మల్గు మాయిప్పాడి శెల్వచ్చిరు మీర్గాళ్
కూర్వేల్ కుడున్దొడిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కన్ణి యశోదై ఇళం సింగం
కార్మేన్చెంగణ్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైదరువాన్
పారోర్ పుగళప్పడిందే లోరెంబావాయ్

(మార్గశీర్ష మాసం వచ్చింది. మంచి పండు వెన్నెల రోజులు.స్నానం చేద్దాము రండి
సఖియలారా, సంపదలకు, సిరికి ఆలవాలమైన పల్లెలో గడుసరులైన సొగసరులారా,
వాడియగు వేలాయుధాన్ని ధరించి, తన కుమారుడైన శ్రీకృష్ణుని నిందించే వారిని దండించే
వాడైన నందగోపుని కుమారుడు, యశోదాదేవి ముంగిటి సింహపు కూన ఐనవాడు, సూర్యునివంటి, చంద్రునివంటి
ముఖశోభలు గలవాడు, నారాయణుడు మనకు 'పర' ను ఇచ్చెదనని వాగ్దానము చేసినాడు, మన స్నాన వ్రతములు
ఈ మహికి మంగళములను ఇస్తాయి, వ్రతం చేద్దాం, వేకువ స్నానం చేద్దాం, నారాయణుడిని సేవిద్దాం, పరను,
పరమపురుషుడి పదమును, పరమపదమును పొందుదాము, రండి! అని గోదాదేవి పిలుస్తున్నది)

మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా భగవానుడు చెప్పిన ఉత్తమమైన మాసం వచ్చింది, దేవాదిదేవుడైన
నారాయణుడి మాసం వచ్చింది, పండు వెన్నెల రోజులు వచ్చాయి, నిర్మలమైన సరస్సులశోభలు హెచ్చాయి.
మార్గములందు ఉత్తమమైనది మార్గశీర్శమాస ము. ఏమిటా మార్గము? భగవంతుని మార్గము. దేవాదిదేవుడైన
శ్రీకృష్ణుని భగవంతునిగా తెలుసుకుని, భజించే మార్గము. మార్గశిర మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించే
సమయమే ధనుర్మాస ప్రారంభము. ఇక్కడ ప్రతీకాత్మకమైన ధనుస్సు ఉన్నది. ఏమిటా ధనువు? ' ప్రణవో ధనుః
శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్చతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్ ' అన్నది ఒక ఉపనిషత్తు. ప్రణవము
అనే ధనుస్సును ఎక్కుబెట్టి, ఆత్మను బాణం చేసి బ్రహ్మ లక్ష్యంగా ప్రయోగించాలి, బ్రహ్మజ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకుని
సాధన చేయాలి, అప్పుడు లక్ష్యము వైపే ప్రయాణించే బాణం వలె లక్ష్య శుద్ది, తద్వారా లక్ష్యసిద్ది కలుగుతుంది, అందుకు
అనువైన మాసం ఈ మాసం, ఖగోళ పరంగా, ఆధ్యాత్మిక పరంగా.

సాత్విక గుణ సంపదలు కలిగిన జాణలైన వ్రేపల్లె పడతులారా, తనకుమారుడు,మన మరుడు, వరుడు ఐన వాడిని,
వరింపదగినవాడిని నిందించేవారిని శిక్షించడానికి సిద్ధంగా ఉన్న నందుని కుమారుడు, తామరలవంటి విశాలములైన
నేత్రములున్న సుందరి యశోదాదేవి ముద్దుల కుమారుడు, దుష్టులకు తీవ్రమైన భానునివంటి ప్రచండకాంతులను
ప్రసరించేవాడు, శిష్టులకు, తన భక్తులకు చల్లని చంద్రుని శోభలవంటి కరుణాకాంతులను ప్రసాదించేవాడు, నందయశోదల
ముంగిటి సింహపు కూన ఐన నారాయణుడు మనకు పరనిచ్చువాడు! మనకే ఇచ్చువాడు, ఎందుకంటే మనమే
ఆయనను తెలుసుకుంటాము గనుక, మనము ఆయనను తప్ప వేరెవరినీ శరణు వేడము కనుక, ఆయనే ఇచ్చువాడు,
ఎందుకంటే పరాత్పరుడు కనుక, ఎవరికైనా, ఏదైనా, ఎంతైనా ఇవ్వగలవాడు కనుక.

నారాయణుడు అంటే నీటియందు శయనించినవాడు. నారాయణుడు అంటే వేదములందు శయనించువాడు, అంటే
వేదములందు నెలకొన్నవాడు, అంటే జ్ఞానమునందు నెలకొన్నవాడు. ఏమిటా జ్ఞానము? (అభేద దర్శనం జ్ఞానం అన్నది
ఒక ఉపనిషత్తు) దేని ద్వారా సత్యమును చూస్తామో, సత్యమును వింటామో, సత్యమును గ్రహిస్తామో, సత్యమును
వ్యాపింపజేస్తామో, మంచి చెడులను గ్రహిస్తామో అదే జ్ఞానము, అంటే శబ్ద రూప రస స్పర్శ గంధములనే పంచ తన్మాత్రల
ఎరుక కోసం వాటి వలన ఉద్భవించిన పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియదగిన వాడిని
తెలియగల్గడమే జ్ఞానం అన్నది ఒక ఉపనిషత్తు. ఆ జ్ఞానం ఏం చెప్తుంది? చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దేవతల
మొదలు మానవులు, అశ్వములు, గోవులు మొదలైన అన్నింటా వెలుగొందే చైతన్యం ఒకటే అని చెప్పింది అదే ఉపనిషత్తు!
అన్నిటా, అంతటా ఒకటే సర్వవ్యాపక తత్త్వం కళకళలాడుతున్నది. అదే విష్ణు తత్త్వంగా చెప్పబడుతుంది. కనుక ఆ
నారాయణుని ఎరుకయే, సర్వత్రా ఆయన దర్శనమే ఉత్తమోత్తమమైన జ్ఞానం. అలాంటి ఎరుకకు ఫలము 'పర' పదము.
దాన్ని పొందడానికి, ఆయనకే చెందడానికి స్నానం చేద్దాము. వ్రతం చేద్దాము రండి!

ఏమిటా స్నానం? స్నానం మనోమల త్యాగం అన్నది ఉపనిషత్తు. మనసును పరిశుద్ధం చేసుకొనడమే ఆంతరంగిక స్నానం.
అది అంతరంగ శుచికి. దానికి బహిరంగ స్నానం అవసరం, అందుకు భౌతిక స్నానం ఒక సాధనం. ఏ బహిరంగ, భౌతిక శుచి
లేకున్నా శుచిర్భూతులము కావడం సామాన్యులమైన మనకు సాధ్యం కాదు, అది ఒక శుకమహర్షికి, ఒక నారదుడికి, ఒక
ప్రహ్లాదుడికి సాధ్యం. కనుక మనకు బాహ్య శుచి కూడా అవసరమే. అందుకే వ్రతాలు, నియమాలు, నదీ స్నానాలు, పుణ్యక్షేత్ర
సందర్శనలు, ఉపవాసాలు, నిష్ఠలు మనకు అవసరం! కనుక పరమాత్ముని పావన గాథల స్నాతులము అవుదాము
ఆంతరంగికంగా, పరిశుభ్రమైన జలాలలో వేకువస్నానం చేసి భౌతికంగా పవిత్రులము అవుదాము రండి! ఇలా మానసిక శుద్ధి,
పరమాత్ముని కీర్తనలద్వారా వాచికశుద్ధి ,నోములు, వ్రతములద్వారా కర్మశుద్ధి చేసుకుని, మనసా, వాచా, కర్మణా పరిశుద్ధులమై
పరమాత్ముని సేవ చేసుకుందాము రండి..అని గోదామాత పిలుస్తున్నది.

స్నానం సరే! వ్రతం ఏమిటి? కాత్యాయనీ వ్రతం. కాత్యాయనీ వ్రతము చేసే అలనాడు గోపికలు శ్రీకృష్ణుడిని పొందారు.
'చంద్రహాసోజ్జ్వలకరా. శార్దూలవరవాహనా, కాత్యాయనీ శుభం దద్యాత్ దేవీ దానవ ఘాతినీ' అని దేవీ నవరాత్రులలో ఆరవరోజున
కాత్యాయనీ రూపంలో అమ్మవారిని సేవించడం వలన నవగ్రహములలో ఆరవ గ్రహమునకు అధిష్ఠాత్రు దైవతమైన కాత్యాయనీ
అనుగ్రహం కలుగుతుంది. శుక్రగ్రహ శుభ వీక్షణల ద్వారా మంచి వరుడు/వధువు దొరకడం, వివాహం జరగడం, అనుకూల
దాంపత్యం పొందడం జరుగుతుంది, ఆ శుభవీక్షణలు లేకుంటే వివాహం ఆలస్యంకావడం, జరగకపోవడం, దాంపత్య జీవితంలో
అపశ్రుతులు చోటుచేసుకొనడం జరుగుతాయి, కనుక ఆ గ్రహాన్ని శాసించే, పాలించే అమ్మను సేవించడం, జ్యోతిష్య శాస్త్ర పరంగా.
కాత్యాయని అంటే మాయయే, అంటే శక్తియే. ఆమెయే యోగమాయ. కృష్ణ సోదరి, అంటే ఈ రకంగా ఆడబడుచు అన్నమాట,
అర్థ మొగుడన్నమాట కృష్ణసతులకు! కనుక ఆమెను మంచిచేసుకొనడం అవసరమే లౌకికంగా. వైష్ణవమార్గంలో ఈ మాయయే
భగవంతునికీ సేవకులకు మధ్య తెర. ఆ తెర తొలిగితే, అవిద్య తొలిగితే, విద్య కలిగితే పరమాత్మునితో సంపర్కం సాధ్యమవుతుంది,
కనుక ఆమెను సేవించడం, ఆధ్యాత్మికంగా! ఆవిడనే పురుషకారిణి అన్నారు వైష్ణవ మార్గంలో. అమ్మ మనకు అనుకూలంగా
ఉంటే, ఆమె ద్వారా ఆమెకు అనుకూలుడైన అయ్యను అనుకూలుడిగా చేసుకొనవచ్చును. కనుక కాత్యాయనీ వ్రతం, సర్వవేదాంత
సమన్వయ సారం గోదామాత ప్రబోధనల సారం. ఆ వ్రత సందర్భముగా ముప్పై రోజులలో రోజుకొక్క పాట చొప్పున ముప్పై పాటల
మాలను గోదమ్మ వేసింది శ్రీరంగని మెడలో. అంతకుముందే తను ధరించి ఎంగిలిచేసిన పూల మాలను కూడా వేసింది ఆయన
మెడలో. అందుకే రెండు మాలలు వేసింది, పామాల, పూమాల అన్నారు, 'పాడిక్కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై శూడిక్కొడుత్తాలై
చ్చొళ్ శూడిక్కొడుత్త శుడర్కొళియే' అన్నారు పరాశర భట్టారు. ఆ పాటల మాలలో వేసిన ముప్పై పాశురాల ముప్పై పారిజాత
ప్రసూనముల సౌరభములను ప్రాప్తం కొద్దీ ప్రతిరోజూ తెలుసుకుందాము! అమ్మ అనుగ్రహించుగాక!

శ్రీకరమగు ధన్వినవ్య
మాకరమగు కోదై విరిమాలికలిచ్చున్
శ్రీ కరశుభములు, శ్రీ సతి
సోకుల పాటలమాలలు సౌఖ్యములిచ్చున్

మార్గశిరమ్మిది మనకప
వర్గప్రదుడైన హరియె వంద్యుడు వనితల్
దుర్గను సేవించిన నగు
మార్గము సులభంబు నగును మాధవు పొందున్!

నిండుగ వెన్నెలల్ ఝరులు నిండిన నిర్మలమౌ తటాకముల్
దండిగ నిండ సంపదలు తానము లాడుడి జాణలందరున్
దండము బూని పుత్రపదదాసుల నిందలుజేయు నీచులన్
దండన చేయు నందుఁ మరుదంతి యశోదల పట్టిఁ పొందగున్!

వనరుహనయన యశోదా
ఘన నందుల ముంగిటి సింగపు సిరికూనన్
తన నగవుల రవియు చంద్రు
లన వెలిగెడి ఘనుని గెలువ లలనల్ రండో

మనమిదెజలకములనాడి
ఘనశ్యాముడు పతియు గాగ కాత్యాయనికై
మననోముల 'పర'పతి గద
మననోముల మహిసర్వసు మంగళమగుతన్.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML