సర్వోపనిషదో గావః దోగ్దాగోపాల నందనః!
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్!!
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడి గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసుకొని గీత అను అమృతమును పితికేను.
శ్రీమద్భగవద్గీత సాక్షాత్తుగా భగవానుని దివ్య వాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఆ మహిమను సంపూర్ణముగ ఎవ్వరును వర్ణింపజాలరు. ఆదిశేషుడు గాని, పరమశివుడుగాని, కడకు మహాగణాధిపతి గాని దీని మహిమను సమగ్రముగా వర్ణింపలేరు. పురాణేతిహాసాదులలో పెక్కు చోట్ల దీని మహిమ కీర్తింపబడినది. ’సర్వశాస్త్రమయీ గీతా’ – గీత సకల శాస్త్ర శోభితము అని మహాభారతమున పేర్కొనబడినది. కానీ ఇట్లు చెప్పుటయు సరిపోదు. ఏలనన శాస్త్రములన్నియును వేదములనుండి ఏర్పడినవి. వేదములు బ్రహ్మ ముఖమునుండి వెలువడినవి. బ్రహ్మ భగవంతుని నాభికమలమునుంచి ప్రభవించెను. ఈ రీతిని గమనిన్చినచో భగవంతునకును, శాస్త్రములకును, మధ్య చాలా అంతరము ఉందును. కానీ భగవద్గీత సాక్షాత్తుగా భగవంతుని ముఖారవిందము నుండియే అవతరించినది. అటువంటి గీత ప్రభవించిన రోజు రేపు అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు కృష్ణుణ్ణి పూజించి, గీతాపారాయణ చేస్తే మంచిదని ప్రతీతి.
No comments:
Post a comment