గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

భగవద్గీత ముందు విషాదయోగంలో ఉన్న అర్జునుడికి బోధ చేస్తోంది

భగవద్గీత ముందు విషాదయోగంలో ఉన్న అర్జునుడికి బోధ చేస్తోంది. ప్రతివాడూ కూడా దుఃఖం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తాడు. అలాగే అర్జునుడు కూడా ఒకవిధమైన దుఃఖ స్థితిలో ఉన్నాడు. ఈ దుఃఖం మోహం వల్ల ఏర్పడింది. అది "ధర్మ సమ్మూఢ చేతః" అని చెప్పినట్లుగా ఏది ధర్మమో, ఏది అధర్మమో నిర్ణయించలేని ఒక సమ్మూఢ స్థితి ఏర్పడినప్పుడు కృష్ణ పరమాత్మ భుజం తట్టి ధర్మమేమిటో చక్కగా స్పష్టపరచి అతనిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. ఎందుకంటే అక్కడ అర్జునుడు అడవిలో ప్రశాంతంగా అన్ని పనులు విడిచిపెట్టి వేదాంతాన్ని నేర్చుకోలేదు. అరణ్యంలో కాకుండా రణంలో నేర్చుకున్నాడాయన. యుద్ధభూమి మధ్యలో కర్తవ్యానికి సిద్ధపడిన అర్జునుడు కర్తవ్యమ్ నుంచి జారిపోతూ చేతిలో గాండీవంతో పాటు ధైర్యాన్ని కూడా జార్చిసిన సందర్భంలో కృష్ణ పరమాత్మ వెన్ను తట్టి పాంచజన్య శంఖారావం లాగా భగవద్గీతను బోధించాడు. అది మర్చిపోకూడదు. భగవద్గీత విన్న వెంటనే అర్జునుడు చేసిన పని ఏమిటి? గాండీవం పట్టుకొని యుద్ధానికి బయలు దేరడం. అదేవిధంగా ఎవరైతే కర్మ రంగంలో ఉంటారో వారికో స్పష్టమైన ఎరుకపరచి చేస్తున్న కర్మకు ఒక సార్ధక్యాన్ని, జ్ఞానాన్ని కల్పించడమే భగవద్గీతయొక్క ఉద్దేశ్యం. అంతేకానీ కర్మలన్నీ మానేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత భగవద్గీత అనే భ్రాంతి కూడదు. పైగా కర్మకీ, భక్తికీ, జ్ఞానానికీ సమన్వయం చాలా అద్భుతంగా సాధించింది భగవద్గీత. 18వ అధ్యాయంలో చెప్పినటువంటి ఒక ప్రధాన శ్లోకాన్ని మనం భావించినట్లయితే అందులో ఉన్న విషయం మనకి స్పష్టమవుతూ ఉంటుంది. "స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః!" ఈవాక్యం భగవద్గీతకు సారభూతమైన వాక్యం అని భావించవచ్చు. ఇది సారాంశము అని చెప్పుకుంటూ బోలెడు శ్లోకాలు కనపడతాయి మనకి భగవద్గీతలో. "యతః ప్రవృత్తి ర్భూతానాం యేన సర్వమిదం తతం! స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః!!" భగవద్గీతలో ఆణిముత్యాల్లాంటి శ్లోకాలలో ఇది ఒకటి. ఎవరి వలన ఈ జగత్తంతా పుడుతూ ఉన్నదో, పెరుగుతూన్నదో చివరికి లయమవుతున్నదో అతడు పరమాత్మ. ఆ పరమాత్మని వారి వారికి విధింపబడిన కర్మలతో అర్చించి సిద్ధిని పొందవచ్చు అని చెప్తున్నాడిక్కడ. వారి వారికి విధింపబడిన కర్మలు అన్నప్పుడు కర్మయోగం చెప్పబడింది. వాటితో పరమాత్మను అర్చిస్తూ అన్నప్పుడు భక్తియోగం చెప్పబడింది. సిద్ధిం విందతి మానవః అన్నప్పుడు జ్ఞానయోగం చెప్పబడింది. అందుకు ప్రధానంగా ఈ మూడూ అక్కడ సమన్వయించారు. కనుక ప్రతివారూ శాస్త్రం చెప్పిన ప్రకారంగా సత్కర్మలను ఆచరిస్తూ వాటిని భగవదర్పణ బుద్ధితో భగవత్ ప్రీతి భావంతో ఆచరించేటప్పుడు వారికి చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల కైవల్యం సిద్ధిస్తుంది అనే విషయాన్ని స్పష్టపరచింది భగవద్గీత. పైగా ఎక్కడికక్కడ ప్రతిచోటా ఒక్కొక్క ధర్మంతో ఉన్న సమన్వయాన్ని చూపిస్తూ ఒక మానసిక తత్త్వ శాస్త్ర వేత్తగా కృష్ణుడు వ్యవహరిస్తాడు. అసలు మనస్సులో ఎలాంటి మాలిన్యమూ, అజ్ఞానమూ లేకుండా ఉండడమే అన్ని అశాంతులకీ నివారణం. అటువంటి నివారణోపాయం మనకి భగవద్గీత ఇస్తూన్నది. "ధ్యాయతో విషయాన పుంసః సంగస్తేషూపజాయతే! సంగాత్ సంజాయతే కామో కామాట్ క్రోధోభిజాయతే!! క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః! స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి!! ఇలాంటి మాటలు మానసిక తత్త్వ శాస్త్ర పరంగా చాలా చక్కగా కనిపిస్తాయి. మొత్తానికి భగవదర్పణ బుద్ధితో ఏకాగ్రమైన చిత్తంతో స్వధర్మాన్ని ఆచరించిన వాడు తప్పకుండా సిద్ధిని పొందుతాడు అని అభయ వాక్యాన్నిస్తున్నటువంటి ఆ భగవద్గీతకు నమస్కారము.
భగవద్గీతను బోధించిన గీతాచార్యునకు నమస్కారము.
సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు!!No comments:

Powered By Blogger | Template Created By Lord HTML