గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 30 December 2014

నిష్కామ కర్మనిష్కామ కర్మ

ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు.

"పూర్వం జాబాలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచ్చుకలు గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబాలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబాలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచ్చుకలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబాలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జాబాలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబాలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చుకలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబాలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML