గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 12 December 2014

విఘ్నాయక: ఈ విఘ్ననాయక నామాన్ని మీరు కనుక భావన చేస్తే క్రమంగా మళ్ళీ పరతత్త్వంలోకి వెళ్తాం.

విఘ్నాయక: ఈ విఘ్ననాయక నామాన్ని మీరు కనుక భావన చేస్తే క్రమంగా మళ్ళీ పరతత్త్వంలోకి వెళ్తాం. అందుకే నామాలు మనకి మిష. నామాలని అర్థం చేసుకొని అలా వెళుతూ ఉంటే అలా పరతత్త్వంలోకి లాగేస్తాయి. అందుకే నామస్మరణ అంత గొప్పది అయింది. విఘ్ననాయక, విఘ్నేశ్వర దీనిని భావించడం. విఘ్నము అంటే ఏమిటి? - అంతరాయం. దీనికే అడ్డంకి అని తెలుగులో కూడా చెప్తాం. అలాగే లలితా సహస్రంలో ’నిరంతరా’ అనే నామం విని వుంటారు. నిరంతరా - నిః అంతరా- నిరంతరా’; అంతరము అంటే అడ్డంకి అని ఒక అర్థం. నిరంతరా - ఏ ఆటంకమూ లేనిది అని అర్థం. అలాగే గణపతి కూడా నిరంతరుడు. అంతరాయ తిమిరోప శాంతయే అని చెప్పుకుంటున్నాం కదా! అంతరాయములను పోగొట్టువాడు. ఈ అంతరాయం అనే మాటకి లౌకికార్థం నుంచి వేదాంతార్థం వరకు అనేకార్థములున్నాయి. ఏ దేవతైనా మనం చిన్నపిల్లల స్థాయిలో అడిగినప్పుడు లౌకికార్థాలే ఇస్తాడు. జ్ఞాన స్థాయిలో అడిగినప్పుడు పరమార్థం ఇస్తాడు. మనం ఎదగాలి నెమ్మదిగా. మనం సాధన చేసి భగవంతుణ్ణి పిలిస్తే నాకు ధనమీయవయ్యా, లేదా నాకు వచ్చే కష్టాలు తొలగించవయ్యా అని అడుగుతాం. రమణమహర్షి వంటి వారు భగవంతుడు కనపడితే జ్ఞానాన్ని అర్థిస్తారు. అంతేకదా! వారి వారి స్థాయిని బట్టి వాళ్ళ కోరికలుంటాయి. ఏదైనా ఇవ్వగలిగే వాడు గనుక ఆయన నామానికి రెండు అర్థాలు చెప్పుకోవాలి. జ్ఞానార్థమూ చెప్పుకోవాలి. భౌతికార్థమూ చెప్పుకోవాలి. భౌతికార్థములో విఘ్నములు తొలగించు వాడు. ఏ పని చేసినా విఘ్నం తప్పదు. దానిని తొలగించమని అడగాలి. అడ్డంకిని తొలగించమని అడగాలి. అడ్డంకి ఏదో మొదట తొలగిస్తే పోయిందా? మొదట ఒక అడ్డంకి కానీ ఫలం దొరికే వరకూ చాలా అడ్డంకులుంటాయి. అంతేకదా! మనిషి ఒక పని చేయాలంటే సంకల్ప స్థాయినుంచి ఫలస్థాయి వరకు అనేక అంచెలు దాటాలి. సంకల్పము, దానికి సంబంధించిన క్రియ, దానిని ఎలా చేయాలో ideas, ఏ స్థాయిలో విఘ్నం దూరినా ప్రమాదమే. కొందరికి సంకల్ప స్థాయిలోనే గండికొడుతూ ఉంటుంది. కొందరు పాపం strategy వరకూ బాగానే ఉంటుంది. క్రియారూపం ధరించే సరికి దెబ్బతినేస్తారు. మేము ఊహించలేదండీ అంటారు. ఇప్పుడు చెప్పండి గణపతి ముందు వచ్చి వెళ్ళిపోవలసిన దేవుడా? చివరివరకూ ఉండవలసిన దేవుడా? గణపతి చివరి వరకూ ఉండాలి. అందుకే ఈ కొంపలాంటి నా శరీరాన్ని యజ్ఞగృహంగా మార్చేసి ఇక్కడ నువ్వు కూర్చుంటేనే ఈ గణములన్నీ పనిచేయగలవయ్యా అని గణానాం త్వా మంత్రానికి అర్థం చెప్పుకున్నాం కదా! అది ఇక్కడ స్ఫురణకు తెచ్చుకోండి. విఘ్నములను తొలగించు వాడు. విఘ్నం అంటే ఏమిటి? ఎవరి స్థాయిలో వారు చెప్తారు. కానీ మన శాస్త్రం ఏం చెప్తోందో తెలియాలి కదా!
"జగన్మయః ప్రతిబంధాత్మకః సద్భావధరః కాలో విఘ్నః" ఇది వల్లభేశ ఉపనిషత్తులో చెప్తున్న నిర్వచనం. "తన్ నియామకోయం విఘ్నరాజః" విఘ్నము అంటే జగన్మయము, ప్రతిబంధాత్మకము, సద్భావధరమైన కాలము. కాలానికి ఇన్ని లక్షణాలున్నాయండి. కాలం పెద్ద విఘ్నంట. విఘ్నం అంటే అడ్డంకి అని చెప్పుకున్నాం. కాలం మనకొక అడ్డంకి. సృష్టిలో దేనిని చూసినా కాలపరిమితిలోనే మనం నిర్దేశిస్తున్నాం. అసలు పరిమితే ఒక అడ్డంకి. పరిమితికే అడ్డంకి అని పేరు. అనంతంగా విస్తరించబోతుంటే అడ్డు పెట్టామనుకోండి ఏమైంది? పరిమితి ఏర్పడింది. అవునా? లేదా? ఆ పరిమితినే మనం చూస్తూ కూర్చున్నాము అంటే విఘ్నం కలిగినట్లే కదా! ఇది జాగ్రత్తగా ఆలోచిస్తుంటే అఖండమైన ఆత్మచైతన్యాన్ని ఈ శరీరానికే పరిమితం చేస్తే ఈ శరీరమే ఆత్మ అనుకున్నాము అంటే విఘ్నం కాదా! ఇది వేదాంతపరంగా చెప్తున్నారిక్కడ. ఎందుకంటే వేదాంతంలో సారాంశం ఒక్కటి గుర్తు పెట్టుకోండి బంధము, మోక్షము అంటే అర్థం చెప్తారిక్కడ. బంధము అంటేనే అడ్డంకి. మీరు చక్కగా ప్రపంచంలోకి తిరుగుదాం అనుకుంటూంటే తాడుతో కట్టి సెల్ లో పడేశారు. అది అడ్డంకి. అవునా?కాదా? మీకు అది అడ్డంకి అయిందా? లేదా? స్వేచ్ఛగా తిరగకుండా అడ్డుకున్నది. మీ స్వేచ్ఛను బంధించేది కూడా విఘ్నమే. కనుక విఘ్నం అనేమాట యొక్క అర్థాన్ని మీరు విస్తారంగా ఆలోచించండి. ఆ scope పెంచండి. ఇంకా దీనియొక్క విశేషం తెలుస్తుంది. కేవలం పనులకు జరిగే ఆటంకాలు అనే అల్పార్థాన్ని విడిచిపెట్టండి. మహార్థంలోకి ప్రవేశించండి. మనల్ని తాడుతో కట్టేశారు. విఘ్నమే అది. కనుక బంధమే విఘ్నము. బంధము తొలగడమే విఘ్న నాశకము. ఇది ఒక్కటి ఆలోచించుకుంటే బంధము, మోక్షము. అంతేకందండీ ప్రపంచం అంటే. వేదాంత విచారణ చేసేవాళ్ళందరూ తెలుసుకోవలసిందే. ఒకసారి నరసింహస్వామి ప్రహ్లాదుడిని అడిగాడట రా! నీకు మోక్షమిస్తా! అని. ప్రహ్లాదుడు చాలా దయామయుడు. నా ఒక్కడికిస్తే ఎలాగయ్యా? మొత్తం అందరికీ మోక్షం ఇచ్చెయ్యి అన్నాడుట. సరే ఎవరెవరు రెడీగా ఉన్నారు పిలు అన్నారుట స్వామి. ఒక్కొక్కరిని పిలిచాడట. రెడీయే గానీ మోక్షం అంటే ఎలా ఉంటుంది అని అడిగారట. ఎలా ఉంటుందా? అక్కడ అసలు ఏమీ ఉండదయ్యా అన్నాడు. ఏమీ ఉండదా? ఏమీ ఉండనికాడికి ఎందుకు అన్నారుట. మోక్షం అంటే ఏమనుకున్నారంటే స్వర్గలోకంలో ఒక Golden seat, దానిమీద కూర్చొని ఉంటే చుట్టూ అప్సరసలు ఉంటే అది మోక్షం అనుకున్నాడు. మోక్షమే కాదది. కానీ కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే స్వర్గం కూడా waste అన్నాడు. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" గట్టిగా చెప్పాడా? లేదా? ఆయన. వీటికి మించి ఏదో ఉంది. అది చెప్పగలిగేది హిందూ మతం. అక్కడ మంచి భోజనాలు ఉంటాయా? ఉండడానికి వసతులు బాగుంటాయా? అని అడిగారు. చూడండి ఇస్తానంటే ఎన్ని ప్రశ్నలో. అవేమీ అక్కరలేదయ్యా అక్కడ. అవేమీ అక్కరలేని ఒక ఆనందం ఉంది అన్నాడు. ఇవేమీ లేని ఆనందం ఒకటి ఉందా? మాకు అర్థం కానిది ఇప్పుడెందుకయ్యా? అన్నారుట. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక కోరిక ఉంది. మా అబ్బాయి పెళ్ళి అయిపోయి మునిమనుమలను ఎత్తుకున్నాక అప్పుడు వస్తాను అన్నారుట. అప్పుడు ప్రహ్లాదుడు సిగ్గుపడి నన్ను క్షమించయ్యా అన్నాడు. అందుకే పండే వాళ్లకి మాత్రమే అర్థం అవుతుంది. నీకు పండింది కనుక ఇస్తానన్నాను. ఎక్కడో నీకు అజ్ఞానం ఉంది వాళ్ళందరినీ తెచ్చుకున్నావు, వదులుకోవయ్యా అన్నాడు. కనుక బంధము, మోక్షము అంటే ఏమిటి? తేలికగా చెప్పమంటారా? చెప్పడం చాలా తేలిక. వింటే అర్థమైనట్లు అనిపించడం కూడా తేలిక. బంధము విఘ్నము. విఘ్నాన్ని తొలగించితే మోక్షము. ఈ రెండే ప్రపంచం అంటే. మోక్షం పొందేవాళ్ళు కోటికొక్కడు ప్రయత్నిస్తాడుట,ప్రయత్నించిన కోటిమందిలో ఒక్కడు పొందుతాడుట. గీతలో స్వామే చెప్పాడు. "మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే!" గోవిందా! నారాయణా! అని కొబ్బరికాయలు కొట్టే వాళ్ళందరూ అసలు ప్రయత్నశీలురే కారయ్యా అని చెప్పాడు. "మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే! యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః!!" అని చీవాట్లు పెట్టి చెప్పాడు కదండీ మహానుభావుడు పరమాత్మ గీతలో. మీరు ఆలోచిస్తే బంధం మోక్షం అనేదానికి simple నిర్వచనం నేను చెప్తున్నాను ఏంటంటే "మీరు దేనితో తాదాత్మ్యం చెందుతారో దానినిబట్టి బంధం మోక్షం నిర్వచించవచ్చు. తాదాత్మ్యం - ఆత్మ్యం - నేను, నాది అనే భావం దేనితో మీరు పొంది ఉన్నారో దానిని బట్టి decide చేయవచ్చు. నేను, నాది అనే భావం దేహంతో పొంది ఉంటే బంధము, దేహాతీతమైన పరమాత్మతో పొందితే మోక్షము. దేహ తాదాత్మ్యం బంధం, పరమాత్మ తాదాత్మ్యం మోక్షం". సూర్యుడినుంచి వచ్చిన కాంతి గోడమీద పడితే గోడనీ, కాంతినీ కలిపి చూడడం బంధం, సూర్యుడినీ కాంతినీ కలిపి చూడడం మోక్షం. సూర్యుడు, కాంతి కరెక్టా? గోడ, కాంతి కరెక్టా? అలాగే పరమాత్మ చైతన్యం అనే కాంతి దేహాదులతో పడుతూ ఉంటే ఇవే నేను అజ్ఞానం మహా గట్టిగా ఉంటుంది. అది వదులుకోవడం మహా కష్టం. అందుకే పశుత్వం అంటే ఏమిటయ్యా అంటే దేహాత్మ భ్రాంతియే. దేహాత్మ భ్రాంతి - ఇది ఒక vedantic term. భ్రాంతే బంధం.
దీనికొక కథ ఉంది. ఆరోజులలో రజకులు గాడిదకి కట్టినట్లు నటించేవారట. నటనే. కట్టేశారు అనుకునేదిట. పొద్దున్నే విప్పినట్లు నటించేవారుట. విప్పేశారు అనుకునేదిట. కట్టా లేదు, విప్పాలేదు. దేహాత్మభ్రాంతి అలాంటిదే. సత్యం కాదు. దీనిలో ఉన్న చైతన్యం మాత్రం అచంచలమైన, అఖండమైన చైతన్యం. దీనికి ఘటాకాశ, పటాకాశ ఇత్యాది ఉపమానాలు వేదాంత శాస్త్రం ఎలాగూ చెప్పింది. మొత్తానికి గణపతి తత్త్వం వేదాన్తంలోకి ఎలా వెళ్తోంది చెప్పడం కోసం తాపత్రయం ఇదంతా కూడా. ఒక శూన్య ఆకాశంలో కుండని పెడితే కుండలో కూడా ఆకాశం ఉందా? లేదా? ఉన్నది. కుండలో ఆకాశం పరిమితంగా కనపడింది. కానీ ఆకాశాన్ని కుండకే పరిమితం చేయద్దయ్యా. పరిమితి కుండది కానీ ఆకాశానిది కాదు. అలాగే అనంతమైన పరమాత్మని దేహానితో పరిమితం చేసి చూడడమే దేహాత్మభ్రాంతి. ఈ పరిమితి అంటే బంధము. దీనినుంచి విడుదలే మోక్షము. కనుక విఘ్నము అంటే సంసార బంధము. మోక్షము అంటే దానినుంచి బయటపెట్టుట.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML