పరమాత్మ ఈ జగత్తులో లోకాన్ని ఉద్ధరించడం కోసం పౌరుష రూపాలు ధరించాడు సృష్టి మొదటినుంచీ. లోకంలో చెప్పుకునేవి పది అవతారాలైతే భాగవతంలో స్పష్టంగా చూపించినవి 21. ఈ అవతారాలను అనేక వైభవాలతో చూపించారు. ఇందులో పరమాత్మ లోకంలో ఆరాధించబడడానికి, అర్చించబడడానికి, ధ్యానించడానికి, కీర్తించబడడానికి, అనేక రూపాలు ధరిస్తారు. అవసరమైనప్పుడల్లా పరమాత్మ వచ్చి అవతార రూపం ధరిస్తారు.
మొట్టమొదలు సృష్టి మొదటిలో కౌమార సర్గ అన్నారు దానిని సనత్కుమార రూపం ధరించారు.
రెండవరూపంలో యజ్ఞవరాహ రూపం. హిరణ్యాక్షుడిని సంహరించిన రూపాన్ని ధరించారు.
మూడు నారదావతారం ధరించారు. పాంచరాత్ర ఆగమాన్ని అంతా సృష్టించారు నారదుడు ప్రత్యేకంగా.
నాలుగో అవతారం నరనారాయణ రూపం ధరించారు.
ఐదు కపిలుడనే దేవహూూతికి కుమారుడు నారాయణుడు కపిల మహర్షిగా అవతరిస్తారు.
షష్ఠ అత్రేరపత్యత్వం వృతః ప్రాప్తోsనసూయయా!
ఆన్వీక్షికీమలర్కాయ ప్రహ్రాదాదిభ్య ఊచివాన్!!11!!
శ్రీదత్తాత్రేయ యోగీంద్ర అవతారాన్ని ఆరవ అవతారంగా ధరించారు. స్వామి సుప్రసన్నుడై తనను తాను ఇచ్చుకున్నాడు. దత్త అంటే ఇవ్వడం. ఏంకావాలన్నారు? నువ్వుకావాలన్నారు. నన్నే ఇస్తున్నాను అని తనను తాను ఇచ్చుకున్న భగవానుడే శ్రీదత్తాత్రేయుడు. ఆత్రేయ అంటే అత్రి కుమారుడు.
గర్భములేదు కష్టపడి కన్నది లేదిక బారసాల సం
దర్భము లేదహో! పురిటి స్నానములున్ నడికట్లు లేవు ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠికీ
యర్భకు? లంతులేని జననాంతర పుణ్య తపః ఫలమ్ములై!!
త్రిమూర్తులను కుమారులుగా పొందింది అనసూయాదేవి.
వేద వేదాంత సౌవర్ణ వీథులందు
తిరుగుచుండెడి దివ్యమూర్తిత్రయమ్ము
బిడ్డలై వంటయింట దోగాడుచుండె గోరుముద్దలు గుజ్జనగూళ్ళు తినుచు!!
అమ్మా! నీ అదృష్టమేమది అనసూయా!
ఆదియు నంతమే యెరుగనట్టి మహామహిమాఢ్యులైన బ్ర
హ్మాదుల కుగ్గు వెట్టి ఒడియం దిడి జోలలపాడు పెద్ద ము
త్తైదువ! “ధన్యురాలవు” గదమ్మ! త్వదుజ్జ్వల కీర్తి గీతికా
నాదము మ్రోగె స్వర్గ భువనమ్మున దైవతమౌని వీణపై.
ఆరవ అవతారం శ్రీదత్తాత్రేయ అవతారం.
ఏడవ అవతారం ఆకూతి, రుచికి యజ్ఞపురుషుడుగా అవతరించారు స్వామి.
ఎనిమిదో అవతారమే ఋషభావతారం. జ్ఞాన ప్రభోదావతారం. ఈయన కుమారుడే జడభరతుడు, ఆయన వల్లే మనకు భరత ఖండం, భరతవర్షం అనే పేరు వచ్చింది.
తొమ్మిదో అవతారం పృథుచక్రవర్తి. ధేనువును మధించగా పుట్టినవాడు.భూమినంతా గోవుగా చేసి ఆ గోవునుంచి సమస్త ఓషధులను పిండాడు.
పదవది మత్స్యావతారం. మన దశావతారలలో మొదలు అనుకొనేది స్వామియొక్క దివ్య విభూతి అవతారములలో పదవది.
పదకొండవదే కూర్మావతారం. మంధర పర్వతాన్ని ధరించి క్షీరసముద్ర మథనానికి సాయపడ్డారు.
పన్నెండవది ధన్వంతరి అవతారం. ఆయుర్వేద ప్రభావం, మూలికలు, వైద్యం అంతా చూపించారు.
పదమూడవది మోహినీ అవతారం. దేవతలకు అమృతం ఇచ్చి రాక్షసులకు అమృతం దక్కకుండా మాయ చేసిన అవతారం.
పధ్నాలుగవది భయంకరమైన హిరణ్యకశిపుని సంహరించిన నరసింహావతారం.
పదిహేనవది వామనావతారం. మూడడుగుల నేలతో బ్రహ్మాండాన్నంతటినీ తాను వశం చేసుకున్నాడు.
పదహారవది పరశురామావతారం.
పదిహేడవది వేదవ్యాసులుగా అవతరించారు. వేద, శాస్త్ర, ధర్మ విభాగం చేయడం కోసం.
పద్దెనిమిది శ్రీరామావతారం. రావణ సంహారం జరిపారు.
పంతొమ్మిదవది శ్రీకృష్ణావతారం.
ఇరవై గౌతమ బుద్ధుని అవతారం.
ఇరవైఒకటోది భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం. భవిష్యత్తు అవతారం కూడా చెప్పారు. ఇన్ని అవతారాలున్నా
ఏతేచ అంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్!
ఇవి భగవంతుని అంశాంశ అవతారములు. పరమేశ్వరుని దివ్య చైతన్య వైభవంతో ఆ చిద్రూప దివ్య విలాస వికాస జ్ఞానాలతో లోకాన్ని రక్షించడానికి అనేక అవతారములు. రాక్షసులను చంపడానికి రారు పరమాత్మ. జీవులను ఉద్ధరించడానికి వస్తారు. అందుకే ఈ కల్కి అవతారం భవిష్యత్తులోది కూడా చూపించారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ. ఇన్ని అంశావతారాలు. అయితే అనేక బీజములు గర్భమందు కలిగిన జామకాయవంటి అవతారం. అన్నీ విత్తనములే లోపల. అనంత కోటి అవతారములయొక్క పరిపూర్ణ స్వరూపమే శ్రీకృష్ణావతారం.
జన్మ గుహ్యం భగవతః య ఏతత్ప్రయతో నరః!
సాయంప్రాతర్గృణన్ భక్త్యా దుఃఖగ్రామాద్విముచ్యతే!!29!!
ఈ భగవదవతార విశేషాలు సాయంకాలం, ప్రాతఃకాలం చక్కగా కీర్తిస్తే, శ్రవణం చేస్తే సమస్త పాపక్షయం కలుగుతుందన్నారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 12 December 2014
పరమాత్మ ఈ జగత్తులో లోకాన్ని ఉద్ధరించడం కోసం పౌరుష రూపాలు ధరించాడు సృష్టి మొదటినుంచీ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment