మనందరికీ భగవద్గీత అంటే అమితమైన శ్రద్ధ, ఆదరం. దానికి కారణం భగవద్గీత సాక్షాత్తు కృష్ణపరమాత్మయొక్క వదనారవిందం నుంచి వెలువడినటువంటిది. దానినే పెద్దలు చెప్పారు
"గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై: శాస్త్ర సంగ్రహై:!
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిహ్సృతా!!(మహాభారతం భీష్మ పర్వం - 43/1)
భగవద్గీత ఒక్కటి చాలయ్యా! మిగతావి ఏవీ అక్కరలేదు. అది సాక్షాత్తు భగవంతుని ముఖం నుంచి వెలువడినటువంటిది. అందువల్ల ఆ భగవద్గీతను మనం అత్యంత శ్రద్ధతో భక్తితో అధ్యయనం చేయాలి. అందులో భగవంతుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి. కేవలం చదివితే లాభం లేదు. దానిని మన జీవితంలో అలవర్చుకోవాలి. అప్పుడే భగవద్గీత చదవడం సార్థకమౌతుంది. అందులో భగవంతుడు మనకు ఎన్నో విషయాలను బోధించాడు. వాటిలో యేఒక్క విషయాన్నైనా సరిగ్గా అర్థం చేసుకొని ఆవిధంగా మన జీవితాన్ని నడిపాము అంటే కృతార్థులం కాగలుగుతాం. భగవద్గీతలో అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు - ఈలోకంలో అనేకమంది తెలిసీ చాలా తప్పు పనులు చేస్తున్నారు. ఎందుకలా? కారణం లేకుండా కార్యం ఉండదు. అవి ఎవరో వెనకాల ఉండి చేయిస్తున్నట్లుగా చేస్తున్నాడు. ఎవరు దీనికి కారణం? అని. దానికి భగవానుడు - ప్రతి ఒక్క మనిషికీ మనస్సులో రెండు శత్రువులు చోటు చేసుకున్నాయి. అవే ఈ తప్పుడు పనులు చేయిస్తున్నాయి. అవి "కామఏషః, క్రోధ యేషః"- కామము అంటే ఆశ, క్రోధం అంటే కోపం. ఈ రెండూ నీ మనస్సులోకి వచ్చి కూర్చొని నీతో తప్పు పనులు చేయిస్తున్నాయి. ఈ రెంటికీ వశం కాలేదు అంటే నీవల్ల తప్పు పనులు జరగవు. ప్రతివాడూ ఏకాంతంలో ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఎవరికీ జవాబు చెప్పక్కరలేదు. ఒక దొంగ దొంగతనం చేస్తున్నాడు అంటే ఆ వస్తువు మీద ఆశ వల్ల. ఒక వ్యక్తిని హింసిస్తున్నాడు అంటే కారణం కోపం. ప్రతిఒక్క అకార్యానికీ ఈ రెంటిలో ఏదో ఒకటి ఉంటుంది. ఈ రెంటికీ అవకాశం ఇవ్వకపోతే నీవల్ల తప్పుడు పనులు జరుగవు.

No comments:
Post a Comment