గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 November 2014

ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తిక పూర్ణిమ.

ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తిక పూర్ణిమ. దీనికి శాస్త్రములయందు విశేషమైన మహా వ్రత దినంగా పేర్కొన్నారు. ముఖ్యమైన పర్వాలలో ఇది ఒకటి. సాధారణంగా పూర్ణిమకే పర్వకాలము అని పేరు. పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, చతుర్దశి - ఈ నాలుగు తిథులు కూడా పర్వములు. ఇవి కాకుండా అష్టమి వంటి తిథులకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా పూర్ణిమ, అమావాస్య పూర్ణ తిథులు కనుక ఈరోజున యే పూర్ణిమ అయినా యే అమావాస్య అయినా కూడా ఈరోజున చేసిన ధ్యానాదులకు అద్భుతమైన విశేష ఫలం వస్తుంది అని సర్వ శాస్త్రములూ చెప్తున్నాయి. పైగా మనకు వేదకాలం నుంచి దర్శ పూర్ణ మాసేష్టులు మొదలైనవి అన్నీ కూడా పూర్ణిమ నాడు చేసే యజ్ఞ యాగాదులకు ఉన్న ఫలితం గురించి చాలా వివరించాయి. పూర్ణిమ నాటి సాధనలు మన మనస్థితిని కూడా ఒక పరిణతిలోకి తీసుకు వెళ్తాయి. అందునా కార్తిక పూర్ణిమ. అందుకే దీనిని మహాకార్తికి అని అంటారు.
సంవత్సరంలో వచ్చే కార్తిక మాసమే వ్రతాల మాసం. భగవంతుడు గొప్ప కాలాన్ని మనకు ఇచ్చాడు. ఆ కాలాన్ని కొద్దిపాటి సాధనతో సద్వినియోగం చేసుకుంటే ఇహమూ బాగుంటుంది, పరమూ బాగుంటుంది, పరమార్థమూ లభిస్తుంది. అందుకు ఈ కార్తికంలో ఏ వ్రతం కొద్దిపాటి చేసినప్పటికీ కూడా విశేష ఫలాన్నిస్తున్నది.
కార్తిక వ్రతములు చాలా ఉన్నాయి. ముఖ్యముగా ఉపవాస వ్రతములు, నక్త వ్రతములు చెప్పబడుతున్నాయి. పగలంతా ఉపవసించి సంధ్యా సమయంలో భగవదారాధన చేసి అటు తర్వాత రాత్రియొక్క ప్రారంభ దశలో ఆహారాన్ని తీసుకుంటే నక్త వ్రతం అని అంటారు. అది పాటించలేనప్పుడు కార్తికంలో స్నానం చేయడం, దీపం పెట్టడం, ఆలయ దర్శనం, ఏదో ఒక పారాయణం, ఏదో ఒక నియమం పెట్టుకోవాలి కార్తిక మాసంలో. అదేవిధంగా ముఖ్య తిథులు కొన్ని ఉన్నాయి పంచ పర్వములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. కార్తికంలో ఈ అయిదింటినీ పంచ మహా పర్వములు అని కూడా అంటారు. దీనికి పంచక వ్రతము అని కూడా పేరు. ఈ అయిదు రోజులూ నియమబద్ధంగా భగవదారాధన చేయడం, అభిషేకాదులు చేయడం చాలా విశేష ఫలితాలను ఇస్తాయి. అందులో చివరి రోజు పూర్ణిమ. ఈ అయిదూ చేయలేనప్పుడు పూర్ణిమ వ్రతమైనా చేయాలి. నెలరోజులూ వీలు కానప్పుడు అయిదు రోజులు, అయిదు రోజులూ వీలు కానప్పుడు పూర్ణిమ. అంత ప్రాధాన్యమున్నది. పైగా ఈ సమయంలో దీప దానం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. వీలైనన్ని దీపాలు వెలిగించి భగవదారాధన చేయాలి. అవి కూడా ఉత్తమమైన ఇంధనములు అందులో వాడాలి. ఆవునెయ్యి, నువ్వులనూనె మొదలైనవి మాత్రమే. మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసం దానానికి, కార్తిక మాసం దీపానికీ ప్రాధాన్యమిచ్చినది. ఒక్క దీపం భగవంతుని ఉద్దేశించి వెలిగించినట్లయితే అది మనకున్న అజ్ఞాన దారిద్ర్యాలను బాధలను తొలగిస్తుందని శాస్త్ర వచనం. పూర్ణిమ నాడు ఏ చిన్నపాటి సాధన చేసినప్పటికీ మహా యజ్ఞ ఫలితం వస్తుంది. అందుకే సంవత్సరంలో ఈ రోజును మాత్రం వృధా చేసుకోరాదు. ఈరోజున ఉపవాసము/ఆహార నియమము పాటిస్తూ స్నానము, దీపము, దానము, ధ్యానము ఇత్యాదులు చేయాలి. ఈరోజున చేసేది ఏదైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. దీపం వెలిగించడంతో పాటు ఒక పీటపై స్వస్తిక్ చిహ్నాన్ని, పద్మాన్ని, శంఖము, చక్రము, శ్రీకారము కూడా లిఖించి వాటిని పూజ చేస్తే ఒక విశేషం అన్నారు. స్వస్తిక్ చిహ్నమే శుభాన్ని, లాభాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు.
కార్తిక మాసంలో విష్ణువును దామోదర అనే పేరుతొ ఆరాధిస్తారు. మార్గశీర్ష మాసంలోని ఏకాదశి, ద్వాదశిలలో కేశవా నామంతో మొదలు పెడితే చక్రం తీసినట్లయితే సరిగ్గా కార్తిక మాసం వచ్చేసరికి పన్నెండు నామాలు పూర్తి అవుతాయి. పన్నెండవ నామం దామోదర నామం. దామోదర అన్న మాటకి సర్వ భూతములూ తనలో కలిగినవాడు అని అర్థం. అలాంటి దామోదర మాసమిది. అందుకు కార్తిక దామోదర ప్రీత్యర్థం అని ఏ కర్మనైనా చేస్తారు. అలాంటి ఆ దామోదరుడు కృష్ణావతారంతో ధన్యులైన గోపికలతో కలిసి రాసలీల చేసినటువంటిది.
రాసలీల అంటేనే ఒక పూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం. జీవాత్మలు పరమాత్మతో లీనమైనటువంటి అవస్థని ఇక్కడ రాసలీల అంటారు. ఆ రాసలీలావస్థ ఒక పూర్ణావస్థ. ఆ పూర్ణావస్థే ఇక్కడ శరత్పూర్ణిమ అని చెప్పబడుతున్నది.
ముఖ్యంగా యోగాపరంగా సహస్రారాన్ని చేరుకోవడమే శరత్పూర్ణిమ. ఆ పూర్ణావస్థలో కలిగే దివ్యానందమే రాసలీలానుభవం. అందుకు ఈ రాసలీల జరిగినటువంటి రోజు కూడా ఇది.
అంతేకాదు ఈ రోజు ఏ దేవతను ఆరాధించినా విశేషమే. ఎందుకంటే దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నక్షత్రం కృత్తిక; ఏ దేవతను ఆరాధించాలన్నా "అగ్నిముఖావై దేవాః" అన్నారు గనుక ఈ అగ్ని నక్షత్రమైన కృత్తిక నాడు ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత సంపూర్ణమైన తృప్తిని పొందుతుంది.
అంతేకాదు ఆదివారం సూర్యుని, శివుని; సోమవారం గౌరీదేవిని; మంగళవారం సుబ్రహ్మణ్యుని, గణపతిని; బుద్ధవారం విష్ణువును, గురువారం బ్రహ్మ దేవుని, దక్షిణామూర్తి, హయగ్రీవ వంటి గురుస్వరూపాలను; శుక్ర వారం ఇంద్రుని, ఇంద్రుడు ఆరాధించిన మహాలక్ష్మిని; అలాగే శనివారం శనైశ్చరుని, యముని, రుద్రుని ఆరాధించాలి అని మనకు శాస్త్రములు చెప్తున్నాయి. ఇవి ఏ మాసంలో చేసినా విశేషమే. కానీ అన్ని మాసాలలో ఏడు రోజుల వ్రతం మనం చేయలేం. కానీ కార్తికంలో మాత్రం ఈ వార యజనం చేస్తే సంవత్సరం అంతా వారయజనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అందుకే కార్తికంలో ఏది చేసినా సంవత్సరమంతా ఆ యజ్ఞము చేసిన ఫలితం వస్తుంది. అందులో ప్రత్యేకించి ఈ పూర్ణిమ నాడు పైన చెప్పిన నియమాలతో పరమేశ్వరుని, విష్ణువుని ఆరాధించాలి. శాస్త్రబద్ధమైన నియమ పాలనతో మహాకార్తికి సాధన చేసి కార్తిక దీప జ్యోతిలో ఆ పరమేశ్వర ప్రకాశాన్ని దర్శించి ధన్యులమౌదాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML