గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 21 November 2014

తల్లికి దాస్య విముక్తి కలిగించిన పక్షేంద్రుడు గరుత్మంతుడు -తల్లికి దాస్య విముక్తి కలిగించిన పక్షేంద్రుడు గరుత్మంతుడు -

పూర్వం సత్యయుగంలో శ్రీమహావిష్ణువు నాభికమలం నుండి "బ్రహ్మదేవుడు'' జన్మించాడు. బ్రహ్మమానసపుత్రులుగా మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుస్త్యుడు, పులహుడు, క్రతువులు జన్మించారు. వీరు ప్రజాపతులను సృష్టించారు. మరీచికి, కశ్యప ప్రజాపతి జన్మించాడు. బ్రహ్మకుడిచేతి బొటనవ్రేలు నుండి దక్షప్రజాపతి జన్మించాడు. బ్రహ్మఎడమచేతి బొటనవ్రేలు నుంచి జన్మించిన "ధరణి'' అనే కన్యను దక్షుడు వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువదియేడు నక్షత్రాలు, సతీదేవితో కలిసి యాభైమంది కుమార్తెలు, ఐదుగురు పుత్రులు జన్మించారు. వారిలో అదితి, దితి, దనువు, కాల, దనాయువు, సింహిక, క్రోధ, ప్రాధ విశ్వ, వినత, కపిల, ముని, కద్రువలను కశ్యపప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు. వినత, కద్రువలు తమ భర్త అయిన కష్యపప్రజాపతిని సేవిస్తూ గర్భవతులయ్యారు. వారి కోరికననుసరించి "నీకు మహాబలవంతులు, పరాక్రమవంతులు అయిన ఇద్దరు కుమారులు జన్మిస్తారని వినతను, నీకు వీరవంతులు, తేజో, పరాక్రమవంతులు అయిన వేయిమంది పుత్రులు జన్మిస్తారని కద్రువకు చెప్పి ... మీ గర్భాలను సంరక్షించుకునే బాధ్యత మీదే'' అని వారికి బోధించి తపోవనానికి వెళ్ళిపోయాడు కశ్యపుడు.


ఆ తరువాత అదితికి రెండు గ్రుడ్లు, కద్రువకు వెయ్యిగ్రుడ్లు కలిగాయి. ఆ అండాలను వారు నేతికుండలలో పెట్టి భద్రంగా కాపాడుతున్నారు. అయిదువందల సంవత్సరాలు గడిచాయి. కద్రువకు కలిగిన వేయిగ్రుడ్లనుంచి భయంకరమైన విషసర్పాలు జన్మించాయి. వారినే 'కాద్రవేయులు'' అంటారు. వినతకు కలిగిన అండాలూ మాత్రం ఫలించక అలాగే వున్నాయి. తన సోదరి కద్రువ సంతానవతియై పిల్లలతో ఆడుకుంటూ, ఆనందిస్తుంటే చూసిన వినత, తనకు ఇంకా అలాంటి ఆనందం కలుగలేదే అనే ఆతృతతో .. ఒక గుడ్డును చితుకగొట్టింది. అప్పటికి శరీర పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడు ఉదయించాడు. అతనికింకా తొడలు, కాళ్ళు, పాదాలు తయారుకాలేదు. అలా అర్థశరీరంతో జన్మించిన ఆ కుమారుడు తన అవిటితనానికి చింతిస్తూ "అమ్మా! అసూయకు లోనై, తొందరపాటు తనంతో నువ్వుచేసిన ఈ చర్యవల్ల నేను అవిటివాడనయ్యాను. నా శక్తియుక్తులన్నీ పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే దౌర్భాగ్యస్థితి కల్పించావు. ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవతికి 500 సంవత్సరాలు సేవలు చేస్తూ దాసిలా బ్రతుకు'' అని శపించాడు. వినత కన్నీళ్ళతో తన కుమారున్ని మన్నించమని వేడుకుంది.

"అమ్మా,, ఈ రెండవ అనడాన్నయినా జాగ్రత్తగా కాపాడుకో, ఈ అండంలో నుంచి ఉద్భవించే నీ రెండవ కుమారుడు నీ దాసీత్వాన్ని తొలగిస్తాడు'' అన్నాడు ఆ కుమారుడు. అతని పేరే "అనూరుడు'' ఊరువులు [తొడలు] లేకుండా జన్మించాడు కనుక అతనికి అనూరుడు అని పేరు పెట్టాడు కశ్యప్రజాపతి. ఇదిలా వుండగా, క్షీరసాగర మథనంలో జనించిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్న సమయంలో రాహుకేతువులు దేవతలా రూపాల్లో వచ్చి అమృతపానానికి సిద్ధపడ్డారు. అది గ్రహించిన సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలోనున్న శ్రీహరికి చెప్పారు. శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు. అయితే, అమృతపానం చేసిన కారణంగా వారి ప్రాణాలు పోలేదు. అప్పటినుంచి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో దేవతలెవరూ సూర్యచంద్రులకు సాయపడలేదు. చంద్రుడు శీతల కిరణుడు. పైగా సూర్యతేజస్సు మీద ఆధారపడినవాడు అతనికి దేవతలపై అలిగే శక్తి లేదు. కానీ సూర్యుడు స్వయంప్రకాశకుడు, మహాశక్తిమంతుడు. అందుకే సూర్యుడు దేవతలపై అలిగి, సమస్త లోకాలను భస్మం చేయాలనే సంకల్పంతో తన దహనశక్తిని వేయింతలు పెంచాడు. ఆ ప్రచండ తాపానికి లోకాలు తల్లడిల్లిపోతుంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుని సలహామేరకు అనూరుని సహాయం అర్థించారు.

పరోపకార పరాయణుడైన "అనూరుడు'' సూర్యుని సమీపించి, "అగ్రజా! ప్రణామాలు, నీవు సమస్యలోకాలకూ ప్రాణాధారుడవు. పైగా లోకబాంధవుడవు. కన్నతండ్రిలా కాపాడవలసిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణికోతికి దిక్కెవరు? ఈ తమ్ముని ప్రార్థనలాలకించి శాంతించు'' అని వేడుకున్నాడు. సూర్యుడు ప్రసన్నుడై "సోదరా! నీ పరోపకార చింతన నాకు అఆనందం కలిగించింది. ఏం వరం కావాలో కోరుకో'' అన్నాడు. "అగ్రజా! కన్నతల్లి తొందరపాటు కారణంగా నేనిలా అవిటివాడనయ్యాను. ఈ సృష్టి సౌందర్యాన్నంతటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక. కనుక నీ రథసారధినై నా కోరిక తీర్చుకుంటాను. అనుగ్రహించు'' అన్నాడు అనూరుడు. సూర్యుడు అంగీకరించాడు. నాటినుంచి అనూరుడు సూర్యారథసారధి అయ్యాడు. అనూరుని భార్య "శ్యేని''. వీరిద్దరికి కలిగిన వారే సంపాతి, జటాయువు.

వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. మరో 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ... ఆ అండం నుంచి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి, భక్తిగా తల్లికి నమస్కరించాడు. వినత సంతోషంగా కుమారుని దీవించింది. అయితే మహాశక్తిమంతుడైన గరుత్మంతుని చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోయింది. తగిన సమయంకోసం ఎదురుచూస్తోంది. ఒకరోజు, వినత, కద్రువలు సాగరతీరానికి విహారానికి వచ్చి, దూరంగా తిరుగుతున్నా "ఉచ్చైశ్రవము'' అనే గుర్రాన్ని చూశారు. ఆ గుఱ్ఱం పూర్తిగా తెల్లగా వున్నదని వినత, తోకదగ్గర నల్లగా వున్నదని కద్రువ వాదులాడుకున్నారు. ఈ విషయంలో ఇద్దరిమధ్య పంతం పెరిగి, "ఓడినవారు గెలిచినవారికి దాస్యం చేయాలని'' పందెం నిర్ణయించుకున్నారు. ఆ రోజు చీకటి పడిన కారణంగా మరునాడు వచ్చి ఆ గుర్రాన్ని పరీక్షించాలని అనుకుని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. కద్రువ తన సంతానమైన పాములను పిలిచి, తమ పందెం గురించి చెప్పి, "మీలో ఎవరైనా వెళ్ళి, ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించండి'' అని ఆజ్ఞాపించింది.సర్పాలు ఆ మోసకార్యం చెయ్యడానికి ఒప్పుకోలేదు. కద్రువకు కోపం వచ్చి, "మీరంతా జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి భస్మం అవుతారు'' అని శపించింది. తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనే సర్పం కద్రువ చెప్పినట్టు గుఱ్ఱం తోకకు చుట్టుకుని, వినతకు నల్లగా కన్పించాడు. పందానికి కట్టుబడిన వినత, కద్రువకు దాసీ అయి జీవిస్తోంది. తల్లితోపాటు గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తున్నాడు. ఒకరోజు గరుత్మంతుడు, తన సోదరులైన పాముల కోరిక మేరకు వారందరినీ తన వీపుపైకి ఎక్కించుకుని ఆకాశానికి ఎగిరాడు. సర్పాల సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ సూర్యమండలానికి సమీపంగా వెళ్ళాడు. ఆ సూర్యప్రతాపానికి సర్పాల శరీరాలు కాలి స్పృహ తప్పి నేలమీద పడ్డాయి. తన పుత్రులు అచేతనంగా పడివుండడం చూసిన కద్రువ గరుత్మంతుని నానా తిట్లు తిట్టింది. గరుత్మంతుడు బాధగా తల్లి దగ్గరకు వెళ్ళాడు. కద్రువ ఇంద్రుని ప్రార్థించింది. ఇంద్రుడు వర్షం కురిపించాడు. సర్పాలు స్పృహలోకి వచ్చాయి. కద్రువ సంతోషించింది.

గరుత్మంతుడు తల్లిని చేరి ... "మనమెందుకు దాస్యం చేస్తూ జీవించాలి?'' అని అడిగాడు. వినత ... తమ పందెం కథంతా చెప్పి "దాస్య విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్నమ్మను అడుగు'' అని చెప్పింది. గరుత్మంతుడు కద్రువను చేరి ... తమ దాస్యం తొలగే మార్గం చెప్పమని అడిగాడు. కద్రువ బాగా ఆలోచించి "అమృతాన్ని తెచ్చి యిస్తే మీ దాస్యం తొలగిపోతుదని'' చెప్పింది. గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి "అమృతం తేవడానికి వెడుతున్నాను. నాకు ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పు'' అని అడిగాడు. "కుమారా! సాగరమథనంలో నిషాదులున్నారు. వారిని ఆహారంగా తీసుకో. అయితే, వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే, అతనిని మాత్రం వదిలిపెట్టు. ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్నికంటే, విషంకంటే భయంకరమైనది'' అని చెప్పింది. గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరి, సముద్రమధ్యంలోనున్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కినవారినందరిని భుజించాడు. అయినా, అతని ఆకలితీరలేదు. వెంటనే ... ఎగురుతూ వెళ్ళి తన తండ్రి అయిన కశ్యపుని కలిసి, నమస్కరించి, ఆకలితీరే మార్గం చెప్పమని అర్థించాడు.

పరస్పర శాపకారణంగా గజ, కచ్ఛపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న విభావసుడు, సుప్రతీకలను భుజించమని చెప్పాడు కశ్యపుడు. గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును, మరొక కాలితో తాబేలును పట్టుకుని ఆకాశానికి ఎగిరి ... వాటిని తినేందుకు తగిన ఓ వృక్షశాఖపై వాలాడు. అతని బరువుకు ఆ వృక్షశాఖ విరిగి క్రిందపడబోతుంటే ఆ వృక్షశాఖకు తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేస్తున్న వాలఖిల్య మహర్షులను చూసి ... ఆ వృక్షశాఖను తన నోటితో పట్టుకుని తన తండ్రి అయిన కశ్యపుని దగ్గరకు వెళ్ళి ఆకాశంలో నిలబడ్డాడు. గరుత్మంతుని దీనస్థితి గమనించిన కశ్యపుడు, వాలఖిల్యులను ప్రార్థించాడు. వారు ఆ వృక్షశాఖ వదిలి మరోచోటుకు వెళ్ళిపోయారు. తరువాత ఆ చెట్టుకొమ్మను హిమాలయాలలో వదిలి, ఆ గజ కచ్ఛపాలను భుజించి, అమృతం కోసం స్వర్గం చేరుకున్నాడు. అమ్రుతాపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసిన ఇంద్రుడు, అతని మీదకు దేవసైన్యాన్ని పంపాడు. గరుత్మంతుడు, దేవసైన్యాన్ని చిత్తుగా ఓడించి, అమృతకలశాన్ని సమీపించాడు. అమృతకలశానికి రక్షణగా ఓ దివ్యచక్రం తిరుగుతోంది. గరుత్మంతుడు సూక్ష్మరూపం ధరించి, చక్రరంధ్రంలోంచి అమృతకలశం దగ్గరకు దిగాడు. ఆ కలశానికి రక్షణగా రెండు భయంకర సర్పాలున్నాయి. గరుత్మంతుడు తన రెక్కలవేగంతో ఆ సర్పాల కళ్ళలో దుమ్ముకొట్టి వారిని సంహరించి ఆ అమృతకలశాన్ని తీసుకుని బయలుదేరాడు. అతడు అమృతం లభించినా తాగలేదు. తన తల్లి దాస్య విముక్తి కోసం అమృతకలశంతో ఆకాశమార్గంలో వస్తున్నాడు. గరుత్మంతుని కార్యదీక్షకు సంతోషించిన శ్రీమహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై "ఏ వరం కావాలో కోరుకో'' అన్నాడు.

"ప్రభూ! మీ సేవాభాగ్యం కన్నా మించిన వరం మరొకటి లేదు. నన్ను మీ వాహనంగా, ధ్వజచిహ్నంగా స్వీకరించండి. అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు జరామరణాలు లేకుండా అనుగ్రహించండి'' అని కోరాడు. శ్రీహరి ఆ వరాలు అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. గరుత్మంతుడు అమృతకలశంతో మహావేగంగా తిరిగి వస్తున్నాడు. అతనిని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధం పంపాడు. అది చూసి, గరుత్మంతుడు, ఇంద్రునితో పరిహాసంగా "దేవేంద్రా! ఈ ఆయుధం దధీచి మహర్షి వెన్నెముకతో తయారయింది. కనుక, ఈ ఆయుధాన్ని అవమానించలేను. అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి బలి చేస్తున్నాను'' అని ఒక ఈకను వదిలాడు. అది చూసి దేవర్షులు గరుత్మంతునకు "సుపర్ణుడు'' అను బిరుదునిచ్చారు. గరుత్మంతుని శక్తిని గుర్తించిన ఇంద్రుడు, "పక్షీంద్రా! మహత్తరమైన నీ బలం ఏపాటిదో తెలుసుకోవాలనుంది'' అని అడిగాడు. "మహేంద్ర! అంతరిక్షంలో కదులాడే చతుర్దశ భువనాలను ఒక్క రెక్కతో మోయగల శక్తి నాకు ఉంది'' అన్నాడు గరుత్మంతుడు. అది విన్న ఇంద్రుడు సంతసించి "ఖగేంద్రా! శ్రీహరి అనుగ్రహించిన వరం వల్ల నీకీ అమృతంతో పనిలేదు. కనుక నాకీ అమృతకలశాన్ని ఇచ్చేయి'' అని అడిగాడు. "దేవేంద్రా! నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతం తీసుకుని వెడుతున్నాను. ఈ కలశాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా పవిత్రస్థలంలో ఉంచి, మా పినతల్లికి చెప్పి ... నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను. ఈ అమృతం ఇతరులు ఎవరూ తాగకుండా హరించి తీసుకుని పోయే బాధ్యత నీది'' అన్నాడు గరుత్మంతుడు. ఇంద్రుడు సమ్మతించి, అతనితో స్నేహబంధం ఏర్పరచుకొని, సర్పాలకు అతనికి ఆహారంగా వరమిచ్చి, వెళ్ళిపోయాడు.అనంతరం గరుత్మంతుడు ఆ అమృతకలశాన్ని కద్రువ ముందు దర్భలపై వుంచి "తల్లీ! ఇదిగో అమృతకలశం. ఇది అతి పవిత్రం. నా సోదరులైన నీ పుత్రులు సాగారజలాలలో శుచిస్నాతులైన తర్వాతే ఈ అమృతాన్ని స్వీకరించాలి. నేటితో నా తల్లి దాస్య విముక్తురాలింది. మాకు స్వేచ్ఛ ప్రసాదించు'' అని పలికాడు. సంతసించిన కద్రువ, వినతను దాస్య విముక్తురాలిని చేసింది. అనంతరం గరుత్మంతుడు తన తల్లిని, కశ్యపునకు అప్పగించి, శ్రీహరిని సేవించుకోవడానికి వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరి వాహనమైన గరుత్మంతుని ఆశీస్సులు మనందరకూ కలుగుగాక.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML