గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 21 November 2014

పాపపుణ్యాలను ఎలా బేరీజు వేస్తారు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు

పాపపుణ్యాలను ఎలా బేరీజు వేస్తారు?
శ్రీకృష్ణుడు చెప్తున్నాడు
''సత్యభామా! నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యపోయిన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాఘ, కార్తీక వ్రతాల వలె తిథుల్లో ఏకాదశి, క్షేత్రాల్లో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి. ఎవరైతే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా సన్నిహితులు అవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాకటాక్షులై పాపభీతి లేనివాళ్ళు అవుతారు''
శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ ''స్వామీ! ధర్మదత్తుడు ధారపోసిన పుణ్యంవల్ల ''కలహ''కు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వల్ల రాజద్రోహాది పాపాలు పటాపంచలౌతాయి. స్వయంకృతాలో, కర్తల నుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి.. దాన్ని వివరించు'' అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు.
పాపపుణ్యాలు ఏర్పడు విధానం
''ప్రియా! కృతయుగంలో చేసిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలో చేసినవి వారివారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేసిన కర్మఫలం మాత్రం ఆ కర్తకు ఒక్కడికే సిద్ధిస్తుంది.
సంసర్గ రహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెప్తాను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడంవల్ల, ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా, సంపూర్తిగా అనుభవిస్తున్నాడు. వేలాది బోధనలవల్ల యజ్ఞం చేయడం వల్ల పంక్తిభోజనం చేయడంవల్ల కలిగే పాపపుణ్యాల్లో నాల్గవ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులు చేసిన పాపపుణ్యాలను చూడటంవల్ల, తలచుకోవడంవల్ల అందులోని వందన భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడూ, త్రుణీకరించేవాడూ, చెడుగా మాట్లాడేవాడూ, చాడీలు చెప్పేవాడు... ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని, పుణ్యాన్ని జారవిడుచుకుంటాడు. తనభార్య, కొడుకు, శిష్యులు లేదా ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇవ్వనివారు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్న వారవుతారు. పంక్తిభోజనాల్లో, భోక్తల్లో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన, సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం దానమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం తప్ప మరేం మిగలదు. దొంగిలించి తెచ్చిన పర ద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వల్ల పుణ్యం ఆ ధనం యజమానికె చెందుతుంది.
ఋణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం ఋణదాతకు చెందుతూ ఉంది. పాపంగానీ, పుణ్యంగానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడూ, ఆ పని చేయడంలో తోడ్పడేవాడూ, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడూ, ప్రోత్సహించేవాడూ తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు, శిష్యుఅ వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తితో నిత్యం భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో, కొడుకో, మరి ఇతరులతోనో ఆచరింపచేసిన పుణ్యాల్లో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది. ఇలా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా, మనకు సంబంధం లేకపోయినా వివిధ జనసాంగత్యాల వల్ల పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తిస్తాయి. అందువల్లనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను.
ధనేశ్వరుని కథ –సత్సాంగత్య మహిమ
చాలాకాలం క్రితం అవంతీపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతడు కులాచార భ్రష్టుడై పాపాలు చేస్తూ ఉండేవాడు. అసత్యభాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపాణం- మొదలైన దుష్కర్మల్లో చురుగ్గా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అలాగే ఒకసారి మహిష్మతీ నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదానది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేస్తూ ఉండగానే కార్తీకమాసం ప్రవేశించింది. దాంతో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీవల్ల వర్తకం బాగా జరుగుతుందికదా! ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజూ నర్మదాతీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చనా విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్యగాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారు, విష్ణుముద్రలను ధరించినవాళ్ళు, తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు భక్తులను చూశారు. చూడటమే కాదు నెల పొడుగునా తానక్కడే మసలుతుండటం వల్ల వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యంవల్ల అప్పుడప్పుడు విష్ణు నామోచ్కారణ కూడా చేసేవాడు. నెల రోజులూ ఇట్టే గడిచిపోయాయి. కార్తీక ఉద్యాపనా విధిని, విష్ణు జాగరణను కూడా దర్శించాడు.
పౌర్ణమినాడు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్తులను చూశాడు. పిదప సాయంకాలం శివ ప్రీత్యర్థం చేసే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామా! నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివారాధన దేనికి - అని ఆశ్చర్యపడకు.
ఎవరైతే నన్ను, మహాశివుని బేధభావంతో చూస్తారో, వారి సమస్త పుణ్య కర్మలు వృథాయే. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేయడంవల్ల కూడా ఆయనను ఆరోజు ఆరాధిస్తారు. ఇక, ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలు అన్నిటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ, వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ, ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతన్ని కాటు వేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతన్ని అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం తర్వాతి క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాషాబద్ధుని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్ళారు.
యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు ''హే ధర్మరాజా! వీడు ఆగర్భ పాపాత్ముడే తప్ప అణువంత కూడా పుణ్యం చేసినవాడూ కాదు అని చెప్పాడు. ఆ మాటమీద దండధరుడు తన దూతలచేత ధనేశ్వరుడి తలను చితక్కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు.
కానీ, ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే, అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాళునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపిచి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి నారదుడు ''ఓ యమధర్మరాజా! ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు.
కనుక ఇతన్ని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్య పురుష దర్శన స్పర్శన, భాషణలకు పాత్రులో వారు ఆ సజ్జనుల పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిడి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్తులు ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొందాడు.
కార్తీక వ్రతస్తుల సహజీవనం వల్ల ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసానవేళ హరిభక్తుల చేత తులసితీర్థం పొందాడు. కర్ణ పుటాల్లో హరి నామస్మరణ జరుపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహం సుస్నాతమయింది. అందరు హరిప్రియుల ఆచరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో. ఇతడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు'' అని బోధించి వెళ్ళాడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML