ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 8 November 2014

పన్నెండు మాసాలలో ఒక్కొక్క మాసాన ఒక్కొక్క పేరున నారాయణుడు అర్చించబడుతున్నాడు.

పన్నెండు మాసాలలో ఒక్కొక్క మాసాన ఒక్కొక్క పేరున నారాయణుడు అర్చించబడుతున్నాడు. ఈ ఆరాధన ఏకాదశ వ్రతంతో కూడినది. మార్గశిర శుద్ధ ఏకాదశినాడు 'కేశవ' నామంతో మొదలై, క్రమంగా కార్తిక శుద్ధ ఏకాదశి వరకు పన్నెండు నామాలలో స్వామిని అర్చిస్తారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర...ఇవీ క్రమంగా పన్నెండు నామాలు. పన్నెండవ నామమైన 'దామోదర' నామం కార్తిక శుద్ధ ఏకాదశి నాటిది. అందుకే కార్తిక మాసమంతా 'దామోదర' నామంతో వ్యవహరిస్తూ విష్ణ్వారాధన చేస్తారు.
కేశవాది చతుర్వింశతి నామాలలో మిగిలిన పన్నెండు కృష్ణ పక్ష ఏకాదశులు. వాటి మాసాది నియమాలు వేరు.
ప్రస్తుతం కార్తిక దామోదరుడే ప్రధానాంశం.

దామోదర' నామానికి చాలా అర్థాలున్నాయి.
ప్రధానంగా 'దామములు ఉదరమున కలవాడు' అని అర్థం.
'దామము' అంటే లోకం. 'ఉదరం' అంటే లోపలి భాగం. తనలో సమస్త జగములు కలవాడు దామోదరుడు.
ఒకదానితో ఒకటి అనుబందింపబడి సాగేవే లోకములు. ప్రతి పదార్థంలో, సమస్త లోకాలలో (ఉదారాలలో) ఈ అనుబంధ సూత్రం (దామము)గా ఉన్నవాడే వాసుదేవుడు.
'దమాట్ దామోదరో విభుః' దమము (ఇంద్రియ నిగ్రహం) చేత కలిగి ఉదార (మేలిమి) బుద్ధికి దొరికేవాడు - అని అర్థాన్ని మహాభారతం చెప్పింది. ఇది పరమాత్మ అయిన నారాయణుని పరంగా అర్థం.
ఈ నారాయణుడే శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు - 'దామోదర' నామానికి పై అర్థాలతో పాటు, మరియొక అర్థాన్ని కూడా కల్పించాడు.
'తాతస్య దామోదరతాం ప్రయమౌ దామబంధనాత్' (విష్ణు పురాణం)
తాటిచే కట్టబడిన కారణంగా దామోదరుడయ్యాడని భావం.
యశోదమ్మచే తాడుతో రోటికి కట్టబడిన కృష్ణ మూర్తియే దామోదరుడు.
ఇది భాగవతంలో ఒక అద్భుత లీలా స్వరూపం.
యశోదమ్మ బాలకృష్ణుని ఒళ్ళో ఉంచుకొని, చల్ల చిలుకుతున్నది. ఈలోపల ఇంట్లో పాలు కాగి పొంగుతుండడంతో స్వామిని దింపి లోపలి వెళ్ళింది. తనను వదిలి వెళ్ళినందుకు అలిగిన చిన్నారి కృష్ణుడు, అక్కడున్న పాలు, పెరుగు కడవల్ని పగలగొట్టి పారిపోయాడు.
తిరిగి వచ్చి, నేలపాలైన పాలు పెరుగుల్ని చూసి ఉలిక్కిపడిన తల్లి, స్వామిని వెతుకుతూ వెళ్ళింది. వేరొక ఇంట్లో రోటిని తిరుగవేసి దానిపై ఎక్కు ఉట్టిమీదున్న వెన్నని తీసు ఒక కోతికిస్తున్న కృష్ణుడు కనబడ్డాడు.
వెంటనే శిక్షించాలని సంకల్పించుకున్న అమ్మ, బాలుని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అది గమనించి పరుగు లంకించుకున్నాడు పరమాత్మ. వెంటపడింది జనని.
పట్టు చిక్కకుండా వడిగా పరుగెడుతున్న కన్నయ్యని పట్టలేక పరుగాపక ప్రయాసపడుతున్నది. ఇదంతా వ్రేపల్లెకి వినోదమయింది.
పరంధాముని పట్టుకోవడానికి ఏకాగ్రంగా ప్రయత్నిస్తున్న భక్తి రూపిణి యశోదకు దేవతలు సైతం నమస్కరిస్తున్నారు.
అలసిన అమ్మను చూసి జాలిపడి నిలబడ్డాడు నీలమోహనుడు. తల్లి అందుకుంది. స్వామిని పట్టుకోగలిగింది. కాదు - స్వామి తనంత తాను దొరికాడు.
మన శ్రమని చూసి కరుణించి లభించవలసినదే ఈశ్వరుడు. పట్టిన స్వామిని కడదామనుకుంది యశోదమ్మ.
ఈ బాలుని కట్టేందుకు పెద్దతాడు ఎందుకు! అంటూ ఒక తాడు తీసుకొని పొట్టచుట్టూ తిప్పి తెచ్చేటప్పటికి ఆ తాడు చాలలేదు. రెండంగుళాల కడమ! వెంటనే ఆ తాడుకి మరోతాడు కలిపి బొజ్జ చుట్టూ తిప్పి తెచ్చింది. మళ్ళీ రెండంగుళాలు చాలలేదు. ఇలా...క్రమంగా ఇంట్లో తాళ్ళన్నీ అయ్యాయి గానీ, రెండంగుళాలు చాలనితనం అలాగే ఉంది! చెమటలు పడుతున్నాయి. పరిసరాలనీ, తననీ కూడా మరచి ప్రయాసపడుతోంది.
తజ్జనని లోగిటం గల
రజ్జు పరంపరల క్రమ్మరన్ సుమగట్టన్
బొజ్జ తిరిగి రాదయ్యే,
జగజ్జాలములున్న బొజ్జ, కట్టన్ వశమే! (పోతన)
అలసటని లెక్క చేయకుండా, శ్రమిస్తున్న మాతృమూర్తిని దయతో చూసి, కట్టుబడ్డాడు స్వామి. కట్టగలిగాననుకొని సంతోషించింది తల్లి.
మన తపనకి ఏడ కరిగి తానే లభించాలి గానీ, పట్టుబడడానికీ, కట్టుబడడానికీ సాధ్యుడా అతడు!
రెండంగుళాల కడమ ఇక లేదు. ఉదరానికి కట్టిన దామాన్ని రోటికి కట్టి, శిక్షించగలిగాననుకొని, గృహకార్యాలలో మునిగింది యశోదాదేవి.

ఎన్నో జన్మల సాధనల పుణ్యఫలంగా - యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదుల వలన - పరమాత్మను హృదయంలో చూడగలిగే భాగ్యం లభించింది.
కానీ - ఆ భాగ్యాన్ని పదిలంగా, ధృఢంగా నిలుపుకోలేక, విషయ వాసనల పాల పొంగులకి, చెదిరిపోయి - స్వామిని దించేస్తే - మళ్ళీ ఆయనను పట్టడం అంత తేలికా! కానీ - ప్రయత్నించాలి.
పట్టులో ఒదిగిన వానిని దింపి వేస్తే, తిరిగి పట్టుకొనే ప్రయత్నమే 'ధారణ'. కట్టే సాధనే 'ధ్యానం'.
ఆ ధ్యానపు కట్టుబడికి - రెండంగుళాల అడ్డంకి! ఆ రెండే అహంకార, మమకారాలు. ఈ లోకపు ఇంట్లో మనముందున్న పాశాలన్నీ ఒక్కటి చేసి 'సర్వంత్వమేవ' అనే సమర్పణా భావంతో, స్వామితోనే ముడి పెట్టుకుంటే, 'అహం', 'మమ'లు తొలగి పరమాత్మ మన ధ్యానంలో నిలుస్తాడు. ఆ నిలుకడయే రాతికి కట్టుబడి నిలిచిన అనుగ్రహం.
దీనికి ఫలంగా జన్మజన్మల కర్మబంధాలని తొలగించి మొక్షాన్నిస్తాడు. దానికి సూచనగానే, రోటిని కదిలించుకు వెళ్ళాడు. శాపవశాత్తు చెట్లై పడివున్న కుబేర పుత్రులకు శాపవిమోచనం చేశాడు. భక్తుల బంధాలను తెంచడానికి తానూ బంధితుడై వెళ్ళాడు భగవానుడు.
ఈ ధారణ ధ్యాన సాధనల భక్తి స్వరూపమే యశోద. ఆ భక్తికి సులభుడు శ్రీకృష్ణుడు. అహంకార జనితమైన ఏ ప్రయత్నాలకీ లభించని పరడైవం. 'నిష్కపటమైన భక్తికి కట్టుబడతాను' అని చాటడానికే దామోదరుడయ్యాడు.
భక్తి పాశ బద్ధుడై, కర్మ పాశ మోచకుడైన పరమాత్మకు ప్రణామాలు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML