ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 17 November 2014

ఒకప్పుడు మహానుభావులు వశిష్టుల వారున్నారు

ఒకప్పుడు మహానుభావులు వశిష్టుల వారున్నారు. మహర్షి వశిష్టులు చాలా గొప్పవారు. ఆయనకీ బహు సంతానం ఉన్నది. పురాణాల లెక్క ప్రకారం నూరు మంది సంతానం. మహర్షులు తేజస్సంపన్నులు. విశ్వామిత్రుడు ఆయనతో స్పర్ధ వహించి చేసిన దుర్మార్గం వల్ల మరణించారట. అంత వశిష్టులకి దుఃఖం కలిగిందిట. పుత్రశోకం అంటారు. సహజం. ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా తాత్కాలిక దుఃఖం వల్ల మనస్సు చెదురుతుంది. అప్పుడు ఏం చేయాలంటే సత్యమేదో వాళ్లకి చెప్పి తిరిగి వాళ్ళని తీసుకురావాలి. అలా వారిని ఓదార్చడాన్ని పరామర్శ అంటారు. పరాన్ని ఆమర్శనము చేయుట. అంతేకానీ ఏడ్చే వాడితో పాటు వీడు ఏడవడం కాదు. జ్ఞానం తెలుసుకో. ఎందుకంటే ఉద్రేకం వచ్చినప్పుడు జ్ఞానం పక్కకి పోతుంది. మూడు రకాల ఉద్రేకాలు ఉంటాయిట. ఆ సమయంలో వాడిని మళ్ళీ ధ్యానంలోకి తీసుకురావాలి. మహాత్ములు చిన్నపాటి పొరపాటు చేసినా భగవంతుడు వెంటనే శుద్దులని చేసేస్తాడు. అందుకే మహాత్ముడైన వశిష్ఠుడు శోకోద్రేకంతో తనను తాను చంపుకోవాలని నిర్ణయించుకున్నాడట. వేదన కలిగినప్పుడు ఆత్మహత్య అనిపిస్తుంది కదా! అందుకు కొండ కొనమీదకి వెళ్లి క్రింద పడబోయాడట. పడబోతూంటే
తనయులు గాధి నందనొక తంబున నూర్వురు చచ్చినన్ మనంబున కడలేని దుఃఖమును పొంది వశిష్ఠుడు కొండ ఎక్కి కూలినా పడకుండగా పుడమి లేమ కరంబున కందుకంబు పట్టిన గతి పట్టి నిల్పి మును డెందము కుందెడలింప యిట్లనెన్!!
ఓ వెర్రీ!
సుతులందరున్ తెగిన యింతే దుఃఖవె అయి చావన్ పుట్టుక తీరునే!! దుఃఖంటో నీవు చస్తే జన్మ పోతుందా? అని అడిగిందిట. నిజంగా నీకు జీవితం మీద రోత పుట్టి ఇంక బ్రతక కూడదు అనే మాట వచ్చిందా - అది కూడా గొప్ప ఆలోచనే. అంటే జనన మరణ పరంపరలో పుట్టకూడదు, పడకూడదు. జీవితం అక్కరలేని స్థితి దీనివల్ల రాదు. కర్మ వల్ల పుడుతూనే ఉంటావు. జ్ఞానం వల్ల మోక్షం పొందుతావు. జ్ఞానం అంటే యే పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మయందు తాదాత్మ్యం చెంది పోవాలి. అభిన్న స్థితి కావాలి. అది నీకు కావాలి. ఇంతవరకు తపస్సు చేయడం వల్ల విజ్ఞానము, జ్ఞానము వచ్చాయి. కాదనడం లేదు. ఎరుక బలపడలేదు. ఏమిటా ఎరుక? - పరమాత్మకు నేను భిన్నము కాదు అనే ఎరుక బలపడి పోవాలి.పరమాత్మతో తాదాత్మ్యం చెందాలి. అది కావాలి అంటే పుస్తకాలు చదివితే రాదు. ఉపనిషత్తులు చెప్తే రాదు. ఆయన అనుగ్రహం లేకపోతే అది రాదు గనుక ఆయన అనుగ్రహం కోసం తపస్సు చేసుకో అని చెప్పింది. ప్రకృతి గమనించుకుంటూ ఉంటుంది మహాత్ములని. ఆ ప్రకృతి రూపంలో పరమాత్మ అభయమిస్తాడు. ప్రకృతియైన భూదేవే ఆయనకి అభయమిచ్చింది. అందుకు ఇక్కడ ఈ మహానుభావుడికి చెప్పింది ఏమిటంటే పార్వతీ రమణుని ఆశ్రయించు, జీవన్ముక్తి పొందుతావు. అటంచు ధాత్రి ఉపదేశింపన్ ప్రమోదంబునన్ - ఎప్పుడైతే భూదేవి ఇలా చెప్పిందో వెంటనే ఆయన వెళ్ళి ఒక అరణ్యానికి చేరాడట. అరణ్యం గజకాననం. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. ఆయనకి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడట. ఎలా అంటే జ్యోతి రూపంలో కనపడి క్రమంగా పార్వతీ పరమేశ్వరులు ఉభయులూ కనపడ్డారు. వాళ్ళిద్దరూ కనపడగానే పరవశించిపోయాడు ఈయన. వసిష్ఠ మహర్షి స్వామివారిని స్తుతిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ స్తుతి అందంగా చక్కటి తెలుగులో ఉంటుంది.
ఆదిగృహస్థ శేఖరుడవైన నినున్ భవతాపన క్షుధా
వేదనచే తపః కుతప వేళ కనుంగొన గల్గె బ్రహ్మ వి
ద్యౌదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే
ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వరా!!
వసిష్ఠ మహర్షి చేసిన స్తోత్రం. ఆదిగృహస్థ శేఖరుడవైన నినున్ - ఆది గృహస్థ శేఖరుడు నాముందున్నాడు. ఎప్పుడు చూశాను టైం అంటే భవతాపన క్షుధా వేదనచే తపః కుతప వేళ కనుంగొన గల్గె - టైం ఏంటి అంటే మధ్యాహ్నం కదా! మధ్యాహ్నం అంటే అర్థం ఏమిటి? - తపించిపోతున్న టైమే మధ్యాహ్నం. కనుక సూర్యుడు మధ్యలో ఉన్నాడు అని కాదు నేను చెప్పేది. ఇది అర్థరాత్రే కావచ్చు గాక! కానీ నేను తపించిపోతున్నాను. తపస్సు చేసిన సమయమే కుతప వేళ - మధ్యాహ్న సమయము. తపించిపోయిన సమయమే మధ్యాహ్న సమయం. కనుక ఏదయ్యా టైం అంటే భగవంతుడి కోసం తపించిపోయినదే టైం. అంతేకానీ ఇవాళ అష్టమి అండీ రేపటి నుంచి అనుకునే వాడికి చదువు ఎప్పుడూ రాదు. మామూలు చదువులకైతే అవన్నీ చూసుకోవాలండీ. భక్తి గురించి మాత్రం రేపు, ఎల్లుండి లేవు.
అద్య అష్టమీతి నవమీతి చతుర్దశీతి" ఇవి పట్టుకొని వ్రేలాడుతున్నావా నువ్వు? పరమాత్మవే నువ్వు అని అదే శాస్త్రం చెప్పిందే అది నచ్చలేదు. అష్టమి, చతుర్దశి ఇవి నచ్చాయే నీకు? అని మందలించారు శంకరాచార్యులు. భవతాపన క్షుధావేదనచే - అనేక జన్మలు ఎత్తి ఎత్తి ఇప్పటికైనా తరించాలి అని తపన వచ్చింది, అది ఆకలి. తపస్సు చేశాడు - ఇది మధ్యాహ్న సమయం. గృహస్థా - ఆదిగృహస్థే ఉన్నాడు. కనుక భిక్ష పెట్టు. ఏం భిక్ష? - బ్రహ్మ విద్యౌదన భిక్ష - జ్ఞాన భిక్ష పెట్టవయ్యా నాకు. భగవంతుడు చెప్పే జ్ఞానమే ఎక్కుతుంది. ఎక్కడ పెడతావు? - పాత్ర రడీగా ఉందా? -ఉంది - చెవులు - చెప్పింది వినడానికి చెవులు . చెవులు భయంకరమైన పాత్రలు ఎందుకంటే ఒక చెవిలో నుంచి వచ్చి ఇంకొక చెవిలో నుంచి వెళ్ళిపోతాయి. కొంతమందికి చెప్పింది ఎంతవరకు ఉంటుంది అంటే లేచి ఒళ్ళు దులుపుకొనే వరకుట. బ్రహ్మవిద్యౌదన భిక్ష నాడు హృదయంబను పాత్రయందు పెట్టవే - ఎంత గొప్ప మాట అన్నాడండీ. నా హృదయమనే పాత్రలో పెట్టవయ్యా. అక్కడ పెడితేనే నిలుస్తుంది. అయితే బాగుందయ్యా ఈ అడుక్కొనే వాళ్ళని ఎందరిని చూడలేదు. ఇవాళ నేను వచ్చి పెడతా. ఇవాళ ఆకలి తీరిపోతుంది. మరి రేపో? మళ్ళీ నువ్వు, నీ అడుక్కోవడం రెడీ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి. మళ్ళీ రేపు అడుగుతావా అంటే ఈ భిక్ష పెడితే మరెవరినీ అడగక్కరలేదు. పైగా నువ్వు పెడితే. కనుక ఇంకెవరినీ అడుక్కోనవసరం లేని భిక్ష బ్రహ్మవిద్య భిక్ష. అందుకే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వరా - మళ్ళీ ఇంకొకడిని అడుక్కోనవసరం లేకుండా హాయిగా ఉంటానయ్యా. ఏది పెడితే మరింకేమీ అక్కరలేదో అది కావాలి. ఏది వస్తే మరేదీ అక్కరలేదో అది వస్తే ఎంత బాగుంటుంది? అది ఇదే. ఇది కాకుండా మరొక మార్గం ఉందా? "నాన్యః పంథా అయనాయ విద్యతే" - మరొకటి లేదు. అందుకు నేను ఇది అడుగుతున్నాను. నాకిది పెట్టు అన్నాడు.
ఇది ఇవ్వాలంటే నేను getup మార్చాలి అన్నాడు. అమ్మ పేరంటం నుంచి ఇంటికి వచ్చింది. పట్టుచీర అలాగే కట్టుకొని వచ్చింది. రాగానే పిల్లవాడు ఆకలేస్తోంది అన్నాడు అనుకోండి ఆవిడ పట్టుచీరతో వంటింట్లోకి వెళ్ళదు. లోపలి వెళ్ళి మామూలు బట్ట కట్టుకొని వస్తుంది. అలాగే భగవంతుడు కూడా ఓహో ఈ subject నీకు కావాలా? అయితే నారూపం మారుస్తాను అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే భగవంతుడి రూపాలు ఒక్కొక్క అనుగ్రహం కోసం ఒక్కొక్క రూపం. ఇద్దరుగా ఉన్నవాడు ఒక్కడై పోయాడు. ఇద్దరు ఒక్కటైపోతే ఆ మూర్తి పేరు దక్షిణామూర్తి. ఇంతవరకు వచ్చిన తేజః పుంజం అలాగే ఉంది. అది లింగం. ఆ తేజఃపుంజం లో ఇద్దరు కనపడ్డారు. ఇప్పుడు ఒకడైపోయాడు. ఆ ఒకడు అవడం ఎలా అంటే పెద్ద మర్రిచెట్టు, మర్రిచెట్టు మొదట్లో కుర్రవాడు, చక్కగా చిన్ముద్ర పట్టుకొని కూర్చున్నాడు, కనపడ్డాడు. కనపడగానే ఈయన గారికి కావలసిన జ్ఞానం వచ్చింది. ఉపన్యాసాలు అవీ ఏమీ లేవు. పరమాత్మ కనపడగానే అజ్ఞానం మొత్తం పటాపంచలైపోయింది. దక్షిణామూర్తి రూపంతో మనం పరమేశ్వరుణ్ణి చూస్తే జ్ఞానం, మోక్షం తప్పకుండా వస్తాయి. ఆ రూపంతో దర్శనమిచ్చాడట. ఇవ్వగానే ఆనంద పరవశుడైపోయాడు, ధన్యుడిని అయ్యానయ్యా అన్నాడు. ఇంకేం వరం కావాలి? అన్నాడు. వెంటనే వసిష్ఠుడు ఏది వస్తే మరేదీ అక్కరలేదో అది ఇచ్చేశావు నాకు ఇంకేమీ అక్కరలేదు అన్నాడు. కాదు కాదు ఇంకేదైనా ఆలోచించు అన్నాడు. ఈయన ఇంత గట్టిగా అడుగుతున్నాడు అంటే ఏదో ఉండచ్చు. అప్పుడు ఆయన నాకేమీ అక్కరలేదు కానీ లోక కళ్యాణం కోసం ఇక్కడకొచ్చి ఎవరు నీకు దణ్ణం పెడతారో వాళ్ళని తరింపజేయవయ్యా అన్నాడు. అంటే మహర్షులకి ఏమీ అక్కరలేదు. వాళ్ళు భగవంతుడిని మనకోసం కోరుకుంటారు. మనకోసం ఉండమని మహర్షులు కోరుకున్న చోట్లే క్షేత్రాలు. భగవంతుడిని వాళ్ళకోసం దింపుకొని మనకోసం ఉంచేస్తారుట. ఒకడు ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతూ ఇది ఊరిలో వారికి వినియోగించవలెను అని వ్రాసి వెళ్ళిపోయాడు. అలా మహాత్ములు మనకోసం మిగిల్చేసినవే ఇప్పుడు క్షేత్రాలు. అవి మనకు పనికొస్తున్నాయి. తనకోసం నాటుకున్న చెట్టు వాడు వెళ్ళిపోయిన తర్వాత మనకూ పండ్లు ఇస్తోంది. అందుకు మహర్షులు తమకోసం దిమ్పుకున్న క్షేత్రం వాళ్ళు వెళ్ళిపోయాక మనల్ని కూడా తరింపజేస్తోంది. వసిష్ఠుల వారు ఈవిధంగా అడగగానే నీకోరిక మీద ఇక్కడే ఉంటాలే, ఎవరు వచ్చినా మోక్షమిస్తాను. ఆయన పొందిపోయాడు. ఈయన ఉండిపోయాడు. ఉంది వచ్చిన వారందరికీ కైవల్య స్థానం చెప్పాడు. కనుక ఆయన అక్కడ ఉన్నాడు అనే ఎరుకతో కోరి చేరితే ఎవడికైనా మోక్షమిస్తాడు.ఆ చోటే దక్షిణామూర్తి వెలసిన చోటు అదే శ్రీకాళహస్తి క్షేత్రం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML